దీపికా పడుకోన్ కర్నాటక. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్. ప్రియాంకా చోప్రా బిహార్. విద్యాబాలన్ మహారాష్ట్ర చెంబూర్. తాప్సీ పన్ను న్యూఢిల్లీ. అనుష్కా శర్మ ఉత్తర ప్రదేశ్. ‘ఔట్‌సైడర్స్’.. వీళ్లంతా! బయటి నుంచి వచ్చినవాళ్లు అని కాదు. బాలీవుడ్ రానివ్వని వాళ్లు. రానివ్వలేదని.. వెళ్లిపోలేదు! సపోర్టు లేకున్నా నిలబడ్డారు. సపోర్టుగానూ ఉంటున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ చనిపోయి నేటికి రెండు వారాలు! అతడి మరణంతో పైకి లేచిన ‘బంధుప్రీతి’ ఆరోపణల భూతం ముంబైలో సినిమాలు తీస్తుండే పెద్ద కుటుంబాల ఇళ్ల తలుపులను దబదబమని కొడుతూ, కాలింగ్ బెల్ నొక్కుతూ లోపల ఉన్నవారందరికీ నిద్ర లేకుండా చేస్తోంది. బయటికి వచ్చి చూస్తే మళ్లీ కనిపించదు! ట్వీట్‌లుగా, పోస్ట్‌లుగా సోషల్ మీడియా స్నానం చేయించి, ఒళ్లు తుడిచి, తల దువ్వి, పౌడర్ అద్ది వదులుతున్న భూతం అది. ప్రధానంగా కరణ్ జొహార్, సల్మాన్ ఖాన్‌ల రక్తం కావాలి దానికిప్పుడు. ఆ రక్తం.. తాగేందుకు కాదు. సుశాంత్ ఆత్మను అభిషేకించేందుకు! వీళ్లిద్దరు, మరికొందరు.. కొత్తవాళ్లను సినిమాల్లోకి రానివ్వకుండా, వచ్చినా నిలవనివ్వకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే పుట్టి పెరిగిన ఆలియా భట్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లకు, బంధువుల ఇళ్లలోని డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్‌లు, టెక్నీషియన్‌లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ, బయటి టాలెంట్‌ను తొక్కి పడేస్తున్నారని.. ఆ భూతం పోలిస్ కంప్లయింట్‌లు, ఆన్‌లైన్ పిటిషన్‌ల వరకూ వెళ్లింది.
భూతాల ఆటలు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్ల దగ్గర సాగవు. అతడే ఒక భూతంలా ఉంటాడు. పైగా రకరకాల భూతాల మీద సినిమాలు తీసినవాడు. ఆరోపణల భూతం అతడికి ఒక లెక్కా! ‘‘ఏయ్.. భూతమా! నోరు మూసుకుని వెళ్లు. ఎవరి పిల్లల్ని వాళ్లు పైకి తేకుండా, పక్కింటి వాళ్ల పిల్లల్ని హీరోలను, హీరోయిన్‌లను చేసేస్తారా ఎక్కడైనా..’’ అన్నాడు. ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ కూడా... ‘‘నీ పిల్లలు పెద్దవాళ్లు అవకపోతారా! అప్పుడు నువ్వు వాళ్లను కాదని బయటి వాళ్ల పిల్లలకు చాన్సులిస్తావా? అదీ చూస్తాను’’ అని భూతంతో అన్నారు. ‘మన’ అనేది మన బ్లడ్‌లోనే ఉంటుంది. బయట ఎంత టాలెంట్ ఉన్నా.. ‘టాలెంట్ ఎవరికి దగ్గర లేదూ..’ అని ఇంట్లోంచి పిల్లల్ని తెచ్చి పెర్ఫార్మ్ చేయించడాన్ని తప్పయితే పట్టేందుకు లేదు. డబ్బున్న వాళ్లు, పలుకుపడి ఉన్నవాళ్లు పరోపకారం చేయడానికి, పదిమందిని పైకి తేవడానికి ఆ డబ్బును, పలుకుబడిని ఉపయోగించినా.. మొదటి ప్రాధాన్యం రక్తసంబంధాలకే ఉంటుంది.
ఏ ఫీల్డులోనైనా పైకి రావడానికి ఎవరి కష్టం వారు పడాల్సిందే. సుశాంత్‌ని ‘అయ్యో’ అని, అతడికి మోకాళ్లు అడ్డుపెట్టి ఉంటారని అనుకున్నవాళ్లను ‘ఏమయ్యో’ అని.. భూతం అంటోంది కానీ.. కెరీర్ ఆరంభంలో షారుక్ ఖాన్ కూడా ఒక సుశాంతే. మాధురీ దీక్షిత్ కూడా ఔట్‌సైడరే! నెగ్గుకు రాలేదా మరి?! ఎవరెస్టంత ఎత్తులో ఉండి, అణిగిమణిగి ఉన్నప్పటికీ బాలీవుడ్ తల్లి కరుణిస్తుందని చెప్పలేం. కరుణించాలని డిమాండింగ్‌గా మారామూ చేయలేం. అయితే ఎవరి కరుణా కటాక్షాలతోనూ నిమిత్తం లేకుండా తమని తాము నిరూపించుకుని, నిలదొక్కుకున్న బయటి నటీమణులు బాలీవుడ్‌లో తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ అనుష్కా శర్మ, విద్యాబాలన్, తాప్సీ.. మరీ ముఖ్యంగా కంగనా రౌనత్ వంటి వారున్నారు. వీళ్లను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఉన్నా సుశాంత్ ధైర్యంగా నిలబడగలిగి ఉండేవాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘దిల్ బేచారా’ అతడి చివరి చిత్రం అయి ఉండేది కాదు.
ఐశ్వర్య, ప్రియాంక అందాల రాణులు. దీపిక, అనుష్క మోడలింగ్ నుంచి వచ్చారు. విద్యాబాలన్ మ్యూజిక్ ఆల్బమ్‌తో పరిచయం అయ్యారు. తాప్పీ, కంగనా రనౌత్ నేరుగా సినిమాల్లోకే ఎంట్రీ ఇచ్చారు. అందరిలోనూ కామన్ పాయింట్ ఒకటే. వీళ్లెవ్వరికీ బాలీవుడ్ బ్యాగ్రౌండ్ లేదు. వీళ్లకు ఒక్క ‘ఇన్‌సైడర్’ కూడా హెల్ప్ చెయ్యలేదు. అలాగని అడ్డు పడకుండానూ లేరు. అయినా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రియాంక అయితే హాలీవుడ్ వరకు ఎదిగారు. బాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలు లేవని కాదు. ‘ఐ హ్యావ్ కిక్డ్ అవుటాఫ్ íఫిల్మ్’ అని అనేక ఇంటర్వూ్యల్లో చెప్పారు కూడా. అంతా ఓకే అయ్యాక ఆఖరి నిముషంలో వేరే వాళ్లను తీసుకునేవారట. ఇప్పుడు ప్రియాంకకే ‘పర్పుల్ పెబిల్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. యంగ్ టాలెంట్‌కి అవకాశాలు ఇస్తున్నారు.
‘ఓం శాంతి ఓం’(2007) తో బాలీవుడ్‌లోకి వచ్చిన దీపిక కూడా ఒక దశలో తన కో–స్టార్ కన్నా తనే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి (పద్మావతి) చేరుకున్నారు. హీరోయిన్‌లు తమ మానసిక అనారోగ్యం గురించి బయట పడితే చాన్సులు తగ్గుతాయి. అందుకు జంకలేదు దీపిక. సినిమాల్లోకి రాకముందు తను డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని బయటపెట్టారు. రామ్ లీల, తమాషా, బాజీరావ్ మస్తానీ, పికుతో విలక్షణ ప్రతిభ కనబరిచారు. అనుష్క కూడా దీపికలానే. ‘రబ్ నె బనా ది జోడి (2008) తో స్క్రీన్ మీదకు వచ్చారు. బ్యాండ్ బాజా బారాత్, ఎన్‌హెచ్10, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్, సూయీ ధాగా.. అన్నీ ఆమె చెంతకు వచ్చిన సినిమాలే. ఇప్పుడిక ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్’ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి వెబ్ సిరీస్‌తో యువ నటీనటులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవలి ‘పాతాళ్ లోక్’ సీరీస్, తాజాగా ‘బుల్‌బుల్’ సినిమాలకు ఆనుష్కే నిర్మాత.
తాప్సీ పన్ను నటించిన సినిమాలైతే ఆమె కోసమే రాసినట్లు ఉంటాయి. అంటే ‘నెపోటిజమ్’ భర్తీ చేయలేనట్లు! తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో ఆమెకు అవకాశాలు ఉన్నాయి. పింక్ , బద్లా, మన్‌మర్జియాన్, సాంద్‌కి ఆంఖ్, తప్పడ్.. ప్రేక్షకుల్ని, విమర్శకుల్నీ మెప్పించాయి. ఇంతగా నటిస్తూ, ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్న తాప్సీ కూడా బాలీవుడ్‌లో బాగా ‘స్ట్రగుల్’ అయిన వారే. ‘‘నేను బయటి నుంచి వచ్చాను కాబట్టి పెద్ద పెద్ద గ్లామరస్ పాత్రలేమీ నాకు రాలేదు. వచ్చిన వాటినే బాగా చేయడానికి మించి నేనేమీ ఆశించలేదు. వచ్చినవే చేస్తూ వస్తున్నాను’’ అని ఒక ఇంటర్వూ్యలో కొద్దిగా బయటపడ్డారు తాప్సీ.
రాధికా ఆప్టే మరో తాప్సీ. మంచివి వస్తే చేయడం. రానప్పుడు బయటి వ్యక్తిగా ఉండిపోవడం. ఇక విద్యాబాలన్ గెలుచుకున్న ఉత్తమ నటి అవార్డు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పూర్తిగా ఆమె తన నటనతో సాధించుకున్నవే. ‘పరిణీత’తో ఆమె సినిమాల్లోకి వచ్చారు. పా, ఇష్కియా, కహానీ, ది డర్టీ పిక్చర్.. ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం కల్పించాయి. వీళ్లు కాక.. వెబ్ సీరీస్‌తో ఇప్పుడు రసికా దుగల్, శోభితా ధూళిపాళ, కీర్తీ కుల్‌కర్ణి, మాన్వీ గగ్రూ తరచు కనిపిస్తున్నారు. ఈ నటీమణులంతా ఎవరి సపోర్టూ లేకున్నా స్వశక్తితో తమని తాము నిరూపించుకుంటున్నవాళ్లే. వీళ్లందరికంటే భిన్నమైన వ్యక్తిత్వం గల నటి కంగనా రనౌత్.
బాలీవుడ్‌లో కంగనకు వచ్చినన్ని బెదరింపులు వేరెవరికీ రాలేదు. సుశాంత్ మరణించాక ఇటీవలే ఆమె ఒక విషయాన్ని బయటపెట్టారు. రాకేశ్ రోషన్‌కి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పకపోతే (హృతిక్ రోషన్‌తో వివాదం విషయంలో) వాళ్లు జైల్లో పెట్టించగలిగినంత పెద్దవాళ్లనీ, చివరికి ఆత్మహత్యే శరణం అవుతుందని జావేద్ అఖ్తర్ తనని ఇంటికి పిలిపించి మరి కేకలేశాడట! ఆ కేకల్ని పట్టించుకోలేదు కంగనా. కెరీర్ ప్రారంభం నుంచీ అలాంటి అరుపుల్ని, హెచ్చరికల్నీ చాలానే వింటూ వస్తున్నారు. నెపోటిజం కు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉన్నారు. అవరోధాలను కల్పించిన వాళ్లను ‘వాళ్ల పాపాన వాళ్లే పోతారు’ అని ఎదిగినవాళ్లు మిగతావాళ్లయితే, తిరగబడి తనని తను నిరూపించుకున్న నటి కంగనా రనౌత్. మరీ రనౌత్‌లా ధిక్కరించకపోయినా.. తనకు తనే ఆశగా, శ్వాసగా ఉండిపోవలసింది సుశాంత్.
Comments
Please login to add a commentAdd a comment