విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..? | Remains within the excretion of urine .. and then some? | Sakshi
Sakshi News home page

విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..?

Published Fri, Dec 20 2013 12:48 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..? - Sakshi

విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..?

 నా వయసు 55. మూడేళ్ల నుంచి నాకు మూత్రధార సరిగా రాకపోవడం, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి లేవాల్సి రావడం జరుగుతోంది. పదిహేనేళ్ల నుంచి నాకు షుగర్ ఉంది. షుగర్ ఉంటే మూత్రం ఎక్కువసార్లు వస్తుందంటారు కానీ నాకు చాలా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే ‘మూత్ర విసర్జన తర్వాత లోపల 150 ఎం.ఎల్. మిగులుతోంది’ అంటున్నారు. ఇలా మిగిలిపోవడం వల్ల ఏదైనా ప్రమాదమా?
 - ఎస్.వి.కె., వరంగల్

 
 సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఇలాంటి మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో లోపల 20 ఎం.ఎల్. కంటే ఎక్కువగా మూత్రం మిగలకూడదు. ఇలా మూత్రం సరిగా రాకపోవడానికి ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రంలో ఇన్ఫెక్షన్, పురుషాంగంపై చర్మం ముడుచుకుపోవడం వంటివి ప్రధాన  కారణాలు. మీరు యూరిన్ ఎగ్జామినేషన్, ప్రోస్టేట్ గ్రంథి సైజు తెలుసుకునేందుకు స్కానింగ్, మూత్ర విసర్జన చేసే విధానాన్ని తెలుసుకునే యురెథ్రోమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా మీ సమస్యకు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్, ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే శస్త్రచికిత్స లేదా కొన్ని మందులు వాడటం, పురుషాంగంపై చర్మం మూసుకుపోతే సున్తీ ఆపరేషన్ వంటి చికిత్సల ద్వారా మీ సమస్యను నయం చేయవచ్చు.
 
 మా బాబుకు మూడేళ్లు. బాబు కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకున్నప్పుడు బాబుకు కిడ్నీలో వాపు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే రెండు కిడ్నీల్లోనూ వాపు ఉందన్నారు. వాడికి ఏడాది వయసున్నప్పుడు ఎంసీయూజీ అనే పరీక్ష చేయించారు. అతడికి రెండువైపులా కిడ్నీల్లోకి మూత్రం వెనక్కు వెళ్తోందని చెప్పారు. ఐదేళ్ల వయసు వచ్చే వరకు అతడిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాపు తగ్గకపోతే ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ అవసరమంటున్నారు. అసలు మా బాబుకు వచ్చిన సమస్య ఏమిటి?
 - ఆర్. ధనంజయరావు, అనంతపురం

 
 పిల్లల్లో వచ్చే ఈ జబ్బును విసైకో యురెథ్రల్ రిఫ్లక్స్ అంటారు. మూత్రం పోసినప్పుడు మూత్రం వెనక్కు తిరిగి కిడ్నీల్లోకి వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళ్తుంటే ఆ కండిషన్‌ను ‘రిఫ్లక్స్’ అంటారు. ఇలా మూత్రం రివర్స్‌లో వెనక్కు వెళ్తున్నప్పుడు... అది ఎంతదూరం వెనక్కు వెళ్లిందనే దాన్ని బట్టి ఐదు గ్రేడులుగా విభజిస్తారు. మొదటి రెండు గ్రేడుల్లో కిడ్నీకి ప్రమాదం తక్కువ. అందువల్ల కొద్దిరోజులు వేచి చూసినా పర్వాలేదు. నాలుగు, ఐదు గ్రేడుల్లో కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. గ్రేడ్-3లో యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వస్తుంటే కూడా ఆపరేషన్‌ను సూచిస్తాం. వయసు పెరిగేకొద్దీ రిఫ్లక్స్ తగ్గుతుంది. అందుకోసమే మీ బాబు విషయంలో డాక్టర్లు ఐదోఏడు వచ్చే వరకూ వేచిచూడమని మీకు సలహా ఇచ్చి ఉంటారు. మీరు క్రమం తప్పకుండా మీ యూరాలజిస్ట్‌తో ఫాలో అప్‌లో ఉండి, ఆయన సలహా మేరకు చికిత్స తీసుకోండి.
 
 నాకు 27 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి సెక్స్ తర్వాత వీర్యంలో కొద్దిగా రక్తం కనిపించింది. ఆ తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా కాస్త రక్తం వచ్చింది. నాకు చాలా ఆందోళనగా ఉంది. అయితే  అంగస్తంభన యథావిధిగా జరుగుతోంది. సెక్స్ కూడా బాగానే చేయగలుగుతున్నాను. నాకు ఉన్న సమస్య తీవ్రత  ఏమిటి? అది భవిష్యత్తులో ఏదైనా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉందా?
 - ఎస్.ఆర్.ఎమ్., భీమవరం

 
 వీర్యంలో రక్తం రావడం అన్నది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవడానికే అవకాశాలు ఎక్కువ. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, అక్కడ ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావడం చాలా పరిపాటి. పైగా ఇలా కనిపించడం చాలా సాధారణం. ఇది చాలామందిలో జరిగేదే. కొన్నిసార్లు ఇలా జరగడానికి ఏ కారణమూ కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అందుకే చాలామంది బయటకు చెప్పకపోవడం అన్నది ఇలాంటి కేసుల్లో చాలా సహజంగా జరుగుతుంటుంది.

చాలా సందర్భాల్లో పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది కాబట్టి చాలామందిలో దీనికి సంబంధించిన ఆందోళన కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్‌ను కలిసి, ఏమైనా సాధారణ యాంటీబయాటిక్స్ తీసుకోవాలేమో చూసుకోండి. ఇది ఆందోళన పడాల్సినంత పెద్ద సమస్య కాదనే కాన్ఫిడెన్స్‌తో యూరాలజిస్ట్‌ను కలవండి.
 
 నాకు 67 ఏళ్లు. ఇటీవల మూత్రం సరిగా రాకపోవడంతో మూత్రపరీక్షలు చేయించుకున్నాను. ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని అంటున్నారు.  ఇప్పటికీ నేనూ, నా భార్య సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఆపరేషన్ అనగానే నా  అంగస్తంభన సామర్థ్యం దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. దయచేసి  నాకు సరైన సలహా ఇవ్వగలరు.
 - ఎస్.ఆర్.కే., రాజమండ్రి

 
 అరవైఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ)తో నయం చేస్తాం. వీర్యంలో ఎక్కువభాగం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా రావడం అన్నది చాలా సాధారణం. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల మీ అంగస్తంభనలకుగాని, సెక్స్ పార్‌ఫార్మెన్స్‌కు గాని ఎలాంటి లోపమూ రాదు.  అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని మీ డాక్టర్లు చెబితే మీరు నిశ్చింతగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్
 యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్,
 కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement