ఆకలితో... అలమటించిన రేసుగుర్రాలు
పాపం
ఇక్కడ దీనంగా కళ్లు వాల్చుకొని నిలబడ్డ గుర్రం నెలరోజులపాటు ఆహారం లేకుండా బతికింది. ఈ ఒక్క గుర్రమే కాదు 49 రేసు గుర్రాలు తిండి లేకుండా నెలరోజులు ఆకలితో అలమటించాయి. ఇదెక్కడి దారుణం అంటారా! ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని దోబా అనే గుర్రపుశాలలో ఎవరో వీటిని బంధించారు. గుర్రపుశాల ఊరికి దూరంగా ఉండడంతో ఎవరూ గమనించలేకపోయారు.
చివరికి ఎవరో విషయం తెలుసుకుని దగ్గర్లోని ఫ్రెండీకోస్ అనే స్వచ్ఛంద సంస్థకు కబురు పంపారు. వారంతా వచ్చిచూస్తే...ఆకలికి సొమ్మసిల్లిన గుర్రాలు కొన్ని, మెడలో తాళ్లను తెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్న గుర్రాలు కొన్ని, ప్రాణాలు విడిచిన గుర్రాలు కొన్ని... అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. త్వరత్వరగా వాటి కట్లు విప్పి వాటికి మేత వేశారు. కట్లు తెంచుకోడానికి ప్రయత్నించిన గుర్రాల కాళ్లకు పుండ్లు అయి లేవలేని స్థితిలో ఉన్నవాటికి వైద్యం చేయించి సపర్యలు చేశారు.
ఓ ఆరు గుర్రం పిల్లలు మాత్రం కన్నుమూశాయి. ఎంతో ఖరీదైన గుర్రాలను ఇలా ఊరవతల బంధించి వెళ్లిన వారెవరో కనుగొని కఠినంగా శిక్షించివలసిందిగా ఈ ఫ్రెండీకోస్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గురించి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో ఆ గుర్రాల పోషణకు ఆర్థికసాయం చేస్తామంటూ చాలామంది ముందుకు వస్తున్నారు.