గుడ్‌ మార్నింగ్‌ ఇదొక అందమైన మార్నింగ్‌ | sakshi tenth anniversary special | Sakshi
Sakshi News home page

గుడ్‌ మార్నింగ్‌ ఇదొక అందమైన మార్నింగ్‌

Published Sat, Mar 24 2018 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

sakshi tenth anniversary special - Sakshi

డబుల్‌ ధమాకా
‘సాక్షి ఫ్యామిలీ’ ఒక ధమాకా అయితే అందులో ప్రతిష్ఠాత్మకంగా మొదలైన ఆదివారం ఇంటర్వ్యూ ఫీచర్‌ ‘డబుల్‌ ధమాకా’. ఒక సెలబ్రిటీని చూడటానికే కళ్లు చాలనప్పుడు ఇద్దరు సెలబ్రిటీలను కూచోబెడితే... వారి మనసులో మాటలను వెలికి తీస్తే... ఒకరిని ఒకరితో ఒకరు మాట్లాడుకోనిస్తే.... సాక్షి ఆవిర్భావంతో పాటు మొదలైన ఈ మెగా మేజిక్‌ ప్రతి ఆదివారం లక్షలాది మంది పాఠకులను ఆకట్టుకుంది. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో మొదలైన ‘డబుల్‌ ధమాకా’ వంద సుదీర్ఘ వారాల తర్వాత మళ్లీ చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ల త్రిపుల్‌ ధమాకాతో ముగిసింది. వంద వారాలు... ఒక ఇంటర్వ్యూ బేస్డ్‌ ఫీచర్‌ను నడపడం అసామాన్యం. అవీ మామూలు కాంబినేషన్లా? వైఎస్‌ఆర్‌ – కెవిపి, ఉండవల్లి – జయశంకర్, సురేశ్‌ రెడ్డి– కిరణ్‌కుమార్‌ రెడ్డి, పూరి జగన్నాథ్‌–రవితేజ, ఈనాడు సుమన్‌– ఈటీవీ ప్రభాకర్, ఇవివి సత్యనారాయణ– ఆర్‌.నారాయణమూర్తి, ఎన్టీఆర్‌–వినాయక్‌... ఇలా ఎన్నో. సంగీతం విషయంలో బాలకృష్ణ ప్రసాద్‌– శోభరాజ్‌ల కాంబినేషన్, కారుణ్య– హేమచంద్రల జంటతో భేటీ... ర్యాపిడ్‌ రౌండ్‌ క్వశ్చన్స్‌.... ఇవన్నీ ఈ ఆదివారం ఏ డబుల్‌ ధమాకా వస్తుందా అని పాఠకులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురు చూసింది. ఈ ఫీచర్‌ను తోటి పత్రికలు ఇమిటేట్‌ చేయాలని చూడటం దీని సక్సెస్‌కు ఒక సూచి. సాక్షి ఫీచర్‌ కన్సల్టెంట్‌ ఇందిరా పరిమి ఈ ఇంటర్వ్యూలతో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రతి ఇంటర్వ్యూ వెనుక రీసెర్చ్, హోం వర్క్‌ కనిపిస్తున్నదనే ప్రశంసలు పొందారు. సాక్షి తొలి పదేళ్ల జర్నీలో ముందు వరుసలో నిలిచే ఒక ప్రతిభావంతమైన ముద్ర– డబుల్‌ ధమాకా.

అదర్‌ సైడ్‌
సినిమా తారల వ్యక్తిగత జీవితాల్లో ఉండే మంచీ చెడూ తెలుసుకోవాలనే ఆసక్తి రీడర్స్‌కు ఉంటుంది. అయితే సినిమా విశేషాలు తప్ప పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసుకోవడానికి సెలబ్రిటీలు ఇష్టపడరు. మరీ ముఖ్యంగా పర్సనల్‌ లైఫ్‌లో ఉండే కాంట్రవర్సీస్‌ గురించి అడిగితే ‘నో కామెంట్‌’ అంటారు. అలా ‘నో కామెంట్‌’ అనే విషయాలను సైతం ఆవిష్కరించిన ఫీచర్‌ ‘అదర్‌ సైడ్‌’. జనరల్‌గా సినిమా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలిచ్చేటప్పుడు ‘ఫేక్‌’ అనే ఫీలింగ్‌ కొంతమందికి ఉంటుంది. ఇండస్ట్రీ పట్ల పబ్లిక్‌కి ఉండే ఆ ఫీల్‌ని మార్చిన ఫీచర్‌ ‘అదర్‌సైడ్‌’. కొంచెం చొరవ తీసుకుని, అడిగే విధానంలో అడిగితే సెలబ్రిటీలు అంతే క్లియర్‌గా ఉంటారని, ఇంటర్వ్యూ కోసం రంగు పులుముకోరని ప్రూవ్‌ చేసిన ఫీచర్‌. జస్ట్‌ సెన్సేషన్‌ని టార్గెట్‌ చేయడం కాకుండా సెలబ్రిటీల లైఫ్‌తో పాటు సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్‌ గురించి డిస్కస్‌ చేస్తూ, వీలు కుదిరినప్పుడల్లా నాలుగు మంచి మాటలు సమాజానికి చెప్పించాలన్న ప్రయత్నంతో చేసిన పలు ఇంటర్వ్యూస్‌ చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాయి. ఆరేడేళ్లుగా ‘అదర్‌ సైడ్‌’, ‘స్టారిస్ట్రీ’, ‘తారాంతరంగం’, ఇప్పుడు ‘ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ’.... ఇలా ఫీచర్‌ పేరు ఏదైనా ప్రతి వారం రేంజ్‌ తగ్గకుండా ఇవ్వడానికి చేస్తున్న కృషి విజయవంతంగా సాగుతోంది. కొన్ని స్పెషల్‌ ఇంటర్వ్యూస్‌ ఈ విధంగా...నటుడు శరత్‌బాబు తన మాజీ భార్య రమాప్రభ గురించి అప్పటివరకూ ఎక్కడా విపులంగా మాట్లాడలేదు.

ఈ ఇద్దరి లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని శరత్‌బాబుతో ‘సాక్షి’ చెప్పించగలిగింది.నటి విజయశాంతికి పెళ్లయిందా? లేదా? అనే విషయం నాలుగైదేళ్ల క్రితం వరకూ ఉన్న డౌట్‌. అయితే శ్రీనివాస్‌ ప్రసాద్‌తో పెళ్లి, పిల్లలు ఎందుకు ప్లాన్‌ చేసుకోలేదనే వ్యక్తిగత విషయాలను విజయశాంతి ఫస్ట్‌ టైమ్‌ షేర్‌ చేసుకున్న విషయాలు ‘సాక్షి’కి స్పెషల్‌. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ఫస్ట్‌ మ్యారేజ్, సెకండ్‌ మ్యారేజ్‌ గురించి, రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఓ సెలబ్రిటీగా సమాజానికి  అతను ఇచ్చే సందేశం ఏంటి? అనే యాంగిల్‌ నుంచి చేసిన ఇంటర్వ్యూ ఓ హైలైట్‌.మమతా మోహన్‌దాస్‌ కేన్సర్‌ బారిన పడటం, రిలాప్స్‌ అయ్యాక పంచుకున్న విశేషాలు మనకు స్పెషల్‌. కేన్సర్‌ బారినపడ్డవారికి ఆత్మస్థయిర్యం ముఖ్యం అనే యాంగిల్‌లో సాగిన ఈ ఇంటర్వ్యూ ఓ ఇన్‌స్పిరేషన్‌.∙‘మిస్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనిపించుకుని సుమలత సోసోగా ఉన్న నటుడు అంబరీష్‌తో ప్రేమలో పడటానికి కారణం, పెళ్లి.. తదితర విషయాల్లో సుమలతతో ఓపెన్‌ టాక్‌. వివాహ బంధం పటిష్టంగా ఉండటానికి కారణం అందం కాదు.. మనసు, మంచితనం, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం అంటూ సుమలత చెప్పిన విషయాలు ‘బ్యూటీ’కి ప్రాధాన్యం ఇచ్చి, జీవితాలు పాడు చేసుకుంటున్నవారికి ఓ మెసేజ్‌. సౌత్‌ బ్యూటీ విద్యాబాలన్‌ హిందీ ఇండస్ట్రీకి వెళ్లి, అక్కడ కూడా సౌతిండియన్‌లాగానే డ్రెస్‌ చేసుకోవడంతో ఆ కట్టుబొట్టుని బాలీవుడ్‌లో విమర్శించారు. ‘మీరు మీలా ఉండండి. ఎవరి కోసమూ మారొద్దు. ఒకప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు నన్ను ప్రశంసిస్తున్నాయి’ అంటూ విద్యాబాలన్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ.. ‘ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్‌’కి గురయ్యేవారికి ఓ మంచి సందేశం.  ‘జస్ట్‌ లైక్‌ దట్‌’ అని కాకుండా ఇలా ‘థాట్‌ ప్రొవోకింగ్‌’గా సాగిన ఇంటర్వ్యూస్‌ రీడర్స్‌కి ‘సండే స్పెషల్‌’.

లవ్‌ డాక్టర్‌
అల్లోపతికి, హోమియోపతికి, ఆయుర్వేదానికి అన్నింటికీ డాక్టర్లు ఉన్నారు. కాని యువతరాన్ని తరచూ సిక్‌ చేసి సతమతం చేసే లవ్‌కు డాక్టర్లు లేరు. తెలుగునాట ‘లవ్‌ డాక్టర్‌’ లేని లోటును సాక్షి ఫ్యామిలీ తీర్చింది. అమ్మాయిల డైలమాలు, అబ్బాయిల అయోమయాలు, బయటకు చెప్పుకోలేని ప్రేమ, బయటకు సరిగ్గా చెప్పని ప్రేమ, బయటకు చెప్పాక తిరస్కరణకు లోనైన ప్రేమ, కొన్నాళ్లు అంగీకారం పొంది ఆ తర్వాత దారి మార్చుకున్న ప్రేమ, అబ్బాయి ఉలకని పలకని ప్రేమ, అమ్మాయి మనసులో ఏముందో ఎప్పటికీ అర్థం కాని ప్రేమ... ఇవన్నీ ప్రశ్నల రూపంలో సాక్షికి వచ్చిపడుతుంటే బెదిరించి భయపెట్టే రీతిలో కాకుండా ఒక సరదా మిత్రుని సున్నితమైన సూచనగా సమాధానాలు నడిచే తీరు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి ఫీచర్‌ అదీ డైలీ ఫీచర్‌గా నడవడం తెలుగు దినపత్రికల్లో ఇదే ప్రథమం. ఈ సమాధానాలతో తెరిపిన పడినవాళ్లు, ఆత్మహత్యల ఆలోచనలు మార్చుకున్నవాళ్లు, ఆ సమాధానాలు తల్లిదండ్రులకు చూపి ప్రేమను ఒప్పించుకున్నవారు ఎందరో తిరిగి సాక్షికి ఆ సంగతి తెలిపి ఆశ్చర్యపరిచారు. అసలు సమస్యే వినకుండా కోప్పడే తల్లిదండ్రులు, తేలిగ్గా తీసుకునే స్నేహితులు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు లవ్‌ డాక్టర్‌ను తమ ఆప్తుడిగా మార్చుకున్నారు. ఒక అన్నయ్యకు తమ సమస్యలు చెప్పుకున్నట్టు చెప్పుకున్నారు. తెలుగు ప్రేమావరణంలో లవ్‌ డాక్టర్‌ నిర్వర్తించిన బాధ్యత బాధ్యతాయుతమైనది. ఎంతో కీలకమైనది. ఈ శీర్షిక ఎవర్‌గ్రీన్‌గా గ్రీన్‌కలర్‌ స్ట్రిప్‌లో నేటికీ ప్రచురితమవుతూ పాఠకాదరణ పొందుతూనే ఉంది.

చెట్టు కథలు
‘చెట్టు’– ఈ మాట వినగానే ప్రాణం లేచి వస్తుంది. జ్ఞాపకాలు ఊడలు పట్టుకుని ఊగుతాయి. చెట్టుతో జీవితం గడవని మనిషంటూ ఉంటాడా? అందుకే సాక్షి ఫ్యామిలీ ‘చెట్టు కతలు’ ఫీచర్‌ని పెట్టింది. చెట్టుతో పాఠకులకు ఉన్న అనుబంధాన్ని రాసి పంపమని చెప్పింది. ఇక చూసుకోండి. తాటి చెట్టు గెలలు పేజీల్లోకి వచ్చిపడ్డాయి. జామచెట్టు కాసిన ఫలాల మధుర రుచులు అక్షరాల రూపం దాల్చాయి. అరటి చెట్టు జ్ఞాపకం గురించి ఒకరు రాస్తే, రావిచెట్టుకు నమస్కారం పెడుతూ రోజెలా మొదలెట్టేవారో మరొకరు రాశారు. పెరట్లో మామిడిచెట్టు కాసిన పూతపూతా ఒకరికి జ్ఞాపకమొస్తే సపోటా చెట్టు చిమ్మిన పాలు మునివేళ్లకు వదలకుండా పట్టుకున్న అనుభవం మరొకరు పంచుకున్నారు. చెట్టు... పచ్చటి చెట్టు... మనకు నీడనిచ్చి, పండునిచ్చి, కలపనిచ్చి, ప్రాణవాయువునిచ్చిన చెట్టు చుట్టూ ఎన్ని జ్ఞాపకాలని? నిద్ర గన్నేరు చెట్టు, జీడిమామిడి చెట్టు, వేప, మర్రి... ఆఖరుకు తుమ్మచెట్టుతో ఉన్న అనుబంధం కూడా సాక్షి ఫ్యామిలీ పట్టుకోగలిగింది. ‘చెట్టు కథలు’ ఫీచర్‌ పెద్ద హిట్‌. అందరూ ముచ్చటపడి పోటీలు పడి మరీ రాశారు. పర్యావరణం మీద ప్రేమ ఆ విధంగా సాక్షి ఫ్యామిలీ కలిగించింది. విధ్వంసంపై ఏవగింపును కూడా పుట్టించగలిగింది. నాస్టాల్జియా ఎప్పుడూ మధురంగా ఉంటుంది. ఈ ఫీచర్‌ నాస్టాల్జియాను రికార్డు చేసింది కనుక ఒక కాలపు తెలుగువారి జీవితం కూడా ఈ చెట్టు కథల్లో ఇమిడిపోయింది. పచ్చటి ఫీచర్‌ ఇది. ఆకుపచ్చటి ఫీచర్‌.

టీ పాయ్‌
ఇద్దరు కలిస్తే సంభాషణ. నలుగురు కలిస్తే కబుర్లు. మరి ముగ్గురు కలిస్తే? ఆలోచన. తెలుగు దినపత్రికల్లో ‘టీపాయ్‌’ అనేది ఒక సరికొత్త ఆలోచన. ముగ్గురు సభ్యులు ప్రతివారం కలిసి కూర్చొని ఒక అంశం మీద పిచ్చాపాటి మాట్లాడే ఫీచర్‌ అది. కాని అవి పిచ్చాపాటి కబుర్లు కావు. ఆలోచన రేకెత్తించే భావధారలు. ‘దేశంలో క్యూ సిస్టమ్‌’, ‘అద్దె ఇళ్లకు పెట్టే షరతులు’, ‘వంట పని ఎవరిది?’, ‘ఎంచుకునే స్వేచ్ఛ అబ్బాయికేనా?’, ‘ట్రాఫిక్‌’... ఇలా అనేక సమస్యలు, సంస్కారాలపై టీ పాయ్‌లో చర్చ జరిగింది. ముందే ప్రిపేర్‌ అయిన సంభాషణ కాదు కనుక వీటిలో ఒక స్వేచ్ఛ, నిరభ్యంతరమైన అభిప్రాయం కనిపించింది. ఇలా కూడా ఫీచర్‌ ఉంటుందా అని ఆశ్చర్యపరిచిన ఫీచర్‌ ఇది.

ఈ పాటకు ట్యూన్‌ తెలుసా?
‘సాక్షి ఫ్యామిలీ’ ఓయ్‌ అని పలికితే ఓయ్‌ అని పాఠకులు బదులిచ్చేలా చేసిన ఫీచర్‌ ఇది. రోజూ పాత, కొత్త సినిమాల పాటల్లోని ఒక పాట టెక్ట్స్‌ మొత్తం ఇస్తే దానిని చూసి, దాచుకుని, హమ్‌ చేసి, నలుగురు కూడినప్పుడు పాడుకోవడానికి డైరీలా చేసుకున్న పాఠకులు ఎంతమందో. దీనిని రాసింది ఫలానా వారా, పాడింది ఫలానా గాయకులా అని తెలుసుకొని ఒక పరిశోధన అంశంగా ఈ ఫీచర్‌ను పరిశీలించిన పాఠకులు ఎందరో. గాయనీ గాయకుల, సంగీత దర్శకుల, గీత రచయితల పుట్టిన రోజు సందర్భాలలో ఇచ్చిన పాటలు ఆ సంగీతకారులను సంతోషపెట్టాయి. దివంగతులను స్మరించుకునేలా చేశాయి. ‘తేటతేట తెలుగులా’... వంటి ఆత్రేయ పాటలను దాచుకున్న పాఠకులే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది’ వంటి చంద్రబోస్‌ పాటలను కూడా దాచుకున్నారు. రెహమాన్‌ ‘మెంటల్‌ మదిలో’, మిక్కీ జె.మేయర్‌ ‘కళాశాలలో’ వంటి పాఠకులు యువ పాఠకులను ఈ ఫీచర్‌ అంటిపెట్టుకునేలా చేశాయి. ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘నీ ఉండేదా కొండపై’, ‘దారి చూపిన దేవత’... వంటి పాటలు ఏ గృహిణి మాత్రం పాడుకోదు. సిరివెన్నెల, రామజోగయ్య, కందికొండ, గద్దర్, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల... అందరి పాటలూ ఈ ఫీచర్‌లో వచ్చాయి. ‘వై దిస్‌ కొలవరి’ ఈ ఫీచర్‌లో వెరీ వెరీ ఫేవరేట్‌గా నిలిచింది. కీరవాణి ‘అన్నమయ్య’ చేసినా, దేవిశ్రీ ‘మన్మధుడు’ చేసినా ఆ పాటలు ఈ ఫీచర్‌లోనే దొరికాయి. రోజూ ఒక పాట... రోజూ ఒక కూనిరాగం... ఇది సాక్షి ఫ్యామిలీ మాత్రం తెచ్చిన సరాగం. ఈ పదేళ్లలో దాదాపు 3000 పాటలను అందించిన ఘనత సాక్షిది. వెల కట్టలేని బ్యాంక్‌. పాఠకులు పోగేసుకున్న విలువైన ఆస్తి.

రీఛార్జ్‌
‘సున్నా’ను బండి చక్రంలా మార్చుకుని తిరిగి ప్రయాణం సాగించవచ్చని స్ఫూర్తి నింపేలా ప్రముఖుల అనుభవాలతో ‘సాక్షి’ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ లెసన్‌గా మారి ఆదరణ పొందింది. చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఇళయరాజా, కలకత్తాలో ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఉంటే చాలనుకునే అమితాబ్‌ బచ్చన్, యాక్టింగ్‌ రాని అందాల బొమ్మ మాత్రమే అని విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్యారాయ్, ప్రాణాలు తీయగలిగే ప్రమాదాల అంచుకు వెళ్లిన అజిత్, తీవ్ర అనారోగ్యం వేధించిన విక్రమ్, పోలీసు కేసులను ఎదుర్కొని జైలులో క్షోభ అనుభవించిన సుమన్, ఒక దశలో సొంత ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చే స్థితికి వెళ్లిన జగపతిబాబు... ఇలా ఎందరో ‘జీరో’ స్థితి ఎదురైనప్పుడు తిరిగి ఎలా రీఛార్జ్‌ అయ్యారో, జీవితం ముందుకు సాగిపోవడానికే తప్ప ఆగిపోవడానికి కాదు అని ఎలా నిరూపించారో ఈ ఫీచర్‌ చెప్పింది. అయినవాళ్లు ద్రోహం చేసినప్పుడు దాదాపు 30 కోట్ల అప్పుకు వెళ్లిన పూరి జగన్నాథ్‌ తాను తిరిగి గోడకు కొట్టిన బంతిలా ఎలా నిలబడ్డారో చెప్పిన రీచార్జ్‌ కథనం వాడవాడలా ఎంతో చర్చకు దారి తీసింది. దాసరి నారాయణరావు, కైకాల సత్యనారాయణ, జయసుధ, రమాప్రభ, జేడీ చక్రవర్తి, కృష్ణవంశీ... ఇలా ఎందరో ఈ శీర్షికలో తమ అనుభవాలను పంచుకున్నారు. జీవితం ఆటుపోట్ల మయం. మన అనుభవాల నుంచే కాక ఎదుటివారి అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. పదే పదే ఛార్జ్‌ కావాలి. ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచిన ఫీచర్, సాక్షి ఫ్యామిలీని రీఛార్జ్‌ చేసిన ఫీచర్‌ ‘రీఛార్జ్‌’.

జెంటిల్‌మన్‌
మగవాడు మగవాడే. ఆకాశంలో స్త్రీకి మొత్తం వాటా ఇచ్చేశాడు. ఇక వేదికలన్నీ ఆమెవే, గొంతంతా ఆమెదే. మరి మగవాడికి లేవా ఫీలింగ్స్‌? వాడికి లేవా ఎమోషన్స్‌?
అదిగో, సరిగ్గా అలాంటి సమయంలో మగవాడికి కూడా ఒక స్పేస్‌ ఇచ్చింది ‘సాక్షి–ఫ్యామిలీ’. మగవాడి అంతరంగాన్ని ప్రతి బుధవారం ‘జెంటిల్‌మన్‌’గా పరిచింది. పురుషుల సమస్యలను నవ్విస్తూనే లోకం దృష్టికి తెచ్చింది. ‘సంపాదించేది నేను – కాణీ లేదు’, ‘ఒకటో తారీఖు చక్రవర్తి’, ‘బ్యాచిలర్‌ ఓ మంచిమొగుడు’, ‘భార్యను మాయ చేయడం ఎలా?’, ‘ఏడ్చే మగవాడిని నమ్మొచ్చు’. ‘లాగుకునేవాడే మగవాడు’, ‘గుర్రంలా నిద్రపోతున్న మగాడు’, ‘నిండు చంద్రుడికి జుట్టుంటుందా?’, ‘మనకేం తక్కువ? మనకెవడు ఎక్కువ?’... ఇలా పురుషుడి ఆలోచనా ప్రవాహాన్ని పేజీ మీదకు మళ్లించింది. మగవాడి ఆత్మవిశ్వాసాన్నీ, న్యూనతనూ, భయాల్నీ, బాధలనూ సున్నితంగా ఆవిష్కరించింది. ‘మీరు మా ఇంట్లో ఉండి ఇవన్నీ గమనిస్తున్నారా?’ అని 25 వారాల పాటు ప్రపంచంలోని తెలుగు మగవాళ్లు అనుకునేట్టు చేయగలిగింది.అయితే, ఈ జెంటిల్‌మన్‌ మీసం మెలేస్తాడు, సింహాన్ని అనుకుంటాడు. అయినా దురుసైనవాడు కాదు, మర్యాద తెలీనివాడు కాదు, ప్రత్యేకించి స్త్రీ మీద ప్రతికూల భావన ఉన్నవాడు కాదు. అయినా స్త్రీని నిందిస్తాడు, ఉడికిస్తాడు, కవ్విస్తాడు, తన అన్ని సమస్యలకూ ఆమే మూలం అన్నట్టుగా కనబడతాడు. ఇది శ్రీరామదాసు శ్రీరాముణ్ని తిట్టినట్టుగా సాగిన ఫీచర్‌. స్త్రీని పురుషుడికీ, పురుషుడిని స్త్రీకీ మరింత అర్థం చేయించడానికి సాగిన కాలమ్‌. తెలుగు ఫీచర్‌ జర్నలిజంలో ఒక ట్రెండ్‌ సెట్టర్‌!

హోమ్‌ థియేటర్‌
పిల్లలు తడబడుతూ అడుగులు వేయడం కూడా ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది వారి ముద్దుమాటలు ఇంకెంత వినసొంపుగా ఉంటాయి!  అలాగే, వారి అమాయక ప్రశ్నలు ఒక్కోసారి ఐన్‌స్టీన్‌ను మరిపిస్తాయి. అందుకే పిల్లల అచ్చిబుచ్చి మాటలనూ, అల్లరిగా కనబడే ప్రశ్నలనూ ‘హోమ్‌ థియేటర్‌’గా సెలబ్రేట్‌ చేసింది ‘సాక్షి–ఫన్‌డే’. ‘బంగారు తొండ’ అంటుందో పాప. ‘పైనాపిల్‌ కిందాపిల్‌’ అంటాడో బాబు. ‘న్యాయమూర్తి=జుడ్గే’ అని చెబుతుందో బుజ్జి. ‘నేటీ బుచ్చినా దివక్కా?’ అని అడుగుతుందో బుచ్చి. ‘చందమామను కొరికి తిన్నదెవరు?’ అని ఒక సందేహం. ‘సూర్యుడు రాత్రి ఎక్కడికెళ్తాడు?’ అని మరో అనుమానం. ‘పెళ్లి ఫొటోలో ఎందుకు లేను?’ అని ఒకరు. ‘అమ్మ కడుపులోకి తమ్ముడు ఎలా దూరాడు?’ అని మరొకరు. ‘క్వీన్‌ అంటే రాణీ ఆంటీ’ అని ఒక గడుగ్గాయి. ‘పోస్ట్‌వ్యూన్‌లకు వున అడ్రసులన్నీ ఎలా తెలుస్తాయి?’ అని ఇంకో వంకాయి. ‘మా చిన్నదానికి జలుబు చేసింది’, అని ఒక హింట్‌ ఇస్తూ ఎలా రాయాలో పెట్టిందే తడవు పాఠకుల నుంచి అనూహ్యమైన వెల్లువలా వారి బుడ్డోళ్ల కబుర్లు వచ్చి పడ్డాయి. పిల్లల అరివీర కృత్యాలు ప్రతి ఆదివారం పేజీకి చక్కిలిగింతలు పెట్టాయి. కొత్త తల్లిదండ్రులైతే వారి పిల్లలను ఈ మాటల్లో చూసుకున్నారు. పాత అమ్మానాన్నలయితే ఒకప్పటి వారి పిల్లల బాల్యాన్ని తలుచుకున్నారు. అంతెందుకు, వారి బాల్యాన్ని సైతం అద్దంలోలా చూసుకున్నారు.సుమారు మూడేళ్లపాటు ఈ ఇంటింటి బాలరామాయణానికి వేదికైంది ఫన్‌డే. దీనికి వాసు బొమ్మలు అదనపు అందాన్నిచ్చాయి.

రియాలిటీ చెక్‌
నిజంగా నిజం ఏమై వుంటుంది? దాన్ని పట్టుకోవడం సాధ్యమేనా?హిజ్రాలతో మాట కలిపితే ఏమంటారు? సెక్స్‌ వర్కర్లను కదిలిస్తే ఏం చెబుతారు?ఒక కల్లు కాంపౌండ్లో జనం ఏం మాట్లాడుకుంటారు? ఒక ఎఫ్‌ఎం స్టేషన్లో జాకీలు ఎలా డ్యూటీ చేస్తారు?గాంధీ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ల హడావుడి ఎలా ఉంటుంది? ఉస్మానియా మార్చురీలో జొబ్బుమనే ఈగలు ఏం అర్థం చేయిస్తాయి?ఒక ఇరానీ హోటల్లో కూర్చుని, రైల్వే స్టేషన్లో తిరిగి, శ్మశానాన్ని చూసి, బిచ్చగాళ్లను విని, గుడిలో ఆహ్లాదపడి, బడిలో ఆలోచన చేసి, రాయాలన్న ఆలోచనే ‘రియాలిటీ చెక్‌’. పీపుల్‌ అండ్‌ ప్లేసెస్‌. ‘ఫన్‌డే’లో యాభై వారాలకు పైగా సాగిన కాలమ్‌. తర్వాతి వారం ఎక్కడికి వెళ్తున్నారని పాఠకులు కుశలంతో పాటు కుతూహలాన్ని కూడా ప్రదర్శించేలా ఆదరణ పొందిన ఫీచర్‌. పార్కు, కోర్టు, జూ, చార్మినార్, గోల్కొండ కోట, చేపల మార్కెట్, పోలీస్‌ స్టేషన్, రాష్ట్రపతి నిలయం... ఇలా ప్రదేశాల్లో ఉన్న మనుషుల, మనుషులు ఉండే ప్రదేశాల వాస్తవ జీవితాన్ని, సాహిత్య విలువలు జోడించి, అంతర్గతంగా ఉన్న తత్వాన్ని విడమరిచి రెండు పేజీల్లో, వెయ్యి పదాల్లో చెప్పడం ఇందులోని హైలైట్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement