కేవలం టైమ్, డేట్ చూసుకోవడానికి మాత్రమే పనికొచ్చే ‘వాచ్’ లు ‘స్మార్ట్‌వాచ్’లుగా మారి వావ్ అనిపిస్తున్నాయి. మొబైల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఫోబ్లెట్‌ల తుఫానుల తర్వాత టెక్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో కొత్త తుఫానును సృష్టించే బాధ్యతను తీసుకొన్నాయి. అందుబాటులో ఉన్నవి, అందుబాటులోకి రాబోతున్నవిగా స్మార్ట్‌వాచ్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. పాత ఓఎస్‌లపైనే కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకొంటున్నాయి. ‘వాచ్’లకు ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి.
మొబైల్‌గా అందుబాటులోకి వచ్చిన ఫోన్ ‘స్మార్ట్‌ఫోన్’అయ్యింది. స్మార్ట్‌ఫోన్ కోసం అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌లు వాచ్‌లను స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌లపై పనిచేసే వాచ్‌లు సరికొత్త ఫీచర్లతో, సరికొత్త మోడళ్లలో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌కు తీసిపోని రీతిలో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తున్నాయి. ‘వాచ్’లను కట్టుకోవడం అందరికీ ఉండే అలవాటు కాదు అనే భావన ఉన్న మన దగ్గర స్మార్ట్‌వాచ్ మార్కెట్ కాస్తంత తక్కువే. అయినా ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌లపై ఆకర్షణలో ఉన్న నేపథ్యంలో... స్మార్ట్‌వాచ్‌లు కూడా ఆకట్టుకొనేవిగా మారాయి.
స్మార్ట్‌గా వచ్చిన శామ్‌సంగ్:
దాదాపు రెండు నెలల కిందట అధికారికంగా విడుదల అయ్యింది శామ్‌సంగ్ స్మార్ట్ వాచ్. శామ్‌సంగ్ గెలాక్సీ గేర్ పేరుతో ఈ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంది, ధర దాదాపు 23 వేల రూపాయలు. దాదాపు 70 ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి ఈ స్మార్ట్‌వాచ్‌లో. 4.14 సెంటీమీటర్ల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఉండే ఈ వాచ్‌లో వీడియోల వీక్షణకు, ఫోన్ కాలింగ్, 1.9 ఎమ్‌పీ కెమెరాతో వీడియో రికార్డింగ్, ఫొటోలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వరకే మార్కెట్‌లోకి వచ్చిన గెలాక్సీ నోట్ 3, త్వరలో మార్కెట్‌లోకి రాబోయే గెలాక్సీ నోట్ 10.01లలో ఉండే ‘ఎస్ వాయిస్’ అనే అప్లికేషన్ ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంటుంది. దాదాపు 27 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌పై పనిచేసే యాప్స్ ఉన్నప్పటికీ... అంత స్టైలిష్‌గా ఉండదనేది ఈ స్మార్ట్‌వాచ్ విషయంలో ఉన్న కంప్లైంట్. అలాగే స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే మరీ చిన్నదిగా ఉండటం నెగిటివ్ పాయింట్ అవుతోంది. మెసేజ్‌లు చదువుకోవడానికి కంఫర్ట్‌గా ఉండదనే భావనతో చాలా మంది ఈ స్మార్ట్ వాచ్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. కేవలం శామ్‌సంగ్ స్మార్ట్ వాచ్ విషయంలోనే కాకుండా.. మొత్తంగా ‘స్మార్ట్ వాచ్’ మార్కెట్‌నే ప్రభావితం చేస్తోంది డిస్‌ప్లే.
సోనీ కూడా స్మార్ట్‌గా వచ్చింది:
సోనీ స్మార్ట్‌వాచ్, సోనీ స్మార్ట్‌వాచ్2లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇవి ‘సెకెండ్ స్క్రీన్ ఆఫ్ యువర్ ఆండ్రాయిడ్’ ఫోన్స్‌గా పేరు పొందాయి. అంటే ఇవి ఫోన్‌కు రిమోట్ కంట్రోల్ లాంటివి. ఫోన్ దూరంగా ఉన్నపుడు, అందుబాటులో లేనప్పుడు దానికి వచ్చే కాల్స్, మెసేజెస్, మెయిల్స్ అన్నింటినీ ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ కనెక్ట్ ద్వారా మొబైల్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌కు బంధాన్ని ఏర్పరచవచ్చు. వీటి ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోయినా.. దానికి ఎంత దూరంలో ఉన్నా.. దాన్ని మానిటర్ చేయడానికి ఉపయోపడుతుంది సోనీస్మార్ట్ వాచ్. సోనీ స్మార్ట్‌వాచ్-2 కూడా అంతే. ఇది వాటర్ రెసిస్టెంట్.
మోటో యాక్టివ్: మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌లను రిసీవ్ చేసుకోవడం, మెయిల్స్, మెసేజెస్ చదువుకోవడం చేయవచ్చు. మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్‌ఎమ్ రేడియో వంటి ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేస్తుంది.
పెబ్బెల్ వాచ్: ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. డే లైట్‌లో కూడా దీని డిస్‌ప్లేను వీక్షించడానికి అవకాశం ఉంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యే ఈ స్మార్ట్‌వాచ్ సైక్లిస్ట్‌లకు బాగా ఉపయోగకరమైనది. స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోపగపడుతుంది. ఐ ట్యూన్‌తో యాక్సెస్ ఉంటుంది.
ఐ’మ్ వాచ్: 1.2 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో, 400 ఎమ్‌హెచ్‌జెడ్ సింగిల్ కోర్ ప్రాసెసర్‌తో, 4 గిగా బైట్స్ ఫ్లాష్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్టర్‌గా పనిచేస్తుంది.
మెటావాచ్: ప్రస్తుతం కిక్‌స్టార్టర్ దశలో ఉంది. రెండు రకాల స్మార్ట్‌వాచ్‌లను రూపొందిస్తోంది మెటావాచ్ కంపెనీ. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం వీటిని రూపొందిస్తున్నారు.
మణికట్టు మాయాజాలం గురించి అంతా మిస్టరీనే!
ఇప్పటికే కొన్ని స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌వాచ్‌ను రూపొందించే పనిలో ఉన్నామని ప్రకటించాయి. అయితే ఎవరెన్ని చెప్పినా ‘ఆపిల్’ నుంచి వచ్చే గాడ్జెట్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఆపిల్ కంపెనీ ‘ఐ వాచ్’ను రూపొందిస్తోందన్న వార్తలు అందరి దృష్టినీ అటువైపు మళ్లించాయి. ‘ఐ వాచ్’లో ఉంటే సదుపాయాలు, ఫీచర్ల గురించి రూమర్లే, రూమర్లు. ‘ఐ వాచ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?’ ‘ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?’ ‘ఐ వాచ్ గురించి ఆపిల్ ఎప్పుడు ప్రకటిస్తుంది?’ మొదలైన విషయాల గురించి నెట్‌లో బోలెడు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ‘ఆపిల్’ భవిష్యత్తును ‘ఐ వాచ్’ నిర్దేశిస్తుందని ఆ కంపెనీ వారే ప్రకటించడం ఈ వేరబుల్ గాడ్జెట్ గురించి అంచనాలను రెట్టింపు చేస్తోంది.
2013లోనే ‘ఐ వాచ్’ అందుబాటులోకి వస్తుందన్నారంతా. అయితే ఈ ఏడాదిలో కూడా అది వచ్చే అవకాశం లేదు అంటున్నారు. 2014 లేదా 2015లోగానీ ఐ వాచ్ అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఐ వాచ్ అనేది సౌకర్యం, సదుపాయం కోసమో కాదని.. అది ధరించిన వారి జీవనశైలినే మార్చేసేంత ప్రభావాన్ని చూపగలదని టెక్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్, ఐ ప్యాడ్‌లు ఒక ఎత్తు అయితే ఐ వాచ్ మాత్రం మరో ఎత్తు అని ఊరిస్తున్నారు. ధర విషయానికి వస్తే ఐఫోన్ 150 డాలర్లకే అందుబాటులోకి వస్తుందని కొందరు.. కాదు కాదు వెయ్యిడాలర్ల వరకూ ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ విధంగా ఐ వాచ్ రూపంలోని మణికట్టు మాయాజాలం గురించిన సమాచారం అంతా మిస్టరీగానే ఉంది!
ఆడవాళ్లకు స్పెషల్ స్టైల్?!
వాచ్‌లను ధరించే విషయంలో ఆడవాళ్లకు, మగవాళ్లకు చాలా తేడాలున్నాయి. ఆడవాళ్లు ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి వాచ్ కట్టాలి.. అనే అభిప్రాయం ఉంది. అయితే నేటి ‘యూనీ సెక్స్ థియరీ’ ప్రకారం ‘ఆడమగ తేడాలు ఎందుకు?’ అని అంటున్నాయి టెక్ జెయింట్ కంపెనీలు. లింగ వివక్ష లేని సమాజం కావాలి కాబట్టి.. ఈ వాచ్‌ల విషయంలో తేడాలు చూపడం అనవసరమని, స్టైల్, కంఫర్ట్‌లను బట్టి స్త్రీ పురుష తేడాలు లేకుండా ఎవరికి ఇష్టమైనవి వారు సెలెక్ట్ చేసుకోవచ్చని అంటున్నాయి. సోనీ కంపెనీ మాత్రం లేడీస్, జెంట్స్ అంటూ భిన్నమైన స్టైల్స్‌ను అందిస్తోంది.
-జీవన్ రెడ్డి.బి