కడుపులో నొప్పి, అజీర్ణం... తగ్గేదెలా? | sakshi health counseling | Sakshi
Sakshi News home page

కడుపులో నొప్పి, అజీర్ణం... తగ్గేదెలా?

Published Thu, Aug 17 2017 12:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

కడుపులో నొప్పి, అజీర్ణం... తగ్గేదెలా?

కడుపులో నొప్పి, అజీర్ణం... తగ్గేదెలా?

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 42. కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. కడుపు ఉబ్బరం. డాక్టర్‌ గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. ఇది హోమియో ద్వారా నయమవుతుందా? – ఆర్‌. రాంబాబు, శ్రీకాళహస్తి
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా కొనసాగితే క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

కారణాలు: 20 – 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙శస్త్ర చికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స: హోమియో వైద్య విధానంలో గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంది. మూల కారణాలైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌


మాకు పిల్లలు పుడతారా?
నా వయసు 32. వివాహమై ఎనిమిదేళ్లయింది. సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీకి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? – సరోజ, కోదాడ
ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్‌ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్‌ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం.

పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : హార్మోన్‌ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్‌ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం

సంతానలేమిలో రకాలు: ∙ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ

ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్‌ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. గర్భాశయంలో లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ రావడం వల్ల సంభవిస్తుంది.

గుర్తించడం ఎలా: థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు.  

చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement