సీతపై శీతకన్ను | real story of seetha | Sakshi
Sakshi News home page

సీతపై శీతకన్ను

Published Tue, Sep 8 2015 10:58 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సీతపై  శీతకన్ను - Sakshi

సీతపై శీతకన్ను

శీతాకాలం చలిమంచు కరుస్తుంది.
ఆ మంచు కంటే కటువైనది పేదరికం.
ఆ పేదరికం కంటే కర్కశమైనది పేద మహిళ జీవితం.
బహుశా సీత చూసిన కష్టం ఏ పేద మహిళ కూడా చూసి ఉండకపోవచ్చు.
గ్యాంగ్‌రేప్ చేశారు. రైలు పట్టాల మీద పారేశారు.
రైలు కూడా ఆగలేదు... కనికరం చూపలేదు.
నిలబడడానికి కాళ్లు లేవు. ఆసరాగా అమ్మ కూడా నిలబడలేదు.
ప్రపంచమంతా శీతకన్ను వేసినా...
ఈ సీత కన్ను అదరలేదు... ఈ సీత మనసు బెదరలేదు
ఈమె గురి చెదరలేదు.
కష్టాన్ని కాలదన్నింది... నిష్ఠూరాన్ని నిగ్గదీసింది.
ఊతం ఇస్తోంది. ఉదాహరణగా నిలిచింది.

 
పేదరికం.. గ్యాంగ్‌రేప్.. అవిటితనం.. సొంత తల్లి నుంచే నిరాదరణ... ఇవి సినిమా కష్టాలు కావు. ఓ సీతకు కాలం విసిరిన సవాళ్లు! స్వీకరించింది.. గెలిచింది.. కాలాన్ని కాళ్ల దగ్గర కట్టిపడేసింది! ఆ సీత కథ ఎలా మొదలైందంటే... రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లా, ఫతేపుర గ్రామం సీత స్వస్థలం. తల్లి తప్ప నా అనేవారెవ్వరూ లేరు ఆమెకు. 20 ఏళ్ల పిల్ల. చదువు లేదు. కూలికెళ్తేనే కూడు. లేకుంటే పస్తే. ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో కూలీగా పనిచేసేది.

ఒకరోజు..
ఎప్పటిలాగే కూలీకి వెళ్లింది. సరిగ్గా పనిచేస్తున్నా.. నోటి దురుసుతనం చూపాడు మేస్త్రీ. ఆమెకు పట్టలేనంత కోపం వచ్చింది. మౌనంగా ఉండలేకపోయింది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించింది. అంతమందిలో సీత తనకు ఎదురుతిరగడంతో మేస్త్రీ అహం దెబ్బతింది. సీతకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. రెండు రోజులు పనిచోట సీతపట్ల బాగానే ఉన్నాడు. మర్యాద నటించాడు. ఇంకోవైపు తన స్నేహితులు, ఫతేపురా సర్పంచ్‌తో కలిసి సీత కిడ్నాప్‌కి పథకం పన్నాడు. మూడోరోజు సీత పని నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం స్నేహితులు, సర్పంచ్‌తో కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు మేస్త్రీ. ఎవరికీ అనుమానం రాకుండా ఆ వ్యాన్‌ని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పుతూ వారంతా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశారు. స్పృహ తప్పిన సీతను మధ్యరాత్రి ఫతేపురా రైలు పట్టాల దగ్గర పడేసి వెళ్లిపోయారు. అప్పుడే అటుగా వచ్చిన ఓ రైలు చక్రాల కింద ఆమె కాళ్లు నలిగిపోయి ప్రాణం మిగిలిపోయింది.

మూడోగాయం..
ఆ సంఘటన జరిగిన నాలుగు రోజులకి గానీ సీతకు మెలకువ రాలేదు. స్పృహ వచ్చాక... నడుం కింది భాగమంతా మొద్దు బారిపోయినట్టుగా ఉంది. కాళ్లు కదిపి రిలాక్స్ అవుదామని ప్రయత్నిస్తే మోకాళ్లు మాత్రమే కదిలాయి. మోకాళ్ల కిందిభాగంలో చర్మాన్ని లాగి కుట్టేసిన ఫీలింగ్. దిగ్గున లేచి చూసుకుందామనుకుంటే ఒళ్లంతా బరువుగా అనిపించింది. నిస్సహాయంగా పక్కనే ఉన్న తల్లివంక చూసింది. ‘రైలు కింద కాళ్లు చితికాయి. ఆపరేషన్ చేసి తీసేసారు’ అని చెప్పింది తల్లి. మనసుకు తగిలిన దెబ్బ, శరీరానికి అయిన గాయం.. రెండూ కలిసి ఒక్కసారిగా సీతను దుఃఖంలో ముంచెత్తాయి. కుమిలి కుమిలి ఏడ్చింది. దగ్గరకొచ్చి తల్లి ఊరడిస్తుందేమో అనుకుంది. రాలేదు సరికదా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రెండు గాయాల కన్నా ఈ చర్య ఆమెను ఎక్కువగా బాధించింది. కోలుకున్న సీత పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. మేస్త్రీతో పాటు ఆయనకు సహకరించిన వాళ్లందరినీ సర్పంచ్ సహా అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిజానికి ఇక్కడే  మొదలయ్యింది.

 ఎలా?
 రెండు లక్షల పరిహారంతో పాటు అవిటితనాన్ని మోసుకొచ్చిన సీత ఆ తల్లికి గుదిబండలా కనిపించడం మొదలుపెట్టింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న బిడ్డను పొట్టలో పెట్టుకోవాల్సిన తల్లి.. బిడ్డను అవమానించసాగింది. కూర్చోని తింటే రెండు లక్షలు ఎన్నాళ్లకు సరిపోతాయి? పనీపాటా చేయలేని నిన్ను ఈ రెండు లక్షలతో ఎంతకాలం సాకాలని ముద్ద పెట్టినప్పుడల్లా దెప్పిపొడిచేది. తల్లి పెట్టే తిండి కన్నా ఆమె తెప్పించే కన్నీళ్లతోనే కడుపు నిండిపోయేది సీతకు. అలా రోజులు గడుస్తుండగా.. ఓసారి సీత విషయంలో అరెస్టయిన దోషుల తాలూకు కుటుంబీకులు సీత వాళ్లమ్మను కలిశారు. అప్పటి నుంచి కూతురి విషయంలో ఆమె మరింత కఠినమైంది.

 న్యూ బిగినింగ్
 ‘కంప్లయింట్ వెనక్కి తీసుకోమంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్లు జైల్లో ఉంటే నీకేమొస్తుంది..? వాళ్లు చెప్పినట్టుగా కంప్లయింట్ వెనక్కి తీసుకుంటే ఇంకో రెండులక్షల రూపాయలొస్తాయి’ అంటూ నస మొదలుపెట్టింది సీత తల్లి. ‘నాకు డబ్బులు ముఖ్యం కాదు. నాకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకూ జరక్కూడదు. వాళ్లు జైల్లో మగ్గితేనే ఆడవాళ్ల పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. గౌరవించడం నేర్చుకుంటారు’ అని సమాధానం చెప్పింది సీత. ఈ మాటకు ఆమె తల్లికి కోపమొచ్చింది. వాళ్లు జైల్లో ఉంటే జీవితాంతం నిన్ను పోషించడానికి నా దగ్గర లక్షల కుప్పల్లేవ్’ అంది విసురుగా. తల్లి ప్రవర్తనకు విస్తుపోయింది సీత. దోషుల బంధువుల దగ్గర్నుంచి ఒత్తిడి ఎక్కువైంది. కూతురేమో వినట్లేదు. పైగా తనను పోషించడం రోజురోజుకీ భారంగా మారింది ఆమెకు. కూతురుని ఇంట్లోంచి గెంటేసింది. పేదరికం కన్నపేగును కూడా తెంచేసుకుంటుందన్న సత్యం బోధపడిన సీత.. గత్యంతరం లేక.. ఏ ఆదరణా దొరక్కా పోలీసుల సహాయం కోరింది. వాళ్లు ఆమెను ‘ప్రవాస్’ అనే ఆశ్రమంలో చేర్చారు. అక్కడే ఓనమాలు దిద్దుకుంది. బ్రిడ్జ్‌కోర్స్‌లో టెన్త్ పూర్తి చేసింది. సొంత కాళ్లమీద నిలబడ్డానికి బట్టలు కుట్టడం నేర్చుకుంది(హ్యాండ్ మిషిన్‌తో). ఇంకోవైపు కంప్యూటర్స్‌లో బేసిక్ కోర్సూ పూర్తి చేసింది. ఓపెన్ డిగ్రీ తరగతులకూ హాజరవుతోంది. ఇదంతా తన జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం.

ఇంకోవైపు తనలాంటి వాళ్లకు సహాయం అందించడానికీ అడుగులేస్తోంది. బట్టలు కుట్టి సంపాదించిన దాంట్లోంచి కొంత డబ్బును ప్రవాస్ ఆశ్రమానికిస్తోంది. విధి వీథిలో పడేసినా ధైర్యం ఉంటే చాలు ఆకాశాన్నే చూరు చేసుకొని ఎలా బతకొచ్చో చెప్తోంది. తననే ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తోంది. దీంతో ఆగలేదు. ఇక్కడే  ఓ కొత్త బిగినింగ్ అడుగులేయించింది ఆమెను జర్మన్‌ఫూట్‌తో. సీత కథను ఇంటర్నేషన్‌లో జర్నల్స్‌లో చదివిన ఓ జర్మన్ జర్నలిస్ట్ ఆమె ధైర్యానికి అబ్బురపడ్డాడు. ఇండియా వచ్చి ఆమెను కలుసుకున్నాడు. జర్మన్‌ఫీట్‌ను కానుకగా ఇచ్చాడు.. ఆమె మనోబలం గడపదాటి బయటకు రావాలని! సీత గడపదాటింది.. తాను నడవడమే కాదు నడవలేని వాళ్లకు నడకా నేర్పుతోంది! ‘మా అమ్మ మీద జాలి తప్ప కోపం లేదు. మేస్త్రీ మీద కనికరం లేదు. నా పరిస్థితి పట్ల భయమూ లేదు. అసలీ ప్రతికూలతలు లేకుంటే నా శక్తి నాకు తెలిసేదే కాదు. కాబట్టి ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డమే కానీ భయపడి పారిపోవద్దు. నా జీవితం నాకు నేర్పిన పాఠం ఇదే’ అంటుంది సీత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement