Tapsee Ponnu
-
'మిషన్ ఇంపాజిబుల్' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్' సందడి..
Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో మాఫీయ డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ.. రాజారామ్..' 'ఆర్ఆర్ఆర్' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి.. 'ఖలీల్.. జిలానీ.. ఫారూక్' 'కేజీయఫ్' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. -
పరుగు ప్రారంభం
దుబాయ్‌లో పరుగు ప్రారంభించారు తాప్సీ. యాక్షన్ అనడం ఆలస్యం పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తాప్సీ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ నిర్మిస్తున్నారు. ఇందులో రన్నర్‌గా నటిస్తున్నారు తాప్సీ. గుజరాత్లో ఓ మారుమూల గ్రామంలో ఉండే అమ్మాయి రష్మీ. ఆమె వేగాన్ని చూసి అందరూ రాకెట్ అంటుంటారు. మరి ఆ రాకెట్ ఎందాకా వెళ్లగలిగింది అనేది చిత్రకథాంశం. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా దుబాయ్‌లో ప్రారంభం అయింది. ‘మరో కొత్త ప్రయాణం ప్రారంభం అయింది. హసీనా (తన గత చిత్రం ‘హసీనా దిల్రుబా’లో పాత్రను ఉద్దేశించి) నుంచి రాకెట్‌గా మారిపోయాను’’ అన్నారు తాప్సీ. -
ఔట్ సైడర్స్
దీపికా పడుకోన్ కర్నాటక. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్. ప్రియాంకా చోప్రా బిహార్. విద్యాబాలన్ మహారాష్ట్ర చెంబూర్. తాప్సీ పన్ను న్యూఢిల్లీ. అనుష్కా శర్మ ఉత్తర ప్రదేశ్. ‘ఔట్‌సైడర్స్’.. వీళ్లంతా! బయటి నుంచి వచ్చినవాళ్లు అని కాదు. బాలీవుడ్ రానివ్వని వాళ్లు. రానివ్వలేదని.. వెళ్లిపోలేదు! సపోర్టు లేకున్నా నిలబడ్డారు. సపోర్టుగానూ ఉంటున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ చనిపోయి నేటికి రెండు వారాలు! అతడి మరణంతో పైకి లేచిన ‘బంధుప్రీతి’ ఆరోపణల భూతం ముంబైలో సినిమాలు తీస్తుండే పెద్ద కుటుంబాల ఇళ్ల తలుపులను దబదబమని కొడుతూ, కాలింగ్ బెల్ నొక్కుతూ లోపల ఉన్నవారందరికీ నిద్ర లేకుండా చేస్తోంది. బయటికి వచ్చి చూస్తే మళ్లీ కనిపించదు! ట్వీట్లుగా, పోస్ట్‌లుగా సోషల్ మీడియా స్నానం చేయించి, ఒళ్లు తుడిచి, తల దువ్వి, పౌడర్ అద్ది వదులుతున్న భూతం అది. ప్రధానంగా కరణ్ జొహార్, సల్మాన్ ఖాన్ల రక్తం కావాలి దానికిప్పుడు. ఆ రక్తం.. తాగేందుకు కాదు. సుశాంత్ ఆత్మను అభిషేకించేందుకు! వీళ్లిద్దరు, మరికొందరు.. కొత్తవాళ్లను సినిమాల్లోకి రానివ్వకుండా, వచ్చినా నిలవనివ్వకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే పుట్టి పెరిగిన ఆలియా భట్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లకు, బంధువుల ఇళ్లలోని డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు, టెక్నీషియన్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ, బయటి టాలెంట్‌ను తొక్కి పడేస్తున్నారని.. ఆ భూతం పోలిస్ కంప్లయింట్లు, ఆన్లైన్ పిటిషన్ల వరకూ వెళ్లింది. భూతాల ఆటలు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్ల దగ్గర సాగవు. అతడే ఒక భూతంలా ఉంటాడు. పైగా రకరకాల భూతాల మీద సినిమాలు తీసినవాడు. ఆరోపణల భూతం అతడికి ఒక లెక్కా! ‘‘ఏయ్.. భూతమా! నోరు మూసుకుని వెళ్లు. ఎవరి పిల్లల్ని వాళ్లు పైకి తేకుండా, పక్కింటి వాళ్ల పిల్లల్ని హీరోలను, హీరోయిన్లను చేసేస్తారా ఎక్కడైనా..’’ అన్నాడు. ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ కూడా... ‘‘నీ పిల్లలు పెద్దవాళ్లు అవకపోతారా! అప్పుడు నువ్వు వాళ్లను కాదని బయటి వాళ్ల పిల్లలకు చాన్సులిస్తావా? అదీ చూస్తాను’’ అని భూతంతో అన్నారు. ‘మన’ అనేది మన బ్లడ్‌లోనే ఉంటుంది. బయట ఎంత టాలెంట్ ఉన్నా.. ‘టాలెంట్ ఎవరికి దగ్గర లేదూ..’ అని ఇంట్లోంచి పిల్లల్ని తెచ్చి పెర్ఫార్మ్ చేయించడాన్ని తప్పయితే పట్టేందుకు లేదు. డబ్బున్న వాళ్లు, పలుకుపడి ఉన్నవాళ్లు పరోపకారం చేయడానికి, పదిమందిని పైకి తేవడానికి ఆ డబ్బును, పలుకుబడిని ఉపయోగించినా.. మొదటి ప్రాధాన్యం రక్తసంబంధాలకే ఉంటుంది. ఏ ఫీల్డులోనైనా పైకి రావడానికి ఎవరి కష్టం వారు పడాల్సిందే. సుశాంత్‌ని ‘అయ్యో’ అని, అతడికి మోకాళ్లు అడ్డుపెట్టి ఉంటారని అనుకున్నవాళ్లను ‘ఏమయ్యో’ అని.. భూతం అంటోంది కానీ.. కెరీర్ ఆరంభంలో షారుక్ ఖాన్ కూడా ఒక సుశాంతే. మాధురీ దీక్షిత్ కూడా ఔట్సైడరే! నెగ్గుకు రాలేదా మరి?! ఎవరెస్టంత ఎత్తులో ఉండి, అణిగిమణిగి ఉన్నప్పటికీ బాలీవుడ్ తల్లి కరుణిస్తుందని చెప్పలేం. కరుణించాలని డిమాండింగ్‌గా మారామూ చేయలేం. అయితే ఎవరి కరుణా కటాక్షాలతోనూ నిమిత్తం లేకుండా తమని తాము నిరూపించుకుని, నిలదొక్కుకున్న బయటి నటీమణులు బాలీవుడ్లో తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ అనుష్కా శర్మ, విద్యాబాలన్, తాప్సీ.. మరీ ముఖ్యంగా కంగనా రౌనత్ వంటి వారున్నారు. వీళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉన్నా సుశాంత్ ధైర్యంగా నిలబడగలిగి ఉండేవాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘దిల్ బేచారా’ అతడి చివరి చిత్రం అయి ఉండేది కాదు. ఐశ్వర్య, ప్రియాంక అందాల రాణులు. దీపిక, అనుష్క మోడలింగ్ నుంచి వచ్చారు. విద్యాబాలన్ మ్యూజిక్ ఆల్బమ్‌తో పరిచయం అయ్యారు. తాప్పీ, కంగనా రనౌత్ నేరుగా సినిమాల్లోకే ఎంట్రీ ఇచ్చారు. అందరిలోనూ కామన్ పాయింట్ ఒకటే. వీళ్లెవ్వరికీ బాలీవుడ్ బ్యాగ్రౌండ్ లేదు. వీళ్లకు ఒక్క ‘ఇన్సైడర్’ కూడా హెల్ప్ చెయ్యలేదు. అలాగని అడ్డు పడకుండానూ లేరు. అయినా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రియాంక అయితే హాలీవుడ్ వరకు ఎదిగారు. బాలీవుడ్లో ఆమెకు చేదు అనుభవాలు లేవని కాదు. ‘ఐ హ్యావ్ కిక్డ్ అవుటాఫ్ íఫిల్మ్’ అని అనేక ఇంటర్వూ్యల్లో చెప్పారు కూడా. అంతా ఓకే అయ్యాక ఆఖరి నిముషంలో వేరే వాళ్లను తీసుకునేవారట. ఇప్పుడు ప్రియాంకకే ‘పర్పుల్ పెబిల్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. యంగ్ టాలెంట్‌కి అవకాశాలు ఇస్తున్నారు. ‘ఓం శాంతి ఓం’(2007) తో బాలీవుడ్‌లోకి వచ్చిన దీపిక కూడా ఒక దశలో తన కో–స్టార్ కన్నా తనే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి (పద్మావతి) చేరుకున్నారు. హీరోయిన్లు తమ మానసిక అనారోగ్యం గురించి బయట పడితే చాన్సులు తగ్గుతాయి. అందుకు జంకలేదు దీపిక. సినిమాల్లోకి రాకముందు తను డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని బయటపెట్టారు. రామ్ లీల, తమాషా, బాజీరావ్ మస్తానీ, పికుతో విలక్షణ ప్రతిభ కనబరిచారు. అనుష్క కూడా దీపికలానే. ‘రబ్ నె బనా ది జోడి (2008) తో స్క్రీన్ మీదకు వచ్చారు. బ్యాండ్ బాజా బారాత్, ఎన్‌హెచ్10, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్, సూయీ ధాగా.. అన్నీ ఆమె చెంతకు వచ్చిన సినిమాలే. ఇప్పుడిక ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్’ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి వెబ్ సిరీస్‌తో యువ నటీనటులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవలి ‘పాతాళ్ లోక్’ సీరీస్, తాజాగా ‘బుల్బుల్’ సినిమాలకు ఆనుష్కే నిర్మాత. తాప్సీ పన్ను నటించిన సినిమాలైతే ఆమె కోసమే రాసినట్లు ఉంటాయి. అంటే ‘నెపోటిజమ్’ భర్తీ చేయలేనట్లు! తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో ఆమెకు అవకాశాలు ఉన్నాయి. పింక్ , బద్లా, మన్మర్జియాన్, సాంద్కి ఆంఖ్, తప్పడ్.. ప్రేక్షకుల్ని, విమర్శకుల్నీ మెప్పించాయి. ఇంతగా నటిస్తూ, ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్న తాప్సీ కూడా బాలీవుడ్లో బాగా ‘స్ట్రగుల్’ అయిన వారే. ‘‘నేను బయటి నుంచి వచ్చాను కాబట్టి పెద్ద పెద్ద గ్లామరస్ పాత్రలేమీ నాకు రాలేదు. వచ్చిన వాటినే బాగా చేయడానికి మించి నేనేమీ ఆశించలేదు. వచ్చినవే చేస్తూ వస్తున్నాను’’ అని ఒక ఇంటర్వూ్యలో కొద్దిగా బయటపడ్డారు తాప్సీ. రాధికా ఆప్టే మరో తాప్సీ. మంచివి వస్తే చేయడం. రానప్పుడు బయటి వ్యక్తిగా ఉండిపోవడం. ఇక విద్యాబాలన్ గెలుచుకున్న ఉత్తమ నటి అవార్డు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పూర్తిగా ఆమె తన నటనతో సాధించుకున్నవే. ‘పరిణీత’తో ఆమె సినిమాల్లోకి వచ్చారు. పా, ఇష్కియా, కహానీ, ది డర్టీ పిక్చర్.. ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం కల్పించాయి. వీళ్లు కాక.. వెబ్ సీరీస్‌తో ఇప్పుడు రసికా దుగల్, శోభితా ధూళిపాళ, కీర్తీ కుల్కర్ణి, మాన్వీ గగ్రూ తరచు కనిపిస్తున్నారు. ఈ నటీమణులంతా ఎవరి సపోర్టూ లేకున్నా స్వశక్తితో తమని తాము నిరూపించుకుంటున్నవాళ్లే. వీళ్లందరికంటే భిన్నమైన వ్యక్తిత్వం గల నటి కంగనా రనౌత్. బాలీవుడ్లో కంగనకు వచ్చినన్ని బెదరింపులు వేరెవరికీ రాలేదు. సుశాంత్ మరణించాక ఇటీవలే ఆమె ఒక విషయాన్ని బయటపెట్టారు. రాకేశ్ రోషన్‌కి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పకపోతే (హృతిక్ రోషన్‌తో వివాదం విషయంలో) వాళ్లు జైల్లో పెట్టించగలిగినంత పెద్దవాళ్లనీ, చివరికి ఆత్మహత్యే శరణం అవుతుందని జావేద్ అఖ్తర్ తనని ఇంటికి పిలిపించి మరి కేకలేశాడట! ఆ కేకల్ని పట్టించుకోలేదు కంగనా. కెరీర్ ప్రారంభం నుంచీ అలాంటి అరుపుల్ని, హెచ్చరికల్నీ చాలానే వింటూ వస్తున్నారు. నెపోటిజం కు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉన్నారు. అవరోధాలను కల్పించిన వాళ్లను ‘వాళ్ల పాపాన వాళ్లే పోతారు’ అని ఎదిగినవాళ్లు మిగతావాళ్లయితే, తిరగబడి తనని తను నిరూపించుకున్న నటి కంగనా రనౌత్. మరీ రనౌత్‌లా ధిక్కరించకపోయినా.. తనకు తనే ఆశగా, శ్వాసగా ఉండిపోవలసింది సుశాంత్. -
‘హైట్ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) రీయాలిటీ షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం 11వ సీజన్ నడుస్తోంది. రియాలిటీ షో బుధవారం 11వ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా బిగ్ బీ కంటెస్టెంట్ చందన్‌తో మాట్లాడుతూ.. అతడి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న అమితాబ్.. తనకు తగిన వధువు వెదుక్కున్నాడని చెప్పారు. ఈ క్రమంలో తన భార్య జయా బచ్చన్ ఎత్తు గురించి ప్రస్తావించారు. ‘చందన్ తన ఎత్తుకు తగ్గ వధువును ఎంచుకున్నాడు. అయితే ఎత్తు విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. అలా చేసి ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేను’ అంటూ తామిద్దరి హైట్లలో ఉన్న వ్యత్యాసం గురించి చమత్కరించారు. దీంతో బిగ్ బీ మాటలకు అక్కడి వారంత తెగ నవ్వుకున్నారు. కాగా నేటి(గురువారం) ‘కర్మవీర్ స్పేషల్’ ఎపిసోడ్ సందర్భంగా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (కీస్) ప్రొఫెసర్, ఒడిశా ఎంపీ అయిన అచ్యుత సమంతా బిగ్ బీ తో కలిసి హాట్ సీట్‌ను పంచుకోనున్నారు. అలాగే ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా పాల్గొననున్నారు. కాగా ఈ ఎపిసోడ్ నవంబర్ 15వ తేదీ(శుక్రవారం) ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఎంపీ సమంతా ఫిలాసఫర్‌గా ఉన్న ప్రారంభంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో, విద్యావేత్తగా ఎలా ఎదిగారో ఈ ఎపిసోడ్లో చూడవచ్చు. అలాగే కీస్ విద్యార్థులు అమితాబ్ కోసం ప్రత్యేకంగా వేయించిన ప్రముఖ ఒడిశా డీజర్ట్ ‘చెన్నా పొడా’ పేయింటింగ్ అమితాబ్‌కు బహుకరిస్తారు. కాగా సమంతా ఒడిశా కందమహాల్ నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. -
‘తాప్సీకి నటించడం రాదు’
వరుస విజయాలతో బాలీవుడ్లో దూసుకుపోతున్నారు హీరోయిన్ తాప్సీ. తాజాగా తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ త్వరలోనే అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని పేర్కొంటూ దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు తాప్సీ. Cheers to the new beginning with some good food! This one is a subject way too close to my heart. I’ve been wanting to do this since years. It becomes exciting when it happens with the ‘Man of The Moment’ @anubhavsinha 8th March 2020 will surely be the day to watch out for ! pic.twitter.com/2ynuW6jmGF — taapsee pannu (@taapsee) July 7, 2019 దీనిపై విశాల్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘అనుభవ్ సర్, మీ సినిమాలో తాప్సీకి బదులు మరో నటిని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సీకి నటించడం రాదు’ అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన తాప్సీ అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘సారీ.. ఇప్పుడేం చేయలేవ్. ఎందుకంటే సినిమాకు సంతకం చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా నేను అది జరగనివ్వను. ఒక పనిచెయ్. నేను మరో సినిమాకు సంతకం చేసేలోపు ఆ చిత్రంలో నన్ను ఎవ్వరూ తీసుకోకుండా ఆపి చూడు’ అని ఛాలెంజ్ విసిరారు. బాగా బుద్ది చెప్పారంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. Sorry yaar, ab toh sab kuch sign n seal ho chuka hai. Ab toh sir ko main hi nahi nikaalne dungi. But ek kaam karo, agli wali ke liye rok lo kyunki shayad woh bhi main lock karva lu jald hi. #TryAgain https://t.co/vK7avyN8XR — taapsee pannu (@taapsee) July 7, 2019 -
‘ముల్క్’.. అక్కడ బ్యాన్
దాయాది దేశం పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో వచ్చిన భారతీయ చిత్రాలను నిషేధిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కోవలోకి మరో చిత్రం చేరింది. రిషి కపూర్, తాప్సీ ప్రధాన పాత్రలుగా, అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ముల్క్’. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన ‘ఇస్లామిక్ ఫోబియా’ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ పాక్ మాత్రం ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించకూడదంటూ నిషేధిత ఆజ్ఞలు జారీ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో విడుదలైన పలు విజయవంతమైన చిత్రాలను పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన వీరే ది వెడ్డింగ్ చిత్రాన్ని వల్గర్‌గా ఉందంటూ బ్యాన్ చేసింది. ‘మెన్యూరేషన్’ ఇతివృత్తంగా అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ప్యాడ్మాన్ చిత్రాన్ని కూడా నిషేధించింది. అందుకు పాక్ సెన్సార్ బోర్డ్ చెప్పిన కారణం ‘ఇలాంటి విషయాలను మా దేశంలో బహిరంగంగా చర్చించడం నిషేధం అందుకే ప్యాడ్మాన్ను నిషేధించాం’ అని పాక్ సెన్సార్ బోర్డు తెలిపింది. ఇస్లామ్‌కు వ్యతిరేకమైన చేతబడి ఇతివృత్తంగా తెరకెక్కిందంటూ అనుష్క శర్మ ‘పారి’ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఇవే కాక అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రాజీ’, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘రాయిస్’ చిత్రాలను కూడా ఇలాంటి కారణాలు చెప్పే నిషేదించింది. ఇదే క్రమంలో ఇప్పుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘ముల్క్’ చిత్రాన్ని నిషేధించింది. అయితే ఈ నిషేధంపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా పాక్ సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ‘ఈ చిత్రం ముస్లింలకు, పాకిస్తాన్‌కు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో తెరకెక్కించింది కాదు. ఇది మనపై మనకు, మన చూట్టు ఉన్న వారి పట్ల మనం ప్రదర్శించే ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన చిత్రం. ఇది మీ గురించి, నా గురించి చెప్పే చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక పాక్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.. సహ ఉనికి గురించి చర్చించే ఈ చిత్రాన్ని పాక్ ఎందుకు బ్యాన్ చేసింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీకు ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఆ రోజు తప్పకుండా ఈ సినిమా చూసి అప్పుడు చెప్పండి పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఎందుకు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిందో’ అంటూ ట్వీట్ చేశారు. -
నిన్ను హీరోయిన్ చేసిందెవరు?
సాక్షి, సినిమా : ఏ నటుడు, నటి అయినా అభిమానుల ప్రేమాభిమానాలే తమ ఈ స్థాయికి కారణం అంటుంటారు. అయితే అందరు అభిమానులు ఒకేలా ఉండరు. ఇక అందరు తారలు అందరికీ నచ్చాలని లేదు. ఒక్కోసారి అభిమానుల వల్లే హర్ట్ అయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే నటి తాప్సీకి ఒక అభిమాని షాక్ ఇచ్చాడు. నటి తాప్పీ ఇంతకుముందు దక్షిణాది చిత్రాల్లో నటించినా.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైపోయ్యింది. అలా అనేకంటే దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా అటకెక్కాయని చెప్పొచ్చు. ఈ అమ్మడు ట్విటర్లో తరచూ అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. అలాంటి ఒక సందర్భంలో తన ఫొటోని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూసిన ఒక అభిమాని నిన్ను కూడా కథానాయకిని చేసిందెవరు? అంటూ ప్రశ్నించాడు. అంతే అభిమాని నుంచి అలాంటి ప్రశ్నను ఊహించని తాప్సీ షాక్ అయ్యిందట. కోపం కూడా తన్నుకొచ్చిందట. తరువాత తేరుకుని ఆ అభిమానికి కొంచెమైనా నటించడం వల్లే నన్ను కథానాయకిని చేశారని బదులిచ్చింది. అయినా నేను సాధారణ అమ్మాయిగా ఉండడంలో సమస్యేమీ లేదుగా, ఈ లోకంలో నాలాంటి సరాసరి అమ్మాయిలే అధికంగా ఉంటారు అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో నాలుగు చిత్రాలు చేస్తుంది. ఇంతకు ముందు నటించిన పింక్, నామ్ షబానా చిత్రాలు సక్సెస్‌తో తాప్సీ హిందీలో సెటిల్ అయిపోయ్యింది. నటిగా తనకంటూ కొత్త బాటను వేసుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనలోని నటనా ప్రతిభను వెలికితీసే పాత్ర ఇంకా రాలేదని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తాప్సీ అంటోంది. అదే విధంగా సినిమా రంగంలో తనకంటూ స్నేహితులెవరూ లేరని పేర్కొంది. -
రైలు కిందపడి చస్తాను కాని..
సాక్షి, హైదరాబాద్: ‘అవసరమైతే రైలు కిందపడి చస్తాను కాని నీ దగ్గరకు మాత్రం తిరిగి రాను’ .. సీనియర్ నటి ఖుష్బూ నోటి నుంచి ఒకప్పుడు వెలువడిన మాటలివి. నిజజీవితంలో కన్నతండ్రితోనే ఈ మాటలు అన్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఎందుకు ఈ మాటలు అనాల్సివచ్చిందో ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో వివరించారు. ‘వుమెన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటిక్’ పేరుతో జరిగిన సెషన్లో గౌతమి, కాజల్, తాప్సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తండ్రి పెట్టే వేధింపులు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు. ‘మా నాన్నకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్న ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆయనపై తిరుగుబాటు చేశాను. మా అమ్మ, సోదరులను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మా నాన్న ఆడవాళ్లను చులకనగా చూసేవాడు. అసభ్యంగా మాట్లాడేవాడు. నేను ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు నాకింకా గుర్తుంది. అది 1986, సెప్టెంబర్ 12. తనను కాదని బయటకు వెళ్లి బతకలేమని, మళ్లీ తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడాల్సి వస్తుందని మా నాన్న అన్నాడు. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను. అలాంటి పరిస్థితే వస్తే నా సోదరులు, అమ్మను చంపేసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకి చస్తాను గాని, నీ దగ్గరకు మాత్రం తిరిగిరానని చెప్పినట్టు’ వెల్లడించారు. చిన్నతనంలోనే తెగువ చూపించిన ఖుష్బూ మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లలో మళ్లీ తండ్రిని ఆమె కలవలేదు. ‘మా నాన్నను మళ్లీ చూడటం నాకు ఇష్టం లేద’ని స్పష్టం చేశారు. -
థగ్స్ ఆఫ్ బాలీవుడ్
తాప్సీ పన్ను, జాక్వెలిన్ ఫర్నాండెజ్ జుట్టు పీక్కుని కొట్టుకున్నారట. ఇలియానా, ఈషా గుప్తా వెంట్రుకవాసిలో కత్తులు దూసుకున్నారట. బాలీవుడ్ రూమర్లు నమ్మితే సినిమాలో కథల కంటే డ్రమాటిక్‌గా ఉంటాయి. జుట్లు పీక్కున్నారో బాకులు దూసుకున్నారో అపన్కో నై మాలూమ్... అంటే మనకి తెలియదు. ఇప్పుడీ లిస్ట్‌లో ఇంకో ఇద్దరు డ్రమాటిక్‌గా చేరారు. హీరోలు హీరోలు కలబడటం, హీరోలు హీరోయిన్లు కలిసి విడిపోవడం, విడిపోయి కలవడం ఇలాంటి రూమర్ల టైమ్ అయిపోయింది. ఇప్పుడంతా లేడీస్ టైమ్. ఈ ఇద్దరు లేడీస్ ఎవరు అని మీరు ముక్కున వేలేసుకోవద్దు. ఆమిర్ ఖాన్ తీస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో కత్రీనా కైఫ్, ఫాతిమా సనా షేక్ ఇద్దరూ మంచి భూమికలు పోషిస్తున్నారు. కత్రీనా ఈ సినిమాలో గెటప్ గాఢమైన కళ్లు, అలల్లాంటి జుట్టు, సూపర్ సెక్సీ డ్రెస్సింగ్‌తో అలరించనుందని ఆల్రెడీ న్యూస్ అవుట్ అయ్యింది. మరి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏమో ఆమిర్ ఖాన్ ఈ కథ ఫాతిమా చేస్తున్న పాత్ర చుట్టే తిరుగుతుందని చెప్పాడు. నా చుట్టూ తిరిగే కథలో నాకు గాఢమైన కళ్లు, అలల్లాంటి జుట్టు, సూపర్ సెక్సీ డ్రస్సులుండాలి కానీ సపోర్టింగ్ రోల్లో ఉన్న కత్రీనాకి అవన్నీ ఉంటే ఎలా అని ఫాతిమా, నాలాంటి హీరోయిన్ను తీసుకుని ఫాతిమా మెయిన్ పాత్ర ఇవ్వడం ఏంటని కత్రీనా దొందూ దూసుకుంటున్నారు. దూషించుకుంటున్నారు. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో వీళ్లిద్దరి కంటే వాళ్లిద్దరి గురించే ముచ్చట ఎక్కువగా ఉంది. -
రిలేషణం: అక్క నా బలం... నేను తన బలహీనత!
చిలిపి తగాదాలు, చిన్ని చిన్ని ఆనందాలు... అల్లరి చేష్టలు, ఆప్యాయతానురాగాలు... అన్నీ ఉన్నాయి తాప్సీ, షగున్ల జీవితంలో. వారిద్దరూ రక్తం పంచుకు పుట్టారు. అందుకేనేమో... సంతోషమైనా, విచారమైనా ఇద్దరూ కలసి పంచుకుంటారు. తమ అందమైన అనుబంధం గురించి, తనకన్నీ అయిన అక్కయ్య తాప్సీ గురించి... చెల్లెలు షగున్ పన్నూ ఇలా చెబుతున్నారు... అక్కకీ నాకూ నాలుగేళ్లు తేడా. అయితే అల్లరి చేయడంలో ఆ తేడా ఉండేది కాదు. ఇద్దరం పోటీపడి అల్లరి చేసేవాళ్లం. అలాగని ఇంట్లో ఫుల్లుగా ఫ్రీడమ్ ఉందనుకునేరు. నాన్న యమా స్ట్రిక్ట్. ఆయనకు అన్నీ పద్ధతిగా ఉండాలి. మేం క్రమశిక్షణతో మెలగాలి. లేదంటే అంతే సంగతులు. మేమేమో అలా ఉండే టైపు కాదు. కానీ నాన్నకు భయపడి ఆయన ఉన్నప్పుడు సెలైంట్‌గా ఉండేవాళ్లం. ఆయన లేనప్పుడు మాత్రం ఇల్లు పీకి పందిరేసేవాళ్లం. అప్పుడు నాకు ఏడేళ్లు. అక్కకీ నాకూ ఏదో తగాదా వచ్చింది. అంతే, అక్క కోపం పట్టలేక దేనితోనోగానీ కొట్టింది. కంటికి కాస్త దగ్గరగా చీరుకుపోయి రక్తం విపరీతంగా కారిపోసాగింది. అంతే, అమ్మానాన్నలు కంగారు పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ గాయం మానిపోయిందనుకోండి. అయితే, ఆ సంఘటన తరువాత అక్కలో చాలా మార్పు వచ్చింది. నన్నేమీ అనేది కాదు. నేను విసిగించినా మౌనంగానే ఉండేది. స్కూల్లో ఎవరైనా నన్ను ఏడిపించినా, కామెంట్ చేసినా విరుచుకుపడేది. మొదట్లో తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది... నన్ను గాయపర్చినందుకు తనెంతో బాధపడిందని, అందుకే నాకెప్పుడూ ఏ బాధా కలుగకుండా చూసుకోవాలని అనుకుంటోందని! నేను ఎవరితోనూ అంతగా మాట్లాడేదాన్ని కాదు. ఎవరికీ త్వరగా దగ్గరయ్యేదాన్ని కూడా కాదు. కానీ అక్క అలా కాదు. ఎవరైనా చిన్న మాట మాట్లాడితే, తిరిగి తాను ఓ పేద్ద పేరాగ్రాఫంత మాట్లాడుతుంది. అందరితోనూ కలసిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పెంకిది. పడినా తనదే పై చేయి అంటుంది. అది కూడా నా విషయంలో మాత్రమే. తప్పు నాది కాదు తనదేనని తెలిసినా ఒప్పుకోదు. బాగా వాదిస్తుంది. నేను కాస్త బిక్కమొగం వేస్తే నవ్వేస్తుంది. చెప్పాలంటే, ఓ రకంగా నేనే తన బలహీనత! ఈ మధ్య నా పుట్టినరోజుకి నన్నో ఐల్యాండ్‌కి తీసుకెళ్లి డిన్నర్ ఇచ్చింది. అదో గొప్ప సర్ప్రైజ్ నాకు! అక్క సినిమాల్లోకి వస్తుందని అనుకోలేదు. నాన్న ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. కానీ తను అనుకున్నది సాధించింది. అంతేకాదు, నేను కోరుకున్న దారిలో నడవడానికి నాక్కూడా ఎంతో సాయం చేసింది. నేను డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోవాలనుకున్నాను. కానీ నాన్న ససేమిరా అన్నారు. ఇంకా చదవమన్నారు. అప్పుడు అక్కే నాన్నను ఒప్పించింది. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోని పీవీపీ సంస్థలో పని చేస్తున్నాను. నాకు నచ్చిన దారిలో సాగిపోతున్నాను. ఇదంతా అక్క వల్లనే. చాలామంది అడుగుతూ ఉంటారు, ‘మీ అక్కలాగా నటివవుతావా’ అని. నాకా ఉద్దేశం లేదు. తెర మీద కనిపించాలన్న ఆశ, ఆలోచన నాకెప్పుడూ లేవు. అయితే అక్కని తెరమీద చూసినప్పుడు మాత్రం చాలా మురిసిపోతుంటాను. ‘గుండెల్లో గోదారి’లో తన నటన, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లోని తన రోల్ నాకు చాలా నచ్చాయి. తను ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను తన చెల్లెల్ని అని చెప్పుకుని మురిసిపోవాలి. అదే నా కోరిక! తనేం కోరుకున్నా ఇస్తాను: తాప్సీ చిన్నప్పుడు మా చెల్లిని బాగా కొట్టేసేదాన్ని. కానీ ఓ సందర్భంలో అది తప్పని తెలుసుకున్నాను. అందుకే వీలైనంత వరకూ తనను కాచుకుని ఉంటాను. షగున్ చాలా నెమ్మదస్తురాలు. తన పనేంటో తను చేసుకుపోతుంది తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోదు. అందుకే తనకి ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకోవాలని ఆరాటపడుతుంటాను. తను ఏం కోరుకున్నా ఇవ్వడానికి ప్రయత్ని స్తాను. తను నటినవుతానన్నా ఆనందంగా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే... తను కాస్త ఫీలయినా నేను తట్టుకోలేను! - సమీర నేలపూడి