నువ్వుల్.. నవ్వుల్
‘పండుగ రోజు నువ్వులుండాలి!’
‘అదేంటండీ! పండుగ రోజు ఉండాల్సింది నవ్వులు కదండీ!’
‘అరే! నువ్వులుంటే... నవ్వులుంటాయ్‌రా భాయ్’
‘చెవిలో పువ్వులుండవా?’
‘ద్వారానికి పువ్వులు... ఇంట్లో పిండి వంటలు... వాటిలో నువ్వులు... ఇంటిల్లపాదీ ఆరోగ్యాల నవ్వులు...’
‘భలేగా పిండికొట్టి మరీ చెప్పావోయ్! పిండివంటల్లో నువ్వులుంటే... ఆరోగ్యాల నవ్వులన్నమాట!’
నువ్వుల కజ్జికాయలు
కావల్సినవి: మైదా/గోధుమపిండి – కేజీ, నువ్వులు – కేజీ, బెల్లం – 800 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – వంద గ్రాములు, నెయ్యి/నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙ముందుగా పిండిని మెత్తగా చపాతీలకు కలుపుకున్నట్టు కలుపుకొని, పక్కన ఉంచాలి. నువ్వులను దోరగా వేయించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. ∙పిండిని పూరీ చేయడానికి తగినంత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక్కొక్క ఉండను ఒత్తాలి. దానిని మౌల్డ్‌లో లేదా చేతి మీద వేసుకొని నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత చివర్లను మూసివేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా చేసుకున్న అన్ని కజ్జికాయలను కాగుతున్న నూనెలో వేసి, దోరగా వేగనివ్వాలి. కజ్జికాయలు చేయడానికి మౌల్డ్, వెనుక చక్రం ఉండే స్పూనులను వాడచ్చు.
సకినాలు
కావల్సినవి: బియ్యం– కప్పు, వాము – టీ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత
తయారీ: రాత్రిపూట బియ్యం కడిగి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే నీళ్లు వంపేసి, బియ్యాన్ని పిండి చేయాలి. ఈ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. అలాగే దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా చేయాలి. ఈ పిండి చేత్తో పట్టుకుంటే మృదువుగా ఉండాలి. శుభ్రమైన కాటన్ క్లాత్‌ని పరిచి, పిండి తీసుకొని చేత్తోనే చక్రాల్లా చుట్టాలి. పది, పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించి, తీయాలి.
నువ్వుల ఉండలు
కావల్సినవి: నువ్వులు – అర కిలో, బెల్లం – 400 గ్రాములు, ఏలకుల పొడి – టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా
తయారీ: తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ నువ్వుల ఉండలకు వాడచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు పోయేటట్లు చేసుకోవాలి. లేదంటే అలాగే కూడా వాడుకోవచ్చు. నువ్వులను వేయించి పొడి చేయాలి. కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. లేదా కాస్త పలుకుగా ఉండేట్లు దంచాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి – రెండూ కలిసే వరకు రోట్లో దంచాలి. చేతికి నెయ్యి రాసుకుని కావల్సిన సైజులో ఉండలు చేయాలి. కావాలంటే నువ్వులలో వేరుసెనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని విడిగా వేయించి, పొడి చేసి కలపాలి.
అరిసెలు
కావల్సినవి: బియ్యం– కేజీ, బెల్లం – 800 గ్రాములు, నువ్వులు – తగినన్ని, నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత
తయారి: ∙అరిసెలు చేయడానికి ముందు రోజు నుంచే కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. ఈ పిండి ఆరిపోకుండా, గాలి తగలకుండా ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద పాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాక మరగనిచ్చి, బియ్యప్పిండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ∙బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకం పిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్టు నిమ్మకాయంత ముద్దలు తీసుకొని నువ్వులలో అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి దోరగా రెండువైపులా వేయించాలి. తర్వాత తీసి అరిసెల పీట మీద వేసి, నూనె కారిపోయేటట్లు ఒత్తాలి. అరిసెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు ఒత్తేయవచ్చు.
అరిసె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడు బియ్యప్పిండి కలుపుకోవాలి.గట్టిగా, ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని ముదరనివ్వాలి. ∙ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూన్‌తో కొద్దిగా తీసుకొని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. ఆ రౌండ్‌ని పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చేదాకా మరగనివ్వాలి. ఇలా చేసుకున్న అరిసెలు 15 రోజుల వరకు ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్నని సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిసెలాగ వేడిగా, మెత్తగా వస్తాయి.
జంతికలు, కారప్పలు
కావల్సినవి: బియ్యప్పిండి – 3 కప్పులు, సెనగపిండి – కప్పు, పుట్నాల పప్పు∙– పావు కప్పు, వెన్న – పావు కప్పు (కరిగించాలి), కారం – టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు– 2 టీ స్పూన్లు, జీలకర్ర– టీ స్పూన్, నూనె – తగినంత
తయారీ: ∙పుట్నాల పప్పు వేయించి, పొడి చేయాలి. బియ్యప్పిండి, సెనగపిండి, పుట్నాల పప్పు పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి ముద్ద చేయాలి. పిండి మృదువుగా అయ్యేంత వరకు కలపాలి. ∙జంతికల అచ్చులో పిండి పెట్టి, పేపర్ మీద మురుకులు ఒత్తి, నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. (పైవన్నీ కలిపి, పూరీలా చేసి, నూనెలో రెండువైపులా కాల్చి తీస్తే కారప్పలు సిద్ధం.)