గొప్ప ప్రవక్త జార్జివర్‌వర్ ఒక ఆథ్యాత్మిక మహాసభలో ఆత్మవశంలో ప్రసంగిస్తున్నారు. ఇచ్చిన సమయం మించిపోయింది. కాని సందేశం ఆపడం లేదు. ఆయన్ని ఎలా ఆపాలో కూడా తెలియక పెద్దలు సతసతమవుతున్నారు. దాని తర్వాత మరో కార్యక్రమం ఉంది. అందుకే ఈ ఆరాటం అంతా. చివరికి ఒక పెద్ద మనిషి వేదిక మీద నుండి కిందికి దిగివచ్చాడు. వేదికకు ముందు జార్జివర్‌వర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నాడే గాని అటు ఇటూ స్థిమితం లేకుండా ఉన్నాడు. అతనిని చూస్తూనే సంపన్నుడు అని ఇట్టే తెలిసిపోతుంది. సమయం మించిపోతుందన్న ఆలోచనతో ఆ సంగతిని గుర్తు చేయడానికి తన చేతికి ఉన్న అత్యంత ఖరీదైన గడియారాన్ని అతడు జార్జి గారికి చూపించాడు. అది చూసి జార్జి ప్రవక్త అవాక్కయ్యాడు. శాంత హృదయంతో ప్రశాంతంగా తన దివ్య సందేశాన్ని ఆపివేశాడు.
సభలో కొందరు పరిచారకులు అటు ఇటూ తిరుగుతూ వున్నారు. వారందరూ అక్కడ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ తమ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. జార్జివర్‌వర్ చిరునవ్వుతో ఒక పరిచారకుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘‘చూడు బాబూ.. నా ఎదురుగా కూర్చున్న ఆ పెద్దాయన తన అత్యంత ఖరీదైన తన చేతిగడియారాన్ని ఈ మహాసభ సహాయార్థం ఇస్తాననే సంకేతంతో తన వాచ్ చూపిస్తున్నాడు. మీరు వెళ్లి ఆ గడియారాన్ని తెచ్చి హుండీలో వేయండి’’ అని ఆజ్ఞాపించాడు. అనుకోని ఈ ఆకస్మిక సంభవానికి పెద్దాయన తలదించుకొన్నాడు. అంతేకాదు, ఇలా తలదించుకొనే ఇలాంటి పని మరోసారి చేయను అని, చేయకూడదు అని తన హృదయంలో నిశ్చయించుకొన్నాడు. దైవ సన్నిధికి వెళ్లినప్పుడు పారవశ్యంతో కూర్చోవాలిగాని ఎన్ని గంటకు వచ్చాను, ఎన్ని గంటకు వెళ్లాలి అని ఆలోచించకూడదు.
– బైరపోగు శామ్యూల్ బాబు
Comments
Please login to add a commentAdd a comment