
వినూత్నమైన, ప్రభావవంతమైన, సుస్థిరమైన మార్పుకోసం కృషిచేస్తున్న ఎందరో మహానుభావులు... వారిలో కొందరికి సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు
నిత్యవిద్యార్థి
నాన్న గారి మాటలే నాకు స్ఫూర్తి. ‘నడవలేవని బాధపడవద్దు, పదిమందిని నడిపించే స్థాయికి చేరు’ అని చెప్పారు. ఆయన కోరుకున్న బాటలో నడుస్తున్నాను. కాళ్లు లేవని బాధపడను, సమాజానికి ఏమీ చేయలేనప్పుడే బాధపడతాను. – బాల లత (యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – ఎడ్యుకేషన్)
‘‘ఒక అమ్మాయి జీవితమంటే సోదరి, భార్య, తల్లి ఇంతేనా? ఈ భూమ్మీదకు వచ్చినందుకు మనకంటూ ఏదైనా చేస్తే తృప్తిగా ఉంటుంది’’ ‘జీవితంలో తానిక నడవలేను’ అని తెలుసుకున్న బాలలత మనసులో మెదలిన ఆలోచన ఇది.అదే ఆమె సంకల్పంగా మారింది. ప్రస్తుతం భారత రక్షణశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలలత ఆత్మసంతృప్తికోసం తాను అనుకున్నది సాధించారు, ఇంకా సాధిస్తూనే ఉన్నారు. మల్లవరపు బాలలతది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జడి జమాల్పూర్ గ్రామం. తల్లి విజయరాణి, తండ్రి శౌరయ్య. పోలియో చుక్కలు వికటించడంతో నడకకు దూరమైన లతను తల్లిదండ్రులు తిప్పని ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఊళ్లు తిరగడంతో బడికి దూరమవడం తప్ప మరో ఫలితం కనిపించలేదు.
అమ్మానాన్న శ్రద్ధగా బోధించడంతో పదవతరగతి పూర్తి చేసిన బాలలత ఆ తర్వాత చదువంతా దూరవిద్యలోనే పూర్తిచేశారు. ఇంటర్‌లో రెండుసబ్జెక్టులు ఫెయిలయినపుడు కొందరు నవ్వారు, అయినా ఆమె కుంగిపోలేదు. లా ఎంట్రన్స్ లో ఫస్ట్ ర్యాంకు వచ్చినపుడు చాలామంది చప్పట్లు కొట్టారు, ఆమె పొంగిపోనూలేదు. తనకు తృప్తి కలిగించే విజయం కోసం చదువుల యజ్ఞం సాగించారామె. పట్టుదలతో సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే 399 ర్యాంకు సాధించారు. అయినా ఆమె చదువుల ప్రయాణం ఆగిపోలేదు. సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడాలనుకున్నారు. తనలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లలో ఆత్మస్థయిర్యాన్ని నింపి, వారికి చేయూతనివ్వాలనుకున్నారు.
బోధించేవాళ్లు ఎప్పుడూ విద్యార్థులతో పోటీ పడాలని నమ్మే బాలలత 2016లో రెండోసారి సివిల్స్ రాసి 167వ ర్యాంకు సాధించారు. ఐఎఎస్ వచ్చినా ఎందుకు వెళ్లలేదని అడిగితే ‘‘నా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపడానికే నేను మళ్లీ సివిల్స్ రాశాను’’ అంటారు. విధి చేసిన తప్పిదాన్ని తన విజయాలతో సరిచేసి, చుట్టూ ఉన్న సమాజానికి తన కాళ్లవైపు చూసే అవసరం లేకుండా చేసిన విజేత ఆమె. దేశానికి ఎక్కువమంది అధికారులను అందించడంలోనే తనకు సంతృప్తి ఉంటుందంటున్న ఈ చదువుల తల్లిని... ఎడ్యుకేషన్ విభాగంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి.
వెలుగు వీచికలు
మేము జంటగా ఎన్నో చోట్ల స్ట్రీట్ ఆర్ట్ వేశాం. ఓ అర్ధరాత్రి జెఆర్‌సి సెంటర్ గోడలకు కూడా. ఇప్పుడు అదే జెఆర్‌సిలో అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రకారులుగా రాణిస్తూ, సందేశాన్ని కళాత్మకంగా చెప్పాలనేది మా కోరిక. – స్వాతి, విజయ్ (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్, స్పోర్ట్స్)
గోడలపై రాతలంటే మనం తక్కువగా చూస్తాం. కానీ... వాళ్లు గీసే గీతలు, రాసే రాతలు, వేసే బొమ్మలు చూస్తే మాత్రం క్షణం ఆగి ఆలోచిస్తాం. ఆ కళాకారులు ఎంచుకున్న దారి అంత గొప్పది మరి. ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతి, హైదరాబాద్ వాసి విజయ్... ఇద్దరూ హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఫైన్‌ఆర్ట్స్ చదువుకున్నారు. అక్కడే ఒకరికొకరు పరిచయమయ్యారు. కళతోపాటు జీవితాన్నీ పంచుకున్నారు. నచ్చిన బొమ్మలు వేసి ఏడాదికో గ్యాలరీ పెట్టుకోవడం ఈ జంటకు సంతృప్తినివ్వలేదు. కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నారు. సమాజానికి ఆర్ట్ ద్వారా ఏదైనా సందేశాన్ని చేరవేయాలనుకున్నారు. రోడ్లపైన, గోడలపైన కొటేషన్లు, పెయింటింగ్స్‌తో అలాంటి ప్రయత్నమే చేశారు. ఆ కళ పేరు గ్రాఫిటీ.
తమ ప్రతిభతో ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్ షిప్ గెలుచుకున్న ఈ జంట, పారిస్‌లో తొమ్మిదినెలలు కళావిహారం చేసింది. స్ట్రీట్ ఆర్ట్‌కి అక్కడ ఉన్న ఆదరణ వారిని అబ్బురపరచింది. తాము ఎంచుకున్న పనిని మరింత వేగంగా ఎలా చేయాలో తెలుసుకున్నారు. జనసంచారం ఉండేచోట ఖాళీగా ఒక గోడ కనిపిస్తే... తెల్లారేసరికి అదొక సందేశంగా మారిపోవచ్చు. అది మనల్ని ప్రశ్నగా నిలదీయొచ్చు. బాధ్యతను గుర్తుచేయొచ్చు కూడా. రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లారి నాలుగు గంటల్లోగా పని పూర్తి చేస్తారు. ఈ కళాకారులకు ఇది హాబీ కాదు, సొంత ఖర్చులతో చేసే ఉద్యోగం. ఇదే జీవితం. రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ ఐదెకరాల పొలంలో సేవ్ ఫార్మర్ నినాదాన్ని సృష్టించి ప్రపంచాన్నే ఆలోచింపజేశారు.
డ్రాపవుట్స్ కారణంగా విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో ప్రభుత్వం ఏకంగా రెండువేల పాఠశాలలను మూసేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ వార్త చదివి చలించిపోయిన ఈ జంట సర్కారు బడికి కొత్త రూపు ఇచ్చి డ్రాపవుట్స్‌ని తగ్గించే బాధ్యతనూ తలకెత్తుకుంది. 2014లో జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరయ్యారు ఈ గ్రాఫిటీ కళాకారులు. రాత్రిపూట కుంచెను కదిలిస్తూ పగటికి కొత్త వెలుగును ప్రసాదిస్తూ... గొప్ప గొప్ప ఆలోచనలకు గోడ కడుతున్న స్వాతి విజయ్‌లను, సోషల్ సర్వీస్ విభాగంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్’ సత్కరిస్తోంది సాక్షి.
టెక్ సేద్యం
యాభై మూడేళ్ల వయసులో నేను అవార్డు అందుకోవడానికి వచ్చింది నేచురల్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే. వ్యవసాయం తెలియని నేను కేవలం పాలేకర్ పుస్తకాలు చదివి వ్యవసాయం నేర్చుకున్నాను. అందరూ నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించండి, స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోండి. – గుళ్లపల్లి సుజాత (ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్)
గుళ్లపల్లి సుజాత స్వస్థలం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారకట్ల. గ్రాడ్యుయేషన్ చేసి, గ్రానైట్ ఎగుమతి వ్యాపారంలో అనుభవం గడించారామె. కానీ... ఒక్కసారిగా తనకు ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏకంగా నలభై ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నారు. కారణం... అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచన.
సుజాత బంధుమిత్రుల్లో చాలామంది వైద్యులున్నారు. వారంతా ఆహారం విషయంలో చాలా పద్ధతులు పాటించేవారు. అయినాసరే తమవారి కుటుంబాల్లో కొందరు క్యాన్సర్ బారిన పడటం, దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురికావడం సుజాతను కలచివేసింది. వీటన్నింటికీ కారణం రసాయనిక అవశేషాలున్న ఆహారపదార్థాలు తినడమేనని ఆమె గ్రహించారు.
ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన ఆహారోత్పత్తులే తినాలని నిశ్చయించుకున్నారు. కానీ అవి అంత సులువుగా దొరికేవి కావు. అలాంటి సమయంలో మనమే ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేయకూడదు అనుకున్నారు.పెదారకట్ల వద్ద రాళ్లు రప్పలతో నిండిన 40 ఎకరాల పొలం తీసుకుని సాగు మొదలుపెట్టారు సుజాత. డ్రిప్ ఇరిగేషన్ సాయంతో పండ్లతోటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు చేసి మంచి దిగుబడి సాధించారు ఈ మహిళారైతు. వ్యవసాయం చేస్తూనే, అందులో అనుభవం సంపాదించిన సుజాత ఇప్పుడు తమ బంధువులతోపాటు ఎంతోమందికి స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తుల్ని అందించగలుగుతున్నారు.
మెకానికల్ ఇంజనీరైన భర్త కోటేశ్వరరావు సాయంతో పొలంలోనే సొంత ఖర్చులతో ఓ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు సుజాత. టెక్నాలజీని తనకు అనుగుణంగా మలచుకున్న సుజాత 40 ఎకరాల క్షేత్రాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తుంటారు. మొదట్లో తాను పండించిన కూరగాయలు, పప్పుధాన్యాలు బంధువులకు మిత్రులకు ఉచితంగా పంపిణీ చేసి వారిలో అవగాహన పెంచారు. ఇప్పుడు వ్యవసాయశాఖ అధికారులతో పాటు ఎంతోమంది తన ఇంటికే వచ్చి ఉత్పత్తులు తీసుకెళ్లడం తనకెంతో సంతోషాన్నిస్తుందంటారామె. పదిమంది ఆరోగ్యం కోసం సాగునే వృత్తిగా ఎంచుకున్న ఈ ఆదర్శరైతును ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017, ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్’ విభాగంలో సత్కరిస్తోంది సాక్షి.
గిరిజన సేవ
వైద్యం అందని ప్రాంతాల్లో రోగి ఇంటి ముందుకే వైద్యాన్ని చేరుస్తున్నాం. మా ఆలోచన చెప్పగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మమ్మల్ని ప్రోత్సహించారు. నాలుగున్నరేళ్ల మా ప్రయాణంలో కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లలేని వేలాది మందికి వైద్యం అందించాం. – డాక్టర్ పద్మనాభరెడ్డి, సీఈవో, నైస్ ఫౌండేషన్ (ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్)
భగవంతుడు ప్రాణాలు పోస్తాడు. వైద్యుడు ప్రాణాలు నిలుపుతాడు. అందుకే మన సమాజంలో వైద్యుడిని దేవుడితో సమానంగా ఆరాధిస్తారు. వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో, నిరుపేదలకు ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు ఫీజుతో అవసరమైన వైద్యచికిత్సలు అందించడానికి ఏర్పాటైంది నైస్ ఫౌండేషన్. నిరుపేద బాలికలు, గర్భిణీలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఈ ఫౌండేషన్.
డాక్టర్ రెడ్డీస్ సహకారంతో కమ్యూనిటీ హెల్త్ ఇంటర్‌వెన్షన్ ప్లాన్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలకు వెళ్లి గిరిజన స్త్రీలు, పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది నైస్ ఫౌండేషన్. నల్గొండ, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని 160 గ్రామాల్లో ఉచిత వైద్య సేవలందిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది నైస్. పలు గ్రామాల్లో మంచానికే పరిమితమైన పేషెంట్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తోంది నైస్.
ఐదు మండలాల్లోని 256 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాల వైద్యసేవలను ఉచితంగా అందచేస్తూ, శిశుమరణాలకు అడ్డుకట్ట వేయాలనే ఆశయంతో నవజాత శిశువుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది ఈ ఫౌండేషన్. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న నైస్ ఫౌండేషన్‌ను 2017 సంవత్సరానికి గాను హెల్త్‌కేర్ రంగంలో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.
ఆటుపోట్ల గెలుపు
నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన మా అమ్మానాన్నలకు వందనాలు. – షేక్ జఫ్రీన్ (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్)
చిన్నతనంలోనే టెన్నిస్ ఆటపై మక్కువ పెంచుకుంది షేక్ జఫ్రీన్. కూతురి అభిరుచి గుర్తించిన తండ్రి షేక్ జహీర్ అహ్మద్ కూతురిని మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు తన సర్వస్వం త్యాగం చేశారు. నిరంతర శిక్షణ, టోర్నమెంట్లలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా టూర్లు, ఇతర ఖర్చుల కోసం ఆస్తి మొత్తం అమ్మేశారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి లక్ష్యంగా దిశగా అంతులేని విశ్వాసంతో ముందుకు సాగారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు. ఆడపిల్లకు ఆటలెందుకని సూటిపోటి మాటలు.
అయినా సరే, కూతురి మీద, ఆమె ఎంచుకున్న టెన్నిస్ మీద నమ్మకం కోల్పోలేదు జహీర్ అహ్మద్. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జఫ్రీన్ తన ఆటతీరుతో కొద్దికొద్దిగా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటికే జఫ్రీన్ ఆట కోసం తండ్రి తనకున్నదంతా ఖర్చు చేసేశారు. సొంత ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఇక అమ్మడానికి ఏమీ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జఫ్రీన్ పట్టుదలతో సాధన చేసింది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంట్లలో పాల్గొని అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. కాని స్పాన్సరర్స్ ఎవరూ ముందుకు రాలేదు.
తండ్రీకూతుళ్లు ఆటను విడిచి పెట్టలేదు. 2013లో బల్గేరియాలో జరిగిన డెప్లింపిక్స్‌లో ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది జఫ్రీన్. ఆ తరువాత నుంచి జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాకెట్‌లా దూసుకుపోయింది. 2017లో జరిగిన డెప్లింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి తన తండ్రి కల నెరవేర్చింది. చిత్రమేమిటంటే, జఫ్రీన్‌కు వినిపించదు, మాటలు సరిగ్గా రావు. అయినా ఇవేవీ ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. షేక్ జఫ్రీన్‌కు జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ – ఫిమేల్ కేటగిరీలో ఎక్స్‌లెన్స్ అవార్డు అందిస్తోంది సాక్షి.
తొలగిన చీకటి
మా అమ్మానాన్నల కళ్లెదుట, వారి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పురోగతిలో ప్రధాన భూమిక వారిదే. నా స్నేహితులు, సంస్థ (ఎస్‌బిఐ)తోపాటు నాకు పూర్తి సహకారం అందిస్తున్న టీమ్‌కి కృతజ్ఞతలు. – ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్)
గ్రౌండంతా కలియతిరుగుతూ అందరినీ ఉత్సాహ పరుస్తూ, క్రికెట్ ఆడే ఓ కుర్రాడు నాలుగేళ్ల వయస్సులో హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. ఇంట్లో కరెంటు పోవడంతో, చీకట్లో పరుగెత్తి, గుమ్మానికి బలంగా గుద్దుకున్నాడు. దానితో ఒక కన్ను పోయింది, మరో కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి పాక్షికంగా కంటిచూపు దెబ్బతింది. పిల్లవాడి భవిష్యత్తు అంధకారమైపోతుందని తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఆ చిన్నారి మాత్రం ధైర్యం కోల్పోలేదు. క్రికెట్ ఆడలేనేమోనన్న∙భయం తెలిసే వయసు కాదు అది.
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని లూథరన్ అంధుల పాఠశాలలో చేరి పదోతరగతి పూర్తి చేశాడు. ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ చదువుతూనే పట్టుదలగా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయస్థాయిలో అనేక క్రికెట్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించాడు. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, రైటార్మ్ ఫాస్ట్ బౌలర్‌గా సేవలందిస్తూ, అనేక విజయాలు సాధించాడీ యువకుడు. 2016 నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు కొనసాగిస్తూనే, ఆటలో ప్రతిభను ప్రదర్శిస్తూ, క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. గుంటూరు జిల్లా గురజాలలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి తనకు ఎదురైన అడ్డంకులన్నిటినీ అధిగమించాడు.
విశిష్టమైన ఆటతీరుతో ఇప్పటికే 80 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, యాభైకి పైగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సాధించారు అజయ్. అనేకమార్లు తన జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. ఆసియా కప్, రెండో టి 20 వరల్డ్ కప్, ఐదో వన్ డే అంతర్జాతీయ ప్రపంచ వరల్డ్ కప్పులను సాధించారు.
ఈ యువకుణ్ణి స్పోర్ట్స్ కేటగిరీ పురుషుల విభాగం, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి.
నేలమ్మ బిడ్డ
శాస్త్రవేత్త వెంకటరెడ్డి చెప్పినట్లు పోషకాలు, పురుగు మందు అన్నీ మట్టిలోనే ఉన్నాయి. ఇదే నా నమ్మకం, ఇదే నా సాగు రహస్యం. నా అనుభవంలో నేర్చుకున్నది కూడా ఇదే. పంటకు సోకిన ఎలాంటి తెగులైనా సరే మట్టి ద్రావణం చల్లితే చాలు... పురుగు నాలుగు రోజుల్లో చచ్చిపోతుంది. – తుమ్మల జగదీశ్ యాదవ్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్)
ఎదిగే బిడ్డను చూసి తండ్రి మురిసిపోయినట్టు... పెరిగే పంటను చూసి రైతు సంతోషిస్తాడు. జగదీశ్ యాదవ్ వేసిన చెరకు పంట నిచ్చెన వేసుకుని ఎక్కేంత ఎత్తు ఎదిగింది. సాగు అతనొక్కడిదే అయినా సంతోషం మనందరిదీ. ఎందుకంటే... అతను చేసింది సేంద్రియ వ్యవసాయం. మట్టిని నమ్ముకున్న రైతు ఎప్పుడూ నష్టపోడు అంటారు. అది కేవలం నమ్మకం మాత్రమే కాదు, నూటికి నూరుశాతం నిజమని నిరూపిస్తున్నారు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన తుమ్మల జగదీష్ యాదవ్.
డిగ్రీ చదువుకున్న జగదీష్ తండ్రి బాటలోనే పొలంబాట పట్టి వ్యవసాయాన్నే ఉద్యోగంగా ఎంచుకున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా తనకున్న 30 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టిద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషిని ఆచరణలో పెట్టి ఫలితాలు సాధించి చూపిస్తున్నారు జగదీష్ యాదవ్. సివిఆర్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ కేవలం మట్టిని పిచికారీ చేస్తే అతని పొలంలో చెరకు 15 అడుగుల ఎత్తుకు పెరిగింది.
పంటకు వేయడానికి ముందు పొలంలో గొర్రెల మందను కట్టేయడం, పంట కాలంలో పదిసార్లు మట్టి ద్రావణాన్ని స్ప్రే చెయ్యడం మినహా ఈ రైతు ఎలాంటి మందులు, ఎరువులు వాడలేదు. ఈ ద్రావణం తయారీలో రెండు రకాల మట్టిని ఉపయోగిస్తారు. భూమికి పైన ఆరంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని పై మట్టిగా, ఆ తర్వాత మరో నాలుగు అంగుళాల లోతు వరకు తవ్విన మట్టిని లోపలి మట్టిగా పరిగణిస్తారు. ఈ రెండింటినీ సమపాళ్లలో నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేసి దాన్ని పంటపై పిచికారీ చేస్తారు. ఇదే పద్ధతిలో జగదీష్ యాదవ్ పత్తి, కంది, మొక్కజొన్న, ఇతర కూరగాయలు పండిస్తూ అద్భుత దిగుబడి సాధిస్తున్నారు.
రసాయనిక ఎరువులు వాడే రైతులు ఎకరానికి 20 వేలు పెట్టుబడి పెడుతుంటే... అందులో పదవవంతు కంటే తక్కువ పెట్టుబడితో అత్యధిక రాబడి అందుకుంటూ మరింతమంది రైతుల్ని సేంద్రీయ వ్యవసాయం వైపు చూసేలా చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తూ, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తోన్న ఈ మట్టిమనిషిని ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 ఉత్తమ రైతు’గా సత్కరిస్తోంది సాక్షి.
గలగలా... గోదావరి
వృత్తి అయినా, వ్యాపారం అయినా... విలువలతో కూడి ఉండాలి. అదే మన సమాజానికి, దేశానికీ గర్వకారణం. – వెంకటేశ్వరరావు(బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్)
రైతులకు నాణ్యమైన పైపులను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిందే గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ‘గోదావరి పైపులే రైతుకు శ్రీరామ రక్ష’ అంటూ... 1991లో ఈ సంస్థ్ధను రాజేంద్ర కుమార్‌తో కలిసి ప్రారంభించారు సి.వెంకటేశ్వరరావు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ చేశారు. అంతేకాదు, ఆయన యూనివర్సిటీ టాపర్ కూడా. వారి కుటుంబ నేపథ్యం కూడా వ్యాపార వాణిజ్యరంగం కావడంతో ఆయన 16 సంవత్సరాల వయసులోనే కార్గో బిజినెస్‌ను ప్రారంభించారు. ఆయన సారథ్యంలో గోదావరి పాలీమర్స్ కంపెనీ దాదాపుగా 3.5లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. ఎపి, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం కార్యకలాపాలు కొనసాగిస్తోంది గోదావరి పాలీమర్స్ ఇండస్ట్రీ.
సంవత్సరానికి 240 టన్నుల ప్రొడక్షన్‌తో ప్రారంభమైన గోదావరి పాలీమర్స్... ఆయన ఆధ్వర్యంలో 25వేల టన్నుల సామర్థ్ధ్యానికి విస్తరించింది. 20 ఎమ్.ఎమ్. పైపు సైజ్ నుంచి 500 ఎమ్.ఎమ్. పైపుల వరకు తయారు చేస్తున్నారు. హెచ్‌డిపిఈ పైప్ ఫిట్టింగ్స్, స్ప్రింక్లర్‌లు, డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులను రైతులకు అందిస్తోంది. కంపెనీ టర్నోవర్ సైతం 0.42 కోట్ల నుంచి 342 కోట్లకు చేరడంలో వెంటేశ్వరరావు కృషి అభినందనీయం. ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి పంట పొలాలకు మళ్ళించడమే తమ లక్ష్యం’ అంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న గోదావరి పాలీమర్స్ ఫౌండర్ కమ్ ఎం.డి... సి. వెంకటేశ్వరరావు... ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017– బిజినెస్ విభాగంలో బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి.
విద్యాగంధం
నాకు 92 ఏళ్లు, ఇంత వరకు ఒక్క అవార్డు కూడా తీసుకోలేదు. సాక్షి మీడియా సంస్థ నిర్వర్తిస్తున్న విశిష్టమైన కర్తవ్యమే నన్ను అవార్డుకి అంగీకరించేటట్లు చేసింది. – డాక్టర్ చుక్కారామయ్య(లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు)
ఆయన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఎంతకాలం ఈ అన్యాయం’ అని గట్టిగా ప్రశ్నించి, ఊరి పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. దళితులు, అణగారిన వర్గాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. నాటి నైజాము ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించారు. రజాకార్ల దౌర్జన్యాలపై తిరగబడ్డారు. సహించలేని కర్కశ నిజాం ప్రభువులు అరెస్టు చేయడంతో ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు. చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడారు. ఆయనే చుక్కా రామయ్య. తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని విద్యావేత్త. ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థులకు ఐఐటీల్లో ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం కల్పించిన విద్యాదాత. క్లిష్టమైన గణిత సమస్యల పరిష్కారాలను ఎంతో సులువుగా విప్పి చెప్పిన విశిష్ట ప్రతిభాశీలి.
ఉద్యోగ విరమణ తరవాత కూడా విద్యావ్యాప్తి కోసం కృషి చేయాలనే సంకల్పంతో 1985 లో హైదరాబాద్‌లో నల్లకుంటలో ఐఐటీ స్టడీ సర్కిల్ ప్రారంభించిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. దానితో చుక్కా రామయ్య, ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో నర్సమ్మ, అనంతరామయ్య దంపతులకు 1925 నవంబర్ 20న జన్మించారు రామయ్య. నాగార్జునసాగర్ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా 1983లో రిటైరయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, జేఈఈలలో సీటు కోసం ప్రయత్నిస్తున్న కొందరు విద్యార్థులు ‘గణిత శాస్త్రంలో ఇబ్బందిపడుతున్నాం, సహాయం కావాలి’ అని చుక్కారామయ్యను కోరి, ఆయనతో ఐఐటీ ఎంట్రన్స్ పాఠాలు చెప్పించుకుని విజయం సాధించారు.
అత్యంత క్లిష్టమైన ఐఐటీ ఎంట్రన్స్ కోచింగు రంగంలోకి వచ్చిన రామయ్య అద్భుతమైన టీచింగ్ విధానాలతో తన విద్యార్థులకు మెరికల్లాగ తీర్చిదిద్దుతున్నారు. ఐఐటీలోనే కాదు, రామయ్య ఐఐటీ కోచింగు సెంటర్‌లో సీటు రావాలన్నా ఎంట్రన్స్ టెస్టు క్లియర్ చేయాల్సిందే. రామయ్య ఐఐటీ కోచింగు సెంటర్‌లో చేరడానికి ప్రతి ఏడాది ఐదువేల మంది పోటీపడితే 180 మందిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. 1985 నుంచి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించారు. సాంఘికసంస్కర్తగా, ఉద్యమకారునిగా, విద్యావేత్తగా, రచయితగా ఎమ్మెల్సీగా బహుముఖమైన సేవలు చేస్తున్న చుక్కా రామయ్యను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి.
పరిపూర్ణ సమాజం కోసం...
రెడ్డీస్ లాబొరేటరీస్ సంస్థ... కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీని రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో విశిష్టమైన సేవలందిస్తోంది రెడ్డీస్ ఫౌండేషన్. మేమందిస్తున్న విద్య, వైద్య రంగాలకు ఒకే రోజు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మా సంస్థ స్థాపకులు డాక్టర్ కల్లం అంజిరెడ్డిగారికి అంకితం. వారి స్ఫూర్తితో ఈ సేవను కొనసాగిస్తాం. – డా. వి.నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్)
వివిధ వ్యాపారాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. లాభనష్టాలకు పరిమితం కాకుండా సమాజ హితం కోసం పాటుపడుతూ అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు పాటు పడుతున్న సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒకటి. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆశయంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి 1996లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నిరుపేద పిల్లలకు విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది ఈ ఫౌండేషన్.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్కూల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ పేరుతో తన వంతు సమాజ సేవ చేస్తోంది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. స్కూల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం 130 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, స్కూల్ బ్యాగులు సరఫరా చేయడంతో పాటు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రతిభ చూపిన నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఉన్నత విద్యకు తోడ్పడుతోంది ఈ సంస్థ. విద్యార్థులకు హెల్త్‌కార్డులను కూడా అందచేస్తోంది.
130 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, గ్రంథాలయాలు, ఆర్‌వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుచేసింది ఈ ఫౌండేషన్. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహిస్తోంది. ఒక సమున్నత ఆశయంతో నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి, జాతినిర్మాణంలో తనవంతు సామాజిక బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌ను ఎడ్యుకేషన్ విభాగంలో 2017 సంవత్సరానికిగాను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి.
రైతు బాంధవుడు
రైతు కష్టపడితేనే మనం మూడు పూటలా తినగలుగుతాం. అలాంటి రైతు తన బిడ్డలకు మూడు పూటలా కడుపునిండా పెట్టలేకపోతున్నాడు. రైతును కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలి. ప్రభుత్వాలకు బాధ్యత తెలిసేలా చేయాలి. – సురేశ్ ఈడిగ (తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఆఫ్ ద ఇయర్)
చదువుకునే రోజుల్లో పై చదువులకోసం బ్యాంకు నుంచి విద్యారుణం తీసుకున్నారు సురేష్. కష్టపడి చదివాడు. అంచలంచలుగా ఎదిగారు. విదేశాలకు వెళ్లారు. అక్కడ తానెంచుకున్న వృత్తిలో మరింతగా ఎదిగారు. త్వరలోనే ఆ దేశంలో ఉన్న ప్రొఫెషనల్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తాను పొందిన ఫలాలను తానొక్కడే తినాలనుకోలేదు. పెద్ద చదువులు చదువుకోవాలన్న తపన ఉండీ, పైకం లేక నిరాశానిస్పృహలలో కొట్టుకుపోయే పేద విద్యార్థులకు కూడా పంచాలనుకున్నారు. దానిని ఏదో తూతూమంత్రంగా చేయదలచుకోలేదు. ఒక బాధ్యతగా భుజాన వేసుకున్నారు. ప్రతిభ ఉండీ, పై చదువులు చదువుకోలేని వారికి అండగా నిలిచారు.పేద రైతులు, చేనేత కార్మికులు, గ్రామీణ విద్యార్థులకు ఆసరా ఇచ్చారు.
అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆÔ¶ యం ఉన్న తనలాంటి మరికొందరిని కలుపుకుని ఆపన్నులకు ఆర్థిక సహకారం అందించారు. ప్రత్యేకించి రైతులకోసం ఒక ఎన్జీవోను నెలకొల్పారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి, అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ పెద్దలను కోల్పోయిన రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచారు. తోడుగా తానున్నానన్న నమ్మకం కల్పించారు. వారు జీవితంలో నిలదొక్కుకునేందుకు తగిన దారి చూపించారు. సంగారెడ్డి జిల్లాలో నేలమ్మ స్త్రీ రైతు సహకార సంఘాన్ని స్థాపించి, వారికి వడ్డీలేని రుణాలను ఇప్పించాడు. అప్పుల పాలైన పేద రైతు కుటుంబాలకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాకుండా ముందుగానే వారి రుణదాతలతో మాట్లాడి, ఒకవేళ వారు తీర్చలేకపోతే వారి అప్పులు తాను తీరుస్తానని హామీ ఇచ్చి, రైతులను ఒత్తిడి పెట్టకుండా చేశారు.
బహుళజాతి కంపెనీలు విక్రయించే నకిలీ విత్తనాలను, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందులను వాడి భూసారాన్ని కోల్పోయి, ఆశించిన దిగుబడి రాక పంట నష్టపోయిన రైతులను సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహించారు సురేష్. వారం వారం ఇంటర్నెట్ రేడియో నుంచి ‘కిసాన్ కీ బాత్’ అనే కార్యక్రమం ద్వారా రైతులకు కొత్త కొత్త పంటలు, పథకాలు, నూతన సేద్యవిధానాలపై అవగాహన కల్పిస్తుంటారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కూడా రైతు సహకార సంఘాన్ని స్థాపించి తనకు చేతనైన సాయం చేస్తుంటారు సురేష్.
వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులు దళారులు, కమీషన్ ఏజెంట్ల బెడద లేకుండా నేరుగా రైతుల దగ్గరే కొనుగోలు చేయడం వల్ల రైతులకు, వినియోగదారులకు కూడా లా¿¶ దాయకంగా ఉంటుందని సురేష్ నమ్మకం. అందువల్ల తనతోబాటు మరో యాభై కుటుంబాలు రైతుల వద్దే నేరుగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేశారు. సురేష్ భార్య శిరీష, ఆమె తల్లిదండ్రులు చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ. 60,000 విలువైన పోచంపల్లి చీరలను గొనుగోలు చేశారు. తనతోబాటు మరో 14 మందిని కలుపుకుని రైతు కుటుంబాలను పైకి తీసుకొచ్చేందుకు సురేష్ పడుతున్న తపనను, చేస్తున్న సేవలను గుర్తించిన సాక్షి 2017 సంవత్సరానికిగాను ఉత్తమ ఎన్నారైగా ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసింది.
సలామ్ మాస్టారూ!
సమాజంలోని విశిష్ట వ్యక్తులను గుర్తించి, వారిని పురస్కరించడం సాక్షి ఔన్నత్యం. టీచర్‌గా నేను ప్రజల డబ్బును జీతంగా తీసుకుని నా పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నాను. ఆ ప్రజల కోసం కొంతైనా చేయడం నా బాధ్యత అనుకుంటాను. అందుకే నా ఇంక్రిమెంట్ డబ్బుల్ని పేద పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను.
– వాల్గోతు కిషన్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్)
తల్లి, తండ్రి, గురువు, దైవం... అన్నారు. దేవుడికంటే ముందే గురువుకి స్థానం ఎందుకిచ్చారో చెప్పడానికి ఈ ఉపాధ్యాయుడి జీవితం ఒక ఉదాహరణ. వాల్గోతు కిషన్. పాటిల్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. స్వస్థలం ఖానాపూర్ మండలం బిలవార్ పూర్. గవర్నమెంటు టీచర్ అంటే స్కూల్లో పిల్లలు ఉన్నా లేకపోయినా, సంతకం పెట్టి వచ్చే ఉద్యోగం అనే అపోహను తొలగించారు. కిషన్ మాస్టారు పనిచేస్తున్న, ఇప్పటికే చేసి వచ్చిన పాఠశాలలకు వెళితే మాత్రం ఆ ముద్ర క్షణాల్లో చెరిగిపోతుంది.
పాఠాలు చెప్పడంతో తన పని అయిపోయిందని ఈ ఉపాధ్యాయుడు ఏనాడూ అనుకోలేదు. తన బడిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు... ఎంతమంది ఉండాలి... ఎంతమంది బడి మధ్యలోనే మానేశారు... ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుక్కుంటారాయన. అంతటితో ఆగిపోకుండా ప్రభుత్వ పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దడం తన కర్తవ్యంగా భావిస్తారు. పాఠశాలను శుభ్రంగా ఉంచడం, కనీస అవసరాలు కొరవడితే తన సొంత ఖర్చులతో వెంటనే ఏర్పాటు చేయడం, డ్రాపవుట్స్ ఉంటే... వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి ఆ పిల్లల్ని మళ్లీ బడిబాట పట్టించడం కిషన్ మాస్టారికి నిత్యకృత్యం.
నవోదయ, గురుకుల పాఠశాలలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలిచ్చి ప్రవేశ పరీక్ష రాయిస్తారాయన. స్కాలర్‌షిప్ వచ్చే అవకాశమున్న నిరుపేద విద్యార్థులను గుర్తించి, దరఖాస్తు చేయించి ప్రభుత్వ సహాయం అందేలా చేస్తారు. పదవ తరగతి పిల్లల కోసం సాక్షి భవిత ప్రచురించిన పుస్తకాలను పెద్దమొత్తంలో తీసుకుని అల్పాదాయ కుటుంబాల పిల్లలకు ఉచితంగా పంపిణీ చేశారీ మాస్టారు. ఎప్పుడూ ఒకటే ధ్యాస... పిల్లలు, చదువు, బడి, సమాజం... ఇంతే.
రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుడు ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు.వాల్గోతు కిషన్‌ను భారతప్రభుత్వం 2016 సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గౌరవించింది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అని నమ్మి... ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిని సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ విభాగంలో సత్కరిస్తోంది సాక్షి.
అమ్మ ఒడి
పిల్లలను గౌరవిద్దాం. బాల్యాన్ని కాపాడుదాం. పిల్లల్లోని నైపుణ్యాన్ని సంరక్షించుకుందాం. వీథి బాలలను, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలను సంరక్షించే ప్రయత్నంతో నాకు సహకరిస్తున్న నా భార్యకు, అధికారులకు ఈ అవార్డు అంకితం. – నాగరాజు, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ (ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్)
అందమైన బాల్యం శాపంగా మారితే భవిష్యత్తు అంధకారమవుతుంది. ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఎక్కడికెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ రైల్వేస్టేషన్‌లో, బస్ స్టేషన్‌లలో తిరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వీరంతా నా అన్నవారు లేక, ఆకలికి అలమటిస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపై కనిపిస్తుంటారు. ఇటువంటి వారిని చేరదీసి, ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పిస్తోంది ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ. చిన్నతనంలోనే పరిస్థితుల కారణంగా మానసికంగా దెబ్బ తిన్న బాలబాలికలకు కౌన్సెలింగ్ చేసి ‘మేమున్నాం’ అనే ధైర్యాన్ని కల్పిస్తోంది ఆశ్రిత.
మరోవైపు సమాజం చేత తిరస్కరించబడినవారు, భిక్షాటన చేసుకుని జీవించే అభాగ్యులు, చిత్తు కాగితాలు ఏరుకునే చిన్నారులు, అమ్మనాన్నలు ఉండి కూడా ఏ రక్షణ లేని బాలబాలికలకు అండగా నిలుస్తోంది ఆశ్రిత. విద్యతో పాటు ఆటపాలలోను ఈ పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. పెద్దయ్యాక సమాజంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే నైపుణ్యం కూడా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం రెయిన్‌బో హోమ్ పేరుతో నిర్వహిస్తున్న ఆశ్రమంలో 100 మంది బాలికలు, స్నేహఘర్‌లో 55 మంది బాలురు ఉన్నారు.
బాలల హక్కులను పరిరక్షించి వారి బంగారు భవిష్యత్‌కు పునాదులు వేయాలనేది తమ సంస్థ ఆశయం అంటారు ఆశ్రిత ఫౌండర్ సెక్రటరీ నాగరాజు. ఇంటి నుంచి పారిపోయినవారు, తప్పిపోయిన చిన్నారుల సమాచారం సేకరించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు సుమారు 65 మంది పిల్లలను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వారంతా ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రైవేటు సంస్థలు, పోలీసుల సహకారంతో నిర్వహిస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థకు 2017 సంవత్సరానికిగాను సోషల్ డెవలప్‌మెంట్ విభాగంలో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా.
గోమాత
ఆవుల కోసం సేవ చేయడానికి ఆవులే మమ్మల్ని ఎంచుకున్నాయి. వాటి సేవ చేయించుకుంటున్నాయి. మా ప్రయత్నంతో మా పిల్లలే కాదు, మరెంతో మంది పిల్లలు, వృద్ధులు స్వచ్ఛమైన పాలను తాగుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన ఆవుల్ని సంరక్షించుకుందాం. – అల్లోల దివ్యారెడ్డి (బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్టార్టప్)
‘గంగిగోవుపాలు గరిటడైన చాలు... కడివెడైన నేమి ఖరముపాలు...’ అన్న వేమన శతకానికి సరిగ్గా సరిపోతుందామె. ఎందుకుంటే జీవాన్ని నింపాల్సిన జలాలు గరళాన్ని నింపుతున్న తరుణంలో... పౌష్టికాహారం అందించాల్సిన పాలు కూడా విషతుల్యం అవుతున్నాయని గ్రహించారు. కల్తీ పాల కాటుకు బలవుతున్న పిల్లలకు స్వచ్ఛమైన పాలనందించాలనే సంకల్పమే ఆమెను ముందుకు నడిపింది. అదే తపన... ఇవాళ వేలాదిమంది పిల్లలకు స్వచ్ఛమైన పాలనందించగలుగుతోంది. స్వయంగా గుజరాత్‌కు వెళ్ళి పాతిక గిర్ ఆవులను తీసుకువచ్చి గచ్చిబౌలిలో డైరీ ఫార్మ్‌ను ప్రారంభించారు. అంతేకాదు రైతు కుటుంబంలో ఒక్కటిగా భావించే ఆవుకు మళ్ళీ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారామె. ఆమే అల్లోల దివ్యారెడ్డి.
జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ పట్టుభద్రురాలైన దివ్య... విదేశాల్లో స్థిరపడాలనుకుంది. కానీ పెద్దవాళ్ల నిర్ణయం ప్రకారం పెళ్ళి అవడం, ఆ తరువాత ఇద్దరు పిల్లలతో గృహిణిగా మారిపోయారు. మార్కెట్‌లో దొరికే కల్తీ పాలతో పిల్లలను పెంచడానికి ఆమెలోని తల్లి మనసు అంగీకరించలేదు. స్వచ్ఛమైన పాలనందించాలనే సంకల్పంతో ఒక అడుగు వేశారు. అదే ముందడుగుగా మారి ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారామె. ఆమె స్థాపించిన క్లిమామ్ డైరీ ఫార్మ్ 85 ఆవులతో నడుస్తోంది.
ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికే ఒక మహిళకు రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. అలాంటి సమయంలో ఈ డైరీ ఫార్మ్ ప్రాజెక్టును తలకెత్తుకున్నారు దివ్య. అది కొంత బరువైన బాధ్యతే అయినా... తన లక్ష్యం ముందు ఆ బాధ్యత చిన్నదిగా అనిపించిందామెకి. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తూ... సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆమెను స్టార్టప్ విభాగంలో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో సత్కరిస్తోంది సాక్షి.
తొలితరం తెలుగు రాకెట్
నా శ్రమను గుర్తించిన సాక్షికి కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచిన క్రీడాకారులు, సమాజంలో అందరికీ కృతజ్ఞతలు. క్రీడారంగంలో నా బాధ్యతను కొనసాగిస్తాను. – పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ (తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్)
క్రికెట్ బ్యాట్ పట్టుకుందామనుకున్న ఆ కుర్రాడు... అన్నయ్య సలహాతో షటిల్ బ్యాట్ ఎంచుకున్నాడు. ఎంచుకున్న క్రీడ ఏదైనా తన సత్తా ఏంటో చూపించాలనుకున్నాడు. దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. ఆ కుర్రాడే భారతీయుల అభిమాన బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్. 1973 నవంబర్ 16న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు గోపిచంద్. తండ్రి సుభాష్ చంద్ర, తల్లి సుబ్బరావమ్మ. హైదరాబాద్ ఎవి కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసిన గోపిచంద్, చదువుతో పాటు తనలో ఉన్న బ్యాడ్మింటన్ ఆటకు సానబెట్టారు. పదిహేడేళ్లకే ఇండియన్ కంబైన్డ్ యూనివర్సిటీస్ బ్యాడ్మింటన్ టీమ్‌కి కెప్టెన్‌గా పనిచేసిన గోపిచంద్... మొదట్లో ఎస్.ఎమ్.ఆరిఫ్ దగ్గర కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ప్రకాశ్ పదుకోన్ అకాడమీలో చేరారు.
రాకెట్ పట్టుకుని కోర్టులోకి దిగింది మొదలు విజయాల పరంపర కొనసాగించిన ఈ భారత క్రీడాకారుడు, 1996 నుంచి వరుసగా ఐదేళ్లు నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లతో, స్టార్ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. 2001... బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా గోపిచంద్ కెరీర్‌ని మలుపు తిప్పిన సంవత్సరం. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకొని, ఆ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచారు. అంతవరకు ఆ ఘనత వహించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్‌పదుకోన్. ‘ఆటనుంచి రిటైర్ అవ్వడం అంటే ఆటను వదిలేయడం కాదు. తనకంటే గొప్ప క్రీడాకారులను తయారుచేయడం’ అనుకున్నారు గోపీచంద్.
ఆ ఆలోచనే 2008లో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా అవతరించింది. 2012, 2016 ఒలింపిక్స్‌లో దేశానికి రెండు ఒలింపిక్ పతకాలు అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అకాడమీకి చెందినవారే. సైనానెహ్వాల్, పివి సింధు, కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ వంటి అద్భుతమైన క్రీడాకారులను అందించారు పుల్లెల. గోపీచంద్‌ను అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, ద్రోణాచార్య, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. చీఫ్ నేషనల్ కోచ్ ఫర్ ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ పుల్లెల గోపిచంద్‌ని ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి.