స్కైడెక్ విహారం...
అమెరికా!
అమెరికాలోని షికాగో నగరంలో విల్లీస్ టవర్ ప్రముఖ వాణిజ్య సముదాయం. దీంట్లో వందకు పైగా కార్పొరేట్ కార్యాలయాలున్నాయి. 110 అంతస్తులు గల ఈ భవనం విస్తీర్ణం 4.5 మిలియన్ అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తై భవనం. ఈ భవనంలోనే 103వ అంతస్తులో ‘స్కైడెక్’ ఉంది. షికాగో నగరాన్ని సందర్శించే ప్రతి వ్యక్తి స్కైడెక్‌ను తప్పనిసరిగా సందర్శిస్తాడు. 1,353 అడుగుల ఎత్తులో గ్లాస్ బాక్స్ నుంచి కిందికి వీక్షిస్తే నగరంలోని భవనాలు చీమల సమూ హాలుగా కనిపిస్తాయి.
కానీ కిందికి పడిపోతామేమోననే భయం అక్కడ మనలను నిలువ నీయదు. 103వ అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లేటపుడు విమానంలో పైకి లేస్తున్న అనుభూతి కలుగుతుంది. 103వ అంతస్తులో 4.3 అడుగులు వెలుపలికి గ్లాసులు ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బైనాక్యులర్స్ ద్వారా మైళ్ల దూరంలోని దృశ్యాలను కూడా చూడవచ్చు. ఈ గాజు గ్లాస్ ఒక పెద్ద ఏనుగు బరువును ఆపగలదు. స్కైడెక్ నిర్మాణం ఇప్పటి వరకు ఉత్తమ నిర్మాణంగా అనేక అవార్డులను గెలుచుకుంది.
స్కైడెక్ సందర్శనకు ముందు స్వల్ప నిడివి గల చిత్రంలో ఆ భవన నిర్మాణం చిత్రాలను, ప్రాముఖ్యతను వివరిస్తారు. 1969లో ‘సియర్స్ రోబక్ అండ్ కంపెనీ’కి చెందిన 3 లక్షల 50 వేల మంది ఉద్యో గులు, 12వేల మంది కార్మికులు మూడు సంవత్సరాల పాటు శ్రమించి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్కైడెక్‌లో వీక్షణకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ 19 డాలర్లు చార్జీగా చెల్లించాలి.
-జి.గంగాధర్,‘సాక్షి’(షికాగో నుంచి)