నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
ఉడీ ఉగ్రదాడి దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేశాన్ని కలిగించింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ.. దాయాదికి తగిన గుణపాఠం చెప్పాలంటూ యావత్ భారతీయులు రగిలిపోయారు. సామాన్యుల నుంచి రాష్ట్రపతి, ప్రధాని వరకు మన జవాన్లకు అండగా నిలిచారు. ఉడీ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ ప్రజలు నివాళులు అర్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలిచారు.
వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి గుజరాత్లోని సూరత్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై కళాకారులు వీర జవాన్ల సేవలను కీర్తిస్తూ దేశ భక్తి గీతాలు పాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. భారీ మొత్తంలో డబ్బును కళాకారులకు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా డబ్బు పోగైంది. ఈ డబ్బును కళాకారులు, నిర్వాహకులు తీసుకోకుండా ఉదారత చాటుకున్నారు. ఉడీ దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. త్వరలో వారి కుటుంబాలను కలసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. సూరత్ ప్రజలు, కళాకారులు, నిర్వాహకుల ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం.