
వివాహేతర సంబంధం పెట్టుకుంటే....
షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
‘నన్ను క్షమించు ప్రియా... నేనేమీ చేయలేను. చేయగలిగివుంటే ఈపాటికే చేసేవాడిని. కానీ ఇక నావల్ల కాదు. దయచేసి నన్ను క్షమించు.’’
గుండెల్లో ఎవరో గునపాలను దింపుతున్నట్టుగా ఉంది. నిప్పు కణికలను పేర్చి నరనరాలనూ కాలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏదో బాధ. ఎలా అణచుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని భయంకరమైన బాధ! ఏం మాట్లాడాలో తెలియక, ఎలా స్పందించాలో అర్థం కాక సోఫాలో కూలబడ్డాను. నా కళ్లముందే తను బయటకు నడచుకుంటూ వెళుతున్నా ఆపలేకపోయాను. కనురెప్పల్ని దాటి పరుగులు తీస్తోన్న కన్నీళ్లను వాటి మానాన వాటిని వదిలేశాను. వాటితోపాటే నా బాధ కూడా బయటకు పోతుందేమోనని ఆశపడ్డాను. కానీ అది తీరని ఆశ అని నాకు తర్వాత అర్థమయ్యింది. ఎంత ఏడ్చినా నా వేదన కాస్తయినా తగ్గలేదు. దాన్ని గుండె గడప దాటించి పంపించెయ్యాలని నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఇక మీదట ఆ మౌనమే నా నేస్తమవుతుందని ఆ క్షణం నేను ఊహించలేకపోయాను.
సంగీత్ మళ్లీ రాలేదు. వస్తాడని కూడా నేను అనుకోలేదు. కానీ ఎక్కడో చిన్న ఆశ మిణుకుమిణుకు మనేది. కాలింగ్‌బెల్ మోగిన ప్రతిసారీ తలుపు అవతల అతడే ఉన్నాడేమో అనిపించేది. ఇంట్లో ఏమూల చిన్న సవ్వడి అయినా, నాకు తెలియకుండా వచ్చి ఎక్కడైనా దాగాడేమో అన్న చిలిపి ఊహ అంత బాధలోనూ తొంగిచూసేది. కానీ నా ఆశలు నిజమయ్యేవి కావు. నా ఊహలకు వాస్తవంగా మారే శక్తి లేదు. అందుకే నేను మళ్లీ సంగీత్‌ని చూడలేదు. నేటి వరకూ అతని జాడ నాకు తెలిసిందీ లేదు.
సంగీత్‌ని నేను ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే... అతను తప్ప నాకు వేరే ప్రపంచమే లేద నేంత. అతడు ఉంటేనే నాకు జీవితం ఉంది అను కునేంత. తొలిసారి నేను ఆఫీసులో అడుగు పెట్టి నప్పుడు, అప్పటికే అక్కడ పనిచేస్తోన్న సంగీత్ నన్ను పలకరించాడు. నన్ను పరిచయం చేసు కున్నాడు. అందరికీ నన్ను పరిచయం చేశాడు. అతడి మాట, నవ్వు, మర్యాద, నడవడిక... వంక పెట్టడానికి వీల్లేని వ్యక్తి. మగాళ్ల అందానికి మెజర్ మెంట్‌లా ఉన్నాడనిపించింది. మనసు నాకు తెలియకుండానే అతని వశమవుతూ వచ్చింది.
నా కనులు అతని కోసం వెతికేవి. పెదవులు అతనితో ఊసులాడాలని తహతహలాడేవి. కానీ ఆడపిల్ల నన్న సంకోచం, బయటపడితే చులకన అయి పోతానేమోనన్న సంశయం నన్ను ఆపుతూండేవి. కానీ ఆ రోజు మాత్రం బయటపడకుండా ఉండలేకపోయాను. ఎలా ఉంటాను.. నేను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమించానంటూ వస్తే! తన మనసులోని ప్రేమనంతా అక్షరాలుగా మార్చి అందమైన లేఖగా అందిస్తే!!
నా ఆనందానికి అవధులు లేవు. సంతోషానికి ఎల్లలు లేవు. అదృష్టదేవత వచ్చి నా ముంగిట్లో కొలువు తీరిందని మురిసిపోయాను. కానీ సంగీత్ చెప్పిన మాట వింటూనే ఒక్కసారిగా నా సంతోషం ఆవిరై పోయింది. ‘‘నాకు ఇదివరకే పెళ్లయ్యింది ప్రియా... కానీ తన నుంచి ఏ ప్రేమనూ పొందలేదు. తను నన్ను అర్థం చేసుకున్నదే లేదు. నాకేం కావాలో తనకు అవసరం లేదు. తనకు ఏం కావాలో నాకు అంతుపట్టదు. ఒక ఇంట్లో ఇద్దరు శత్రువుల్లా బతుకుతున్నాం.
నీ కళ్లలో నా మీద ప్రేమ కనిపించింది. అది నాకు కావాలని పించింది. దాన్ని నాకు దూరం చేయకు ప్లీజ్’’... తను చెప్పిన వాస్తవం నన్ను నిలువున్నా కుదిపేసినా, తన గొంతులోని ఆవేదన, కళ్లలోని తడి నన్ను కదిలించాయి. అందుకే కాదనలేకపోయాను. నా ప్రేమను చంపుకోలేకపోయాను. తనకు నా గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని తుడిచేసే సాహసం చేయలేకపోయాను. అది ఎంత తప్పో తర్వాత నాకు అర్థమైంది.
తన భార్య నుండి శాశ్వతంగా విడిపోయి నా దగ్గరకు వస్తానన్న సంగీత్ మాట మీద కలిగిన నమ్మకం... నన్ను అన్ని హద్దులనూ దాటించింది. నన్ను తనకు పూర్తిగా సొంతం చేసింది. కానీ సంగీత్ మాత్రం నాకు ఎప్పటికీ సొంతం కాడన్న నిజం చాలా ఆలస్యంగా అవగతమయ్యింది. అతడు తన భార్యను వదిలి పెట్టలేదు. నా మెడలో తాళి కట్టలేదు. నాకు భార్య హోదానీ ఇవ్వలేదు. నాలుగు గోడల మధ్య నేను తన అర్థాంగిని. బయట కూడా నాకు ఆ గుర్తింపు కావాలని అడిగినప్పుడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా నని అనిపించుకున్న దానిని.
మొదట్లో కాస్త సమయం పడుతుందనేవాడు. కొన్నాళ్లు గడిచాక ఆ పనిలోనే ఉన్నానని చెప్పేవాడు. అయినా నేను సహించాను. తన కోసం భరించాను. ఓ పక్క తప్పటడుగు వేశావంటూ మనసు నిందిస్తున్నా... దాని నిండా నిండిపోయిన ప్రేమ మాత్రం కొన్నాళ్లు వేచి చూడమనేది. అందుకే మళ్లీ రాజీపడిపోయేదాన్ని. కానీ అలా పడిన తర్వాత... ప్రతిక్షణం నరకం కనిపించేది.
భర్త చేతులు పట్టుకుని సంతోషంగా నడుస్తోన్న ప్రతి భార్యా నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. బిడ్డను ఒడిలో లాలిస్తోన్న ప్రతి తల్లీ నీకా అదృష్టం లేదు అని నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించి మనసు మెలికలు పడేది. చివరకు తట్టుకోలేక సంగీత్‌ని నిలదీశాను. ఇక ఎదురు చూడలేను, నా దగ్గరకు వచ్చేమని అడిగాను. కుదరదన్నాడు. తన భార్య ఒప్పుకోవడం లేదన్నాడు. కేసు పెడతానంటోందంటూ భయాన్ని వ్యక్తం చేశాడు. చివరికి ఓ క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకున్నాడు.
నా ప్రేమను ఎంగిలాకులా విసిరేశాడు. నా మనసును ముక్కలుగా విరిచేశాడు. నన్ను ఒంటరిగా వదిలేసి తన దారిన తాను పోయాడు. నేనేం చేయలేకపోయాను. అప్పుడు తనతో ఉండలేనన్నవాడివి ఇప్పుడెలా ఉంటావని ప్రశ్నించలేక పోయాను. అలా చేసి ఏం లాభం? అతను స్వార్థపరుడు. నన్ను తన స్వార్థానికి బలి తీసుకున్నాడు. కానీ బలైపోవడానికి నేనేగా సిద్ధపడి వెళ్లింది? నేనేగా తనకి ఆ అవకాశాన్ని కల్పించింది? అందుకే మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాను.
నా తప్పుకు శిక్షను అనుభవించాలని నిర్ణయించుకున్నాను. జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక, మరో మహిళకు అన్యాయం చేయబోయి నేనే అన్యాయమైపోయానన్న వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం లేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. బతుకంతా అనుభవించినా తీరని కఠినమైన శిక్ష!!
- ప్రియాంక (గోప్యత కోసం పేరు మార్చాం)
ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
ఒక వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతడి భార్యే కాదు, ఆ రెండో మహిళా నష్టపోతుంది. అందుకే నేనెప్పుడూ అవగాహనా సదస్సుల్లో మహిళలకు చెబుతుంటాను.. వివాహేతర సంబంధాల జోలికి పోవద్దు అని. దానివల్ల వాళ్లేమయినా సంతోషంగా ఉంటారా అంటే అదీ లేదు. చట్టబద్దమైన హక్కులుండవు. సమాజంలో సరైన స్థానం, గౌరవం ఉండవు. అందరూ అతని భార్య మీద జాలి చూపిస్తారు. ఆమెను భర్తకు దూరం చేసినందుకు ఈమెను నిందిస్తారు.
సదరు వ్యక్తి కూడా చివరకు తన భార్యాపిల్లల వైపే మొగ్గు చూపుతాడు తప్ప ఈమె గురించి ఆలోచించడు. ఎటు చూసినా నష్టపోయేది కచ్చితంగా రెండవ మహిళే. అందుకే అలాంటి జీవితంవైపు అడుగు వేసేముందు ప్రతి మహిళా ఆలోచించాలి. మరో మహిళకు అన్యాయం చేయడంతో పాటు తనకు తానూ అన్యాయం చేసుకుంటున్నానన్న వాస్తవాన్ని గ్రహించాలి. మహిళకు తోడు అవసరమే. కానీ ఆ తోడును చట్టబద్దంగానే సంపా దించుకోవాలిగానీ ఇలా కాదు. చట్ట విరుద్ధంగా చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది.
త్రిపురాన వెంకటరత్నం
చైర్ పర్సన్
రాష్ట్ర మహిళా కమిషన్