
వేడిమిలో తేడా.. విద్యుత్తు పుట్టిస్తుంది!
పగలు ఎండతో వేడిగా ఉంటుంది... రాత్రయితే చల్లగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ ఉష్ణోగ్రత తేడాలతో కరెంటు పుట్టించడం.. దాంతోనే చిన్న చిన్న సెన్సర్లు, పరికరాలను నడిపించడం సాధ్యమని అంటున్నారు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు. అనడమే కాదు.. ఒక పరికరాన్ని తయారు చేసి నెలలపాటు విద్యుత్తు ఉత్పత్తి చేశారు కూడా. ఉష్ణోగ్రతల్లో తేడాలను విద్యుత్తుగా మార్చడం కొత్తేమీ కాదు. సముద్రాల్లో ఉపరితలంపై ఉండే వేడి నీటిని.. లోపలుండే చల్లటి నీటి సాయంతో చాలాచోట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.
అయితే ఎంఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరికరానికి ఒకే సమయంలో రెండు వేర్వేరు ఉష్ణోగ్రతల అవసరం లేదన్నమాట. రాత్రిపగళ్ల మధ్య ఉండే వ్యత్యాసాన్ని సమర్థంగా వాడుకోగలదు. థెర్మల్ రెసొనేటర్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరాన్ని రిమోట్ సెన్సింగ్ రంగంలో విస్తృతంగా వాడుకోవచ్చునని.. సోలార్‌ప్యానెల్స్, బ్యాటరీలు వంటివేవీ లేకుండా ఏళ్లపాటు సెన్సర్లతో సమాచారం సేకరించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఉష్ణాన్ని త్వరగా గ్రహించడం, లేదా పరిసరాలలోకి విడుదల చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉన్న పదార్థాన్ని వాడటం ద్వారా ఈ థెర్మల్ రెసొనేటర్ పనిచేస్తుంది. ఈ రెండు లక్షణాలున్న పదార్థాలను తెలివిగా పేర్చడం ద్వారా థెర్మల్ రెసొనేటర్ పగటి ఉష్ణోగ్రతలను గ్రహించి తనలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రి సమయపు చల్లదనాన్ని ఇతర పదార్థాలు శోషించుకుంటాయి. రెండింటి మధ్య ఉన్న తేడాతో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వీటిని సోలార్ ప్యానెల్స్ అడుగున ఉంచితే ప్యానెల్స్ వెలువరించే వేడిని తీసేయడంతోపాటు విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తాయని.. తద్వారా రెండింతల లాభం వస్తుందని అంటున్నారు.
తేనెటీగల వైవిధ్యతతో మనిషికి మేలు!
భూమ్మీద తేనెటీగలు అంతరించిపోయిన కొంత కాలానికే మనిషీ కనుమరుగవుతాడని ఐన్‌స్టీన్ అంతటి శాస్త్రవేత్త ఎప్పుడో చెప్పాడు. తాజాగా రట్‌గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేసి.. ఒకే రకమైనవి కాకుండా బోలెడంత వైవిధ్యతతో కూడిన తేనెటీగలు ఉండటం మనిషికి చాలారకాలుగా మేలు చేస్తుందని తేల్చారు. పెన్సెల్వేనియా ప్రాంతంలో తాము దాదాపు వంద రకాల తేనెటీగలను గుర్తించి, సేకరించడంతోపాటు 48 తోటల్లో పరీక్షలు కూడా జరిపామని విన్‌ఫ్రీ అనే శాస్త్రవేత్త తెలిపారు.
తేనెటీగల వైవిధ్యత ఎంత పెరిగితే.. ఫలదీకరణం కూడా అంతే స్థాయిలో ఎక్కువైనట్లు తమ పరిశీలనల్లో తేలిందన్నారు. పర్యావరణ వ్యవస్థ చురుకుగా పనిచేయాలంటే.. తద్వారా మనిషికి మేలు జరగాలంటే తేనెటీగల వైవిధ్యత ఎంత ముఖ్యమన్నది తమ అధ్యయనం చెబుతోందని ఆయన అన్నారు. రైతులు రహదారులకు రెండు వైపులా.. లేదంటే పొలాల గట్ల వెంబడి తేనెటీగలు మనగలిగేలా పూల మొక్కలు ఎక్కువగా నాటడం ద్వారా కీటకనాశినుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని, తద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని విన్‌ఫ్రీ తన గత పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment