పిల్లల భవిష్యత్తు పెద్దల చేతుల్లో ఉంటుంది. అయితే హీరో షారుక్ ఖాన్.. మానవాళి భవిష్యత్తునే ఓ చిన్నారి చేతుల్లో పెట్టేశాడు! ఏంటా స్టోరీ? స్టోరీ కాదు.. సినిమా కథ కాదు. గీతాంజలీరావు అనే బాల సైంటిస్టుకు ఆయనిచ్చిన ప్రశంస.
దేశంలో మనుషులు ఉన్నట్లుగా లేదు! కాలుష్యం మాత్రమే ఉన్నట్లుంది. ఢిల్లీ చూడండి. చూడాలా! చూడ్డానికి ఏం కనిపిస్తుంది? అంతా కాలుష్యమేగా. ఢిల్లీ ఒకటే కాదు.. దేశమంతటా గాలి కలుషితమైపోతోంది. నీరు కలుషితమైపోతోంది. గాలీ నీరు మాత్రమేనా.. టోటల్‌గా పంచభూతాల్లోని స్వచ్ఛతే ఫినిష్ అయిపోతోంది. మనిషా మజాకా! ఇంతటి కాలుష్య దేశాన్ని తీసుకెళ్లి.. పదమూడేళ్ల లేత చేతుల్లో పెట్టేశాడు షారుక్ ఖాన్. ‘‘తల్లీ.. మా భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉంది’’ అని ఆ చిన్నారికి ప్రణామాలు కూడా అర్పించాడు. ఆయుక్షీణం కాదా.. చిన్నపిల్లను ‘నమో నమామీ’ అనడం?! చిన్నపిల్ల అయితే మాత్రం? ఛేదించింది, సాధించిందీ తక్కువ విషయమా! తాగునీరు ఎంత శాతం సీసంతో కలుషితం అయిందో తెలుసుకునే పరికరాన్ని ఆ అమ్మాయి కనిపెట్టింది.
ఈపీఎ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ–యు.ఎస్) లెక్కల ప్రకారం తాగే నీటిలో జీరో శాతం మాత్రమే సీసం ఉండాలి. అంటే అస్సలు ఉండకూడదు. మనిషికి హాని చేసే రసాయన మూలకం సీసం. అయితే నీటిలో సీసం ఉండకుండా పోదు. ప్రకృతి సిద్ధంగానే నీటితో కలిసి వస్తుంది. మరీ ఎక్కువ మోతాదుల్లో ఉంటే దేహంలోని ప్రతి అవయవాన్నీ కబళిస్తుంది. తాగే నీటిలో సీసం .24 మైక్రో మోలార్స్ వరకు ఉండొచ్చు. అంతకు మించితే ప్రమాదం. నేరుగా దొరువుల నుంచి, చెరువుల నుంచి, బావుల నుంచి కాకుండా క్యాన్‌లే ఇంటిముందుకు దిగే కాలంలోకి వచ్చిపడ్డాం కనుక.. ప్లాంట్ నుంచి వచ్చే ఆ నీటిలోంచి ముందే సీసాన్ని తొలగిస్తారు. తొలగించాం అంటారు కానీ నిజంగా తొలగించారా లేదా ఇంట్లోనే తెలుసుకోవాలంటే ఇదిగో.. ఈ గీతాంజలి కనిపెట్టిన పరికరం ఉపయోగపడుతుంది.
పోర్టబుల్ డివైజ్ అది. ‘టెథిస్’ అని పేరు పెట్టింది గీతాంజలి ఆ పరికరానికి. టెథిస్ అనేది గ్రీకు పురాణాల్లోని ఒక సముద్రం పేరు. ‘స్వచ్ఛమైన జలం’ అని ఇంకో అర్థం. టెథిస్‌ను నీటికి తాకిస్తే చాలు మొబైల్‌కి కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో ఎంత మోతాదులో సీసం ఉన్నదీ ఫోన్ స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది. టెథిస్ ఫార్ములాను ఏదైనా కంపెనీ తీసుకుని ఉత్పత్తి మొదలుపెట్టి, మార్కెట్‌లోకి తీసుకురావడమే ఆలస్యం. ధర కూడా ఎంతో ఉండదని గీతాంజలి చెబుతోంది. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ కాబట్టట. ఎక్కడో ముంబైలో ఉండే షారుక్‌కీ, ఇంకెక్కడో కొలరాడోలో ఉండే గీతాంజలికీ ఎలా కలిసినట్లు? నవంబర్ 2 షారుక్ బర్త్ డే. ఆయన పుట్టిన రోజుకు గీతాంజలి యు.ఎస్.
నుంచి ఇండియా వచ్చి ఆయన్ని కలిసిందా? లేదు. నవంబర్ రెండునే స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా–సీజన్ 2.. నయీ బాత్’ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రసారం అవుతుండే ఈ ‘టెక్నాలజీ – ఎంటర్ టైన్‌మెంట్ – డిజైన్’ టాక్ షోకి వ్యాఖ్యాత షారుక్ ఖాన్. ఆ షోలో గెస్ట్ స్పీకర్ గీతాంజలీ రావు. అలా గీతాంజలికి షారుక్‌ని కలిసే అవకాశం వస్తే.. గీతాంజలిని కలిసే భాగ్యం తనకు దక్కిందని షారుక్ సంతోషపడిపోయారు. ఆ చిన్నారి కనిపెట్టిన పరికరం గురించి తెలుసుకుని ‘‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’’ అని మురిసిపోయాడు. గీతాంజలి, ఆమె తల్లిదండ్రులు యు.ఎస్‌లో ఉంటారు. కొలరాడో లోని లోన్ ట్రీలో 2005లో పుట్టింది. ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది.
కొత్తకొత్త విషయాలను కనుక్కోవడంపై ఆసక్తి. జెనిటిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఆశట! ఉద్యోగాల్లో స్త్రీ–పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాల మీద కూడా ఇప్పటికే చిన్న ప్రసంగం కూడా ఇచ్చేసింది. షారుక్ అన్నట్లు మానవాళి భవిష్యత్తు ఇలాంటి పిల్లల చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. సమాజంలోని అన్ని కాలుష్యాలనూ హరించగల జ్ఞానం, వివేకం ఉన్న బాలల్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, వాళ్ల ఆలోచనల్నుంచి గ్రహించవలసిందీ ఎంతో ఉంటుంది.
జబ్ షారుక్ మెట్ గీతాంజలి
పదమూడేళ్ల గీతాంజలికి షారుక్‌ని కలిసే అవకాశం వస్తే.. గీతాంజలిని కలిసే భాగ్యం తనకు దక్కిందని 54 ఏళ్ల షారుక్ సంతోషపడిపోయారు. ఆ చిన్నారి కనిపెట్టిన పరికరం గురించి తెలుసుకుని ‘‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’’ అని మురిసిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment