
పూలమాలి
సేవను విధి అనుకుని చేసేవారు కొందరు. సేవను స్వభావంగా భావించి చేసేవారు మరికొందరు.
సేవను విధి అనుకుని చేసేవారు కొందరు. సేవను స్వభావంగా భావించి చేసేవారు మరికొందరు. శ్రీలత స్వభావంలో సేవ ఉంది. మార్పు కోరే చైతన్యం ఉంది. చైతన్యానికి సరిపడా పోరాట స్వభావం ఉంది. మొగ్గలను రాల్చే తోటమాలులతో పోరాడి వాటిని కాపాడి ఫలవంతం చేస్తున్న శ్రీలత సిసలైన పూలమాలిగా కనిపిస్తుంది.
సరిగ్గా ఏడాది కిందటి మాట. మదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినులంతా తరగతి గది నుంచి బయటకొచ్చారు. తమ క్లాస్ టీచర్‌ను చుట్టుముట్టి సీరియస్‌గా ఏదో చెప్పారు. అవునా... అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన టీచర్ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి పదండి అంటూ విద్యార్థినులను వెంట తీసుకుని పావుగంటలో ఊళ్లోని ఓ ఇంటికెళ్లింది. అక్కడ జరిగే పెళ్లి తతంగాన్ని చూసి పద్నాలుగేళ్ల వయసున్న పిల్లకు పెళ్లేంటని గొడవ పడి ఆ బాల్యవివాహాన్ని అడ్డుకుంది.
ఈ సంఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పది మండలాల్లో బాల్య వివాహాలు చేయాలంటే పెద్దలు వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. బాల్యవివాహాలు సగానికి సగం తగ్గాయి. ఇక్కడి జనంలో ఇంతటి మార్పు రావడానికి ‘రోప్స్’ సంస్థే కారణం. దానిని నడిపే శ్రీలత, ధనశేఖరన్ దంపతులు ఆరేళ్ల పోరాటానికి ఫలితం ఇప్పటి వరకూ 500కు పైగా బాల్య వివాహాలు ఆగిపోవడం.
పులివెందుల నుంచి...
పులివెందుల ప్రాంతానికి చెందిన శ్రీలత, ధనశేఖరన్ దంపతులు 1989లో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంను కార్యస్థలిగా చేసుకుని రూరల్ ఆర్గనైజేషన్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్ సర్వీసెస్ (ఆర్‌వోపీఈఎస్- రోప్స్) పేరిట ఎన్జీవోను నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల్లో సాంఘిక దురాచారాలకు గురవుతూ నలిగిపోతున్న గిరిజన మహిళలు, వారి పిల్లలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రోప్స్ సేవలు ప్రారంభించింది.
పేద పిల్లలకు చదువు చెప్పడం, వైద్యం అందించడం, అనాథలను అక్కున చేర్చుకోవడం, విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి కల్పించడం, సాంఘిక దురాచారాలను అరికట్టడం వంటి సామాజిక సేవలతో ఈ సంస్థ ఇక్కడున్న 20కి పైగా గ్రామాల్లో మంచి గుర్తింపు పొందింది. అనాథలైన పిల్లలతో పూర్తిగా మమేకమైన శ్రీలతను ‘దేవుడిచ్చిన అమ్మ’గా పిల్లలు భావిస్తారు. అందుకే ఈ నెల 8న పలమనేరులో జరిగిన ‘మదర్స్‌డే’ వేడుకల్లో ఈ ప్రాంతపు ప్రముఖులు ఆమెను ‘బెస్ట్ మదర్’గా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
సాటివారి ఆనందం కోసం...
తన ప్రయాణం ఎలా మొదలయ్యిందో శ్రీలత వివరిస్తూ - ‘‘మాది కడప జిల్లా పులివెందుల. అమ్మ రత్నమ్మ, నాన్న యూసఫ్. ఇద్దరూ టీచర్లే. నా చదువంతా రాయచోటిలోనే. 1981-85 మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియాలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత రాయచోటికి దగ్గర్లోని దేవపట్ల ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఇన్‌చార్జిగా ఉద్యోగంలో చేరాను. 1988లో ధనశేఖరన్‌తో పెళ్లయ్యింది. జనం కోసం ఏదైనా చేయాలన్న ఆయనలోని తపన, ఆరాటాన్ని గుర్తించాను. చిన్నప్పటి నుంచీ నాలోనూ అదే కోరిక. మనం బతుకుతూనే మన పక్క వారు ఆనందంగా బతికేలా చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని నమ్మాం.
పెళ్లైన నాలుగు నెలల తర్వాత ఉద్యోగ రీత్యా బంగారుపాళ్యం చేరుకున్నాం. బంగారుపాళ్యం, గంగవరం, పలమనేరు, పుంగనూరు, పెద్ద పంజాణి మండలాల్లో పేదరికంతో అల్లాడిపోతున్న ఎస్సీ, ఎస్టీలను చూస్తే గుండె తరుక్కుపోయేది. 1989లో వీరి కోసం రోప్స్‌ను ప్రారంభించాం. మొదట 5 గ్రామాల్లో మహిళా మండళ్లు ఏర్పాటు చేశాం. సాయంత్రం పూట చదువు లేని ఆడోళ్లందరినీ సమావేశపరిచి వారికి పొదుపు, ఆరోగ్యం, స్వయం ఉపాధి మీద మంచి మాటలు చెప్పేవాళ్లం. అంతేకాకుండా వాళ్లను వెంటబెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి రేషన్‌కార్డులు, పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం చేసే వాళ్లం.
మాధవన్‌తోపు ప్రాంతంలో వెట్టిచాకిరిలో మగ్గుతున్న 23 ఎస్సీ కుటుంబాలకు విముక్తి కలిగించి వారికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ద్వారా ఇళ్లు కట్టించాం. ఇప్పుడా కుటుంబాలన్నీ బుట్టలల్లుకుంటూ స్వయం ఉపాధిని పొందుతున్నాయి. ఆ తర్వాత రోప్స్ సంస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
మొదట 15 బాల్వాడీలు...
రోజంతా ఎండలో ఎండుతూ చంకలో ఏడాది బిడ్డనెత్తుకుని కూలి పనులకు వెళ్లే మహిళల్ని చూస్తే బాధేసేది. వీళ్ల బిడ్డలను మా బిడ్డలుగా చూడాలనుకున్నాం. వెంటనే 0-5 ఏళ్ల మధ్యనున్న పిల్లల కోసం పలమనేరు, గంగవరం మండలాల్లో 15 చోట్ల బాల్వాడీ కేంద్రాలను ప్రారంభించాం. పిల్లలకు పోషకాహారం పెట్టడంతో పాటు వారికి ఆట పాటల విద్యాబుద్ధులు నేర్పాం. ఐరాల, బెరైడ్డిపల్లి, బంగారుపాళ్యం మండలాల్లో గర్భవతులు, కాన్పులు పూర్తయిన మహిళల్ని కలిసి వైద్య పరంగా సలహాలివ్వడమే కాకుండా వారికి ఉచితంగా మందులు, ఇంజక్షన్లు ఇచ్చేవాళ్లం.
అప్పట్లో ఇక్కడి గ్రామాల్లో కాన్పులు కష్టంగా ఉండేవి. ఊళ్లల్లో ఉండే మంత్రసానులు కాన్పు సమయంలో పేగు కోసేందుకు కత్తులు, బ్లేడులు వాడే వాళ్లు. దీంతో అమాయకులైన మహిళలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవాళ్లు. దీన్ని నివారించడానికి ఇద్దరు నర్సులను ఎంపిక చేసి సురక్షిత కాన్పులపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఎక్కడ కాన్పులుంటే అక్కడికి వీరిని పంపేవాళ్లం.
బాల్య వివాహాలపైనే ఫోకస్....
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, మదనపల్లి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల్లో చదువుసంధ్యల్లేక, ఎండు కట్టెలమ్ముకునే ఆడపిల్లల్ని చూసి బాధ కలిగేది. పదమూడేళ్లకే పెద్దలు వీళ్ల పెళ్లిళ్లు చేసే వాళ్లు. దీంతో కాన్పు సమయంలో పెద్ద ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. దీన్ని నివారించాలని నిర్ణయించుకున్నాం. 2009 నుంచి బాల్య వివాహాలపై పోరాటం ప్రారంభించాం. పోలీసులు, చైల్డ్‌లైన్ సహకారంతో బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాం.
ఇప్పటికి సుమారు 500కి పైగా బాల్య వివాహాలను ఆపగలిగాం. ఓసారి బాల్య వివాహాలపై మేం మైకు ప్రచారం జరుపుతుంటే తరగతి గదిలోంచి విన్న ఓ విద్యార్థిని బైటకొచ్చి మాకు ఫోన్ చేసింది. రేపు తన పెళ్లనీ, వచ్చి సాయం చేయమని కోరింది. వెంటనే వెళ్లాం. ఆమెకు అండగా నిలబడ్డాం. ఇప్పుడా అమ్మాయి లక్షణంగా చదువుకొని, తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్యోగం సంపాదించుకుంది.
శివరాత్రికి శ్రీకాళహస్తి, మొగిలి క్షేత్రాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మా బృందాలతో వెళ్లి పెద్దలను ఒప్పించి ఆయా వివాహాలను ఆపేవాళ్లం. ఈ పనిని ఇంకా కొనసాగిస్తాం. ప్రజలు మాకు అండగా నిలుస్తారని భావిస్తున్నాం’’ అని అంటున్న శ్రీలతలో ఈ సమాజానికి ముఖ్యంగా బాలబాలికలకు ఏదైనా చేయాలనే నిజమైన తపన కనిపించింది.
- గంగిశెట్టి వేణుగోపాల్, సాక్షి ప్రతినిధి, తిరుపతి
అందరూ అమ్మా... అనే పిలుస్తారు...
2006లో జరిగిన ఓ సంఘటన మనసును కదిలించింది. ఎయిడ్స్ వ్యాధితో కన్నుమూసిన భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదారేళ్లు ఉన్న ఈ పిల్లలు అనాథలయ్యారు. వీరిని దగ్గరకు తీసుకుని ఓ ఆయాను ఏర్పాటు చేశాం. వీరిని చూసి మరికొంత మంది వచ్చారు. ఈ విధంగా కారుణ్య చిల్డ్రన్స్ హోం ఏర్పడింది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. వీళ్లంతా నన్ను అమ్మా... అంటారు. నాకు చాలా సంతోషమేస్తుంది.
నేను వెళ్తే చాలు... నా చుట్టూ చేరిపోతారు. రోజంతా వాళ్లతో కబుర్లు చెప్పినా తనివి తీరదు మరి. మా ఇద్దరి జీతాలతో పాటు నెదర్లాండ్స్‌కు చెందిన టెరిడా సంస్థ ఏటా కొంత ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో పాటు చైల్డ్‌లైన్ సంస్థ వారు అయిదుగురు ఉద్యోగులకు వేతనాలు అందిస్తూ సాయం చేస్తోంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సంస్థను నడుపుతున్నాం.
- పి. శ్రీలత, రోప్స్ సంస్థ నిర్వాహకురాలు