suryapet city
-
ఉప్పు ప్యాకింగ్ ఉద్యోగం పేరిట టోకరా..!
అమాయకులను బురిడీ కొట్టించేందుకు మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చనే ఏకంగా మైకులను ద్వారా ప్రచారం నిర్వహించారు. మేము సరఫరా చేసే ఉప్పును ప్యాకింగ్ చేసి ఉపాధి పొందవచ్చని నమ్మబలికారు. కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే ఉద్యోగం ఇస్తామని ప్రచారం చేశారు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల్లో బాధితుల నుంచి డబ్బు వసూలు చేసి టోకరా ఇచ్చేశారు. ఇదీ... సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఉప్పు దందా ఉదంతం. సూర్యాపేట : ‘పేట’ జిల్లా కేంద్రంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పును ప్యాకింగ్ చేసేందుకు.. ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. ‘ రూ. వెయ్యి పెట్టు.. జాబ్ పట్టు’ అంటూ పద్మశాలి భవన్లో జాబ్ మేళా పేరుతో మణికంఠసాయి సాల్ట్ కంపెనీ పేరుతో కొంతమంది వ్యక్తులు జిల్లా కేంద్రంలోని మహిళలను నమ్మించారు. వారి ఇంటి వద్దనే ఉప్పు ప్యాకింగ్‌కి సంబంధించిన ముడి సరుకును పంపిస్తామంటూ మాయమాటలు చెబుతూ రూ.వెయ్యి చొప్పున వసూళ్లకు తెరలేపారు. దీంతో సుమారు 400 మందికి పైగా మహిళల నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. మణికంఠ సాల్ట్ కంపెనీ పేరుతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉప్పు లోడ్లు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తాయని మాయమాటలు చెప్పి పట్టణంలోని ప్రధాన కాలనీల్లో ఇటీవల మైక్‌తో ప్రచారం నిర్వహించారు. దీంతో అమాయక మహిళలు ఉప్పు ప్యాకింగ్ చేసే పనే కదా అని రూ.వెయ్యి మణికంఠ సాల్ట్ కంపెనీ పేరుతో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు చెల్లించుకున్నారు.మణికంఠ సాల్ట్‌కు చెందిన నిర్వాహకులు తాళ్లగడ్డ, ప్రియాంకకాలనీ, జనగాం క్రాస్‌రోడ్డు, అంబేద్కర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీల్లో వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలో ఏకంగా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ భారీగా దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తేరుకున్న కొందరు మహిళలు పద్మశాలి భవన్ వద్దకు చేరుకుని తమ నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్లు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ పరిస్థితి ఏమిటని నిర్వాహకులను మహిళలు నిలదీయడంతో సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : సీఐ ఉద్యోగం పేరిట మహిళల నుంచి మణికంఠ సాల్ట్ కంపెనీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసినట్టు తమకు సమాచారం లేదు. బాధితులు తమను ఆశ్రయించలేదు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తాం. -
డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు
సాక్షి, సూర్యాపేట: వైద్యుడు దేవుడితో సమానమంటారు.. కానీ కొందరు వైద్యులు డబ్బులకు కక్కుర్తిపడి వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు.. చనిపోయిన విషయం చెప్పకుండా.. ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తీసిన ఓ తెలుగు సినిమాలోని సీన్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పునరావృతమైంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..జనగాం జిల్లా కొడకండ్ల మండలం హక్యతండాకు చెందిన గుగులోతు సరిత(28)కు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో వైద్యులు ఆపరేషన్ చేయడంతో సరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది ఆపరేన్ గది నుంచి శిశువును బయటికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సరితను బయటికి తీసుకరాకపోవడంతో వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని బంధువులు నిలదీశారు. వైద్యులు మాత్రం ఎవరికేం కాలేదంటూ గంటల తరబడి మృతి చెందిన సరితను చూపకుండా ఠాగూర్ మూవి సీన్‌ను తలపించే విధంగా వ్యవహరించారు. మొత్తం డబ్బులు కడితేనే సరితను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆ మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత సరిత మృతిచెందిందని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆపరేషన్ వికటించే చనిపోయిన సరితను ఆపరేషన్ థియేటర్లో ఉంచి డబ్బులు చెల్లించాక మృతి చెం దిందని చెప్పడమేం టని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను సద్దు మణిగింపచేశారు. అయితే ఇదే ఆస్పత్రిలో ఇటీవల బాలింతల మృతిచెందుతుండడంతో గర్భిణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా ఆసుపత్రిలో వైద్యురాలి అందుబాటులో లేకున్నా అడ్మిట్ చేయించుకొని గర్భిణి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
రూ.కోటిన్నరకు రియల్ వ్యాపారి ఐపీ..?
సూర్యాపేట(నల్లగొండ): రూ.కోటిన్నరకు ఐపీ పెట్టి ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన సూర్యాపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. స్థానిక బాలాజీనగర్‌లోని మసీద్ సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో రూ.కోటిన్నరకు పైగా అప్పులు చేసి ఐపీ పెట్టినట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న అతనికి అప్పులు ఇచ్చిన వారు, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగినట్టు తెలిసింది. ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన గురైనట్టు సమాచారం. దీంతో లక్షల్లో అప్పులు ఇచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటంతో కుటుంబసభ్యులు అతడిని పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.