రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు నివారణ, చికిత్స ఉన్నాయా?
నా వయసు 34 ఏళ్లు. గత ఆరేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో రకాల నొప్పి తగ్గించే మందులు వాడుతున్నాను. అయినప్పటికీ ఉపశమనం కలగడం లేదు. నా సమస్యకు నివారణ, చికిత్స ఏమిటి? - స్పందన, నల్లగొండ
జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. దురదృష్టవశాత్తూ ఈ రకమైన వ్యాధులకు శాశ్వత నివారణ లేదు. అయితే వ్యాధిని ప్రారంభ దశలోనే నిర్ధారణ చేసి, చికిత్స మొదలుపెడితే... జీవననాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. అంతేగాక ఈ వ్యాధి వల్ల వచ్చే క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. చికిత్స చేయించుకునే విషయంలో డాక్టర్ మీద ఉన్న నమ్మకం, వారి మాటలను తూ.చ. తప్పకుండా పాటించడం వంటి అంశాల మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కానీ దాదాపు సగం మంది రోగులకు ఉండే అపోహలతోనూ, సరైన నమ్మకం ఉంచుకోకపోవడం వల్లనూ డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోరు. దాంతో ఫలితాలు కనబడవు.
ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఇచ్చే మందులలో నొప్పి నివారణ మాత్రలు, స్టెరాయిడ్స్ వాడుతుంటారు. చికిత్సకు ఇవి అవసరమే గానీ వీటి దుష్ర్పభావాలు చాలా ఎక్కువగానూ, విపరీతంగానూ ఉంటాయి. కాబట్టి వీటి ఉపయోగంలో పరిమితిని పాటించాలి. వ్యాధి తీవ్రతను మార్చేలా అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెథోట్రెక్సేట్, లెఫ్లూనమైడ్, సల్ఫాసలాజిన్ పేర్కొనదగినవి. ఈ రకమైన తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో ఇటీవల బయలాజికల్ మందులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ రెండు రకాల మందులను రుమటాలజిస్ట్‌ల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే మొదలు పెడితే... వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గించి, అదుపులోకి తీసుకురావచ్చు. వ్యాధి తీవ్రతను నియంత్రించిన తర్వాత... రుమటాలజిస్టు మీ మందుల మోతాదును నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తారు. మందులతో పాటు మంచి పోషకాహారం, ఫిజియోథెరపీలతో వ్యాధి వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. - డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్,కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్