మంచిని పంచు.. మంచిని పెంచు
ఎక్కడో ఐర్లండ్‌లో ఓ బస్సు నుంచి ఒక వృద్ధురాలు దిగింది. ఆమె షూ లేస్ విడిపోయి ఇబ్బంది పెడుతున్నాయి. డ్రైవర్ ఆమెను లే సు కట్టుకొమ్మన్నాడు. అయితే ఆమె ముందుకు వంగి లేస్ బిగించి కట్టుకోలేదని ఆయనకు అర్థమైంది. అతడు బస్సు నుంచి దిగి, ఆమె షూలేస్‌ను కట్టేశాడు. దీంతో ఆ వృద్ధురాలు సంతోషంతో ఆ డ్రైవర్‌కు బస్సు కదిలే సమయంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. చేసి మరిచిపోయేంత చిన్నపాటి సాయం ఆ డ్రైవర్ చేసింది. కానీ ఆ మంచి పని ఓ ప్రయాణికురాలి గుండెను తాకింది. అది ఆమె సెల్ కెమెరాకు చిక్కింది. ఆమె దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అంతే.. ఇంటర్నెట్ ఆ మంచిని పంచింది. మరింత పెంచింది. ఇప్పుడు ఫొటోలో వీపు మాత్రమే కనిపించే ఆ గుడ్ సమారిటన్ డ్రైవర్ ఒక హీరో అయిపోయాడు.
‘నేను చేసిన ఇంత చిన్న సహాయానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నేను చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసిన వారున్నారు. కానీ వారికి గుర్తింపు రాలేదు. నాకు మాత్రం అనుకోకుండా గుర్తింపు వచ్చింది’ అని హారిస్ అనే ఆ డ్రైవర్ అన్నాడు. అవును మరి! విత్తనం చిన్నదే కావచ్చు. కానీ అది మొలకెత్తితే మహావృక్షం అవుతుంది. మంచి పని చిన్నదే కావచ్చు. కానీ సరైన ప్రచారం దొరికితే లక్షల గుండెలను తాకుతుంది. వేయి విత్తులై, లక్ష మొక్కలై, కోట్ల పూలై, శతకోట్ల విత్తనాలై వ్యాపిస్తుంది