ఉప్పు ప్యాకింగ్‌ ఉద్యోగం పేరిట టోకరా..! | Salt Packing Job Fraud in Suryapet | Sakshi
Sakshi News home page

ఉప్పు ప్యాకింగ్‌ ఉద్యోగం పేరిట టోకరా..!

Published Sun, Nov 24 2019 8:50 AM | Last Updated on Sun, Nov 24 2019 8:51 AM

Salt Packing Job Fraud in Suryapet - Sakshi

నిర్వాహకులతో వాగ్వాదం చేస్తున్న మహిళలు

అమాయకులను బురిడీ కొట్టించేందుకు మోసగాళ్లు  కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చనే ఏకంగా మైకులను ద్వారా ప్రచారం నిర్వహించారు. మేము సరఫరా చేసే ఉప్పును ప్యాకింగ్‌ చేసి ఉపాధి పొందవచ్చని నమ్మబలికారు. కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే ఉద్యోగం ఇస్తామని ప్రచారం చేశారు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల్లో బాధితుల నుంచి డబ్బు వసూలు చేసి టోకరా ఇచ్చేశారు. ఇదీ... సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఉప్పు దందా ఉదంతం.

సూర్యాపేట : ‘పేట’ జిల్లా కేంద్రంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పును ప్యాకింగ్‌ చేసేందుకు.. ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. ‘ రూ. వెయ్యి పెట్టు.. జాబ్‌ పట్టు’ అంటూ పద్మశాలి భవన్‌లో జాబ్‌ మేళా పేరుతో మణికంఠసాయి సాల్ట్‌ కంపెనీ పేరుతో కొంతమంది వ్యక్తులు జిల్లా కేంద్రంలోని మహిళలను నమ్మించారు. వారి ఇంటి వద్దనే ఉప్పు ప్యాకింగ్‌కి సంబంధించిన ముడి సరుకును పంపిస్తామంటూ మాయమాటలు చెబుతూ రూ.వెయ్యి చొప్పున వసూళ్లకు తెరలేపారు. దీంతో సుమారు 400 మందికి పైగా మహిళల నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు.
 
మణికంఠ సాల్ట్‌ కంపెనీ పేరుతో..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఉప్పు లోడ్‌లు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తాయని మాయమాటలు చెప్పి పట్టణంలోని ప్రధాన కాలనీల్లో ఇటీవల మైక్‌తో ప్రచారం నిర్వహించారు. దీంతో అమాయక మహిళలు ఉప్పు ప్యాకింగ్‌ చేసే పనే కదా అని రూ.వెయ్యి మణికంఠ సాల్ట్‌ కంపెనీ పేరుతో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు చెల్లించుకున్నారు.మణికంఠ సాల్ట్‌కు చెందిన నిర్వాహకులు తాళ్లగడ్డ, ప్రియాంకకాలనీ, జనగాం క్రాస్‌రోడ్డు, అంబేద్కర్‌ కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీల్లో వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలో ఏకంగా మైక్‌ ద్వారా ప్రచారం చేస్తూ భారీగా దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  తేరుకున్న కొందరు మహిళలు పద్మశాలి భవన్‌ వద్దకు చేరుకుని తమ నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్లు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ పరిస్థితి ఏమిటని నిర్వాహకులను మహిళలు నిలదీయడంతో సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని  పోలీసులను వేడుకున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : సీఐ
ఉద్యోగం పేరిట మహిళల నుంచి మణికంఠ సాల్ట్‌ కంపెనీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసినట్టు తమకు సమాచారం లేదు. బాధితులు  తమను ఆశ్రయించలేదు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement