కాటన్ బట్టను ఉత్పత్తి చేసే సాంచాలపై బ్యాండేజీ బట్ట
ఆస్పత్రులు, ఇతర అవసరాలకు సరఫరా
సిరిసిల్లలో ఫలించిన ప్రయోగం
సిరిసిల్ల: మార్కెట్‌లో ఏ బట్టకు డిమాండ్ ఉంటే, ఆ బట్టను కాలానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తేనే పోటీ ప్రపంచంలో మనుగడ ఉంటుంది. ఈ వ్యాపార సూత్రాన్ని ఆకలింపు చేసుకున్న సిరిసిల్లలోని కొందరు వ్రస్తోత్పత్తిదారులు కాటన్ బట్ట ఉత్పత్తికి స్వస్తి పలికారు. బ్యాండేజీ బట్ట ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ బట్టను శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత నీట్‌గా స్టెరలైజ్‌లో ప్యాకింగ్ చేసి ఆస్పత్రుల్లో గాయాలకు కట్లు కట్టేందుకు వినియోగిస్తారు. వినాయకచవితి సందర్భంగా వివిధ రంగుల్లో ఈ బ్యాండేజీ బట్టను ప్రాసెస్ చేసి వినియోగిస్తారు.
సిరిసిల్లలో కొత్తగా ఆలోచించే కాటన్ యజమానులు బ్యాండేజీ బట్ట ఆర్డర్లు తీసుకొని సాంచాలపై కొత్త రకం బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తి రంగంలో వచ్చిన ఈ మార్పుతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది.
సర్కారు వైపు చూడకుండా..
సిరిసిల్ల పాలిస్టర్ యజమానులు, ఆసాములు ప్రభు త్వం ఇచ్చే వస్త్రోత్పత్తి ఆర్డర్లకు చూస్తుండగా, కాటన్ వస్త్రోత్పత్తిదారులు సొంత వ్యాపారం నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలిస్టర్ వ్రస్తోత్పత్తిదారులు బతుకమ్మ చీరలు, ఆర్‌వీఎం, రంజాన్, క్రిస్మస్ వంటి ఆర్డర్లతో కాలం వెళ్లదీశారు.
కాటన్ వస్త్రపరిశ్రమకు ప్రభుత్వ పరంగా ఆర్డర్లు రాకపోయినా, సొంతంగా ఆర్డర్లు సంపాదించుకొని మార్కెటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు 160 డయింగ్(అద్దకం) యూనిట్లతో సిరిసిల్ల కాటన్ పరిశ్రమ ఉపాధి కేంద్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం 50 డయింగ్ యూనిట్లకు చేరింది. ఇలాంటి తరుణంలో కాటన్ వస్త్రవ్యాపారులు కొత్త కం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తున్నారు.
సాంచా నడుపుతున్న ఇతని పేరు చిలుక మల్లేశం. సిరిసిల్లలో కాటన్ బట్టను ఉత్పత్తి చేసే మల్లేశం కొత్తగా బ్యాండేజీ బట్టను తక్కువ పిక్కుల (పోగులు)తో బట్ట జాలి(రంధ్రాలు) ఉండే విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో లంగాల బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.22 లభించేది. కానీ దీనికి డిమాండ్ లేదు. ప్రస్తుతం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.19 లభిస్తున్నది. మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment