రిషి కపూర్ - తాప్సీ పొన్ను
దాయాది దేశం పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో వచ్చిన భారతీయ చిత్రాలను నిషేధిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కోవలోకి మరో చిత్రం చేరింది. రిషి కపూర్, తాప్సీ ప్రధాన పాత్రలుగా, అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ముల్క్’. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన ‘ఇస్లామిక్ ఫోబియా’ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ పాక్ మాత్రం ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించకూడదంటూ నిషేధిత ఆజ్ఞలు జారీ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన పలు విజయవంతమైన చిత్రాలను పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన వీరే ది వెడ్డింగ్ చిత్రాన్ని వల్గర్‌గా ఉందంటూ బ్యాన్ చేసింది. ‘మెన్యూరేషన్’ ఇతివృత్తంగా అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ప్యాడ్‌మాన్ చిత్రాన్ని కూడా నిషేధించింది. అందుకు పాక్ సెన్సార్ బోర్డ్ చెప్పిన కారణం ‘ఇలాంటి విషయాలను మా దేశంలో బహిరంగంగా చర్చించడం నిషేధం అందుకే ప్యాడ్‌మాన్‌ను నిషేధించాం’ అని పాక్ సెన్సార్ బోర్డు తెలిపింది.
ఇస్లామ్‌కు వ్యతిరేకమైన చేతబడి ఇతివృత్తంగా తెరకెక్కిందంటూ అనుష్క శర్మ ‘పారి’ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఇవే కాక అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రాజీ’, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘రాయిస్’ చిత్రాలను కూడా ఇలాంటి కారణాలు చెప్పే నిషేదించింది. ఇదే క్రమంలో ఇప్పుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘ముల్క్’ చిత్రాన్ని నిషేధించింది. అయితే ఈ నిషేధంపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా పాక్ సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.
‘ఈ చిత్రం ముస్లింలకు, పాకిస్తాన్‌కు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో తెరకెక్కించింది కాదు. ఇది మనపై మనకు, మన చూట్టు ఉన్న వారి పట్ల మనం ప్రదర్శించే ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన చిత్రం. ఇది మీ గురించి, నా గురించి చెప్పే చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక పాక్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.. సహ ఉనికి గురించి చర్చించే ఈ చిత్రాన్ని పాక్ ఎందుకు బ్యాన్ చేసింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీకు ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఆ రోజు తప్పకుండా ఈ సినిమా చూసి అప్పుడు చెప్పండి పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఎందుకు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిందో’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment