జగత్కల్యాణం.. శారదాదేవికి కుంభాభిషేకం!
నేత్ర పర్వం
బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతీదేవి, శాపవశాన బ్రహ్మదేవుని అవతారమైన మండనమిశ్రుని భార్యగా భూలోకాన అవతరించింది. మండన మిశ్రులు, సురేశ్వరాచార్యులనే పేరుతో, శ్రీశంకర భగవత్పాదుల శిష్యులైన వెంటనే, శాపవిమోచనమై, బ్రహ్మలోకానికి వెళుతుండగా, శ్రీ శంకరులు, తమ యోగశక్తితో ఆమె నిజస్వరూపాన్ని దర్శించి, ‘‘అవ్యాజ దయామృతాలు కురిపించే చల్లని తల్లివి, జ్ఞానధనాన్నిచ్చే పరమనిధివి, ఋష్యశృంగాది క్షేత్రాలలో మేము నెలకొల్పుతున్న అద్వైత పీఠాలలో శ్రీ శారదదేవీ స్వరూపాన విలసిల్లి సకల జనుల పూజలు స్వీకరిస్తూ, సనాతన ధర్మాలను కాపాడుతూ ఉండు తల్లీ’’ అని ప్రార్థించారు. ఆ ప్రార్థనను అంగీకరించి, శ్రీ సర్వతీదేవి ఆనాటినుండి, శృంగగిరి క్షేత్రాన శ్రీ శారదాదేవిగా కొలువై భక్తుల పాలిట కల్పతరువుగా ఉంది. శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన చందన శారదావిగ్రహాన్ని జగద్గురు శ్రీ విద్యారణ్యులు సువర్ణవిగ్రహంగా మార్పు చేశారు. అనంతర కాలంలో చంద్రశేఖర భారతీ స్వామి ఆలయనిర్మాణం చేసి, 1916లో కుంభాభిషేకం కావించారు. 35 వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థులు 1963లో శ్రీశారదాదేవి ఆలయానికి కుంభాభిషేకం కావించి, శ్రీ శారదాదేవి అనుగ్రహాన్ని భక్తులకు అందించారు. తదుపరి, ఈనాటి జగద్గురువులు, 36వ పీఠాధిపులైన జగద్గురు భారతీతీర్థులు 1993లో ఆలయానికి కుంభాభిషేకం చేశారు.
లోకక్షేమం కోసం మళ్లీ ఇప్పుడు భారతీతీర్థులు తమ శిష్యులైన విధుశేఖర భారతీ సన్నిధానం వారితో కలిసి దుర్ముఖినామ సంవత్సర మాఘశుక్ల పంచమి, సౌమ్యవాసరం, ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా ఫిబ్రవరి 1, బుధవారం నాడు శిలామయంగా ఉన్న శ్రీ శారదాదేవి ఆలయగోపురాన్ని స్వర్ణమయంచేసి, కుంభాభిషేకం జరుపుతున్నారు.
ఈ సందర్భంగా అనేక వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. దుర్ముఖ వత్సర మాఘశుక్ల ద్వితీయనాడు గణపతికి లక్షమోదక హోమం, తృతీయనాడు శ్రీ సన్నిధానం వారిచే శ్రీ మలహానికరేశ్వర స్వామివారికి విశేష పూజ, ఆ పవిత్రదినం నుండి మాఘపూర్ణిమ వరకు అతిరుద్ర మహాయాగం ది.2.2.2017 నుంచి పదిరోజులు కోటికుంకుమార్చన జరిపి, మాఘకృష్ణ తృతీయ 13.2.2017న శ్రీ శారదాదేవి రథోత్సవం జరుపుతున్నారు.
శారదే పాహిమాం, శంకర రక్షమాం
– కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం, తిరుమల