బ్యాగ్ భుజాన వేసుకుంటే బల్బు వెలుగుతుంది...
భుజాన బ్యాగ్ వేసుకుని వెళుతూంటే కాసేపట్లో చెమట్లు పట్టడం ఖాయం. ఇది కాస్తా మనల్ని చీకాకు పెడుతుంది గానీ.. ఛాల్మర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ వస్త్రం మాత్రం చెమటతోపాటు కొంత కరెంటూ పుట్టిస్తుంది. బరువు ఎంత ఎక్కువైతే స్వేదంతోపాటు విద్యుత్తు కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువైనా... ఎక్కువగా లాగినాసరే... ఈ వస్త్రంతో విద్యుత్తు పుడుతుందన్నమాట.
ప్రస్తుతానికైతే బ్యాగ్‌ను భుజానికి తగిలించుకునే స్ట్రాప్‌లో కొంతభాగంలో మాత్రమే ఈ వస్త్రాన్ని వాడారు. దీంతో ఒక ఎల్‌ఈడీ బల్బును వెలిగించేంత కరెంటు మాత్రమే పుడుతోందనీ, ఇది డిజిటల్ వాచీలూ, పాకెట్ కాలిక్యులేటర్, వంటి చిన్న చిన్న గాడ్జెట్లను నడిపేందుకు సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంజా తెలిపారు. పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే భౌతిక శాస్త్ర ధర్మం ఆధారంగా ఈ వస్త్రం పనిచేస్తుందని ఇందులోని పదార్థం రూపురేఖలు మారినప్పుడల్లా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వివరించారు.
విద్యుత్తును ప్రసారం చేయగల నూలుపోగులు, పీజో ఎలక్ట్రిక్ పదార్థాలను కలిపి దీన్ని తయారు చేసినట్లు తెలిపారు. మూడు కిలోల బరువును బ్యాగ్‌లో ఉంచినప్పుడు నాలుగు మైక్రోవాట్ల విద్యుత్తు పుట్టిందన్నీ... బ్యాగ్ మొత్తాన్ని పీజో ఎలక్ట్రిక్ పదార్థాంతో తయారు చేస్తే వైర్‌లెస్ సిగ్నళ్లను ప్రసారం చేయగలిగేంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంజా తెలిపారు.
మూలకణాలతో మళ్లీ చూపు!
శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. బ్రిటిష్ వైద్యులు ఈ లక్షణం ఆధారంగా కండరాలు బలహీనమవడం వల్ల క్రమేపీ చూపు కోల్పోతున్న ఇద్దరు మళ్లీ చూడగలిగేలా చేశారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలోనే ఈ రకమైన చికిత్స ద్వారా వయసుతోపాటు వచ్చే దృష్టి లోపాలను సరిచేయగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్లలోని కండరాలు బలహీన పడుతుంటాయి.
ఈ క్రమంలో ఒక పొర కణాలు నాశనమవుతాయి. రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం అని పిలిచే ఈ పొర కళ్లను శుభ్రం చేసేందుకు, కంటి బయటి పొరకు పోషకాలను అందించేందుకూ ఉపయోగపడుతుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న ఇద్దరికి బ్రిటిష్ వైద్యులు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేసి మూలకణాలు ఎక్కించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో ఈ మూలకణాలు అక్కడే పెరగడంతోపాటు రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం కణాలుగా ఎదిగినట్లు గుర్తించారు.
రోగ నిరోధక వ్యవస్థ ఈ కొత్త కణాలను తిరస్కరించే అవకాశం ఉందా? లేదా? మూలకణాలు కాస్తా కేన్సర్ కణాలుగా మారతాయా? వంటి విషయాలను మరిన్ని పరిశోధనల ద్వారా రూఢి చేసుకున్న తరువాత ఈ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment