వీర కుటుంబాలకు 'సాక్షి' సలామ్ | Sakshi Salam to Soldiers' families! | Sakshi
Sakshi News home page

వీర కుటుంబాలకు 'సాక్షి' సలామ్

Published Fri, Sep 23 2016 12:06 AM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM

వీర కుటుంబాలకు 'సాక్షి' సలామ్ - Sakshi

వీర కుటుంబాలకు 'సాక్షి' సలామ్

వాళ్లు బందూకు పడితే... మనం ముద్ద తినగలుగుతున్నాం. వాళ్లు పహారా కాస్తుంటే... మనం నిద్రపోగలుగుతున్నాం. వాళ్లు తూటాలను ఎదుర్కొంటే... మనం జీవితాన్ని గడపగలుగుతున్నాం. వాళ్ల తల్లితండ్రులు వారిని యుద్ధక్షేత్రానికి పంపితే... మనం మన పిల్లలను స్కూళ్లకు పంపగలుగుతున్నాం. విజయమో, వీర స్వర్గమో అని యుద్ధంలోకి దిగిన మన భరతమాత ముద్దుబిడ్డలపై పిరికిపందలు చాటుదెబ్బ తీశారు. వాళ్లకు జరిగిన అన్యాయం ఇప్పటికీ మనమే భరించలేకపోతుంటే... మరువలేకపోతుంటే... మనకే కన్నీళ్లు ఆగలేకపోతుంటే... ఈ వీరజవాన్ల కుటుంబాలు ఎంతగా ఆవేదనతో రగిలిపోతున్నాయో!

తెలుగు పాఠకులందరూ కొద్దిరోజులుగా పడుతున్న మనోవేదన ఒక్కటే. ‘ఆ కుటుంబాలకి మేమున్నాము’ అని చెప్పుకోలేకపోతున్న ఆవేదన. ఇదే ఆ కుటుంబాలకు శక్తినిచ్చే.. ధైర్యం నింపే... మనోబలాన్ని అందించే... తెలుగు ప్రార్థన. ఆ వీర కుటుంబాలకు మనమంతా అందించే సలామ్. దానికి మీరే సాక్షి.

 
 
యూరీ సెక్టార్‌లో జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతి కలిగించింది. ఉగ్రవాద దాడిలో బలైన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అమర వీరులైన ఈ సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
- వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి (సెప్టెంబర్ 18న, ట్విట్టర్‌లో...)
 
అన్న బాటలో తమ్ముడూ రెడీ!
సిపాయి జావ్రా ముండా, వయసు 35 ఏళ్లు
జార్ఖండ్ ఖుటీ జిల్లా మెర్లా గ్రామానికి చెందిన జావ్రా వయసు 35 ఏళ్లు. మూడేళ్లుగా కశ్మీర్‌లో సిపాయిగా సేవలందిస్తున్నారు. మెర్లా గ్రామవాసుల రక్తంలోనే ఆ పవర్ ఉంది. దేశభక్తి ఉంది. ఆ గ్రామంలో మూడు తరాలుగా సిపాయిలుగా పనిచేస్తున్నవారున్నారు. జావ్రాకు తమ్ముడు 18 ఏళ్ల దావుద్ మాట్లాడుతూ ‘‘నేను ప్రస్తుతం బీఏ చదువుతున్నాను. వచ్చే నెలలో...  ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయట. సైన్యంలో చేరేందుకు రాంచీ వెళ్తా. ముందుగా నా అన్న చావుకు శత్రుసైన్యాలపై ప్రతీకారం తీర్చుకోవాలి’’ అంటున్నాడు.  
   
అదే చివరి ఫొటో...
సిపాయి రాకేశ్ సింగ్, వయసు 28
బిహార్ రాష్ట్రం కైమూర్ లోల్లా బాద్ధా గ్రామస్థుడు రాకేశ్‌సింగ్. మొన్న మే నెలలో సెలవులకు రాగానే తన భార్య కిరణ్ ఖుష్‌వాహానూ, కొడుకు హర్షిత్‌నూ అస్సాంలోని కామాఖ్య దేవాలయానికి తీసుకెళ్లాడు సిపాయి రాకేశ్ సింగ్. ఇంటి దగ్గరికి వచ్చే వారందరికీ దేవాలయంలో వాళ్లు దిగిన ఫోటోలను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు తండ్రి హరిహర్ సింగ్. ఇక ఆయన తల్లి రాజ్‌కవల్ దేవి కన్నీళ్లు ఆగడం లేదు. ‘‘మా వాడు మరణించాడు. ఈ పని చేసిన వాడికి మనం దీటుగా సమాధానం ఇవ్వాలి’’ అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు రాకేశ్ పెద్దన్న బజ్‌రంగీ సింగ్.
   
చూపు తెప్పించండి ! అప్పుడూ..
హవల్దార్ అశోక్ కుమార్ సింగ్, వయసు 44 ఏళ్లు
 బిహార్‌లోని భోజ్‌పూర్ వాస్తవ్యుడు హవల్దార్ అశోక్ కుమార్ సింగ్. వాళ్ల నాన్న జగ్‌నారాయణ్ సింగ్ వయసు 78 ఏళ్లు. గత 20 ఏళ్లుగా ఆయనకు కళ్లు కనిపించడం లేదు. ‘‘నాకు కాస్త చూపు తెప్పించండి. నన్ను సరిహద్దుల్లో వదిలేయండి. చూపు అంటే లేదు గానీ ఓపిక ఉంది. శత్రువులతో పోరాడే శక్తి ఉంది. నన్ను కాస్త అక్కడ వదిలేస్తే... నా కొడుకు మరణానికి ప్రతీకారం చేస్తా’’ అంటున్నాడు ఎనభైలకు చేరువవుతున్న జగ్‌నారాయణ్. ఆయన కుటుంబంలో ఇది మొదటి విషాదం కాదు. 1986లో కూడా జగ్‌నారాయణ్ సింగ్ పెద్ద కొడుకు కమ్టా సింగ్ కూడా బికనీర్‌లో జరిగిన ఒక బాంబు పేలుడులో మృతిచెందారు. ఈ కుటుంబం నుంచి చాలా మంది దేశసేవలో నిమగ్నమై ఉన్నారు. వాళ్లంతా శత్రువుకు తగిన శాస్తి చేయడం కోసం ఇప్పుడు రగిలిపోతున్నారు.
   
 
దసరాకు వస్తానన్న వాడు... ఇక రాడు!
నాయక్ సునీల్ కుమార్ విద్యార్థి, వయసు 40 ఏళ్లు
‘‘నా కొడుకు వచ్చే దసరా పండగకు వస్తానన్నాడు. ఇక రాడు. దేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడు. ఇది బాధాకరమైన అంశమే. కానీ అదే సమయంలో నాకు గర్వకారణం కూడా. ఇంకొక్క బాధ కూడా ఉంది. అయితే వాడి ప్రాణత్యాగం వృథా కాకూడదు. శత్రువుకు తగిన గుణపాఠం నేర్పాలి. ఇదే నేను కోరేది’’ అంటున్నారు సునీల్ కుమార్ విద్యార్థి తండ్రి మథురా యాదవ్. అతడిది బొక్నారీ గ్రామం, గయ జిల్లా, బిహార్ రాష్ట్రం.  
 
నాన్న.. గుండె దిటవు చేసుకొనేదెలా?
సిపాయి రాజేశ్ కుమార్ సింగ్, వయసు 33 ఏళ్లు
ఉత్తరప్రదేశ్, జావున్‌పూర్ జిల్లా, భాకూర్ గ్రామం లోని ఉమేంద్ర తన సోదరుడు రాజేశ్‌కుమార్ నుంచి ఏదైనా కాల్ వస్తుందేమోనంటూ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అతడి మరణవార్త వచ్చింది. ‘‘ఇరవై రోజులుగా రాజేశ్ నుంచి ఏదైనా సమాచారం కోసం వేచి చేస్తున్నాను. ఈ సమయంలో నా సోదరుడు అమరుడయ్యాడనే వార్త వినాల్సి వచ్చింది. కొడుకు గురించిన వార్త విన్నప్పట్నుంచీ మా నాన్న దిగులుగా ఉన్నాడు. అసలే ఆయన గుండెజబ్బు మనిషి. ఆయన ఈ వార్త విని, ఎలా సంబాళించుకుంటారో అని బెంగగా ఉంది’’ అన్నారు ఉమేంద్ర.
   
వాడి ఏటీఎం కార్డూ ఇచ్చేశాడు!
సిపాయి హరీందర్ యాదవ్, వయసు 26 ఏళ్లు
‘‘హరీందర్ అంటేనే బాధ్యతకు మారుపేరు. మాది ఉమ్మడి కుటుంబం. హరీందర్ భార్య, అతడి ఇద్దరు కొడుకులతో పాటు మేం నలుగురు అన్నదమ్ములం కలిసి ఉమ్మడి కుటుంబంలా జీవిస్తున్నాం. అతడి కొడుకులూ చాలా చిన్నవాళ్లు. పెద్దవాడు రోహిత్‌కు నాలుగేళ్లు. చిన్నవాడు రాజ్‌కు రెండేళ్లు. మా నలుగురు అన్నదమ్ముల్లో హరీందర్ ఒక్కడే సైన్యంలో పనిచేస్తున్నాడు. అతడు ఎంత మంచివాడూ, ఎంత బాధ్యత గల వాడంటే... అతడి ఏటీఎమ్ కార్డు కూడా మాకు ఇచ్చేశాడు. కొన్నేళ్లుగా అది నా దగ్గరే ఉంది’’ అంటూ హరీందర్ ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నారు అతడి సోదరుడు నాగేంద్ర. హరీందర్‌ది గాయిన్ దేవ్‌పూర్, ఘాజీపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్.  
 
అతని భార్య నిండు గర్భిణి...
లాన్స్‌నాయక్ రాజేశ్ కుమార్ యాదవ్, వయసు 35 ఏళ్లు
‘‘నా సోదరుడు రాజేశ్ మృతి చెందిన విషయం నా తల్లికీ, అతడి భార్యకూ తెలియనివ్వకూడదని మేమంతా ప్రయత్నించాం. మా ఇంటికి వచ్చేవారిని వద్దన్నాం. కారణం... నా తల్లి సిమారియా దేవి గుండె జబ్బు మనిషి. ఈ వార్త విని ఏమైపోతుందో తెలియదు. ఇక రాజేశ్ భార్య పార్వతీదేవి ఎనిమిది నెలల గర్భిణి. అందుకే వాళ్లిద్దరినీ కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించాం. కానీ కొందరి వల్ల చివరకు ఈ వార్త వాళ్లిద్దరికీ తెలిసింది. దుఃఖంతో కుప్పకూలిపోయారు.  వెంటనే మేం చేయాల్సి వచ్చిన పని... అంబులెన్స్‌ను ఏర్పాటు చేయమని జిల్లా పాలన అధికారులను కోరడమే’’ అంటూ విలపిస్తూ చెబుతున్నారు వికేశ్ యాదవ్. వీళ్లది యూపీలోని బలియా జిల్లా, దుబార్ధా గ్రామం.  
   
నన్ను సైన్యంలోకి తీసుకోండి!
సిపాయి నయిమన్ కుజూర్, వయసు 30 ఏళ్లు
‘‘నా భర్తను చంపిన వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఒక భార్యగా  నాకెంతో దుఃఖంగా ఉంది. కానీ, నేనొక సైనికుడి భార్యనైనందుకు గర్వంగా ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే నన్ను సైన్యంలోకి తీసుకోండి. నేను సైనికురాలిగా మారేందుకు సంసిద్ధంగా ఉన్నాను’’ అంటోంది బీనా. ఆమె సిపాయి నయిమన్ కుజూర్ భార్య. వీళ్లది జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా చైన్‌పూర్ గ్రామం. నయిమన్ సోదరుల్లో ఒక్కరు మినహా అంతా సైన్యంలో పనిచేస్తున్నారు. సోదరుల స్ఫూర్తితోనే చిన్నవాడైన నయిమన్ సైన్యంలో చేరారు.
 
చెల్లిపెళ్లి విషయం మాట్లాడుతుండగా...
సిపాయి గణేశ్ శంకర్, వయసు 34 ఏళ్లు
ఉత్తరప్రదేశ్... సంత్ కబీర్‌నగర్ జిల్లా, ఘూరాపల్లి గ్రామంలో గణేశ్ శంకర్ చెల్లెలైన ఇంద్రావతి పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఆ పెళ్ళి ఎంత ఆనందంగా చేయాలో అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో గణేశ్ అమరుడైనట్లు వార్త వచ్చింది. ‘‘గోరఖ్‌పూర్ వాసితో ఇంద్రావతి నిశ్చితార్థం జరిగింది. అంతలో పిడుగుపాటు లాంటి ఈ వార్త...’’ అంటూ భోరుమన్నారు గణేశ్ సోదరుడు సురేశ్ చంద్ర యాదవ్. ‘‘నిజానికి నేనో చిన్నపాటి రైతునైనా... కుటుంబానికి అండ గణేశే’’ అంటూ బావురుమన్నారు సురేశ్. ‘‘అక్టోబర్ నెలలో జరిగే చెల్లి పెళ్లి కోసం వాడు ఎప్పుడు రావాలో చెప్పాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. అమరవీరుడైన మా గణేశ్ భార్య గుడియా, వాడి పిల్లలైన తొమ్మిదేళ్ళ అమృత, ఏడేళ్ల అంకిత్, నాలుగేళ్ల కృషి పరిస్థితి ఏమిటో ఇప్పుడు ఆలోచించుకుంటేనే ఆందోళనగా ఉంది’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు ఆయన సోదరుడు సురేశ్.
   
ఒక వీరుడు మరణిస్తే...
సుబేదార్ కర్నైల్ సింగ్, వయసు 46 ఏళ్లు
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని షిబుచాక్ ప్రాంతానికి చెందినవాడు. వాళ్ల కుటుంబంలో ఆర్మీలో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. ఆర్మీలో చేరాలనేది కర్నైల్ సింగ్ చిన్నప్పటి కల. తోటి పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా తల మీద టోపీ పెట్టుకొని ఓ కర్రపుల్లను గన్‌గా పట్టుకొని సరిహద్దుల్లో కాపాలా కాసే సైనికుడి ఆటనే ఇష్టపడేవాడు. ‘పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశాన్ని కాపాడతా’ అని చెప్పేవాడట. అనుకున్నట్టుగానే పద్ధెనిమిదేళ్లకే మిలిటరీలో చేరాడు. కలలు కన్నట్టుగానే దేశాన్ని కాపాలాకాసే జవానయ్యాడు. వీర జవానుగా మిగిలిపోయాడు. విషాదం ఏమిటంటే.. కర్నైల్‌సింగ్ కుటుంబానికి ఆర్థిక ఆధారం ఆయనే. కర్నైల్‌సింగ్‌కు అన్‌మోల్, అరుణ్, శివమ్ అని ముగ్గురు కొడుకులు. కానీ, కర్నైల్ సింగ్ కుటుంబంలోని గొప్పతనం ఏమిటంటే, వీరుడైన తమ ఇంటి పెద్ద చనిపోయాడని ఆ కుటుంబం కుప్ప కూలి పోలేదు. ఆ వ్యక్తి స్థానంలో ఈ ఇంటి నుంచి ఇంకో వీర జవానును సైన్యంలోకి పంపడానికి సమాయత్తమవుతోంది.  
   
ఇక మాట్లాడ్డం కుదరదేమో అన్నాడు!
సిపాయి గంగాధర్ దలూయ్, వయసు 23 ఏళ్లు
పశ్చిమ బెంగాల్‌లోని జమునా బలాయ్‌కి చెందినవాడు గంగాధర్. వాళ్ళది పేద కుటుంబం. పిల్లలను బాగా చదివించాలని ఉన్న చేనూ చెలక అమ్మి, హౌరాలోని మంచి కాలేజ్‌లో చేర్పించాడు గంగాధర్ తండ్రి ఓంకార్‌నాథ్ దలూయ్. చిన్నప్పటి నుంచి ఆటలంటే అమితమైన ఆసక్తి గంగాధర్‌కు. ప్రతి ఆటలో గెలుపే. జుమునా బలాయ్‌లోని మురికివాడలో ఉన్న రెండుగదుల ఇరుకు ఇంట్లో.. ముందు గదిలోని చెక్క షెల్ఫ్‌ల మీద గంగాధర్ గెలుచుకున్న మెమొంటోలే అన్నీ. ఆ యువ జవాను జ్ఞాపకాలను తడిగా ఉంచడానికన్నట్టేమో అవన్నీ మెరుస్తూ కనిపిస్తాయ్. ‘వచ్చే వారం నుంచి చాలా బిజీగా ఉంటాను.. మాట్లాడ్డం కుదరదేమో.. మీరేం కంగారు పడకండి’ అని చెప్పాడు. అన్నట్టుగానే అదే ఆఖరు ఫోన్ అయింది’ అంటూ ఏడుస్తోంది గంగాధర్ తల్లి శిఖా దలూయ్.
   
ఆ న్యూస్ కూడా అదే ఫోన్ నుంచి...
సిపాయి బిశ్వజిత్ ఘోరాయ్, వయసు 22 ఏళ్లు
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గంగాసాగర్ వాస్తవ్యుడు. అతనికి ఒక అన్న, ఒక చెల్లెలు. బిశ్వజిత్ సమీప బంధువులు ఇద్దరు ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ల స్ఫూర్తితోనే రెండున్నరేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. నిజానికి బిశ్వజిత్‌ను బాగా చదివించాలనేది అతని తల్లితండ్రుల కల. అతని చదువు కోసం ఉన్న కొద్ది భూమినీ తాకట్టు పెట్టారు. బిశ్వజిత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. డిగ్రీలో చేరాడు కానీ ఆర్మీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలూ కొనసాగించాడు. ఫస్టియర్‌లో ఉన్నప్పుడే ఆర్మీ నుంచి కాల్ లెటర్ వచ్చింది. అది తెలిసి అతని తల్లితండ్రులు అవాక్కయ్యారు. సరేలే కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని సర్దుకున్నారు. మొదటి నెల జీతంతో సోదరి బుల్టీకి సెల్‌ఫోన్ కొనిపెట్టాడు బిశ్వజిత్. ఆ ఫోన్ ద్వారే సోదరుడి మరణవార్త వినాల్సి వచ్చింది. ‘మాకు జరిగిన నష్టం ఇంకెవరికీ ఎదురు కాకూడదు’ అంది బాధ నిండిన గొంతుతో బుల్టీ.
   
 
ఆ కుటుంబానికి దిక్కెవరు?
హవల్దార్ నింబ్‌సింగ్ రావత్, వయసు 48 ఏళ్లు
రాజస్థాన్‌లోని రాజ్వా ప్రాంతానికి చెందినవాడు. ఆరావళి పర్వతప్రాంతంలోని మారుమూల గ్రామం అది. ఇరవై రోజుల కిందటే యూరీకి ట్రాన్స్‌ఫర్ అయింది. నింబ్‌సింగ్‌కు భార్య రోడీ దేవి, కూతుళ్లు - పదిహేనేళ్ల ఆశ, పదమూడేళ్ల దీప, పదేళ్ల నిషా, ఏడేళ్ల పాయల్, అయిదేళ్ల కొడుకు చందన్ ఉన్నారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు. ఉమ్మడి కుటుంబం. నింబ్‌సింగ్ ఆర్మీ ఉద్యోగమే ఆ ఇంటికి ఆధారం. యూరీ దాడి కంటే వారం ముందే భార్య రోడీతో ఫోన్‌లో మాట్లాడాడట. నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడంతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాడని వాపోతోంది రోడీదేవి. ‘ఇప్పుడు నాకూ, నా పిల్లలకూ దిక్కేది? పిల్లలను ఎలా చదివించాలి? ఈ ఆడపిల్లల పెళ్లి ఎట్లా చేయాలి? ప్రభుత్వం మా ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే, మా జీవితాలేమైనా గట్టెక్కుతాయి’ అని రోదిస్తోంది రోడీ దేవి.
   
 
ఆ పసివాడికి ఇదేమీ తెలీదు!
లాన్స్‌నాయక్ చంద్రకాంత్ గలాడే, వయసు 27 ఏళ్లు
మహారాష్ట్రలోని సతారాలోని జషి గ్రామస్థుడు చంద్రకాంత్. టెన్త్ వరకు చదివాడు. రెండేళ్ల కిందటే యూరీ పోస్టింగ్ వచ్చింది. అయితే చంద్రకాంత్ ఇద్దరన్నలు కేశవ్, మాంజాబాపు కూడా ఆర్మీలోనే ఉన్నారు. చంద్రకాంత్ భార్య నిషా భర్త మరణవార్తతో షాక్‌కి గురైంది. ఇప్పటికీ తేరుకోలేదు. చంద్రకాంత్‌కి ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి నాలుగేళ్లు. తండ్రికి అంతిమ సంస్కారాలు జరుగుతుంటే, వాకిట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ స్థితిలో పసివాడిని చూసి ద్రవించని హృదయం లేదు. రెండో పిల్లాడికి మూడు నెలలే. తల్లి ఒడిలో కేరింతలు కొడుతున్నాడు. ‘దాడి కంటే రెండు రోజుల ముందే ఫోన్ చేశాడు... చిన్నోడి బర్త్‌డేకి తప్పకుండా వస్తానని. మా ఇంట్లోని గేదెలు, మేకలంటే వల్లమాలిన ప్రేమ వాడికి. ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతాడు అవి ఎలా ఉన్నాయని. మొన్నా అడిగాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఫోన్ వచ్చింది వాడు పోయాడని. టైస్టుల దాడికి ఇలా ఎంతమంది ప్రాణాలు పోవాలి ఇంకా? ఇప్పటికైనా ప్రభుత్వం పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి’ అంది చంద్రకాంత్ తల్లి సూలాబాయి.
   
 
ఎంతమందికి ఈ గర్భశోకం!
సిపాయి టీఎస్ సందీప్, వయసు 25 ఏళ్లు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఖండగలి గ్రామస్థుడు. నలుగురు సంతానంలో సందీపే ఆఖరివాడు. రెండున్నర నెలల కిందటే జమ్ము-కశ్మీర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. జమ్ము-కశ్మీర్‌కి వెళ్లే ముందే సొంతూరికి వచ్చిపోయాడు. దీపావళికి వస్తానని మాటిచ్చాడు. ఆ టైమ్‌కల్లా అబ్బాయికి మంచి సంబంధం చూసి పెట్టాలనీ సందీప్ తల్లితండ్రులు నిర్ణయించుకున్నారు. సందీప్ తండ్రి సోమ్‌నాథ్ చిన్న రైతు. తనకున్న మూడు ఎకరాల భూమిలో ఉల్లిపంట వేశాడు. ఉల్లి ధర పడిపోవడంతో డీలాపడ్డ రైతుల్లో సోమ్‌నాథ్ ఒకరు. ఆ దెబ్బకు ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కొడుకు పోయాడన్న వార్తతో మనిషి జీవచ్ఛవమే అయ్యాడు అని చెప్తున్నాడు సందీప్ బావ ధ్యానేశ్వర్ చావంకే. ‘ఇంకా ఇలా ఎంతమంది తల్లితండ్రులు చేతికందిన కొడుకులను పోగొట్టుకొని జీవచ్ఛవాల్లా బతకాలి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవని భరోసా ఇవ్వాలి’ అంటాడు.
   
 
దీనికి పరిష్కారం చూపండి!
సిపాయి వికాస్ జాన్‌రావ్ ఉయ్‌కే, వయసు 26 ఏళ్లు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా నందగావ్ పట్టణవాసి. వికాస్ తండ్రి జాన్‌రావు కూడా ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడు. తండ్రిలాగే తనూ ఆర్మీలో చేరి దేశసేవ చెయ్యాలనేది వికాస్ కోరిక, లక్ష్యం కూడా. ఇందుకు తండ్రి ఒప్పుకోలేదు. అయినా పట్టువీడకుండా ప్రయత్నించి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు వికాస్. ఒప్పుకోక తప్పలేదు జాన్‌రావుకి. మిలటరీలో వచ్చే జీతంతో చెల్లెలి పెళ్లికీ తన వంతు ఆర్థిక సహాయం అందించాడు. ప్రతి నెలా తప్పకుండా పదివేలు తల్లితండ్రులకు పంపేవాడు. ఈ దుస్సంఘటన జరగడానికి 20 రోజుల ముందే తల్లితండ్రుల దగ్గరకు వచ్చివెళ్లాడట. యూరీలో జవాన్ల మీద టైస్టు దాడి జరిగి తమ కొడుకు వికాస్ చనిపోయాడన్న విషయం టీవీ స్క్రోలింగ్‌లో వచ్చేదాకా వికాస్ కుటుంబానికి తెలియలేదు. స్క్రోలింగ్‌లో చూసుకొని జిల్లా ఎస్‌పి, కలెక్టర్‌కి ఫోన్ చేస్తే కాని నిర్ధారణకు రాలేకపోయారు. ‘ఈ చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్ మీద దాడి చేయడం గొప్ప విషయం కాదు.. ఈ సమస్యకు పరిష్కారమూ కాదు. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా... దీటైన, వివేకవంతమైన జవాబు చెప్పడం, పరిష్కారం చూపడం అవసరం’ అంటాడు జాన్‌రావు.  
 
ఆ పసిగుడ్డు పరిస్థితి ఏంటి?
సిపాయి వికాస్ జనార్దన్, వయసు 26 ఏళ్లు
మహారాష్ట్రలోని యావత్‌మల్ జిల్లా పూరద్ నెరాద్‌కు చెందినవాడు. వికాస్ 2008లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్నెల్ల కిందట యూరీ క్యాంప్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. రెండేళ్ల కిందటే పెళ్లయింది. భార్య స్నేహ. నాలుగు నెలల కూతురు ఉన్నారు. వికాస్‌కి ఓ తమ్ముడు. యూరీ ఉగ్రవాద దాడిలో గాయపడి  చికిత్స పొందుతూ మొన్న సోమవారం ఉదయం ప్రాణాలు విడిచాడు వికాస్. తల్లితండ్రులు, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement