సేవకు సేవింగ్స్‌ అకౌంట్‌ | Savings Account :Time Bank Service | Sakshi
Sakshi News home page

సేవకు సేవింగ్స్‌ అకౌంట్‌

Published Wed, Jun 27 2018 12:58 AM | Last Updated on Wed, Jun 27 2018 12:58 AM

Savings Account :Time Bank Service - Sakshi

ఈ అకౌంట్‌ను ఎవరైనా ప్రారంభించవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ ౖటñ మ్‌ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు. వృద్ధాప్యంతో తీసి వాడుకోవచ్చు!

ఏ దేశపు కుర్రాడో తెలియదు. చదువుకోడానికి స్విట్జర్లాండ్‌ వచ్చాడు. కాలేజ్‌ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు గల ఆవిడ పేరు క్రిస్టీనా. 67 సంవత్సరాలు. ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. ఈ కుర్రాడు చేరాడు కదా. ఇప్పుడు ఇద్దరు. సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు క్రిస్టీనా. పింఛను వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛను మామూలుగా ఉండదు. మూట నిండుగా ఉంటుంది. తినడానికి, తాగడానికి.. దేనికీ తడుముకోనక్కర్లేదు. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంది. అయినా గానీ క్రిస్టీనా.. ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటారు! ఆమె చేసే పని ఓ 87 ఏళ్ల వృద్ధుడికి సేవలు అందించడం. అది చూసి, ఈ కుర్రాడు అడిగాడు ఒక రోజు : ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా.. పనికి వెళ్లొస్తున్నారు..’’అని. క్రిస్టీనా నవ్వారు. ‘‘డబ్బు కోసం కాదు. నా టైమ్‌ని ‘టైమ్‌ బ్యాంక్‌’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’ అని చెప్పారు. కుర్రాడు ఆసక్తిగా చూశాడు. టైమ్‌ బ్యాంక్‌ అనే మాటను తొలిసారి అతడు వింటున్నాడు. ‘టైమ్‌ని సేవ్‌ చేసుకోవడం, టైమ్‌ని వాడుకోవడం ఏంటి పెద్దమ్మా’ అని అడిగాడు. 

దగ్గరుండి చూసుకోవాలి
‘టైమ్‌ బ్యాంక్‌’ అనేది స్విట్జర్లాండ్‌లో కొన్నేళ్లుగా ఉన్న వృద్ధాప్యపు పింఛను పథకం. స్విస్‌ సామాజిక భద్రత సమాఖ్య మంత్రిత్వశాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించే పథకం అది! ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. కాలకృత్యాలకు చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం, వేళకు మందులు అందివ్వడం, ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం.. ఇలాంటివే ఆ సేవలన్నీ. జబ్బున పడ్డవారికైతే ఇంకొంచెం సేవ, ఇంకొంచెం ప్రేమ అవసరం. ఇలా రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైమ్‌ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు.  

గంటల్ని సేవ్‌ చేసుకోవాలి
క్రిస్టీనా వారానికి రెండుసార్లు సేవకు వెళ్లేవారు. వెళ్లిన ప్రతిసారీ రెండు గంటలు సేవలు అందించేవారు. ఇల్లు సర్దేవారు, షాపింగ్‌ చేయించేవారు. సన్‌బాత్‌కి తీసుకెళ్లేవారు. పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి క్రిస్టీనాకు ఒక ‘టైమ్‌ బ్యాంకు కార్డు’ ఇస్తుంది టైమ్‌ బ్యాంక్‌. కూడబెట్టుకున్న టైమ్‌కి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి పొందవచ్చు. క్రిస్టీనా అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంకు వాళ్లే అమె దగ్గరికి వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి క్రిస్టీనా డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్‌ ఉంటుంది కదా.. ఆ అకౌంట్‌లో వాళ్ల టైమ్‌ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు. ఇదీ టైమ్‌ బ్యాంక్‌ కాన్సెప్ట్‌. 

ఓపికున్నన్నాళ్లూ.. చేయొచ్చు!
ఓ రోజు కాలేజ్‌లో ఉండగా క్రిస్టీనా ఇంట్లో అద్దెకు ఉన్న కుర్రాడికి ఫోన్‌ వచ్చింది. స్టూలెక్కి కిటికీ అద్దాలు తుడుస్తుండగా ఆమె స్టూలు మీద నుంచి పడిపోయారు. వెంటనే ఆ కుర్రాడు ఇంటికి చేరుకుని క్రిస్టీనాను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె కాలి మడమ దగ్గరి ఎముక చిట్లిపోయింది. కొంతకాలం కదలకూడదు. మంచం మీదే ఉండాలి. ఆ కుర్రాడు దీర్ఘకాలిక సెలవు తీసుకుని ఆమెకు సేవలు చేయడానికి సిద్ధమైపోయాడు. క్రిస్టీనా అతడిని వారించారు. అప్పటికే ఆమె తన టైమ్‌ని విత్‌డ్రా చేసుకుంటానని టైమ్‌ బ్యాంక్‌కి అభ్యర్థన పంపుకున్నారు! రెండు గంటల్లోపే టైమ్‌ బ్యాంక్‌ నుంచి ఒక నర్సు వచ్చారు. ఆ నర్సు క్రిస్టీనా దగ్గర ఉన్నన్ని రోజులూ ఆమెను ప్రేమగా చూసుకున్నారు. ఆత్మీయంగా సేవలు అందించారు. రుచికరమైన భోజనం వండి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లు చెప్పారు. చాలా త్వరగా కోలుకుని, తిరిగి తన పనికి వెళ్లిపోయారు క్రిస్టీనా! ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్లూ పనికి వెళ్తానని, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని వాడుకుంటానని.. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆ కుర్రాడితో చెప్పారు క్రిస్టీనా. 

వృద్ధాప్యానికి సేవల పింఛన్‌
టైమ్‌ బ్యాంక్‌ స్కీమ్‌ గురించి అతడు ఫేస్‌బుక్‌లో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వృద్ధాప్యం కోసం టైమ్‌ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. టైమ్‌బ్యాంక్‌ వల్ల ప్రభుత్వానికి పింఛను భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైమ్‌ బ్యాంక్‌ చక్కటి పరిష్కారం అయింది. స్విస్‌ పెన్షన్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన సర్వే ప్రకారం స్విట్జర్లాండ్‌లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైమ్‌ బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్‌ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోందట!(ఇది ఎంత వరకు నిజమో తెలీదు. నిజమైతే సంతోషం.  నిజం కాకపోతే.. నిజం చేసుకోవలసినంత సంతోషం. స్విట్జర్లాండ్‌లో చదువుతున్నట్లుగా ఓ కుర్రాడు  తన పేరు లేకుండా పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫార్వర్డ్‌ అవుతోంది. బ్లాగుల్లో కనిపిస్తోంది. ఫేస్‌బుక్‌లో షేర్‌ అవుతోంది).    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement