కీలెంచి.. మేలెంచు! | sakshi health councling | Sakshi
Sakshi News home page

కీలెంచి.. మేలెంచు!

Published Wed, Jan 4 2017 11:14 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

కీలెంచి.. మేలెంచు! - Sakshi

కీలెంచి.. మేలెంచు!

మన రక్షణ కోసం పాటుపడాల్సిన బాణం మనల్నే పోటు పొడిచినట్లుగా చేసే శరాఘాతమే ఈ కీళ్లవాతం. మేకులతో గుచ్చినట్లు బాకులతో పొడిచినట్లు ఒకటే నొప్పి! చిన్న కీళ్ల నుంచి మొదలై పెద్ద కీళ్లలోకి పాకుతూ   మరింత పెరిగే బాధ!   ఈ సీజన్‌లో అవస్థలను పెంచే వ్యాధుల్లో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ముఖ్యమైనది. మన కీళ్లపై మనకు అవగాహన పెంచేందుకే ఈ ప్రత్యేక కథనం. కీలెంచి మేలెంచేందుకు   చదవండి... చదివించండి.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చాలా సాధారణంగా కనిపించే ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. దీన్ని సాధారణ పరిభాషలో కీళ్లవాతం అని కూడా అంటారు. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కీళ్లపైనే ప్రతికూలంగా వ్యవహరిస్తూ, వాటిని బాధించే పరిస్థితిని రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అంటారు. జన్యుపరమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధి రావడానికి కారణాలు
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఎందుకు వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. దీనికి సరైన కారణం తెలియదు. జన్యుపరమైన మార్పులు లేదా పర్యావరణంలో కలిగే మార్పుల సంయుక్త ప్రభావం వల్ల ఈ వ్యాధి వస్తుందని కొందరు నిపుణుల అంచనా. మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ సొంత కణాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా సొంత కణాలను శత్రు కణాలుగా పొరబడుతుంది. అలా వాటిపై దాడి చేస్తుంది. ఈ పరిణామాల కారణంగా ఎముకల చివర్లలో కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్, ఎముక పొర దెబ్బతిని, కీళ్లు క్రమంగా అరిగిపోతాయి. క్రమేణా కీళ్లు బలహీనపడి పటుత్వాన్ని కోల్పోతాయి. మిగతా వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్యుల అభిప్రాయం.

ఎవరెవరిలో ఈ వ్యాధి వస్తుంది?
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను ఏ వయసువారిలోనైనా చూడవచ్చు. అయితే సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పొగతాగే వారిలో ఇది ఎక్కువన్న విషయం పరిశోధనల్లో తేలింది. గర్భిణుల్లో వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి... ప్రసవం తర్వాత తీవ్రరూపం దాలుస్తుంది.

వ్యాధి తీవ్రత
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు, తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే కాలంతో పాటు వ్యాధి తీవ్రత కూడా మారుతుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే తీవ్రత చాలా ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ప్రశాంతంగానూ ఉండవచ్చు.

వ్యాధి వల్ల కలిగే క్లిష్ట సమస్యలు
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను ప్రారంభ దశలోనే కనుగొని సరైన చికిత్స తీసుకోకపోతే ఇది మరిన్ని సమస్యలకూ, ఇతర వ్యా«ధులకూ దారితీస్తుంది. కీళ్లు వంకరపోవడం, చర్మం మీద దీర్ఘకాలంగా మానని పుండ్లు పడటం, చర్మం కుళ్లిపోవడం, చర్మం మీద దద్దుర్లు రావడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఊపిరితిత్తులు మూసుకుపోవడం, గుండెపోటు, మూత్రపిండాలు, కాలేయ వైఫల్యం వంటివీ కలుగుతాయి. ఒంటిలో కొవ్వు శాతం పెరిగి, రక్తకణాలు మూసుకుపోతాయి. నరాల బలహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం, కంటిచూపు కోల్పోవడం వంటి అనర్థాలు సంభవించే అవకాశం కూడా ఉంది. సరైన చికిత్స తీసుకోని వారిలో ఎముకలు బోలుగా మారడం, కార్పల్‌ టన్నల్‌ సిండ్రోమ్, చిన్నవయసులోనే మరణం, క్యాన్సర్‌ జబ్బులు కూడా అధికంగా వస్తాయి.

వ్యాధి నిర్ధారణ
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ విషయంలో ఆరంభదశలోనే వ్యాధి నిర్ధారణ చేయడం అత్యంత కీలకమైన అంశం. అయితే ఈ దశలో వ్యాధిని కనిపెట్టడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వివిధ రకాల కీళ్లవాతాలు, కీళ్ల నొప్పుల సమస్యలు, కీళ్ల వాపులు వంటì  కీళ్లకు సంబంధించిన జబ్బులన్నీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నిర్దిష్టంగా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ కీళ్లనొప్పులను కనిపెట్టడం ఒకింత కష్టసాధ్యమవుతుంది. అందుకే కాస్త సంక్లిష్టంగా కనిపించే కీళ్లనొప్పులు వస్తే రుమటాలజిస్ట్‌ను సంప్రదించడం అవసరం. ఈ నిపుణులు కండరాలు, కీళ్లు పరీక్షించి, వ్యాధిని సరిగా కనిపెడతారు. దాంతోపాటు కీళ్ల వాతానికి సంబంధించిన ఆర్‌ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ అనే నిర్దిష్టమైన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చికిత్స కోసం సీబీపీ, ఈఎస్‌ఆర్, కిడ్నీ, కాలేయ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.

చికిత్స విధానాలు
వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి నిపుణులు చికిత్సను ప్రారంభిస్తారు. ఈ వ్యాధికి అనేక రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని రోజులు మాత్రం నొప్పి నివారణ మాత్రలు వాడాలి. స్టెరాయిడ్స్‌ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వీటిని మొదలు పెట్టాలి. వ్యాధి తీవ్రత తగ్గుతున్నప్పుడు వీటి మోతాదును క్రమేణా తగ్గించి, మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు వాటిని మానేయాలి. వీటి వల్ల వెంటనే నొప్పి, వాపు తగ్గుతాయి.
పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం వాడితే అనర్థాలే!

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు చెందిన మందులను నిపుణుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా దీర్ఘకాలం వాడితే షుగర, బీపీ, ఎముకల బలహీనత, ఇలా బలహీనపడటం వల్ల తేలిగ్గా విరిగిపోవడం, కంటిలో శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటి ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయి.

తీవ్రతను బట్టి మందులు, మోతాదులు
ఒకటి లేదా రెండు కీళ్లలోనే జబ్బు తీవ్రత కనిపిస్తే, దాన్ని తగ్గించడానికి నిపుణులు కీళ్లలోకి సూదిమందును పంపే ప్రక్రియను సూచిస్తారు.
స్టెరాయిడ్‌ స్పేరింగ్‌ మందులు... అంటే మెథిట్రెక్ట్సెట్, సల్ఫాసాలజీన్, లెఫ్లూనమైడ్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల వ్యాధి తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తూ, పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఈ మందులు వాడేటప్పుడు క్రమం తప్పకుండా సీబీసీ, కాలేయం, కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలను డాక్టర్ల సలహా మేరకు చేయించుకోవాలి.

అందుబాటులో అనేక ఆధునిక చికిత్సలు
ఇటీవల ఈ వ్యాధికి అనేక ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బయొలాజికల్‌ మందులు అంటారు. స్టెరాయిడ్‌ స్పేరింగ్‌ మందులకు లొంగని వ్యాధిగ్రస్తులలో, అలాగే ముందు నుంచి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో ఈ మందులను సూచిస్తారు. వీటి వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే వ్యాధి వల్ల కలిగే సంక్లిష్ట సమస్యలను కూడా ముందునుంచే అరికట్టవచ్చు.
నివారణ: దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. ఆరంభదశలో చికిత్స మొదలు పెడితే, జీవననాణ్యత మెరుగుపరుచుకోవచ్చు.

మూడు ‘ఎస్‌’లతో గుర్తించడం తేలిక
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వచ్చిన వారిలో  కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా ఈ వ్యాధిని  తేలిగ్గా గుర్తించవచ్చు. అవి...

స్టిఫ్‌నెస్‌ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి  అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం.
     
స్వెల్లింగ్‌ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట)
     
స్క్వీజింగ్‌ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్‌ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్‌ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు... షేక్‌హ్యాండ్‌ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్‌’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్‌’ అయితే మీకు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉందేమోనని చూసుకోవాలి.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రుమటాలజిస్ట్‌లను సంప్రదించి, వ్యాధిని నిర్ధారణ చేసుకొని, సత్వరం చికిత్స మొదలుపెట్టుకోవాలి.వైద్యుల సలహా మేరకు కీళ్లవాతానికి సంబంధించిన మందులు వాడుతున్నప్పుడు సకాలంలో ఇతర పరీక్షలు కూడా కొన్ని చేయించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఏడాదికి ఒకసారి ఒంట్లో కొవ్వు శాతం, గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.మందులతో పాటు ఫిజియోథెరపీ వంటి చికిత్స విధానాలను కూడా అనుసరించాలి. దీనివల్ల తీవ్రమైన నొప్పులనుంచి ఉపశమనం పొందడమే గాకుండా కీళ్లు వంకరపోకుండా కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.పొగతాగే అలవాటును, మద్యం దురలవాటు ఉంటే తక్షణం వాటిని మానేయాలి.

ఇతర లక్షణాలు
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. కేవలం ఒక చేతి కీళ్లకే ఈ నొప్పి పరిమితం కాదు. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... ఒకేలా నొప్పి పెడతాయి. ఉదయంపూట తీవ్రమైన అలసట ఉంటుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయం కల్లా పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్‌ తిప్పడం,  డబ్బా మూత తీయడం, షర్ట్‌ బటన్లు పెట్టుకోవడం సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు.

లక్షణాలు
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ప్రధానంగా కీళ్లపై ప్రభావం చూపెడుతుంది. కీళ్లు వాచిపోయి సున్నితంగా మారతాయి. ఉదయాన్నే ఎక్కువసేపు బిగుసుకుపోయి (స్టిఫ్‌నెస్‌ కలిగి) ఉంటాయి. సాధారణంగా చేతి, కాళ్ల చిన్న చిన్న కీళ్లను ఈ వ్యాధి మొదట ప్రభావితం చేస్తుంది. క్రమంగా మణికట్టు, భుజాలు, మోకాళ్లు వంటి పెద్ద కీళ్లకు వ్యాపిస్తుంది. కీళ్లనొప్పులతో పాటు జ్వరం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, బుద్ధిమాంద్యం లాంటివి కూడా కనిపిస్తాయి. కేవలం కీళ్ల మీదనే గాక ఇతర అవయవాలైన చర్మం, కళ్లు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు, రక్తనాళాలు, కాలేయం మీద కూడా ఈ వ్యాధి ప్రభావం చూపెడుతుంది. ఈ వ్యాధి గర్భవతులకు వస్తే.... ఈ వ్యాధి కారణంగా వారిలో.... పూర్తిగా నెలలు నిండక ముందే  శిశువుల ప్రసవం, తక్కువ బరువు ఉన్న శిశువుల జన్మించడం, గర్భస్రావం మొదలైన సమస్యలు కనిపిస్తాయి.

డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి,
కన్సల్టెంట్‌ రుమటాలజిస్ట్,కిమ్స్‌ హాస్పిటల్స్,
సికింద్రాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement