
హీరో ప్రిన్స్‌కు శిక్షణనిస్తున్న ట్రైనర్ ‘సిక్స్‌ప్యాక్ వెంకట్’
డైట్ వర్కవుట్
పాతికేళ్ళప్పుడు చేస్తే...
ప్రిన్స్‌ది సరైన వయసు. వర్కవుట్‌ని ఇష్టపడ్డాడు కాబట్టి కష్టపడ్డాడు అనలేం. ఎవరైనా సరే ఇలా పాతికేళ్ల వయసులో వ్యాయామం అలవాటు చేస్తే ఆ తర్వాత వయసంతా శరీరాన్ని అధీనంలో ఉంచుకుని మన ఆదేశాలు పాటించేలా చేసుకోవచ్చు. ముందు వెయిట్‌లాస్, ఆ తర్వాత మజిల్ బిల్డింగ్, ఆ తర్వాత సిక్స్‌ప్యాక్... ఈ వరుస క్రమం తప్పకుండా వెళితే... ఎవరైనా గ్రీకు వీరుడు కావచ్చు. - ట్రైనర్ సిక్స్‌ప్యాక్ వెంకట్
వెయిట్ లాస్ అయినా హ్యాపీగా అనిపించలేదు... అందరూ బాడీ బాగా బిల్డ్ చేశానంటున్నారు. నాకు మాత్రం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశానని అనిపిస్తోంది. ఒకప్పుడు బాడీ ఫంక్షన్ కరెక్ట్‌గా లేక రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టకపోవడం, చిన్న పనికే అలసిపోవడం వంటివి ఉండేవి. అవన్నీ ఇప్పుడు హాంఫట్ అయిపోయాయి.
గెట్...సెట్...గో... ఏడాది క్రితం దాదాపు 98 కిలోలు బరువుండేవాణ్ణి. తగ్గాలని జిమ్ స్టార్ట్ చేశా అయితే సీరియస్‌గా చేయకపోవడంతో రిజల్ట్ అంతగా రాలేదు. ఆ తర్వాత గట్టి నిర్ణయంతో వెయిట్‌లాస్ టార్గెట్ పెట్టుకుని కార్డియో, రన్నింగ్, సైక్లింగ్‌లు చేసి 72 కిలోలకు తగ్గాను. అందరూ శభాష్ అన్నారు కానీ... నాకెందుకో శారీరకంగా హుషారు లేకపోగా బాగా నీరసంగా అనిపించేది. అప్పుడే మా ట్రైనర్ సిక్స్‌ప్యాక్ వెంకట్‌తో పంచుకుంటే మజిల్ బిల్డింగ్ స్టార్ట్ చేయమన్నాడు దాంతో వెయిట్స్‌తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బాగా చేశాను. వెయిట్ మళ్లీ 84 కిలోలకు పెరిగింది. అయితే అది మజిల్ వెయిట్ అంటే... అది బరువు పెరగడం కాదు పవర్ పెరగడం.
ఆరుపలకల కోసం ఆరు భాగాలుగా ఆహారం... ఏదైనా ప్రారంభంలోనే కదా తడబాటు. ఒక దశ దాటాక ఇక ఆగమన్నా ఆగం. మా ట్రైనర్ కూడా ప్యాక్ మారో అన్నాడు. వెయిట్‌లాస్, మజిల్ బిల్డింగ్ తర్వాత 4 నెలల పాటు రోజుకు 4 గంటల చొప్పున రెండు పూటలా కఠినమైన వ్యాయామాలు చేశాను. కార్డియోతో పాటు క్రంచెస్ వంటివి బాగా చేయడంతో సిక్స్‌ప్యాక్ వచ్చేసింది.
నా డైట్ ఏమిటంటే...రోజుకు 6 సార్లు హై ప్రోటీన్ డైట్.. ఉదయం 6 స్క్రాంబుల్డ్ ఎగ్స్ తర్వాత 30 నిమిషాల వ్యాయామం. వెంటనే వే ప్రోటీన్ షేక్ తాగడం.. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధి తీసుకుని బ్రేక్‌ఫాస్ట్‌లో 2 ఎగ్స్, 150గ్రాముల బాయిల్డ్ లేదా గ్రిల్డ్ చికెన్, కేరట్, కుకుంబర్ వంటి వెజ్ సలాడ్స్. మధ్యాహ్నం 12. నుంచి 1 గంట మధ్యలో లంచ్. సలాడ్ విత్ ఫిష్ లేదా చికెన్... అది కూడా స్పెషల్లీ ప్రిపేర్డ్. సాయ్రంతం 4 గంటల సమయంలో 2 నుంచి 3 గుడ్లు, 40 బాదంపప్పులు... దీని తర్వాత వర్కవుట్. అదై పోగానే డిన్నర్ 7.30గంటల కల్లా పూర్తి. అక్కడి నుంచి ఉదయం 6 గంటల దాకా కడుపు ఖాళీ. ఈ ఫుడ్ అంతా సాల్ట్ లేకుండానే. అవసరాన్ని బట్టి పెప్పర్ వేసుకుంటానంతే... సగం డైట్ ఇంట్లోనే వండుకుంటే, ఫ్రెండ్ రెస్టారెంట్‌లో కొన్ని స్పెషల్‌గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు.
సాఫ్ట్ నుంచి యాక్షన్... నా ఆలోచనా ధోరణిలో కూడా ముందుకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఫిజికల్ ఫిట్‌నెస్ వల్ల మన మీద మనకు వచ్చే కాన్ఫిడెన్స్ అద్భుతం. ఒకప్పుడు రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టేది కాదు. కానీ, ఇప్పుడు యాంగ్జయిటీ, టెన్షన్ అన్నీ పోయాయి. కెరీర్‌లో యాక్షన్ మూవీస్ చేయాలని ఇష్టం ఉన్నా, నాకున్న సాఫ్ట్ లుక్ వల్ల ఇప్పటి వరకూ అన్నీ లవ్ స్టోరీస్ చేయాల్సి వచ్చింది. ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌తో... అది మారుతుందనుకుంటున్నా. - ప్రిన్స్, సినీ నటుడు