చిన్నకీళ్లను ప్రభావితం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుకభాషలో వాతం అంటారు. దీని బారిన పడ్డవారు కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. కానీ వారికి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తెలియదు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది క్రానిక్ సిస్టమిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. అంటే జీవక్రియల అసమతౌల్యత వల్ల మన వ్యాధినిరోధకశక్తే మనపట్ల ప్రతికూలంగా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. మన శరీరంలోని వివిధరకాల కణజాలాలు, అవయవాలు, కీళ్లు (సైనోవియల్ జాయింట్స్), ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మంపై ఈ వ్యాధి తాలూకు దుష్ర్పభావం ఉంటుంది.
సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చిన ప్రతిసారీ నొప్పి నివారణ మందులు వాడి, దాని నుంచి ఉపశమనం పొందుతుంటారు. కానీ మందులు ఆపివేయగానే నొప్పులు మళ్లీ తిరగబెడతాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్స చేయించుకుని, వ్యాధిని అంకురం నుంచి సమూలంగా తొలగించుకోకపోతే... వ్యాధి తీవ్రత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు వచ్చి అది వైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి సంపూర్ణంగా నయమయ్యేవరకు చికిత్స చేయించుకోవాలి.
ఎవరెవరిలో...
ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా కనిపించే అవకాశం ఉంది. కానీ యుక్తవయసులో ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మగవారిలో కంటే ఆడవారిలో ఇదివచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. రుతుక్రమం ఆగిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువే. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువినైల్ ఆర్థరైటిస్ అంటారు.
లక్షణాలు
వ్యాధిప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లు (సైనోవియల్ జాయింట్స్)పై వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది.
కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనపడతాయి.
శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం.
లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు (మెటాటార్సో ఫాలింజియల్ జాయింట్స్), చేతివేళ్లు (మెటా కార్పో ఫాలింజియల్ జాయిడ్స్, ఇంటర్ ఫాలింజియల్ జాయింట్స్), మణికట్టు ఆ తర్వాత పెద్ద కీళ్లయిన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరసలో వ్యాపిస్తుంటాయి.
దీర్ఘకాలం పాటు కీళ్లు ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడం వల్ల ఫైబ్రస్ కణజాలం ఏర్పడి, కొన్ని కీళ్లు వైకల్యానికి గురి అవుతాయి. దీన్నే డిఫార్మిటీ(స్) అంటారు. దీనిలో... బౌటనీర్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ, అల్నార్ డిఫార్మిటీ ముఖ్యమైనవి. వీటివల్ల కీళ్లు తమ సాధారణ అమరికను, కదలికలను కోల్పోతాయి.
కీళ్లపై చర్మం లోపల చిన్న చిన్న కణుతులు వస్తాయి. వీటినే ‘రుమటాయిడ్ నాడ్యూల్స్’ అంటారు.
ప్లూరా ఇన్‌ఫ్లమేషన్‌కు గురి అయి, ఫైబ్రోసిస్ కావడం వల్ల రుమటాయిడ్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది.
ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం (అథెరోస్క్లిరోసిస్) వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ.
పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా సాధారణంగా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలూ ఉండవచ్చు.
రోగి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్-ఫ్యాక్టర్, పీఆర్‌పీ, ఏఎన్‌ఏ, యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్) మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.
హోమియో చికిత్స: చాలారకాల ఆటో-ఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. అన్నిరకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌కి ఇతర చికిత్స విధానాల్లో శాశ్వత నివారణ లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందుల్ని రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వాభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం ఎలా...?
ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా చిన్న కీళ్లు దానిబారిన పడతాయి.
ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో నొప్పి, వాపు ఉండటాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు.
ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయి, సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. దాదాపు రెండుగంటల పాటు అలా ఉన్న తర్వాత నిదానంగా అవి వదులవుతాయి.
శరీరంలో ఇరువైపులా ఒకేవిధంగా కీళ్లు... నొప్పులకు, వాపునకు గురవుతాయి. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
కీళ్ల ప్రాంతంలో చర్మం కింద ఫైబ్రస్ కణజాలం పెరగడంతో అది బయటకు చిన్న కణుతుల్లా కనిపిస్తుంటాయి.
దీర్ఘకాలికంగా వ్యాధి ఉన్నప్పుడు కీళ్లనొప్పులతోపాటు కీళ్ల వైకల్యం (జాయింట్ డిఫార్మిటీ) రావచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్