హోమియో కౌన్సెలింగ్
నా వయసు 54. నేను గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం సూచించగలరు.
- డి. హేమలత, హైదరాబాద్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ వ్యవస్థ తన సొంతకణజాలాలతోనో పోరాడినప్పుడు కలిగే వ్యాధి. ఇది మొదట చేతివేళ్లు, కాలివేళ్లు తరువాత మోచేయి, మోకాలు, తుంటికి పాకుతుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌కు గురయిన ఈ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరిక కోల్పోయి, విపరీతమైన నొప్పితో బాటు కీళ్ల కదలికలు కూడా ఇబ్బందికరంగా తయారవుతాయి. ఇది కొందరిలో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, చర్మం మొదలైన వాటిపై కూడా దుష్ర్పభావం చూపిస్తుంది.
వ్యాధి కారణాలు: మన శరీరంలో తెల్లరక్తకణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ తదితర వ్యాధికారక క్రిములతో పోరాడుతూ నిత్యం మనల్ని రక్షిస్తుంటాయి. ఆర్థరైటిస్ రోగులలో తెల్లరక్తకణాలు కీళ్లచుట్టూ ఉండే సైనోవియల్ పొరలోకి వెళ్లి ప్రొటీన్లను విడుదల చేయడం వల్ల అది మందంగా మారిపోయి దెబ్బతినడం ఆరంభమవుతుంది. క్రమేపీ కీళ్లలోపలి ఎముకలు, కార్టిలేజ్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవడం వల్ల కీళ్ల అమరికలో ఏర్పడే మార్పు వైకల్యానికి దారితీస్తుంది.
లక్షణాలు: కీళ్లవాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం నిద్రలేచేసరికి కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసుకు పోవడం, ఈ లక్షణాల తీవ్రత ఎప్పడూ ఒకేలా కాకుండా రెండువైపులా ఒకకేరకంగా కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికితోడు రక్తహీనత, ఆకలి సరిగా లేకపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు ఏర్పడవచ్చు. నిర్ధారణ: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్.ఎ.ఫ్యాక్టర్, యాంటిసిపిపి, ఎక్స్‌రే, ఎమ్మారై తదితర పరీక్షలు.
హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఇతర చికిత్సా విధానాల ద్వారా కేవలం ఉపశమనం మాత్రమే లభిస్తే హోమియోకేర్ ఇంటరేనషనల్‌లోని జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యపద్ధతిలో వ్యాధిని తగ్గించడం లేదా కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలో మంచి ఫలితాలను సాధించవచ్చు. వ్యాధి తీవ్రత పెరగకుండా చేయవచ్చు.
లైఫ్ స్టయిల్ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. ఆస్తమా ఉంది. ఈ చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వ్యాయామం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- ఎమ్. సంజీవరావు, వైజాగ్
ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సైతం వ్యాయామం చేయవచ్చు. ఇలాంటి వారికి జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు మంచిది. అయితే వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఉండే మెషిన్స్ వంటి ఉపకరణాల సహాయంతో వ్యాయామం చేయదలచుకున్నవారు ముందుగా ఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. మీ వ్యాయామం శరీరాన్ని తీవ్ర అలసటకు గురిచేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా వంటివీ రావచ్చు. శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఏదైనా తినీతినగానే వ్యాయామాలు వద్దు. లైట్‌గా తిన్న తర్వాత 30 నిమషాల వ్యవధి ఇచ్చి వ్యాయామం మొదలుపెట్టండి. ప్రివెంటార్ ఇన్‌హేలర్స్ పీల్చాక, నెబ్యులైజేషన్ తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి కనీసం 30 నిమిషాల వ్యవధి ఇవ్వండి. వ్యాయామం మొదలుపెట్టే సమయంలో ముందుగా బ్రీతింగ్ వ్యాయామాలు, వార్మప్ వ్యాయామాలు విధిగా చేయండి. నేరుగా పెద్ద పెద్ద వ్యాయామాల జోలికి వెళ్లవద్దు. వ్యాయామం పూర్తయ్యాక అకస్మాత్తుగా ఎక్సర్‌సైజ్‌ను ఆపేయవద్దు. శరీరాన్ని క్రమంగా వ్యాయామం నుంచి ఉపసంహరించే క్రమంలో కూల్‌డౌన్, బ్రీతింగ్ అవుట్ ఎక్సర్‌సైజులు చేయాలి. మరీ ఎక్కువగా బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. పుషప్స్, సిటప్స్ వంటివి చేయకపోతేనే మంచిది. బరువు ఎత్తే వ్యాయామాలు చేయదలిస్తే అవి ఎత్తే సమయంలో శ్వాస విడుస్తూ ఉండాలి. ఆరుబయట ఉంటే మరీ ఎక్కువ వేడిగానూ లేదా మరీ ఎక్కువగా చల్లగానూ ఉండవచ్చు. అలాంటప్పుడు బయట ఉండే తేమ ఊపిరితిత్తులను తొందరగా అలసటకు గురిచేస్తుంది. అందుకే ఈ సీజన్‌లో జిమ్‌లో గానీ లేదా ఇన్‌డోర్స్‌లోగానీ వ్యాయామం చేయండి. నిటారుగా ఉండే ఎత్తులను ఎక్కకండి. మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, జ్వరం ఎక్కువగా ఉందనిపించినప్పుడు వ్యాయామం చేయకండి. వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస అందని పరిస్థితి ఉన్నా లేదా ఆయాసంగా ఉన్నా వ్యాయామం చేయడం ఆపి, డాక్టర్‌ను సంప్రదించండి. గుండెదడగా అనిపిస్తే వ్యాయామాన్ని నిలిపివేయండి. బలహీనంగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించినా, ఛాతీమీద బరువుగా అనిపించినా, భుజం, దవడ, వెన్ను భాగంలో నొప్పి ఉన్నా వ్యాయామం ఆపి డాక్టర్‌ను కలవండి. వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీలోగానీ లేదా శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి వస్తే, దాన్ని విస్మరించి వ్యాయామాన్ని కొనసాగించకండి.
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
నా వయసు 44 ఏళ్లు. మెడనొప్పిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాను. ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి మెడకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్పారు. దయచేసి వివరించండి.
- సుభానీ, గుంటూరు
మీరు మెడనొప్పిని తగ్గించుకోడానికి ఎప్పుడూ మెడను పూర్తిగా రౌండ్‌గా తిప్పకండి. సగం మాత్రమే తిప్పండి. నిద్రపోయే సమయంలో పలచగా ఉన్న తలగడను భుజాలకిందుగా ఉండేలా అమర్చుకోవాలి. మరీ మెత్తటి తలగడను వాడకండి. మీ కంప్యూటర్ మానిటర్, టీవీ చూసే సమయంలో దానిలోకి తొంగిచూస్తున్నట్లుగా మెడను ఉంచకండి. కూర్చున్నప్పుడు, నిలబడ్డ సమయంలో మీ తలను శరీరానికి నిటారుగా ఉంచండి. తలను అటు ఇటు అకస్మాత్తుగా తిప్పకండి. ఫోన్లు మాట్లాడే సమయంలో భుజానికి, తలకు మధ్యన ఫోన్‌ను ఇరికించి, తలను పక్కకు తిప్పి మాట్లాడకండి. భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి. మీ మెడనొప్పి తగ్గడానికి... మీ భుజాలను షగ్ ్రచేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కొని ఐదు అంకెలు లెక్కపెట్టి మళ్లీ వదలండి. ఇలా కనీసం ఐదుసార్లు చేయండి. మీ భుజాలను మొదట ఒక ఐదుసార్లు సవ్యదిశలో, ఆ తర్వాత ఐదుసార్లు అపసవ్యదిశలో తిప్పండి. మీ నుదుటిని అరచేతితో పట్టుకొని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ ఐదంకెలు లెక్కపెట్టండి. అలాగే రెండు చెంపలకూ అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధంగా వ్యాయామం చేయండి. ఆ తర్వాత తల వెనక చేతిని పెట్టుకొని కాసేపు తలను వెనకవైపునకు నొక్కుతూ వ్యా యామం చేయండి. మెడ, వెన్ను, భుజం... ఇలా ఏ ప్రాంతంలో నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టండి. చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, పేపర్ చూస్తున్నప్పుడు తలను ఎక్కువగా ఒంచకండి. ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ మానిటర్‌గానీ మీ కళ్ల లెవల్‌కు సమానంగా ఉండేలా చూసుకోండి. కంటికీ మానిటర్‌కూ మధ్యన 16 నుంచి 22 అంగుళాల దూరం ఉండాలి. అంతకు తక్కువ, ఎక్కువ ఉండటం సరికాదు. కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మీ మోచేతులను కుర్చీ చేతుల మీద ఆన్చి... వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి.
శ్వాసకోశ వ్యాధులు ఉన్నా వ్యాయామం చేయాలంటే..?
Published Sun, Nov 15 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM
Advertisement
Advertisement