
శ్రీలంకలో సీతమ్మవారి ఆలయం
తెలుసుకుందాం
మన దేశంలో రామాలయాలు లేని ఊళ్లు దాదాపు లేవు. రామబంటు అయిన ఆంజనేయుడి ఆలయాలు కూడా మనకు అడుగడుగునా కనిపిస్తాయి. అయితే, రాముడి సహధర్మచారిణి సీతకు గల ఆలయాలు మాత్రం చాలా అరుదు. వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలో మాత్రమే ఉన్న అరుదైన సీతాలయాల్లో ఒకటి శ్రీలంకలో ఉంది. రావణుడి చెరలో సీత లంకలోని అశోకవనంలో గడిపిన సంగతి తెలిసిందే. శ్రీలంకలోని నువార ఎళియ పట్టణానికి చేరువలో సీతానది తీరానికి సమీపంలో నువార ఎళియ కాండి రోడ్డు వద్ద పురాతనమైన ‘సీతై అమ్మన్’ ఆలయం పేరిట వెలసిన సీతమ్మవారి ఆలయం నేటికీ భక్తులను ఆకట్టుకుంటోంది.
ఈ ఆలయ వెలుపల జటాయువు విగ్రహం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడి గుడి కూడా ఉంది. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో సీతమ్మవారు రామలక్ష్మణుల సమేతంగా దర్శనమిస్తుంది. ఆలయానికి సమీపంలోని సీతానది ఒడ్డున ఉన్న కొండలపై కనిపించే పాదముద్రల వంటి చిహ్నాలను ఆంజనేయుడి పాదముద్రలుగా భావిస్తారు. గుంతలుగా ఏర్పడ్డ ఈ పాదముద్రల చిహ్నాలలో అప్పుడప్పుడు నీరు కూడా చేరుతూ ఉంటుంది.