స్మార్ట్‌ఫోన్ సీక్రెట్లు..! | Sikretlu smartphone ..! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ సీక్రెట్లు..!

Published Tue, Oct 14 2014 11:46 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్ సీక్రెట్లు..! - Sakshi

స్మార్ట్‌ఫోన్ సీక్రెట్లు..!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో మీరు ఏమేం చేయవచ్చు? అని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. రకరకాల గాడ్జెట్లతోపాటు అనేక రకాల అప్లికేషన్లు చేరి స్మార్ట్‌ఫోన్‌ను మినీ కంప్యూటర్‌ను చేసేశాయి. దీంతో మనకు తెలిసిన అప్లికేషన్లను రన్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాం. కానీ... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో మీకే తెలియదు. కావాలంటే కొన్ని ఉదాహరణలు చూడండి...
 
ఫొటోలు, వీడియోలతో మూవీలు..

స్మార్ట్‌ఫోన్‌తో మనం ఎన్నో ఫొటోలు, వీడియోలు తీస్తూంటాం. ఎప్పటికప్పుడు వాటిని విడిగా స్టోర్ చేసుకుంటూంటాం కూడా. కానీ మీరు ఏ మాత్రం శ్రమ పడకుండా ఫొటోలు, వీడియోలన్నీ ఆటోమెటిక్‌గా ఒక మూవీ మాదిరిగా కనిపించేలా చేసేందుకు చిన్న ట్రిక్ ఉంది. నేరుగా గూగుల్ ప్లస్ అప్లికేషన్‌లోకి వెళ్లండి. అందులోని సెట్టింగ్స్‌లో ఉండే ఆటోబ్యాకప్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఆ తరువాత మీరు తీసే ప్రతి ఫొటో, వీడియో ఒక సినిమా మాదిరిగా గూగుల్ ప్లస్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది.
 
తగిలిస్తే షేరింగ్...

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) సౌకర్యమున్న ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేసే ఫీచర్ ఇది. ఫైల్స్‌ను సులువుగా షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ఉండే ‘మోర్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి చూస్తే మీ ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఉందా? లేదా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ ఉంటే చాలు.. ఫోటోలు, మెసేజ్‌లు, వీడియోలను మరో ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత ఫోన్‌కు జస్ట్ తాకడం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
 
చూస్తున్నంతసేపూ ప్రకాశవంతంగా...

ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించిన ఈ ఫీచర్ అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ఉండే అవకాశం తక్కువ. సామ్‌సంగ్ ఫోన్లలో మాత్రం డీఫాల్ట్‌గా ఉంటోంది. సెట్టింగ్స్, డిస్‌ప్లేలో ‘స్మార్ట్ స్టే’ అన్న ఆప్షన్ (సామ్‌సంగ్ ఫోన్లలో... సెట్టింగ్స్, స్మార్ట్‌స్క్రీన్ స్మార్ట్‌స్టే) సెలెక్ట్ చేసుకుంటే సరి. మీరు స్క్రీన్‌వైపు చూస్తున్నంత సేపు స్క్రీన్‌సేవర్ పనిచేయకుండా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది.
 
తుడిచేయండి రిమోట్‌గా...

స్మార్ట్‌ఫోన్‌ని పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది. అందులో మీకు మాత్రమే సంబంధించిన సున్నితమైన సమాచారం ఉండవచ్చు. ఫొటోలు, వీడియోలు కూడా ఇతరులు చూస్తే మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో మీ ఫోన్‌లోని సమాచారం మొత్తాన్ని నిక్షేపంగా నాశనం చేసి ఇతరుల కళ్లబడకుండా చేసేందుకు ఆండ్రాయిడ్‌లో ఒక ఏర్పాటు ఉంది. స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకోక ముందే మీరు అప్లికేషన్లలో ఉండే గూగుల్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి. అందులో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్‌ను సెలెక్ట్ చేసుకోండి. ‘రిమోట్‌లీ లొకేట్ దిస్ డివైస్’, ‘అలౌ రిమోట్ లాక్ అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్’ అప్షన్‌ను టిక్ చేయండి.
 
నోటిఫికేషన్లు ఆఫ్ చేసేందుకు...


స్మార్ట్‌ఫోన్‌తో ఉన్న ఒక చిక్కేమిటంటే... మెయిళ్లు మొదలుకొని అనేకరకాల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, అప్లికేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లు. తరచూ వచ్చే ఈ నోటిఫికేషన్లు అన్నీ మనం చూడకపోవచ్చు. మీకు ఇష్టమైన నోటిఫికేషన్లను మాత్రమే చూసేందుకు, మిగిలిన వాటిని ఆఫ్ చేసేందుకు ఆండ్రాయిడ్‌లో ఓ చిన్న చిట్కా ఉంది. మీరు వద్దనుకుంటున్న నోటిఫికేషన్‌ను కొంచెం ఎక్కువసేపు టచ్ చేసి ఉంచితే ఆప్ ఇన్ఫో అన్న డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని క్లిక్ చేసి ‘షో నోటిఫికేషన్స్’లోని బాక్స్‌ను అన్ టిక్ చేస్తే చాలు. ఆ నోటిఫికేషన్ మళ్లీ మీకు కనిపించదు.
 
 ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా..
 
 . *#*#4636#*#* స్మార్ట్‌ఫోన్, బ్యాటరీల సమాచారం డేటా వినియోగపు వివరాలు.
 
 . *#*#7780#*#* ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు తీసుకెళుతుంది. కాకపోతే అప్లికేషన్ డేటా, అప్లికేషన్లను మాత్రమే డిలీట్ చేస్తుంది.
 
 . *2767*3855# మీ స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మొత్తాన్ని తుడిచిపెట్టేసి తాజాగా ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు మార్చేస్తుంది.
 
 . *#*#273282*255*663282ూుూుూ మీడియా ఫైళ్లను బ్యాకప్ చేసుకునేందుకు.
 
 . *#12580*369#సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమాచారం తెలుసుకునేందుకు.
 
 (ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తున్నప్పటికీ కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఈ కోడ్స్ పనిచేయకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్ తయారు చేసిన కంపెనీ ఓఎస్‌లో మార్పులు చేయడం దీనికి కారణం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement