మనసా స్మరామి : రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...
మా ఊరు గుంటూరు జిల్లా, వెనిగండ్ల. పుట్టింది ఒకచోట, పెరిగింది ఒకచోట, చదువుకున్నది మరోచోట. చిన్నప్పుడు చదువుకోనని తెగ మారాం చేస్తుంటే మా మామయ్య నన్ను బాపట్లలోని వాళ్ళింటికి తీసుకెళ్ళి చదువుతో పాటు, శ్రద్ధబుద్ధులు నేర్పించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. అక్కడే నాకు సాహిత్య సాన్నిహిత్యంతో పాటు సినీగేయ సాహిత్యంపై అవగాహన ఏర్పడింది. మా మామయ్య సూర్యోదయానికి ముందే నన్ను నిద్ర లేపి మంత్రాలు, వాటి అర్థాలు చెబుతుండేవారు. నాకు బోర్ కొడుతుందన్నప్పుడు సినిమా పాటలు, ఆ సినీగేయకవి గురించి ఎక్కువగా చెప్పేవారు. అలా మా మామయ్య మాటల ద్వారా పరిచయమైన కవి వేటూరిగారు. వారి పాటలు రోజుకి ఒకటి చొప్పున అర్థాలు తెలుసుకుంటూ ఉండేవాడిని.
అలా వారి కవనాల్లో నా మనసుని బాగా కదిలించిన పాట ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...’’. అప్పటి వరకు తత్త్వాన్ని, తర్కాన్ని సంస్కృతంలో తెలుసుకుంటున్న నాకు, అలతి పదాలతో తెలుగులో కూడా తత్త్వాన్ని చెప్పొచ్చని అర్థమయ్యింది. వేటూరి గారి సాహిత్యానికి కీరవాణి స్వరం, స్వరకల్పన తోడైన ఈ పాట నా మనసుపొరల్లో చెరగని మధురామృతాన్ని నింపింది. తర్వాత నాలో గీత రచయిత కావాలనే కోరికను రగిలించింది. జాతీయ పురస్కారం అందుకున్న ‘అద్వైతం’ లఘుచిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన నా సాహిత్యానికి, ఈ పాటే మార్గదర్శకమైంది.
‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటవూలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయువ్మూ... కలికీ వూ చిలక..! పాడకు నిన్నటి నీ రాగం...’
ఈ పల్లవిలో కవి కనిపిస్తాడు. కవి పువ్వుని, సాయంత్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాలే పువ్వు, వాలే పొద్దు ఈ రెండూ ఎక్కువ రంగులని ఈనుతుంటాయి. ఐనా గతించే నీకు ఇన్ని రంగులు, హంగులు ఎందుకు..? అనే తత్త్వం పాట ఆద్యంతం మనకి కనిపిస్తుంది.
‘చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకవ్ము గాథగా... చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా....
తన వాడు తారల్లో చేరగా వునసు వూంగల్యాలు జారగ... సిందూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూవూత వు నీవై వేకువలో వెన్నెలవై... కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై’
చిలకగోరింకల్లా కలకాలం చల్లగా ఉండండి అని మనం నవ దంపతులను దీవిస్తుంటాం. నిజానికి చిలక, గోరింక రెండూ కలిసి ఉండవు. కాపురం చేయవు. చిత్రంలో సత్యం (నాజర్), శారద (మాధవి) ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ చిర్రుబుర్రులాడుతుంటారు. చివరికి రూపం లేకుండా పోయి శూన్యంలో కలిసింది. శారద భర్త చనిపోవడంతో సుఖాలు, కోరికలు అన్నీ తన ‘సిందూరం’ తో తెల్లారి చల్లారిపోయాయి. కేవలం తన బిడ్డల కోసం ఓర్పుతో భూమాతలా తిరుగుతూ కష్టపడుతుంది.
‘అనుబంధవుంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ వుబ్బులే
హేవుంతరాగాల చేవుంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే...’
‘ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయం’ అంటారు. ఈ భవబంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వలన ఏర్పడతాయి. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగి తలకు మించిన భారం అవుతుంది. అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మోక్షం రాదు. తన తరువాత తన పిల్లలు ఏమైపోతారో అని పరితపిస్తున్న శారదకి కవి గొంతు ఇలా తత్త్వాన్ని చెప్పింది.
వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం ఆశల హారతి, జారిపడే జాబిలి, కరిగే మబ్బు... వీటిన్నింటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది, చివరికి తీగ తెగిన వీణలా బంధాలనన్నింటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది... అని తత్త్వాన్ని వర్ణించడం వేటూరిగారి కలానికే చెల్లింది. భూమి మీద మనుషులు, బంధాలు-అనుబంధాలు ఉన్నంత కాలం ఈ పాటలోని ప్రతి అక్షరం అజరామరం.
- సంభాషణ: నాగేశ్