జీతం పెరిగిందా? | salary increase but how to save? | Sakshi
Sakshi News home page

జీతం పెరిగిందా?

Published Wed, Aug 31 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

జీతం పెరిగిందా?

జీతం పెరిగిందా?

ఏడవ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య పచ్చజెండా ఊపింది. దాంతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. ప్రతి నెలా చేతిలో పడే పచ్చనోట్ల సంఖ్యా పెరిగింది. ‘బేసిక్ పే’ అని ముద్దుగా అందరూ పిలిచే మూల వేతనం దీని వల్ల దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువవుతుంది. నెలకు రూ.7 వేలు ఉండే ప్రారంభ స్థాయి జీతం ఈ దెబ్బతో రూ. 18 వేలకు పెరుగుతుంది. అలాగే, అత్యున్నత స్థాయి జీతం రూ. 90 వేల నుంచి ఏకంగా రూ. 2.5 లక్షలు అవుతుంది. ఈ జీతాల పెరుగుదలతో దాదాపు కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చేతిలో నాలుగు డబ్బులు ఆడతాయి.


చేతికి వచ్చే డబ్బు పెరగడం వల్ల వినియోగదారుల డిమాండ్ పెరుగుతుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల్లో గణనీయ సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు కాబట్టి, గ్రామ ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగులకు సుమారు 6 నెలల ఎరియర్స్ కూడా రానున్నాయి. మరి, ఇప్పుడు ఈ పెరిగిన డబ్బుతో ఏం చేయాలి? ఈ సమయంలో వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటే అంత కన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదు. అందుకే, తెలివైనవాళ్ళు తమ సేవింగ్స్‌నూ, పొదుపు ప్రణాళికలనూ, రిటైర్మెంట్ వ్యూహాలనూ మరోసారి సరిచూసుకుంటారు. ఈ క్రమంలో ఏం చేయాలంటే...

 
1. ముందుగా అప్పులు తీర్చాలి.
ఎందుకంటే, ఇవాళ ప్రతి ఒక్కరికీ గృహ ఋణాల దగ్గర నుంచి ఏదో ఒక అప్పు ఉంటుంది. అలాంటి ఋణాలపై దృష్టి పెట్టి, ఆ ఋణభారాన్ని తగ్గించాలి. తీసుకున్న ఋణంలో కొంత భాగాన్ని ఇలా ముందే తీర్చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థికస్థితి బలమవుతుంది. ఉదాహరణకు 20 ఏళ్ళలో తీర్చేలా, 10 శాతం వడ్డీకి దాదాపు రూ. 50 లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారనుకుందాం. మీకు పెరిగిన జీతం, వచ్చిన ఎరియర్లతో మొదటి అయిదేళ్ళలోనే లక్ష రూపాయలు ముందుగా తీర్చేశారనుకుందాం. అప్పుడు ఈ 20 ఏళ్ళ కాలపరిమితిలో దాదాపు రూ. 3.3 లక్షల మేర భారాన్ని తప్పించుకున్నట్లు లెక్క.

 
2. రిటైర్‌మెంట్ ప్రయోజనాల గురించి ఆలోచించాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు సర్వసాధారణంగా రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఇస్తారు. ఉచిత ఆరోగ్య సంరక్షణ వసతీ ఉంటుంది. అయితే, 2004 తర్వాత సర్వీస్‌లో చేరినవారికి ప్రభుత్వ ఖజానా నుంచి నికరమైన పింఛను బదులు, రిటైర్‌మెంట్ పొదుపు ప్రణాళిక మొత్తం ‘జాతీయ పింఛను పథకం’ కిందకు వస్తోంది. పదవీ విరమణ అనంతరం వచ్చే సొమ్ములపై  ఈ పథకం తుది ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలీదు. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వీలైనంత వరకు అనేక ఇతర మదుపు ప్రణాళికలు వేసుకోవాలి. పదవీ విరమణ అనంతర జీవితం ఇబ్బందుల్లో పడకుండా, ఇప్పుడు పెరిగిన జీతాన్ని అప్పటి సుఖానికి తగ్గట్లు పొదుపు, మదుపు చేయాలి.

 
3. జీతం పెరిగిందని, ఖర్చులు పెంచుకోకూడదు.

అసలు జీతం పెరిగిందనే విషయాన్ని మర్చిపోయి, ఆ పెరిగిన డబ్బును మీకు ఎందులో సౌకర్యంగా ఉంటే, అందులో మదుపు చేయాలి. దీర్ఘకాలిక మదుపు పథకాల్ని ఆశ్రయిస్తుంటే, ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఈక్విటీల్లో డబ్బు మదుపు చేయడం ఉపయోగం. ఈక్విటీ ఆధారిత మదుపు పథకాల్లో వచ్చే ప్రతిఫలం పరిస్థితుల్ని బట్టి మారిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మిగిలినవాటి కన్నా ఇవే ఉత్తమం. దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే, రిస్కూ తగ్గుతుంది.

మొత్తం మీద, వేతన సంఘం సిఫార్సుల వల్ల జీతాలు పెరిగాయని సంబరపడితే సరిపోదు. ఆ పెరిగిన డబ్బును మన ‘ఫ్యామిలీ’కి ఉపయోగపడేలా మదుపు చేస్తేనే ఉపయోగం. ఎందుకంటే, రూపాయి ఆదా చేశామంటే, రూపాయి సంపాదించినట్లేగా! 
- అదిల్ శెట్టి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ‘బ్యాంక్ బజార్ డాట్‌కామ్’

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement