
సంగీత మహేశ్వర్, మీనా కస్లీవాల్
ఒక కుటుంబం ఎదగాలంటే.. ఆ కుటుంబంలోని మహిళకు చేయూతనివ్వాలి. పిల్లల ముఖాల్లో సంతోషం చూడాలంటే... తల్లి చేతిలో నాలుగు డబ్బులు ఉండాలి. అందుకే.. ఇంటికే పరిమితమైన మహిళల్లో దాగిన నైపుణ్యానికి ఒక వేదిక కల్పిస్తున్నారు సంగీత, మీనా. ఒకే ఆలోచన, ఒకే అభిరుచి ఉన్న వీళ్లిద్దరూ కలిసి ఊరూవాడకు తోడుగా ఉంటున్నారు..బతుకు జాడ చూపిస్తున్నారు.
‘‘గురువారం ఉదయం పండ్లు కొందామని మొజాంజాహీ మార్కెట్‌కెళ్లాను. పండ్లు కొనుక్కుని డబ్బులిస్తుంటే ఆ షాపు కుర్రాడు డబ్బు తీసుకోకుండా ‘మేడమ్ బాగున్నారా’ అని పలకరించాడు. నేను ఇతడి షాపుకి రెగ్యులర్‌గా కస్టమర్‌ని కాదు, ఇంతకు ముందెప్పుడూ ఇతడిని చూసినట్లు కూడా లేదు’ అనుకుంటూనే ‘నీకు నేనెలా తెలుసు’ అని అడిగాను. మీరు మా కాలనీలో పిల్లలకు ఆటల పోటీలు పెట్టి, గెలిచిన వాళ్లకు బహుమతిగా బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లు. చాలా ఏళ్ల కిందట పార్దీవాడాలో మీ చేతుల మీద ఐదు కేజీల బియ్యం తీసుకున్నాను’ అని పదేళ్ల నాటి సంగతి గుర్తు చేశాడు. తన పేరు మాధేశ్ అని పరిచయం చేసుకున్నాడు. ‘నా సంతోషం కోసం ఇస్తున్నాను పండ్లు పట్టుకెళ్లండి, డబ్బులు వద్దు’ అన్నాడు. నేను కాదు కూడదంటే... అప్పుడు ధర తగ్గించి తాను కొన్న ధర మాత్రం తీసుకున్నాడు. ‘నా ఫోన్ నంబరు తీసుకోండి మేడమ్. ఏమైనా కావాలంటే చెప్పండి’ అని నంబర్ షేర్ చేశాడు. చెప్పలేనంత సంతోషం అది. మనం నాటిన మొక్క పెద్దదై పువ్వు పూచినప్పుడు కలిగే ఆనందం అది. ఇరవై ఏళ్లుగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో సర్వీస్ చేస్తున్నాం. అప్పటి చిన్న పిల్లవాడు ఇప్పుడు ప్రయోజకుడై మమ్మల్ని గుర్తు పట్టి అభిమానంగా పలకరించాడు. ఇంతకంటే సంతృప్తి ఇంకేం కావాలి?’’ అని ఎంతో ఉద్వేగంగా అన్నారు మీనా కస్లీవాల్.
ఆమెతోపాటే సంగీత మహేశ్వర్ ఉన్నారు. ‘‘గౌలిగూడా, పార్థీవాడా, ఎంజీమార్కెట్, జుమ్మేరాత్ బజార్ కాలనీలకు, జగదీశ్ కన్యా పాఠశాల, మార్వాడీ హిందీ విద్యాలయలకు వెళ్లినప్పుడు పిల్లలు మా దగ్గరకొచ్చి ‘మంచిగ చదువుకుంటున్నాం, పరీక్షలు బాగా రాశాం. వచ్చే ఏడాది కూడా మాకు పుస్తకాలు ఇస్తారా’ అని ఆశగా అడుగుతుంటారు. చిన్న పిల్లలు వచ్చి ‘మేము చదువుకుంటాం, పుస్తకాలిస్తారా’ అని అడిగితే కాదనగలమా. మేము చిన్నగా మొదలు పెట్టిన సర్వీస్ విస్తరించడానికి కారణం కూడా పిల్లల అభిమానమే’’ అన్నారు సంగీత. ‘మహిళా జాగృతి’ నిర్వహకులు సంగీత, మీనా.
పండుగ రోజు పరమాన్నం
సంగీత పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. వారిది హైదరాబాద్‌లో స్థిర పడిన రాజస్థాన్ కుటుంబం. మీనా పుట్టింది ఉత్తరప్రదేశ్‌లో. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. పెళ్లితో హైదరాబాద్‌కి వచ్చారామె. ఇద్దరూ పాతికేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ వేర్వేరు సంస్థలతో పని చేసేవారు. ‘‘మా జైన్ కుటుంబాల్లో... మనిషి చనిపోయే లోపు సమాజానికి చేతనైన సహాయం ఏదయినా చేయాలని చెబుతారు. ఆ స్ఫూర్తితోనే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పని చేశాం. సంగీత కూడా అలాగే చేస్తుండేది. అలా ఇద్దరం ఒకరికొకరం పరిచయమయ్యాం. మహిళల కోసం ఏదైనా చేయాలనే మా ఆలోచనలే ఇద్దర్నీ దగ్గర చేశాయి. ‘మహిళా జాగృతి’ పేరుతో సంస్థను స్థాపించాం. ఇంటికే పరిమితమైన మహిళలు బయటకు రావాలంటే వాళ్లకు పరిచయమైన వేదిక ఒకటి ఉండాలి. వాళ్లకు తెలిసిన పని అయితేనే ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. అందుకే కుకింగ్ కాంపిటీషన్స్ పెట్టాం. ఇరవై ఏళ్ల కిందట మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఇప్పుడున్నంతగా ఉండేది కాదు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో హెల్త్ క్యాంపుల అవసరం చాలా ఉండేది. ఆ కాలనీల్లో హెల్త్‌క్యాంపులతో పాటు పండుగ సమయాల్లో పిల్లలకు ఆటలపోటీలు పెట్టేవాళ్లం. గెలిచిన వాళ్లతోపాటు పోటీలో పాల్గొన్న అందరికీ బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లం. ఆ కుటుంబాల్లో నిజానికి వాటి అవసరం చాలా ఉండేది కూడా. పిల్లలకు తల్లులు పండగ రోజు మిఠాయిలు పెట్టలేకపోయినా కనీసం తియ్యటి అన్నమైనా పెట్టగలగాలనేది మా కోరిక. అలా పెట్టిన ఆటల పోటీల్లో పాల్గొన్న కుర్రాడే మాధేశ్’’ అన్నారు మీనా.
జీవన నైపుణ్యాలపై బాలికలకు, మహిళలకు వర్క్‌షాప్
బంధువులే ముందుకొచ్చారు
‘‘ఉద్యోగినులు వాళ్ల బిజీలో వాళ్లుంటారు. చదువుకుని కూడా గృహిణిగా ఇంటికే పరిమితమైన వాళ్లలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుండేది. వాళ్లంతా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్లు. మళ్లీ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతారా అన్నట్లు ఎదురు చూసేవాళ్లు. సోషల్ గ్యాదరింగ్స్ కూడా వాళ్లకు అందనివి అన్నట్లు ఉండేవి. చాలామంది నిరుత్సాహంగా రోజులు గడుపుతున్నట్లు కూడా అనిపించేది. వాళ్లలో స్కిల్ ఉంటుంది, దానిని ప్రదర్శించడానికి వేదిక లేకపోవడంతో టాలెంట్ మరుగున పడిపోతోంది. వేదిక ఒకటి ఉంటే వాళ్లలో హిడన్ టాలెంట్ బయటికొస్తుందనుకున్నాం. ఆ అనుకోవడమే... 2000లో ఒక ఎగ్జిబిషన్ రూపం సంతరించుకుంది. మేము మా ఆలోచన బయట పెట్టగానే బంధువుల్లోనే ఎక్కువ మంది మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఏటా మూడు రోజులు మహిళల కోసం ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఇది 19వ ఎగ్జిబిషన్ (జూలై 19, 20, 21 తేదీల్లో జరిగింది). ఇంట్లో ఖాళీ టైమ్‌లో వాళ్లకు చేత వచ్చిన హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకుంటారు. మూడు రోజులు స్టాల్‌లో అమ్ముకుంటారు. టేబుల్ స్పేస్ నుంచి స్టాల్ వరకు వాళ్ల అవసరాన్ని బట్టి అద్దెకు తీసుకుంటారు. అలాగే ఏటా ఫ్రీ స్టాల్స్ కూడా ఉంటాయి. బేగంపేటలో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్‌లో ఉండే అంధ విద్యార్థులు క్యాండిల్స్, పేపర్ ప్లేట్‌లు, గ్లాస్‌ల వంటివి తయారు చేస్తారు. ఆ స్టూడెంట్స్‌కి స్టాల్ ఉచితంగా ఇవ్వడంతోపాటు వాళ్లను హోమ్ నుంచి ఎగ్జిబిషన్‌కు తీసుకురావడం, భోజనాల వంటి ఏర్పాట్లు కూడా మేమే చూసుకుంటాం. అలాగే ఇతర దివ్యాంగులతోపాటు లంబాడీ మహిళలకు కూడా స్టాల్ ఉచితంగా ఇస్తున్నాం. ఈ ఏడాది 15 స్టాళ్లను ఉచితంగా ఇచ్చాం’’ అన్నారు సంగీత మహేశ్వర్.
ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు
సంగీత, మీనా ఇద్దరూ ఒకేరకమైన వస్త్రధారణలో కనిపించారు. ఏడాదంతా కాదు, ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నప్పుడు, కాలనీల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇలా ఒకేరకమైన చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే.. ఎవరికైనా అక్కడ సహాయం అవసరమైతే ఎవర్ని సంప్రదించాలనే అయోమయం లేకుండా చూడగానే అర్థం కావడం కోసమేనంటారు ఈ స్నేహితులు. ‘‘దీపం వెలిగించే వత్తుల నుంచి రత్నాలు, మరకతాల ఆభరణాల వరకు రకరకాల స్టాల్స్‌కు వేదిక ఇది. ఒక మహిళ తన చేత్తో పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఎంతో చదువు అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పనులే డబ్బు సంపాదించి పెడతాయి. రుచిగా వండడం వస్తే అదే వాళ్ల పరిశ్రమకు పెట్టుబడి అవుతుంది. ఎగ్జిబిషన్‌లో ఎప్పుడూ ఫుడ్‌కోర్ట్‌లో చోళాబటూరా, వడాపావ్‌ల వంటి నార్త్ వంటకాలు ఎక్కువగా ఉండేవి. ఈ దఫా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉన్నాయి.. దోశె కోసమే ఒక స్టాల్ పెట్టాం. సంపాదించే వాళ్లకు మాత్రమే గౌరవాలందుతున్న సమాజంలో న్యూనతకు లోనవుతున్న గృహిణులకు భరోసా కల్పించడమే ‘మహిళా జాగృతి’ ఉద్దేశం. మహిళ సమాజంలో సగౌరవంగా జీవించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అందుకు తోడ్పాడునందించడంలో సంతృప్తి ఉంది. ఇన్నేళ్ల అనుభవంలో మహిళలకు మేము చెప్పేది ఒక్కటే... రోజుల్ని నిరుపయోగంగా గడిపేస్తే, జీవించడమే దుర్భరంగా ఉంటుంది. ప్రతి రోజునీ ఉపయుక్తంగా మలుచుకుంటే జీవితం మన విజయం వెంట పరుగులు తీస్తుంది. రోజును ఫలప్రదం చేసుకోండి’’ అంటున్నారు సంగీత, మీనా. మనకోసం చేసిన పనిలో ఫలితం మన చేతుల్లోకే వస్తుంది. ఇతరుకు చేసిన పనికి ఫలితం అభిమానం రూపంలో ఆత్మ సంతృప్తినిస్తుంది’’ అన్నారిద్దరూ సంతోషంగా.
– వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్
Comments
Please login to add a commentAdd a comment