కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష | Rakhi Festival in India, Raksha Bandhan | Sakshi
Sakshi News home page

కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష

Published Thu, Aug 7 2014 11:16 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష - Sakshi

కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష

సందర్భం-10న రాఖీ
 
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షాబంధన విశేషాలను చెబుతూ దీని వల్ల కలిగే మేలును వివరించాడు.
 
శ్రావణ పౌర్ణిమను రక్షాబంధనం పండుగగా పిలుచుకొంటాం. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు కట్టే రక్ష ఇది. ఈ పండుగ ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తర పురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపోతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాం.

రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని ఆ తర్వాత మొదలుపెట్టి, అజేయులయ్యేవారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందని విశ్వాసం.
 
శ్రావణ పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశం.     

ఇప్పుడంటే అక్కాచెల్లెళ్లు మాత్రమే అన్నదమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భర్తకి భార్య రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే ఇందుకు నిదర్శనం. చరిత్ర విషయానికి వస్తే,  పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడతాడు అలెగ్జాండర్. విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా బేగం, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదిస్తుంది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న ఆమె, శ్రావణ పౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టి, బహుమానంగా భర్త ప్రాణాలు కాపాడమని కోరుతుంది. తన చేతికి ఉన్న రక్ష కారణంగా అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు.
 
సంప్రదాయం ప్రకారమైతే, పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు తిలకం దిద్ది, అప్పుడు మాత్రమే రక్షను కట్టాలి.
 ‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
 తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల’’
 రక్షాబంధనమనేది కేవలం అన్నాచెల్లెళ్లు కట్టుకునేదే కాదు, రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగ. ఈ ఆచారాన్ని తప్పకుండా అందరూ పాటించాలని కూడా చెబుతారు.
 శ్రావణీ నృపతిం హంతి... గ్రామం దహతి ఫాల్గుణి
 శ్రావణ మాసంలో రాజులకు, ఫాల్గుణ మాసంలో గ్రామానికీ ప్రమాదమని శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇది రాజవంశాలలో ప్రారంభమై ఉంటుందని తెలుస్తోంది. శ్రావణంలో వచ్చే భద్ర అనబడే సంపుటి ప్రభావంతో రాజవంశాలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా ఈ రక్షాబంధనం వచ్చిందని తెలుస్తోంది. భద్ర సంపుటి ఏర్పడితే, ఆ రోజున ఏ పనులూ చేయరాదు. అయితే ఆ సంపుటి శ్రావణ పౌర్ణమినాడు వచ్చినప్పటికీ అది వర్జ్యంగా పరిగణింపబడదు. అంటే రక్షాబంధనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకం వచ్చినా అంటే వర్జ్యం వచ్చినా కూడా వదలవద్దని శాస్త్రోక్తి.
 
- డా. పురాణపండ వైజయంతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement