ఉద్యోగాల్లో దక్కని సమభాగం | problems in jobs with womens! | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల్లో దక్కని సమభాగం

Published Fri, Mar 11 2016 1:42 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ఉద్యోగాల్లో దక్కని సమభాగం

ఉద్యోగాల్లో దక్కని సమభాగం

ఆకాశంలో సగం వాళ్లు. అయినా, అవకాశాల్లో సమభాగం దొరకడమే లేదు. చట్టసభల్లో మహిళా బిల్లుకు ఇప్పటికీ మోక్షం దక్కడం లేదు. ఇన్ని ప్రతికూలతల నడుమ వారిది ఎడతెగని ఎదురీత. నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలంటే అష్టకష్టాలు అనివార్యం. అడుగుపెట్టాక అందులో కొనసాగాలంటే అడుగడుగునా అగ్నిపరీక్షలే! ఐటీ రంగంలో మహిళల నియామకాలు పెరుగుతున్నాయి. ఇదొక ఊరట. కేవలం ఒక్కరంగంలో సానుకూలత ఉన్నంత మాత్రాన సరిపోదు కదా! మిగిలిన రంగాల్లోని ఉద్యోగాల మాటేమిటి ఇబ్బందికరమైన పనివేళలు...

పనిప్రదేశాల్లో వేధింపులు... ఎదుగుదలకు అడ్డంకిగా మారే లింగవివక్ష... ఇలాంటి పరిస్థితుల్లో కడవరకు కొనసాగుతున్న వారు కొద్దిమందే.. వేధింపులను తట్టుకోలేక కొందరు... వివక్షపై విరక్తి చెంది ఇంకొందరు... ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు.

 
ఇదీ మన పరిస్థితి
ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కార్పొరేట్ రంగంలో మహిళల భాగస్వామ్యం భారత్‌లోనే అతి తక్కువ. మన దేశంలో కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళలు 23 శాతం మాత్రమే. కార్పొరేట్ రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడంలో అమెరికా 52 శాతం మహిళా ప్రాతినిధ్యంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (48 శాతం), కెనడా (46 శాతం), ఫిన్లాండ్ (44 శాతం) ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ఈ లెక్కల ప్రకారం మన దేశం అట్టడుగు స్థానంలో ఉండటం శోచనీయం.
 
మనదేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఐటీ రంగంలో మహిళల నియామకాలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పుంజుకుంటున్నాయి. అయితే, ఉద్యోగాల్లో దీర్ఘకాలం కొనసాగేందుకు తగిన అనుకూల పరిస్థితులే వారికి గగనమవుతున్నాయి. అందుకే దాదాపు 40 శాతం మంది మహిళలు ఉద్యోగాలను వదులుకోవడానికే సిద్ధపడుతున్నారు. పిల్లల ఆలనాపాలన చూసుకోవడానికి కొందరు ఉద్యోగాలను వదులుకోవాలని భావిస్తుంటే, పనిప్రదేశాల్లో వేధింపులు, లింగవివక్ష తట్టుకోలేక చాలామంది ఉద్యోగాలకు రామ్ రామ్ చెప్పేయాలని భావిస్తున్నారు.

ప్రభుత్వరంగంలో ఈ పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు గానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే మహిళల్లో దాదాపు 40 శాతం మంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలను మానేయాలనుకుంటున్నట్లు ‘అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ (అసోచామ్) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ‘అసోచామ్’ ఈ సర్వే నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పుణే నగరాలను ఈ సర్వే కోసం ఎంపిక చేసుకుంది. ఈ సర్వే ప్రకారం... మహిళలు ఉద్యోగాలు మానేయాలనుకునేందుకు దారి తీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవీ:
 
* పురుషులతో సమానమైన వేతనాలు పొందలేకపోవడం
* అనుకూలంగా లేని పనివేళలు
* పనిప్రదేశంలో వేధింపులు, లింగ వివక్ష
* పనిచేయడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం
* తగిన భద్రత లేకపోవడం
* కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు
* ఉన్నత చదువులు చదవాలనుకోవడం
ఇవి మాత్రమే కాదు. పలు సంస్థల్లో యాజమాన్యాల నిర్వాకాలకు విసిగి వేసారిపోయి కూడా పలువురు మహిళలు ఉద్యోగాలను వదులుకోవాలనుకుంటున్నారు. తాము పనిచేసే సంస్థల్లో మహిళలకు భద్రత కరువవుతోందని, మహిళల భద్రత కోసం చట్ట నిబంధనల ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలేవీ యాజమాన్యాలు కల్పించడం లేదని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా, పరిష్కరించే యంత్రాంగమేదీ ఉండటం లేదని కూడా ఈ సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు వాపోవడం గమనార్హం.
 
‘‘చాలా సంస్థల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం వాళ్లకు చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటం. ఒకేలాంటి అనుభవం ఉన్నా ఇంకా చాలా సంస్థల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు సమాన పారితోషికం ఇవ్వడం లేదు. మహిళల పట్ల వివక్ష కూడా ఎక్కువ. ఈ వివక్ష వల్ల కూడా మహిళా ఉద్యోగుల సంఖ్యను ప్రభావితం చేస్తోంది. ఇక మహిళలు గర్భం ధరించాల్సి వస్తే వాళ్లకు కనీసం 84 రోజుల పాటు సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. కానీ చాలా సంస్థలు ఈ  నిబంధనను పాటించడం లేదు.

పైగా నిబంధనను పాటించాల్సి వస్తే తాము వేతనాన్ని ఇస్తున్నా, తగిన పనిని రాబట్టుకోలేకపోతున్నామనే భావన ఉంటుంది. ఇక వస్తుత్పాదన రంగాలు, పరిశ్రమల్లో జాబ్ టైమింగ్స్ కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రధాన భూమిక పోషించే అంశం. అందుకే ఈ రంగాలను వదిలి సాఫ్ట్‌వేర్ రంగంవైపునకు మహిళలు మొగ్గుచూపుతున్నారు’’
- వి. ప్రశాంతి
హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

 
ఎనిమిదేళ్లు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేశాను. మా వారిది ఐటి ఫీల్డ్. చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయితే, నేనూ అక్కడికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మా వారికి బెంగుళూర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ టైమ్‌లో బాబు పుట్టాడు. పనివేళలు సరిగా లేకపోవడం, ఒత్తిడి.. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవనిపించి ఉద్యోగం మానుకున్నాను.
- శకుంతల, బెంగుళూరు
 
నేనొక ఐటీ బేస్డ్ కంపెనీలో ఏడాది పాటు జాబ్ చేశాను. రోజూ తొమ్మిది నుంచి పది గంటల పని. ఇచ్చిన టైమ్‌లో వర్క్ పూర్తి చేయాలి. లేదంటే రిమార్క్. ఎంత చేసినా తరగని పని, దానికి తోడు ఉద్యోగ భద్రత లేకపోవడం, టార్గెట్ రీచ్ కాకపోతే ఏమవుతుందో అనే టెన్షన్... దీంతో తిండి మీద కూడా ధ్యాస ఉండేది కాదు. విసుగనిపించి జాబ్ మానేశాను.
- శ్రావణి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement