గణనీయంగా తగ్గిన జీడిగింజల దిగుబడులు
చుక్కల్లో ధరలు.. తారస్థాయికి చేరిన జీడిపప్పు ధర
వేటపాలెం: జీడిపప్పు తయారీ కేంద్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జీడిపప్పు పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే స్థితికి చేరాయి. విదేశాల నుంచి ముడి జీడిగింజల దిగుమతులు నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. మనదేశం జీడి మామిడి ఉత్పత్తి, జీడిపప్పు ప్రాసెసింగ్, ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామి. ఇక్కడ నుంచే 65శాతం ఎగుమతులు జరుగుతున్నాయి.
మనదేశంలోని ఫ్యాక్టరీలకు ఏటా 15–16 లక్షల టన్నుల ముడి జీడిగింజలను ప్రాసెస్ చేసి జీడిపప్పును ఎగుమతి చేసే సామర్థ్యం ఉంది. అయితే సగటు జీడిగింజల ఉత్పత్తి మాత్రం 7.28 లక్షల టన్నులు మాత్రమే ఉంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి ముడి జీడిగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ధర ఒక్కసారిగా పెరగడంతో దిగుమతులు తగ్గి, ముడిసరుకు అందక ఎగుమతులు క్షీణిస్తున్నాయి.
దేశంలో జీడిగింజల ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో పశ్చిమబెంగాల్, మూడో స్థానంలో కేరళ ఉన్నాయి. మన రాష్టంలో శ్రీకాకుళంలోని పలాస, కాశీబుగ్గ వీటికి ముఖ్య కేంద్రాలుగా చెప్పవచ్చు, తరువాత విశాఖప³ట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
గింజల ధరల్లో భారీ పెరుగుదలజీడిమామిడి పంట ఏటా మార్చి, ఏప్రిల్‌లో వస్తుంది. వ్యాపారులు ఈ నెలల్లో శ్రీకాకుళం, విజయనగరం, పలాసతో పాటు, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి జీడి గింజలు కొనుగోలు చేస్తుంటారు. 2023 మార్చిలో రైతుల నుంచి వ్యాపారులు బస్తా గింజలు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మార్చిలో బస్తా రూ.9 వేలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా ధర రూ.14 వేలకు చేరుకుంది. దీంతో జీడిపప్పు ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు.
సంక్షోభంలో పరిశ్రమ
రాష్ట్రవ్యాప్తంగా జీడిపప్పు పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఓవైపు గత ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో జీడి పంట గణనీయంగా తగ్గింది. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం జీడిగింజల దిగుమతి పై 9.05 శాతం పన్ను విధించింది. బస్తా జీడి గింజలు ప్రస్తుతం రూ.14 వేల ధర పెరిగింది. దీంతో కష్టాలు తప్పడం లేదని జీడిపప్పు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
రాష్ట్రంలో పలాస, విజయనగరం, వేటపాలెం ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వందేళ్లకు పైగా ఈ పరిశ్రమలు ఉన్నా జీడిపప్పు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు ఇతర దేశాలకు జీడిపప్పును ఎగుమతి చేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు సంస్థలను ఏర్పాటు చేశాయి. వారంతా మన రాష్ట్రంలో తయారైన జీడిపప్పును కొనుగోలు చేసుకుని ఎగుమతు చేసి లాభాలు గడిస్తున్నారు. దీంతో జీడిపప్పు పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గుతున్న తోటల విస్తీర్ణం
రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతాల్లో 4.25లక్షల ఎకరాల్లో జీడి మామిడి తోటలున్నాయి. ఏటా జీడిగింజల ఉత్పత్తి 92 వేల మెట్రిక్ టన్నులు. ప్రతి ఎకరాకు సాలుసరి 350 కిలోలు దిగుబడి. అయితే కోస్తాతీరం వెంబడి గడిచిన 10 ఏళ్ల నుంచి జీడి మామిడి తోటలను నరికి వేసి రైతులు ఇతర పంటలు సాగు చేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.
కొరత ఎక్కువగా ఉందిఈ ఏడాది జీడిమామిడి
గింజల కొరత ఎక్కువగా ఉంది. పప్పు ధర బాగున్నా గింజలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏడాది పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 30 శాతమే పండటంతో దాదాపు 70 శాతం గింజలను బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. విదేశాల నుంచి దిగుమతులు లేవు. – ప్రతి వెంకట సుబ్బారావు,జీడిపప్పు వ్యాపారి, వేటపాలెం, బాపట్ల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment