ఉప్పు తగ్గితే... నిద్ర పెరుగుతుంది!
పరిపరిశోధన
ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగిన కొద్దీ రక్తనాళాల్లో రక్తపోటు పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తల వల్ల కొత్తగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారికి నిద్రపట్టడం తగ్గుతుంది. అన్నంలో ఉప్పు తగ్గించండి... మంచి నిద్రపడుతుందంటూ భరోసా ఇస్తున్నారు. దీనికి మరో మంచి తార్కాణాన్ని కూడా వారు చూపుతున్నారు. ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగినప్పుడు రాత్రివేళ చాలాసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందట. దాంతో అనేక మార్లు నిద్రాభంగమవుతుందంటున్నారు వారు. అలాగే ఉప్పు తగ్గిస్తే మూత్రానికి వెళ్లాల్సి రావడం తగ్గుతుందని పేర్కొంటున్నారు. దాంతో అంతరాయం లేనందు వల్ల నాణ్యమైన నిద్రపోవడం సాధ్యమంటున్నారు.
ఈ అధ్యయనం కోసం అన్నంలో ఉప్పు ఎక్కువగా వేసుకునే 321 మంది జపాన్ పౌరులను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. వారిని 12 వారాలు పరిశీలించారు. ఆ తర్వాత వాళ్లలోనే 223 మందిని ఎంచుకొని, వారి ఆహారంలో ఉప్పు పాళ్లను బాగా తగ్గించారు. దాంతో వీళ్లలో రాత్రివేళల్లో నిద్ర లేవాల్సిన అవసరం రావడం గణనీయంగా తగ్గడం చూశారు. ఆహారంలో ఉప్పు తగ్గించని మిగతా 98 మంది మాటిమాటికీ బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే మంచి నిద్ర కావాలంటే ఉప్పు తగ్గించాల్సిందేనని సూచిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల నిర్వహించిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ యూరాలజీ వార్షిక సమావేశంలో వెల్లడించారు జపాన్ పరిశోధకులు.