ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై కఠిన నిషేధం విధించారు. ఈ ప్రకటనను ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వార్ ఉల్ హక్ కాకర్ స్వయంగా చేశారు. గాజాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన.
గురువారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని అన్వార్ ఉల్ హక్ కాకర్ ప్రసంగించారు. ‘‘పాక్ ప్రజలంతా పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకోండి. గాజాలో ఉన్న మన పాలస్తీనా సోదర సోదరీమణులకు సంఘీభావం తెలపాల్సిన సమయం ఇది. నూతన సంవత్సరానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠినమైన నిషేధం విధించిందని గుర్తించాలి’’ అని అన్నారు.
గాజాలో ఇప్పటిదాకా 21 వేలమంది పాలస్తీనియన్లు మృతి చెందారన్న పాక్ ప్రధాని.. ఇజ్రాయెల్ దాడుల్లో 9 వేల మంది చిన్నారులే మరణించారని గుర్తు చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నిరాయుధులైన పాలస్తీనియన్లు, అమాయక పిల్లల మారణహోమం పట్ల పాక్ సహా యావత్ ముస్లిం సమాజం పూర్తి వేదనలో ఉన్నాయన్నారాయన.
ఇదిలా ఉంటే.. పాక్‌లో సాధారణంగానే కొత్త సంవత్సరం వేడుకలు మరీ కోలాహలంగా ఏం జరగవు. ఇస్లామిక్ గ్రూప్‌ల అభ్యంతరాల నేపథ్యంలో.. పరిమితంగానే జరుగుతుంటాయక్కడ.
Comments
Please login to add a commentAdd a comment