నా వయసు 38 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఆర్. రజిత, ఖమ్మం
రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి.
పాప్‌కార్న్ లంగ్ అంటే ఏమిటి?
నా వయసు 47 ఏళ్లు. చాలా చిన్న వయసు నుంచే స్మోకింగ్ మొదలుపెట్టి కొంతకాలం కిందటే ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ మొదలుపెట్టాను. అయితే అది కూడా వద్దనీ, దానివల్ల పాప్‌కార్న్ లంగ్ రావచ్చని డాక్టర్ అయిన నా ఫ్రెండ్ చెబుతున్నారు. ఈ ‘పాప్‌కార్న్’ లంగ్ అంటే ఏమిటి?– నాగేశ్వర్‌రావు, హైదరాబాద్
పాప్‌కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నను దీర్ఘకాలం పాటు వాడినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు. కృత్రిమ వెన్నలో తొందరగా ఆవిరయ్యే ‘డై అసిటైల్’ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అలాగే కొన్ని ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్‌కార్న్‌లను వెన్నలో బదులు దీనిలో వేపుతుంటారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి ఈ జబ్బును సాధారణ పరిభాషలో ‘పాప్‌కార్న్ లంగ్’ అంటుంటారు. పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివీ కనిపించే ఇతర లక్షణాలు. దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్‌కార్న్ లంగ్‌ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు. ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు. అందుకోసం ఏ రూపంలో పొగతాగే అలవాటున్నా దాన్ని వదులుకోవడమే మేలు.
ఏమిటీ ‘ఫంగల్ బాల్’?
కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. రక్తం కూడా పడుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. నాకు ఆందోళనగా ఉంది. ఫంగల్‌బాల్ అంటే ఏమిటి? – వినయ్‌కుమార్, రాజమండ్రి
ఫంగల్ బాల్ సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్‌లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్‌లోకి) చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్‌ను మన ఇమ్యూనిటీ దాన్ని నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇరతత్రా అంశాలు తోడవుతాయి. దాంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో పొక్కులా పెరగడం (యాబ్సెస్), ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది. కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్‌బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు.
ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్–రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది.
- డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్ , కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment