సువార్త
యేసుక్రీస్తుకు దగ్గరి వారైన 70 మంది శిష్యుల్లో మార్కు ఉన్నాడు. యేసును రోమా భటులు బంధించినప్పుడు ఆయన్ను వెంబడించి మధ్యలో ఆయన్ని వదిలి పారిపోయిన యువకుడు మార్కు (మార్కు 14:51,52) ఇతనేనన్నది చరిత్రకారుల అభిప్రాయం. యేసు చివరిసారి పస్కా ఆచరించిన ఇల్లు ఇతని తల్లిదేనని, పస్కా ఏర్పాట్లన్నీ ఈయనే చేశాడని కూడా చెబుతారు (మార్కు 14:12–16). యేసు పునరుత్థానం తర్వాత పౌలు బర్నబాతో కలసి సువార్త యాత్ర కోసం సైప్రస్ దేశానికి వెళ్లాడు. కాని అతను మధ్యలోనే వారినొదిలేసి యెరూషలేముకొచ్చేశాడు. ఆ తర్వాత పౌలు, బర్నబా మరో సువార్త యాత్రకు వెళ్దామనుకున్నప్పుడు మార్కును వెంట తీసుకెళ్దామని బర్నబా ప్రతిపాదిస్తే, మునుపు మనల్ని మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి మనతో ఎందుకంటూ పౌలు తీవ్రంగా విభేదించాడు. ఆ కారణంగా పౌలు, బర్నబా విడిపోయి పౌలు సౌలు అనే వ్యక్తితో, బర్నాలా మార్కుతో కలసి చెరోవైపు వెళ్లిపోతారు. (అపో.కా.15:39–41). దుడుకు తత్వం, పిరికితనం, మధ్యలో పారిపోయే చంచలత్వం ఉన్న మార్కును ఆనాడు అంతా తక్కువ చేసి మాట్లాడారేమో కాని, దేవునికి మాత్రం అతని పట్ల దృఢ సంకల్పం, తిరుగులేని ప్రేమ ఉన్నాయి. కాబట్టే యేసుక్రీస్తు జీవిత విశేషాలపై ఆయన రాసిన గ్రంథాలన్నీ దేవుడు బైబిల్ లోని నాలుగు సువార్త గ్రంథాల్లో ఒకటిగా మార్కు సువార్తగా చేర్చాడు. అదే దేవుని ప్రేమలోని ప్రత్యేకత.
ప్రజల దృష్టిలో అల్పుడైన వ్యక్తి దేవుని దృష్టిలో కూడా అల్పుడు కానక్కరలేదు. ప్రజలు ఆకాశానికెత్తే వ్యక్తిని దేవుడు కూడా హెచ్చిస్తాడనడానికి లేదు. ఎందుకంటే, మనలాగా ఆలోచించడానికి దేవుడు మానవుడు కాదు. పరిచర్యలో పడుతూ లేస్తూ ముందుకు సాగిన మార్కులాంటి బలహీనుడికి బైబిల్‌లో ఏకంగా సువార్త గ్రంథాన్ని రాసే ఆధిక్యతనివ్వడం దేవునికే చెల్లింది. అందుకే లోకాన్ని చూస్తూ, లోకం మెప్పుకోసం పాకులాడితే దేవుడు నిర్దేశించిన పథంలో పరుగెత్తడం కష్టమవుతుంది. అందువల్ల ఎన్ని వైఫల్యాలున్నా దేవుని వైపే చూస్తూ నిదానంగానైనా ముందుకు సాగే బలహీనులు, ఫలహీనుల్లోనే దేవుడు తన కృపను, మహదైశ్వర్యాన్ని నింపుతాడు. వాళ్లే దేవుని రాజ్యాన్ని అద్భుతంగా నిర్మిస్తారు. పడిపోయిన మార్కును దేవుడు ఘనంగా వాడుకోవడమే కాదు, అతనిలో వచ్చిన మంచి మార్పును, ఆత్మీయ పరిణతిని, ఎదుగుదలను పౌలు కూడా గ్రహించి అతన్ని అద్భుతంగా ప్రేమించాడు. బలహీనులే అయినా తనకు విధేయంగా వుండే వారితోనే దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. పొరపాటున జారిపడ్డా, తప్పులు చేసినా, విశ్వాసాన్ని పాదుకొని, పరులను గెలవడమెలాగో విశ్వాసులంతా మార్కును చూసి నేర్చుకోవాలి.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
పడి ఉవ్వెత్తున లేచే కెరటం విశ్వాసి!!
Published Sat, Apr 8 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
Advertisement
Advertisement