వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు.
తేజ మాత్రం తన పెళ్లి కోసం ఒక్క అబద్ధం కూడా ఆడించలేదు.
‘అబ్బాయికి సొంతిల్లుందా?’
‘లేదు. కనీసం అద్దె ఇల్లు కూడా లేదు’ (పచ్చినిజం)
‘కారుందా?’
‘కారా! సైకిలుంటే గొప్ప’ (మరో పచ్చినిజం)
ఇలాగే మరికొన్ని ప్రశ్నలు, మరికొన్ని ‘లేదు’ లు!
ఒక్క అబద్ధమైనా ఆడించకపోగా..
వెయ్యి నిజాలు చెప్పాడు తేజ!
పెళ్లి కోసమో, పబ్లిసిటీ కోసమో అబద్ధాలు చెప్పే రకం కాదతడు.
అయితే -
నిజాలు చెప్పి, పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు...
ఇండస్ట్రీలో అబద్దాలు చెప్పకుండా బతికేయడం!
కానీ తేజ బతికాడు, పదిమందిని బతికిస్తున్నాడు.
తేజ లైఫ్ మొత్తం బిట్టు బిట్టు ఒక టెరిఫిక్ ఫైట్!
ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
‘మనిషంటే వీడ్రా’ అని మీకు ఒక్కచోటైనా అనిపించలేదంటే...
కచ్చితంగా మీరు అబద్ధం చెబుతున్నట్లే!
మంచి పీక్‌లో ఉన్నప్పుడు ‘నిజం’ చెప్పారు.. ఇప్పుడు అబద్ధాలు! ఒకటి కాదు, రెండు కాదు... వెయ్యి! ‘నిజం’కే ప్రేక్షకులు అవ్వాల్సినంతగా రియాక్ట్ కాలేదు. మరి అబద్ధాలను అంగీకరిస్తారంటారా?
తేజ: జనాలకు నిజం చెబితే నచ్చడంలేదు. ‘నిజం’ సినిమాలో మీరు నిజం అనుకునేవన్నీ నిజాలు కాదు... అంతా అబద్ధమే అని చెప్పాను. అందుకే ‘ఇట్స్ ఎ లై’ అన్నాను. ఇప్పుడు ‘అబద్ధం’లోనూ అస్సలు నిజం లేదు అంటున్నా. అయితే, ఏకంగా టైటిలే పెట్టి సినిమా తీశా. వెయ్యి అబద్ధాలాడి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే ఈ ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రకథ.
ఇక, ఓసారి మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే.. వెళ్లాల్సినంత పీక్‌కి వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు. పైగా సినిమా సినిమాకీ బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకలా?
తేజ: మధ్యలో ఓ రెండేళ్లు, ఆ తర్వాత నాలుగైదేళ్లు సినిమాలు చెయ్యలేదు. మా అబ్బాయికి వంట్లో బాగా లేకపోవడంవల్ల సినిమాలకు దూరమయ్యాను. ఆ తర్వాత చేసిన చిత్రమే ‘నీకు నాకు డాష్ డాష్’. ట్రాక్‌లో పడి, పదునవ్వడానికి టైమ్ పట్టింది. అందుకే ఆ సినిమా రిజల్ట్ తేడా అయ్యింది. ఇప్పుడు తీసిన సినిమా కరెక్ట్‌గా ఉంటుంది.
ఇకమీద మీ కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?
తేజ: ఎలా ఉన్నా ఓకే. ఎక్కడో ఉండేవాణ్ణి ఈ రేంజ్‌కి వస్తాననే అనుకోలేదు. భవిష్యత్తు గురించి ఏం చెప్పగలను. ఇప్పుడు నన్ను ఇక్కడ ఊడ్చేయమన్నారనుకోండి.. పని నచ్చితే శుభ్రం చేస్తాను. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? అని ఆలోచించను. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తాను.
అంటే.. మీకు లక్ష్యాలు లేవా?
తేజ: సాధారణంగా డెరైక్టర్స్‌కి ఉండే... బాలకృష్ణతోనో పవన్‌కళ్యాణ్‌తోనో సినిమా చేయాలనే లక్ష్యాలు నాకు లేవు. కానీ ఒక్క లక్ష్యం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా తప్పుదోవలో వెళుతోంది. అది దర్శక, నిర్మాతలకు, హీరోలకు.. అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నదే ఆ లక్ష్యం.
సరైన దారంటే...
తేజ: చెప్పను.. చేసి చూపెడతా! డిఫరెంట్ టైపాఫ్ సినిమాలు తీయాలని ఉంది. ఇండియాలో కమర్షియల్, ఆర్ట్.. ఇలా రెండు రకాల సినిమాలున్నాయి. ఆర్ట్ అంటే మరీ ఆథెంటిక్‌గా ఉంటాయి. బి. నరసింగరావుగారు తీసిన ‘దాసి’లాంటివి అన్నమాట. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు జీవితాలను చూస్తున్నట్లనిపిస్తుంది. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’.. ఇలాంటివన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్స్. ఇలా కాకుండా ఆథెంటిక్ సినిమాలో కమర్షియల్ వేల్యూస్ ఉండేలా, కమర్షియల్ వేల్యూస్ ఉన్న చిత్రం ఆథెంటిక్‌గా ఉండేలాగ. ఆ రెండిటికీ మధ్య ఉన్న గోడ తీసేయాలన్నది నా ఆశయం. నేను తీసిన ‘చిత్రం’ని తీసుకుంటే ... అటు కమర్షియల్‌గానూ ఉంటుంది. అలాగే ఆర్టిస్టిక్‌గా కూడా ఉంటుంది. దాన్ని ఒప్పుకోవడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ, ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు. మేమే తియ్యడంలేదు.
‘నిజం’లాంటి సినిమా తీస్తే, కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదని టాక్... ఇంకా కొత్తరకం సినిమా తీయడం రిస్కేగా?
తేజ: ‘నిజం’ని ఆరున్నర కోట్లలో తీశాం. అంతకు ముందు నలభైలక్షలు తీసుకున్న మహేష్‌బాబుకు ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చాం. దాంతో కలిపి ఆరున్నర కోట్లలో తీశాం. అప్పట్లోనే ఆడియో రైట్స్‌ను 2 కోట్లకు, సినిమాని 26 కోట్లకు అమ్మాం. నష్టం వచ్చినవాళ్లకి కొంత వెనక్కి ఇచ్చాం కూడా. అయినా ఐదారు కోట్లు లాభమే వచ్చింది. ఈ లెక్కలు చాలామందికి తెలియక ‘నిజం’ కమర్షియల్‌గా ఫ్లాప్ అనుకుంటారు.
మహేష్‌బాబు తర్వాత వేరే స్టార్ హీరోస్‌తో ఎందుకు సినిమాలు చేయలేదు?
తేజ: తెలుగు హీరోలందరూ ఓ ఫిక్స్‌డ్ ఫార్మట్‌లో ఉన్నారు. స్లో మోషన్‌లో నడవాలి, ఆరు పాటలు, ఫైట్లు ఉండాలి. మిగిలినదాంట్లో కథ చెప్పాలి. ఇప్పుడు ‘స్వాతిముత్యం’లాంటి సినిమాని నేను తెలుగులో తీయాలనుకున్నాననుకోండి.. ఒక్క హీరో పేరు చెప్పండి. ఏం మన హీరోల్లో యాక్ట్ చేసే కెపాసిటీ లేదా? అంటే... మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లాంటివాళ్లు అద్భుతంగా చేయగలుగుతారు. కానీ చెయ్యరు. కమర్షియల్ గిరి నుంచి బయటికి రావడానికి వాళ్లు ఇష్టపడటంలేదు. అందుకే నేను పెద్ద స్టార్స్‌తో చెయ్యను.
ఒకవేళ ఏ స్టార్ హీరో అయినా మీతో సినిమా చేయాలనుకుంటే?
తేజ: నాతోనా? అస్సలు అనుకోరు. కొత్తరకం సినిమా ట్రై చేద్దామనేంత పరిణతి మన తెలుగుపరిశ్రమలో ఉన్న హీరోల్లో ఉందని నేననుకోను. ఎందుకంటే, హీరో అంటే ఇంత పారితోషికం అని ఫిక్స్ అయిపోయింది. అంతకన్నా తక్కువ తీసుకుంటే మార్కెట్ తగ్గిపోయిందనుకుంటారని భయం. ఎక్కువ పారితోషికం తీసుకుని, భారీ బడ్జెట్‌తో సినిమా చేసినప్పుడు ఎక్కువకే అమ్మాలి. అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కమర్షియల్ సినిమానే చేస్తారు. మహేష్‌బాబుని ఇప్పుడు ‘నిజం’ చెయ్యమంటే చెయ్యడు. ఆ సినిమాకి అతన్ని అడిగినప్పుడు ‘బాబీ’ అనే అట్టర్ ఫ్లాప్ సినిమా చేశాడు. నేను తీసిన ‘జయం’ సక్సెస్ అయ్యింది కాబట్టి ‘నిజం’ చేయడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు?
ఇలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు... మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావా?
తేజ: ఏం ఫర్వాలేదండి. ఎందుకంటే నేనెవరి మీదా ఆధారపడి లేను. నాకసలు వాళ్లతో సినిమాలు చేయాలనే ఆశలేవీ లేవు. అలాంటప్పుడు నా మనసులో మాట చెబితే ప్రాబ్లమ్ ఏంటి!
ఇలాంటి మాటలు మాట్లాడటంవల్లే తేజకు నోటి దురుసుతనం ఎక్కువని అంటుంటారు...
తేజ: చాలామంది లోపల ఒకటనుకుని బయటికి ఒకటి చెబుతారు. దానివల్ల ఏం సాధిస్తారు? ఫైనల్‌గా వెనక్కి తిరిగి చూసుకుంటే, వాడి దగ్గర వీడి దగ్గర అణిగి మణిగి పడున్నాం అనే అసంతృప్తి తప్ప ఏమీ మిగలదు. వీళ్లకి ఉండే ఓ గొప్ప టాలెంట్ ఏంటంటే, అసంతృప్తి వల్ల ఏర్పడిన కోపాన్ని ఇంట్లో భార్యాపిల్లల మీదో, అసిస్టెంట్ల మీదో చూపిస్తారు. లేకపోతే తాగేసి రభస చేస్తారు. కానీ నేనలా చేయను. నాకే అలవాట్లు లేవు. ఐ థింక్ ఐయామ్ ది మోస్ట్ స్ట్రయిట్ ఫార్వర్డ్ పర్సన్. ఏదనుకుంటే అది ఓపెన్‌గా చెప్పేస్తాను. తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇంత ఓపెన్‌గా ఎవరూ మాట్లాడలేరు.
ఇలా ఓపెన్‌గా మాట్లాడటంవల్లే ‘ధైర్యం’ సినిమా అప్పుడు ఇరుకుల్లో పడ్డారట?
తేజ: ఆ సినిమా అప్పుడు ఒక బయ్యర్ వచ్చి, ‘‘సార్.. ‘జయం’ నేనే కొన్నాను. ‘ధైర్యం’ కూడా కొనబోతున్నా. కొనమంటారా’’ అన్నాడు. ‘‘ఇంట్లో భార్యాపిల్లలు బాగున్నారు కదా.. జాగ్రత్త’’ అన్నాను. దాంతో అతనా సినిమాని కొనలేదు. ఆ తర్వాత.. అతను ‘‘మీ డెరైక్టరే సినిమాని కొనొద్దన్నాడు’’ అంటూ నిర్మాతకి లెటర్ ఇచ్చాడు. అప్పుడా నిర్మాత నన్ను పిలిచి ‘‘నిజంగానే అలా అన్నావా?’’ అంటే, నేనేమన్నానో చెప్పా. దాంతో దాసరి నారాయణరావుగారు, తమ్మారెడ్డి భరద్వాజ్‌గారు, ఆదిశేషగిరిరావుగారు, కేఎస్ రామారావుగారు, చిల్లర కళ్యాణ్‌గారు జడ్జిలుగా వ్యవహరించి, ఏషియన్ ఫిలింస్‌వాళ్లకి కోటి రూపాయలు, సుధాకర్‌రెడ్డిగారికి 33 లక్షలు కట్టించారు.
మీ సినిమాని మీరే కొనొద్దని చెప్పడం ఏంటి?
తేజ: నేను తీసే సినిమా ఆడుతుందా? లేదా? అని నాకే కదా తెలుస్తుంది. ఆ బయ్యర్ మంచి కోరి చెప్పాను.
మరి.. ఇవతల నిర్మాత ఏమైపోతాడు?
తేజ: అప్పుడు నేను చెప్పింది వినాలి కదా. ఇక్కడ తేడా ఉంది... ఆ తేడాని సరి చేయాలన్నాను. ‘‘లేదు. డేట్ కుదిరింది. రిలీజ్ చేద్దాం’’ అన్నారు. వద్దని నేను, రసూల్ పోరాడాం. వినలేదు.
ఆ కోపంతో బయ్యర్‌కి అలా చెప్పారా?
తేజ: నిజం చెప్పాను. నన్నడిగాడు కాబట్టి చెప్పా. నేను కొనొద్దు అనలేదు. జాగ్రత్త అన్నాను. ఇప్పుడదే బయ్యర్ వచ్చి ‘వెయ్యి అబద్ధాలు’ కొన్నాడు.
ఈసారి కొనమన్నారా? అంటే.. ‘వెయ్యి అబద్ధాలు’ కన్‌ఫర్మ్ హిట్టా?
తేజ: జాగ్రత్త అని మాత్రం చెప్పలేదు. హిట్, ఫ్లాప్ గురించి చెప్పను. ఎందుకంటే, ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని, ఇంత కలక్ట్ చేస్తుందని నేనే సినిమాకీ చెప్పలేదు.
సెన్సేషన్ కోసం తేజ స్టేట్‌మెంట్లు ఇస్తాడని కూడా అనుకుంటుంటారు..?
తేజ: అలా సెన్సేషన్ కోసం స్టేట్‌మెంట్లు ఇచ్చి ఉంటే నేనింకా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి కదా. సెన్సేషన్‌ని వాడుకోవడం తెలియాలిగా. మే బీ నా బ్లడ్‌లోనే సెన్సేషన్ ఉందేమో. అందుకే ఇలా మాట్లాడుతున్నానేమో. ‘ఐయామ్ ఎ బార్న్ ఫైటర్’. ఒకవేళ నేను రోడ్డు మీద కారులో వెళుతున్నప్పుడు అనవసరంగా ఎవరైనా ఒకణ్ణి ఏమైనా అంటున్నారనుకోండి... నాకు సంబంధం లేకపోయినా కారు దిగి ఆ సంగతేంటో తేల్చుకునే వెళతాను. ఎందుకంటే, ‘ఇది నా దేశం.. నేను భారతీయుణ్ణి’ అని ఫీలవుతా. చాలామంది ఫీలవ్వరు. నా ఫీలింగ్‌ని సెన్సేషనలిజమ్ అంటున్నారంటే.. ఏమనాలో నాకు తెలియడంలేదు.
అవునూ మీ ఇంటి చుట్టూ ఈ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏంటి?
తేజ: కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నానని ప్రకటించగానే కొడుకునో, కూతురినో హీరో హీరోయిన్ చేసేయాలనే తాపత్రయంతో గేట్లు దూకి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇద్దరు లేడీస్ అయితే చీరలతో దూకేశారు. కాలో, చెయ్యో విరుగుతుందని మా భయం. అందుకే ఈ ఫెన్సింగ్. నేను కూడా సాఫ్ట్‌గా కాకుండా రూడ్‌గా మాట్లాడటం మొదలుపెట్టాను. ఎందుకంటే, ఓ 40వేల అప్లికేషన్స్ వస్తుంటాయి. వాళ్లల్లో నటన వచ్చినవాళ్లు 70మందే ఉంటారు. మిగతావాళ్లంతా ఏదో ఇస్తానంటున్నాడు కదా అని ఓ అప్లికేషన్ పడేస్తుంటారు. అదే తేజ రూడ్‌గా మాట్లాడతాడు.. కొడతాడు.. ఇంతకుముందు మీరన్నట్లు దురుసుగా మాట్లాడతాడనే ఫీలింగ్ ఏర్పడిందనుకోండి.. అప్పుడు ఇంతమంది ట్రై చేయరు. సిన్సియర్‌గా పైకి రావాలనుకున్నవాళ్లే వస్తారు.
ఇంతకుముందు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘బార్న్ ఫైటర్’ ని అన్నారు. అసలేంటి మీ ఫ్లాష్‌బ్యాక్?
తేజ: నాకు మూడేళ్లప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ పోయిన బాధలో నాన్న తాగడం మొదలుపెట్టారు. అంతకుముందు అలవాటు ఉండేదేమో.. అమ్మ పోయిన తర్వాత ఎక్కువైంది. అలా అలా... రోడ్డుకొచ్చేశాం. ఆ తర్వాత నాన్నగారు కూడా చనిపోయారు. దాంతో మమ్మల్ని మా బంధువులు పంచుకున్నారు.
మీ తోబుట్టువులు ఎంతమంది?
తేజ: అక్కా, నేను, చెల్లి. నాన్న చనిపోయిన తర్వాత మా ముగ్గుర్నీ బంధువులు పంచుకున్నారు. ముగ్గురం మూడు ఇళ్లల్లో పెరిగాం. ఆ ముగ్గురికీ పడకపోతే మేం మాట్లాడుకోకూడదు. ఒక్కోసారి మా అక్క నాకు శత్రువులా అనిపించేది. ఇంకోసారి ఫ్రెండ్‌లా. మేం ఎవరింట్లో ఉన్నామో వాళ్లందరూ కలిస్తే మేం కలిసేవాళ్లం. లేకపోతే లేదు.
మీ ముగ్గుర్నీ మీ బంధువులు బాగా చూసుకునేవాళ్లా?
తేజ: మా అక్క మా అత్తయ్యగారింట్లో, చెల్లి మా బాబాయ్ వాళ్లింట్లో ఉండేవాళ్లు. చెల్లిని పోషించలేక బాబాయ్ వాళ్లు స్త్రీ సేవామందిర్ అని అనాథ శరణాలయంలో చేర్చారు. నేను ఇంకో బాబాయ్ ఇంట్లో ఉండేవాణ్ణి. కొన్నిరోజుల తర్వాత ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశా. మా నాన్నగారు చనిపోయినప్పుడు, ‘‘నీకేదైనా సమస్య వస్తే నా దగ్గరకు రా’’ అని మా పెద్దనాన్న అన్నారు. అది మనసులో పెట్టుకుని ఆయన దగ్గరకు వెళితే, ‘‘ఏదో మాట వరసకంటే వచ్చేస్తావా?’’ అనడిగారు. దాంతో వెనక్కి వచ్చేశా. అప్పట్నుంచి జీవన పోరాటం మొదలైంది.
అప్పుడు మీ వయసెంత?
తేజ: వయసు గుర్తు లేదు. టైమ్, డేట్ అన్నీ అప్పట్లో కడుపుతోనే కనెక్షన్. కడుపు నిండితే ఒక రోజు ముగిసినట్లు అనుకున్నాను.
అసలు మీరెంతవరకు చదువుకున్నారు?
తేజ: నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లో. కానీ తెలుగువాళ్లమే. చెన్నయ్‌లో బాల గురుకుల్‌లో చదువుకున్నాను. ముందు నర్సరీలో చేర్చారు. ఫస్ట్ స్టాండర్డ్ చదివా. సెకండ్ చదవలేదు. థర్డ్, ఫోర్త్ చదివాను. ఫిఫ్త్, సిక్త్స్ చదవలేదు. సెవెన్త్ చదివాను. ఎయిత్ మధ్యలో మానేశాను. ఏదో మామూలుగా చదువు సాగింది. కాకపోతే ఇంగ్లిష్ మీడియమ్ కాబట్టి, ఇంగ్లిష్ బాగా వచ్చింది. అలాగే చాలా పుస్తకాలు చదివేవాణ్ణి.
మీ నాన్నగారు ఏం చేసేవారు? ఆయన ఉన్నంతవరకు ఆర్థికంగా బాగుండేదా?
తేజ: నాన్న ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసేవారు. కొన్నాళ్లు బాగానే ఉంది. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. మూడోక్లాస్ చదివేటప్పుడు అందరూ లంచ్ తింటుంటే, మేం ముగ్గురం మా లంచ్ బాస్కెట్ కోసం స్కూల్ బయట వెయిట్ చేసేవాళ్లం. నాన్న పంపిస్తే తినేవాళ్లం. లేకపోతే మంచినీళ్లు తాగేవాళ్లం. నాన్న ఏదైనా ఊరెళ్లినప్పుడు.. మా ముగ్గుర్నీ ఒకింట్లో ఉంచేవారు. వాళ్లకి డబ్బులిచ్చి వెళ్లేవారాయన. ఆ డబ్బులైపోయేవరకూ మాకు ఫుడ్ పెట్టేవాళ్లు. నాన్న ఊరి నుంచి వచ్చేవరకు స్కూల్ ఫీజు కూడా కట్టేవాళ్లం కాదు. ఎవరెవరు ఫీజు కట్టలేదని క్లాస్‌లో అడిగితే, మేం ముగ్గురూ దాక్కునేవాళ్లం. అప్పట్లో ఇంత విరివిగా ఫోన్లు లేవు కదా. మా నాన్న మనియార్డర్ పంపిస్తారని వెయిట్ చేసేవాళ్లం. రోజూ పోస్టాఫీస్ దగ్గరకు వెళ్లేవాళ్లం. ‘నిన్న నేను అడిగాను కదా.. ఇవాళ నువ్వు అడుగు..’ అంటూ వంతులు వేసుకుని పోస్ట్ మాస్టర్‌ని మనీయార్డర్ గురించి అడిగేవాళ్లం. కొన్ని రోజులు తర్వాత మేం కనపడగానే ‘ఇవాళ మనీయార్డర్ రాలేదు’ అని చెప్పేవాళ్లు.
మీ పెద్దనాన్న ఎందుకొచ్చావన్న తర్వాత ఏం చేశారు?
తేజ: కొన్నాళ్లు లారీలు తుడిచా. అలా... రకరకాల పనులు చేసి, చివరికి ఫిలిం రిప్రజెంటేటివ్‌గా చేశాను. 1983, 1984ల్లో అది చేసిన తర్వాత కెమెరామేన్ రవికాంత్ నగాయిచ్‌గారి దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా చేరా. ఒక్క ఎంజీఆర్ తప్ప శివాజీగణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్... ఇలా మద్రాసులో అందరి హీరోలతో సినిమాలు చేశాను. తెలుగులో కూడా చాలామంది హీరోల సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత మహీధర్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. అక్కణ్ణుంచి అసిస్టెంట్ డెరైక్టర్ అయ్యా. ఆ తర్వాత పబ్లిసిటీ డిజైనర్‌గా చేశా.
బాగుంది.. మరి కెమెరామేన్‌గా ఎప్పుడు మారారు?
తేజ: ‘రాత్రి’ సినిమాతో మారాను. అంతం, మనీ, రక్షణ, తీర్పు.. తెలుగులో చేసినవి ఇవే. ఆ తర్వాత ముంబయ్ వెళ్లి 30 సినిమాలకు కెమెరామేన్‌గా చేశాను. శతృఘ్న సిన్హా, ధర్మేంద్ర, గోవిందా, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ ఇలా చాలామందితో సినిమాలు చేశాను.
డెరైక్టర్ అయిన తర్వాత బాలీవుడ్ నుంచి మీకు ఆఫర్స్ రాలేదా?
తేజ: అక్కడి హీరోలు ఆఫర్స్ ఇస్తుంటారు. ఇక్కడో విషయం చెప్పాలి. తెలుగు హీరోల యాటిట్యూడ్‌తో పోల్చితే బాలీవుడ్ హీరోలు మహాత్మా గాంధీలాంటివాళ్లు. అక్కడ హీరో, డెరైక్టర్, కెమెరామేన్ కలిసి భోజనం చేస్తారు. తెలుగులో ఒకప్పుడు అలా ఉండేది. రామారావుగారు కూడా అందరితో పాటే కలిసి భోజనం చేసేవారట. కానీ, ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హీరో ఒక కారవాన్, హీరోయిన్ మరో కారవాన్‌లో ఉంటారు. ఒక ఫ్యామిలీలా ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అంటే కొంచెం చులకన. ఒక్క మ్యూజిక్ డెరైక్టర్‌కి, డెరైక్టర్‌కి తప్ప మిగతా టెక్నీషియన్స్‌కి విలువ ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే డెరైక్టర్ కూడా సెకండరీయే. హీరోనే ముందు. ఇక్కడి హీరోల్లో చాలామందికి తమ సినిమాకి పని చేస్తున్న ఆర్ట్ డెరైక్టర్ ఎవరో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి.
మరలాంటప్పుడు బాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యారు?
తేజ: త్వరలో వెళ్లిపోతానంటూ నాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం నచ్చదు. కానీ హిందీ సినిమాలు చేసే ఉద్దేశం ఉంది. బాలీవుడ్ హీరోలు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికొస్తారు. నేను కూడా అప్పుడప్పుడూ వాళ్లు చేసే సినిమాల కథాచర్చల్లో పాల్గొని, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెబుతుంటా.
ఆకలి బాధ ఎలా ఉంటుందో చిన్నప్పుడే చూశా అన్నారు కదా... ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది?
తేజ: నా చిన్నప్పుడు ప్లేట్‌మీల్స్ రూపాయి డెబ్భై అయిదు, ఫుల్ మీల్స్ రెండు రూపాయల ఇరవైపైసలుండేది. మెస్‌లో నెలకి సరిపడా టోకెన్స్ కొనుక్కునేవాళ్లుంటారు. వాళ్ల చేతిలో టోకెన్ బుక్ చూడగానే, లైఫ్‌లో ఎప్పటికైనా ఫుల్ టోకెన్ బుక్ కొనుక్కుని, స్టయిల్‌గా టోకెన్ చింపి ఇవ్వాలనుకునేవాణ్ణి. ఇంకోటేంటంటే మా కెమెరామేన్‌గారింటికి వెళ్లాలంటే బస్సులో టికెట్ కొనుక్కోవడానికి డబ్బులుండేవి కాదు. ఎక్కడికెళ్లినా కాలినడకనే. దాంతో ఎప్పటికైనా సైకిల్ కొనుక్కోవాలనుకునే లక్ష్యం ఉండేది. మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పటికీ మా ఇంట్లో ఓ సైకిల్ ఉంది.
మీరనుకున్నట్లు సైకిల్ కొనుక్కున్నారు. ఆ తర్వాత కార్లు కూడా కొనుక్కున్నారు కాబట్టి ఇదంతా ఆ దేవుడి వల్లే అనుకుంటారా? అసలు దేవుణ్ణి నమ్ముతారా?
తేజ: దేవుణ్ణి నమ్మడం అనేది నా సౌకర్యాన్నిబట్టే. కంట్రోల్ చేసుకోలేనంత ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రొఫెషనల్‌గా గుర్తు రాలేదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా దేవుణ్ణి ఏమీ అనుకోలేదు. దేవుడా.. ఫలానా హీరో డేట్స్ ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను దేవుణ్ణి బాగా నమ్ముకున్నది మా రెండో అబ్బాయికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే. కానీ వాడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. దాంతో ఆ దేవుడు గుర్తు రావడంలేదు.
అంటే.. దేవుడి మీద నమ్మకం పోయిందా?
తేజ: నమ్మకం కాదు.. అవసరంపోయింది.
ఆ బాబుకి చికిత్స చేయించడానికి చాలా ఊళ్లు వెళ్లారట. అసలు ప్రాబ్లమ్ ఏంటి?
తేజ: పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏదో మిస్టేక్ వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఏదైతే అయ్యిందనుకుని ఏ దేశమైనా వెళ్లి చికిత్స చేయించాలనుకున్నాను. చైనా, జర్మనీ తీసుకెళ్లాం. జర్మనీలో నా భార్య, కూతురు నెలన్నర ఉన్నారు. ఆ తర్వాత చైనాలో చికిత్స జరిగింది. కోలుకుంటున్నట్లే కనిపించాడు. ఇక.. ఫర్వాలేదు అనుకుంటున్న సమయంలో ఓ రోజు దగ్గి, పడిపోయాడు. అంతే..
చాలా చిన్నప్పుడు అమ్మా నాన్న.. ఇప్పుడు కన్న కొడుకు దూరమయ్యాడు. ఈ రెంటినీ ఎలా తట్టుకున్నారు?
తేజ: మా అమ్మ చనిపోయినప్పుడు నాకు మూడేళ్లట. దాదాపు ఏడాదిన్నర ఆవిడ కోసం ఏడ్చానట. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడుపు రాలేదు. ఒకే ఒక్కసారి మద్రాసులో నేను రోడ్డు మీద పడుకున్నప్పుడు ఏదో జరిగితే ఏడెనిమిది కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ ఏడ్చాను. ఆ తర్వాత ఎప్పుడూ ఏడవలేదు. మా అబ్బాయి మరణం అంటారా.. ఆ బాధను మాటల్లో చెప్పలేను.
దేవుణ్ణి అవసరాన్ని బట్టి నమ్ముతానన్నారు. కానీ స్వామీజీలను నమ్ముతారేమో. ఓసారి మీ ఇంటికి నిత్యానంద వచ్చినట్లున్నారు?
తేజ: మా అబ్బాయికి వంట్లో బాగాలేనప్పుడు నిత్యానందస్వామిని నా భార్య ఇంటికి తీసుకు వచ్చింది. లక్ష రూపాయలివ్వమన్నారు. కానీ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో ‘స్వామీజీకిచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. లెంపలేసుకోండి. ఎకౌంట్‌లో డబ్బులు వేయండి’ అని చెప్పింది మా ఆవిడ. నేను మర్చిపోతే రెండోసారి కూడా చెక్ బౌన్స్ అయ్యింది. మూడోసారి ఎకౌంట్‌లో డబ్బులేద్దామని వెళుతుండగా, నిత్యానందను అరెస్ట్ చేశారని టీవీల్లో వచ్చింది. నాకు లక్ష మిగిలింది. మా అబ్బాయిని బాగు చేస్తాడేమోనని తనని ఇంటికి తీసుకొచ్చా. ప్రతి మనిషికి ఒక ‘వీక్ సిట్యుయేషన్’ ఉంటుంది. ఆ సమయంలో చుట్టూ ఉన్నవాళ్ల ప్రోద్బలంతోనో, మన మనసు వీక్ అయ్యో.. అవతలివైపు వ్యక్తికి ఆ పవర్ లేకపోయినా ఉన్నట్లనిపిస్తుంది.
చెక్ బౌన్స్ అయ్యిందని మీరే అన్నారు. మీ సినిమాకి పని చేసేవాళ్లల్లో చాలామందికి సరిగ్గా పారితోషికం ఇవ్వరట?
తేజ: శ్రమపడేవాళ్లకి తప్పకుండా ఇస్తాను. పడనివాళ్లకి ఎందుకు ఇవ్వాలి? ఉదాహరణకు, మీకు యాక్టింగ్ రాదు.. శ్రమపడి నేను యాక్టింగ్ నేర్పిస్తా. మరి.. మీరు నాకేం ఇస్తున్నారు. నితిన్‌ని హీరోని చేశాను. 11 వేలు ఇచ్చాను. గోపీచంద్‌తో విలన్‌గా చేయించాను. 11వేలు ఇచ్చాను. సదాకి 11వేలు ఇచ్చాను. ఇక, ఎవరికి ఇవ్వలేదో తెలియడంలేదు.
ఈ 11వేల సెంటిమెంట్ ఏంటండి? ఆ పారితోషికం అందుకున్నవాళ్లు ఎక్కడికో వెళ్లిపోతారట కదా?
తేజ: అట..! సూపర్‌స్టార్లు, కోటీశ్వర్లు అవుతారట. నాకూ తెలియదు. బొంబాయిలో అడ్వాన్స్ 11వేలు, లక్షాపదకొండు వేలు.. అలా ఇస్తుంటారు.
అదే మీరూ ఫాలో అవుతున్నారన్నమాట.
తేజ: ‘చిత్రం’ సినిమా అప్పుడు నాకు, రసూల్‌కి, ఉదయ్‌కిరణ్‌కి, రీమాసేన్‌కి 11 వేలు అని ఫిక్స్ చేశా. అయిదువేల అయిదువందలు ఇచ్చినవాళ్లకి కలిసి రాలేదు. అది కూడా అందరూ చెప్పడం తప్ప నాకు తెలియదు.
ఇప్పుడు నితిన్‌వాళ్లతో మీ అనుబంధం... మళ్లీ తనతో సినిమా చేసే ఆలోచన ఉందా?
తేజ: ఇప్పుడు మేం బాగానే ఉన్నాం. నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డిగారు సినిమా చేద్దామని అడుగుతుంటారు. ిహ ట్‌లో ఉన్నవాళ్ల దగ్గరికి అస్సలు వెళ్లను. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో! ఎందుకంటే వాళ్ల యాటిట్యూడ్ వేరేలా ఉంటుంది. నితిన్ ఎప్పుడైతే కథను నమ్మడం మొదలుపెట్టాడో అప్పుడు హిట్లొచ్చాయి. తనతో సినిమా చేయకూడదని ఏమీ లేదు... చేయాలనే తపనా లేదు.!
మీ జనరేషన్ డెరైక్టర్స్‌లో మీరు బాగా రిచ్ అంటారు. అసలు కోట్లు సంపాదిస్తానని ఎప్పుడైనా అనుకున్నారా?
తేజ: అనుకోలేదు. ఇప్పుడు నేనుంటున్న ఇలాంటి పెద్ద ఇళ్లను మద్రాసులో చూసినప్పుడు, ఆ ఇంటి తాలూకు అవుట్‌హౌస్‌లో ఉంటే చాలనుకున్నాను. కానీ ఏకంగా పెద్ద ఇంట్లోనే ఉంటున్నాను. అందుకే మా వాచ్‌మన్ ఉండే రూమ్‌కి కూడా మంచి మార్బుల్ వేయించా. సంపాదించేసిన తర్వాత మాట్లాడుతున్నానని అనుకోవద్దు. డబ్బుతో సంతృప్తి రాదు. సమస్యలు వస్తాయి. మినిమమ్ డబ్బులుండాలి. డబ్బున్నా లేకపోయినా సంతృప్తి ముఖ్యం. నేను మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. అయినా చాలా ఆనందంగా ఉన్నా. ఒకప్పుడు వందల రాత్రులు ఫుట్‌పాత్ మీద పడుకున్నాను. కప్పుకోవడానికి దుప్పటి లేకపోతే న్యూస్‌పేపర్లు కప్పుకున్నా. అలాంటి జీవితాన్ని చూశాను. అందుకే ఉన్న డబ్బుతో సంతృప్తిపడతాను. ప్రయోగాలు చేసి, డబ్బులు పోగొట్టుకోవడానికి వెనకాడను.
ఆర్థికంగా సేఫ్ అయ్యారు కాబట్టే ప్రయోగాలు చేయడానికి వెనకాడటంలేదేమో?
తేజ: అలా ఏం లేదు. ‘జయం’ అప్పుడు నా దగ్గర ఏముంది? రిస్క్ చేశాగా.
అప్పుడు మీరు సింగిల్.. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా.. మరి భయం ఉండదా?
తేజ: అస్సలు లేదు. ఎప్పుడైనా సరే రోడ్డు మీద నిలబడటానికి రెడీగా ఉండండని నా వైఫ్, పిల్లలతో చెప్పేశా. ‘‘నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటా. పెద్దయిన తర్వాత రూపాయి ఇవ్వను. నేను సొంతంగా సంపాదించుకున్నాను. మీరూ అంతే. ఒకవేళ నేను ప్రయోగాలు చేసి, మొత్తం డబ్బు పోగొడితే, అప్పుడు నన్ను కూడా మీరే చూసుకోవాలి’’ అని మా పిల్లలకు క్లియర్‌గా చెప్పేశాను.
మరి.. ఆవిణ్ణి మీరెలా చూసుకుంటున్నారు?
తేజ: తన వల్ల నాకే ప్రాబ్లమ్ లేదు. నాతో కాపురం చేయడం మాత్రం కష్టమేనండి. దాదాపు మూడీగానే ఉంటాను. తినాలనిపిస్తే తింటాను. లేకపోతే లేదు. ఎప్పుడేం చేస్తానో తెలియదు. మా ఆవిడవాళ్లు బిగ్ షాట్స్. మొదట్లో ఓ రెండు ఫంక్షన్స్‌కి తీసుకెళ్లింది. అందరూ సూట్, కోట్ వేసుకుని హంగామాగా ఉంటే, నేనేమో సాదాసీదాగా వెళ్లాను. నలుగురిలో కలవను. దాంతో ‘‘ఇకనుంచి నన్ను పిలవొద్దు. నువ్వు కావాలంటే వెళ్లు’’ అని చెప్పేశా. కాబట్టి తనే వెళుతుంటుంది. నా స్టయిల్ తనకు అలవాటైపోయింది.
మీ అబ్బాయి డెరైక్షన్ కోర్స్ చేస్తున్నాడట. అది మీ సలహానా?
తేజ: నా పిల్లలకు సలహాలివ్వను. బాగా చదువుకోమని కూడా చెప్పను. మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచించుకోవాలని చెబుతాను. డెరైక్షన్ కోర్స్ చేయడానికి అబ్రాడ్ వెళతానంటే రూపాయి కూడా ఇవ్వలేదు. అస్సలు సపోర్ట్ చేయనని కూడా చెప్పేశాను. నా సిస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లాడు. నేను టికెట్ కూడా కొనివ్వలేదు.
విచిత్రంగా ఉంది. ఎలాగూ మీరు కష్టాలు పడ్డారు కదా. మరి మీ పిల్లలు కూడా కష్టపడాలనుకోవడమేమిటి?
తేజ: నేను కష్టపడి పైకొచ్చాను. నా పిల్లలు కూడా అలానే రావాలి. కష్టపడితేనే సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతారని నా ఫీలింగ్!
పిల్లలకు తల్లిదండ్రులేదైనా చేస్తేనే కదా.. వాళ్లూ ధైర్యంగా ముందుకెళతారు?
తేజ: ఫుడ్ పెడతాం. బట్టలు, నీడ ఇస్తాం. కల్చర్ నేర్పిస్తాం. పద్ధెనిమిది, ఇరవయ్యేళ్లు వచ్చేవరకే ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత వాళ్ల భవిష్యత్తును వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. ఏ అలవాట్లు చేసుకోవాలి, ఏవి చేసుకోకూడదని వాళ్లే తెలుసుకోవాలి. ఇది రైట్, అది రాంగ్ అనే జ్ఞానం మాత్రమే మనం ఇవ్వాలి. ఆలోచనా విధానాన్ని నేర్పాలి కానీ మనమే ఆలోచించి ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇవ్వకూడదు. అయినా, మా అబ్బాయి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది.
మీరెంతోమందిని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశారు కదా.. వాళ్లందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారా?
తేజ: అడుక్కునేవాడికి అందరూ రూపాయి ఇస్తే, మీరు వంద రూపాయలు ఇచ్చి, ఆ మర్నాడు సిగ్నల్ దగ్గర మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే తప్పు మీదవుతుంది. కృతజ్ఞతగా ఉండాలని ఆశించడం తప్పు. అడిగారు కాబట్టి చెబుతున్నా. కుల, మతాలు ప్రాంతాలకు అతీతంగా నేను 397మందిని పరిచయం చేశాను. అందులో విశ్వాసం, ఓ పద్దతి ఉండేవాళ్లు ఆర్టిస్టుల్లో ఓ ఆరేడు మంది ఉంటారేమో. నవదీప్, సుమన్‌శెట్టి, వేణు, కాజల్, సదా, రీమాసేన్, ఈ మధ్య పరిచయం చేసిన ప్రిన్స్... వీళ్లంతా బాగుంటారు. ఇక పెద్ద ఆర్టిస్టుల్లో తనికెళ్ల భరణిగారు, ధర్మవరపు, తెలంగాణ శకుంతల.. వీళ్లు నాకేదైనా సమస్య వస్తే వెంటనే వచ్చేస్తారు. సుమన్‌శెట్టిలో గొప్పతనం ఏంటంటే.. తను ఇల్లు కట్టుకున్నాక, ‘‘మీ వల్లే పైకొచ్చాం.. మీ ఋణం ఏ విధంగా తీర్చుకోవాలి’’ అని సుమన్‌శెట్టి, వాళ్ల నాన్న అంటే.. ‘‘నాకేం వద్దు. కానీ నేను కొత్తవాళ్లతో సినిమాలు తీస్తుంటాను. ఎప్పుడైనా రోడ్డుమీదికొచ్చేస్తానేమో. నాకోసం మీ ఇంట్లో ఒక గది కట్టించండి చాలు..’’ అన్నాను. ఇప్పటికీ వాళ్లింట్లో నాకోసం ఓ గది ఉంది. ఇక విశ్వాసం లేనివాళ్లంటే... ఇద్దరు హీరోలున్నారు... పేర్లు అనవసరం!
మరి.. మీకు అవకాశాలిచ్చినవాళ్ల దగ్గర మీరెంత కృతజ్ఞతగా ఉంటారు?
తేజ: అక్కినేని వెంకట్‌గారు ఇప్పుడు పిలిస్తే వెళ్లిపోతాను. రామోజీరావుగారు పిలిచి సినిమా చేయమంటే చేసేస్తాను. రామ్‌గోపాల్‌వర్మకు నా అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ అవసరమైతే ఇల్లు అమ్మయినా రాము దర్శకత్వంలో నేను సినిమా నిర్మిస్తా!
రజనీకాంత్‌తో ప్లాన్ చేసిన ‘రైతు’ సినిమా ఏమైంది?
తేజ: రజనీకాంత్‌తో కథాచర్చలు కూడా జరిగాయి. ఆయన క్లయిమాక్స్ వేరే రకంగా మార్చమన్నారు. ఆ తర్వాత ఆయన్ను కలవడం మానేశాను.
మామూలుగా అంత పెద్ద హీరో అడిగితే ఏ దర్శకుడైనా కాదనరు. మీరెందుకంత పట్టుదలగా ఉంటారు?
తేజ: సినిమాకి హీరో కాదు కథ ముఖ్యం. ఒక కథ వల్ల ఓ యాక్టర్ స్టార్ అవుతాడు. స్టార్ వల్ల స్టోరీ హిట్ అవ్వదు. రజనీకాంత్ నటించిన ‘బాబా’ని తీసుకోండి. ఆ సినిమాలో ఉన్నది స్టారేగా. కానీ ఏమైంది? అమితాబ్‌బచ్చన్, చిరంజీవి, బాలకృష్ణగార్లకు ఎన్ని ఫ్లాపులున్నాయో తెలుసు. ఓన్లీ స్టోరీయే హీరో. అది ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాలి.
భాషాభేదం లేదని, కులమతాలకు అతీతం అని, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమందిని పరిచయం చేశానని అన్నారు. సినిమాల్లో పరిచయం సంగతి సరే.. రియల్ లైఫ్‌లో కూడా ప్రాధాన్యం ఇవ్వరా?
తేజ: లేదు. మా పిల్లల స్కూల్ ఫామ్‌లో క్యాస్ట్ ఫిల్ చేయను. ఇంటి పేరు కూడా ఎక్కడా చెప్పను. మా అబ్బాయి పేరు అమితవ్, అమ్మాయి పేరు అలియా. అమితవ్‌తేజ, అలియాతేజ అని చెప్పుకుంటుంటారు. నా డ్రైవింగ్ లెసైన్స్, డెబిట్ కార్డ్స్.. ఏ కార్డులోనూ ఇనిషియల్ ఉండదు. ఐయామ్ యాన్ ఇండియన్... దట్సాల్!
- డి.జి. భవాని
కొట్టామని పబ్లిసిటీ చేశాం...కొట్టినదానికన్నాఎక్కువ పబ్లిసిటీ వచ్చింది!!
స్కూల్ పిల్లలను అస్సలు కొట్టకూడదు. ఏమీ తెలియని వయసు వాళ్లది. వీళ్లు బడితల్లా ఉంటారు. పాతికేళ్లుంటాయి. యాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో వచ్చి, ఇన్‌వాల్వ్‌మెంట్ లేకుండా చేసేవాళ్లని ఏమనాలి? కొంతమంది యాక్టర్స్ ఉన్నారనుకోండి. తెలియని గీతేదో పెట్టుకుంటారు. అది దాటితే వాళ్లల్లో అద్భుతమైన యాక్టర్ ఉంటాడు. దాటించడానికి కొంతమందిని బతిమాలాలి, కొంతమందిని తిట్టాలి, మరికొంతమందిని పుష్ చెయ్యాలి. ఈ ఫుషింగ్‌లో కూడా తేడా ఉంటుంది. కొంతమంది చెప్పగానే చేసేస్తారు. సదా ఉందనుకోండి.. చెప్పగానే చేసేది. కాజల్ చేసేది కాదు. ఓ సీన్లో కాజల్ ఏడవాలనుకోండి.. వాళ్ల అమ్మమ్మ చనిపోయిన సంఘటనను వాళ్ల అమ్మ గుర్తు చేస్తే అప్పుడు ఏడ్చింది. అనిత మంచి ఆర్టిస్ట్. అయితే ‘నువ్వు నేను’ చేస్తున్నప్పుడు ఓ పర్టిక్యులర్ సీన్‌లో తను ఏడవాలి. ఏడుపు రావడం లేదంది. మాకేమో లైట్ పోతోంది. ఒకటి కొడతాను.. చేస్తావా అంటే ఓకే అంది. ఒక్కటిచ్చాను. ఏడ్చేసింది. సీన్ తీశాం. అలా కొట్టామని పబ్లిసిటీ చేశాం. కొట్టినదానికన్నా పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది.
మీది లవ్‌మ్యారేజ్ అట. మీ పెళ్లి ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని వినికిడి. వివరంగా చెబుతారా?
తేజ: మా వైఫ్ వాళ్ల అన్నయ్య, నా చెల్లెలు మద్రాస్‌లో క్లాస్‌మేట్స్. ఆ విధంగా తనతో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. దానికి నా భార్య సైడ్‌వాళ్లు ఒప్పుకోలేదు. మనకు ఇక్కడ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. క్యాస్ట్ మాత్రమే కాదు.. అప్పటికి నాది మామూలు స్థాయి. కెమెరామాన్‌గా ఫస్ట్ సినిమా ‘రాత్రి’ ఇంకా విడుదల కాలేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఉండే మగాళ్లను అస్సలు నమ్మరు. ఆ మాటకొస్తే ఆడవాళ్లనూ నమ్మరు. నా వైఫ్‌వాళ్లు సుబ్బిరామిరెడ్డిగారికి బంధువులు. ఆ పక్కిల్లు అక్కినేని నాగేశ్వరరావుగారిది. ఆ విధంగా అక్కినేని వెంకట్‌గారు, ఆయన మిసెస్ జ్యోత్స్నగారు ‘కుర్రాడు మంచోడు. మా స్టూడియోలో పని చేశాడు’ అని చెప్పారు. కానీ, ‘ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు.. కారు కూడా లేదు’ అని వాళ్లన్నారు. అప్పటికి సొంత ఇల్లేం ఖర్మ నాకు అద్దె ఇల్లు కూడా లేదు. వర్మ కార్పొరేషన్ ఆఫీసులో ఉండేవాణ్ణి. వెంటనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని, కారు కొని, ఓ మంచం కొని, ఏసీ కూడా కొన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కోసం ఇన్ని త్యాగాలు చేశాననుకోవద్దు. నన్ను నేను తగ్గించుకోలేదు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని పట్టుదల పట్టాను కదా. అది కూడా మొండితనమే. ఆ మొండి పట్టుదలను నెరవేర్చుకోవడం కోసం అవన్నీ చేశాను. ఇప్పటికీ నా మిసెస్ తరఫువాళ్లు ‘‘బాగున్నాడా.. కరెక్ట్‌గానే ఉంటున్నాడా’’ అని ఫోన్ చేసి అడుగుతుంటారు (నవ్వుతూ).