చేతులకూ కొంత టైమివ్వాలి!
బ్యూటిప్స్
మృదువైన ముఖం మీద నుంచి దృష్టి తామరతూడుల్లా ఉండాల్సిన చేతుల మీదకు మళ్లుతుంది. కానీ చాలామంది చేతుల మీద శ్రద్ధ పెట్టరు. దాంతో చేతులు గరుకుదేలి మొరటుగా తయారవుతాయి. ముఖం కోసం కేటాయించిన సమయంతోపాటు చేతులకూ టైమివ్వాల్సిందే. కొద్దిగా నీళ్ళు, టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా తయారు చేస్తుంది. గిన్నెడు నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుంచి భుజాల వరకు రాయాలి.
ఇలా వారానికి రెండుసార్లు చే స్తే చేతులు సున్నితంగా తయారవుతాయి. గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్‌తో గబగబారుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు రాలిపోతాయి. తర్వాత ఒక టీ స్పూన్ తేనెకి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు రాయాలి. తరువాత చేతులకు ప్లాస్టిక్ బ్యాగ్స్ తొడుక్కొని అరగంట అలాగే ఉంచుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. అరచేతులు పొడిబారినట్లయితే రాత్రి పడుకోబోయే ముందు రెండు చుక్కల కొబ్బరి నూనె అరచేతుల్లో వేసుకుని మర్దన చేసుకోవాలి.