వాడి పడేసిన బాటిల్స్‌తో బస్ షెల్టర్స్
‘మన అవసరానికి భూమి మీద తగినన్ని వనరులు ఉన్నాయి.కానీ, అవి మన దురాశకు కాదు’ అని చెప్పిన గాంధీజీ మాటలను గుర్తుచేసుకున్నారు హరిచందన. పర్యావరణ హితురాలిగా ప్లాస్టిక్‌రీసైక్లింగ్ విధానాలు, కార్యక్రమాల ద్వారా విభిన్నంగా హరితవనానికినాయకత్వం వహిస్తున్నారు ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అడిషనల్ కమిషనర్‌గా తను చేపడుతున్న పనులను, ముందున్న సవాళ్లను ఆమె వివరించారు. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ విధానాలలో తన సృజనాత్మక ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఇంటి నుంచి మొదలు
‘మా ఇంట్లో పనమ్మాయి మొదట్లో కిచెన్ నుంచి వచ్చిన తడిచెత్త, మిగతా పొడిచెత్త, ఏమైనా పగిలిపోయిన వస్తువులన్నీ కలిపి ఒకే చెత్తబుట్టలో వేసేది. నేనూ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. అనారోగ్యకారణం వల్ల ఓ నెల రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తను చేస్తున్న పనులు చూసి మూడు చెత్తబుట్టలను ఏర్పాటు చేసి, ఏ చెత్త ఎందులో ఎలా వేయాలో వివరంగా చెప్పాను. నేను గమనించిన అన్నిరోజులూ బాగానే చేసేది. ఆఫీసుకు రావడం మొదలయ్యాక నేను గమనించడం లేదనుకొని మళ్లీ అన్నీ ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేయడం మొదలుపెట్టింది. ‘ఎందరికో చెత్త, రీ సైక్లింగ్, పర్యావరణం గురించి అవగాహన కలిగించేలా చెబుతుంటాను. నా ఇంట్లోనే ఇలా ఉంది.. ఏమిటి చేయడం?’ అని ఆలోచించాను. నా భయంతో కాకుండా అవగాహన కలిగించాలని నిర్ణయించుకున్నాను.
సాధారణంగా నెల చివర్లో తీసేసే న్యూస్ పేపర్లు తీసి, అమ్ముకోమని మా పనమ్మాయికి చెబుతుంటాను.
బాటిల్ ఫెన్సింగ్..
ఆ పేపర్లతో పాటు మరో మార్గం సూచించా. తడి, పొడి చెత్తతో పాటు మూడవ డస్ట్‌బిన్‌లో వేసే ప్లాస్టిక్, పనికిరాని వస్తువులను ఉంచేలా చూసి, ఒకరోజు వాటిని వేటికవి విడివిడిగా చేయించా. ఆ చెత్త నుంచి తీసిన స్క్రాప్‌ను కూడా అమ్మమని చెప్పా. ఆ నెల తనకు అలా మరో నాలుగు వందల రూపాయలు అదనంగా వచ్చాయి. దీంతో పేపర్లతో కలిపి నెలకు ఏడెనిమిది వందల రూపాయలు వస్తున్నాయి. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దేనికది చెత్త డబ్బాలను ఉపయోగిస్తుంది. ప్రతీ ఇంట్లోనూ నెల–రెండు నెలలకోసారి ఏడెనిమిది వందల ఆదాయం మన చెత్త నుంచే వస్తుందంటే ఇదీ ఒక పొదుపే కదా! మనం వాడి పడేసే చెత్తను ఇంటి నుంచే తగ్గిస్తే డంప్‌యార్డ్‌లకు చేరే చెత్త తగ్గుతుంది. మనకు పర్యావరణం పట్ల ప్రేమ, అవగాహన, బాధ్యత, భయం కూడా ఉంటేనే ఈ జాగ్రత్త తీసుకోగలం. మా అమ్మాయికి మూడేళ్ల వయసు. తనచేత ఒక కుండీలో మొక్క నాటించి, రోజూ దానికి కొన్ని నీళ్లు పోయమని చెప్పాను. ఇప్పుడు నేను సాయంకాలం ఇంటికి వెళ్లాక ఆ మొక్కకు సంబంధించిన విషయాలన్నీ ఆనందంగా చెబుతుంటుంది. వాటిని శ్రద్ధగా వింటాను. ఆ మొక్క మా ఇద్దరి మధ్య ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచడం నాకు సంతోషంగా అనిపిస్తుంటుంది.
పాత టైర్లతో అందమైన చైర్లు, సెంటర్ టేబుల్
పాల పాకెట్ల సేకరణ నుంచి
‘చదువుకునే రోజుల్లో మా అమ్మ చేస్తున్న పనులను అంతగా పట్టించుకునేదాన్ని కాదు గానీ గమనించేదాన్ని. అవి నేను పెద్దయ్యాక ఆలోచింపజేసేలా, ఆచరణలో పెట్టేలా దోహదమయ్యాయి. మా అమ్మ ఏ చిన్న డబ్బా దొరికినా అందులో కొద్దిగా మట్టి పోసి మొక్క పెట్టేస్తుంది.. ఇప్పటికీ ఇండోర్‌ప్లాంట్స్, రూఫ్‌గార్డెన్ పనులు అమ్మ చాలా ఇష్టంగా చేస్తుంటుంది. రోజూ పాల ప్యాకెట్లు డస్ట్ బిన్‌లో కాకుండా ఒక దగ్గర పోగుచేస్తుంది. అమ్మ నిరంతరం చేసే ఆ పనులను గమనించడం వల్ల నాకూ వేస్టేజ్‌పై దృష్టిపెట్టడం పెరిగిందనుకుంటాను.’
అతి పెద్ద చెత్త కొండ
‘జీహెచ్‌ఎంసిలో పోస్టు తీసుకోగానే సిటీలో ఉన్న డంప్‌యార్డ్‌లను చూడటానికి వెళ్లాను. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను చూడగానే ‘వామ్మో’ అనిపించింది. ఎటు చూసినా చెత్త.. పెద్ద కొండలా తయారైంది ఆ డంప్‌యార్డ్. నేను పుట్టింది ఖమ్మం. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కానీ, ఎప్పుడూ అంత చెత్తను చూసింది లేదు. వాటన్నింటి గురించి తెలుసుకుంటే ఇళ్ల నుంచి వచ్చే చెత్తనే ఎక్కువ అని తేలింది. కొంచెం జాగ్రత్తపడితే చెత్త రావడాన్ని మనమే నిరోధించవచ్చు. ఉన్న చెత్తను తగ్గించవచ్చు అనుకున్నాను. అప్పుడే రీ సైక్లింగ్ విషయాల మీద మా టీమ్ అందరితో మాట్లాడాను. వేస్ట్‌ను తిరిగి వాడే సంస్థల గురించి తెలుసుకున్నాను. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌తో షెడ్, రీయూజ్ ప్లాస్లిక్‌తో టైల్స్ డిజైన్ చేయించాం, ఉపయోగంలో లేని టైర్లతోనూ, ఆయిల్ డ్రమ్ములతో సిట్టింగ్ చైర్లు, టేబుళ్లు తయారు చేయించాం. ఇలా వాడి పడేసి ఇక పనికిరావనుకున్న వస్తువులన్నీ తిరిగి పనికి వచ్చేలా ఏమేం చేయచ్చో తెలుసుకుంటూ, వాటిని ఏర్పాటు చేస్తూ, అలా ఏర్పాటు చేస్తామన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నాం. ఆహారం వృధా కాకుండా అవసరమైన వారికి అందజేయచ్చు అని ఉద్దేశ్యంతో ఫీడ్ నీడ్‌ను ఏర్పాటు చేశాం. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను రూపొందించే పనిలో ఉన్నాం. ఈ జాబ్‌లోకి రాకముందు అమెరికాలో పర్యావరణానికి సంబంధించిన కంపెనీలో వర్క్ చేశాను. ఒక రోజు ఆఫీసులో ఉన్నప్పుడు నా ఆలోచనలు, పనులు ఒక ఆర్గనైజేషన్ వరకే పరిమితం అయితే ఎలా అని ఆలోచించాను. ఒక పెద్ద గ్రూప్‌లో ఉంటే మన ఆలోచనా విధానం కూడా పెరుగుతుందని ఇటువైపుగా వచ్చాను. ఆ దిశగానే నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటున్నాను.’– నిర్మలారెడ్డిఫొటోలు: సురేశ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment