మైండ్‌ను గ్రీన్‌జోన్‌లో  ఉంచండి | Special Article About Coronavirus In Family | Sakshi
Sakshi News home page

మైండ్‌ను గ్రీన్‌జోన్‌లో  ఉంచండి

Published Fri, May 8 2020 7:29 AM | Last Updated on Fri, May 8 2020 7:30 AM

Special Article About Coronavirus In Family - Sakshi

కరోనాను అర్థం చేసుకున్నాం దాదాపు. ఇక జీవితం అర్థం కావాలి. ఇంతకు ముందు ఉండే జీవితాన్ని మార్చుకొని కొత్తది నేర్చుకోవాలి. సమస్యలు, సవాళ్లు, ఆశాభంగాలు, ఆత్మీయులతో దూరాలు నిద్రలేమిని ఇస్తాయి.జీవితం రెడ్‌జోన్‌లో ఉందని తెలిసినప్పుడు మైండ్‌ ఉద్వేగంలోకి వెళుతుంది.కళ్లెం లేనిదై పరిగెడుతుంది. దానిని శాంతపరిచి వశపరుచుకున్నవాడే ఇప్పుడు విజేత. దారిన వెళుతున్నప్పుడు పాము ఎదురు పడితే ఎగిరి పక్కకు దూకి కాపాడుకోవచ్చు. కాని కనిపించని క్రిమి ఎదురు పడితే?

అశోక్‌ రామ్‌ తన బెడ్‌రూమ్‌లోని కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. రోడ్డు మీద మనిషి ఆనవాలు లేదు. వాహనాల కదలికా లేదు. టైమ్‌ చూశాడు. పన్నెండున్నర. మామూలుగా అయితే ఆ టైమ్‌లో కూడా ఏదో ఒక సందడి ఉండే రోడ్డు అది. ఇప్పుడు మాత్రం చడీచప్పుడు లేదు. అశోక్‌ రామ్‌కు రాత్రయ్యి చాలాసేపయినట్టుగా ఉంది. ఏడింటికే అంతా సద్దుమణిగిపోవడంతో పన్నెండున్నర అంటే సగం రాత్రి అయిపోయిన ఫీలింగ్‌ వచ్చింది. మామూలు రోజుల్లో అయితే అతడు ఆఫీసు నుంచి వచ్చి, స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు టీవీ చూసే సరికి పదకొండు అవుతుంది. అప్పడే అతనికి రాత్రి అయినట్టు. ఇప్పుడు? సాయంత్రం నుంచే రాత్రయిన ఫీలింగ్‌ వస్తోంది. అతనికి రాత్రయితే భయం వేస్తోంది.

గత పదిహేను రోజులుగా నిద్ర రావడం లేదు. ఏం చేసినా రావడం లేదు. అతడికి తాగుడు అలవాటు లేదు. దుర్వ్యసనాలు ఏమీ లేవు. మంచి ఆరోగ్యమే. కాని నిద్ర పట్టడం లేదు. పడుకుంటే పీడకలలు. గుండె దడ. ఏదో తెలియని భయం. పక్కన చూశాడు. భార్య బెడ్‌ మీద పడుకుని ఉంది. హాల్లో పిల్లలు పడుకుని ఉన్నారు. మొత్తం మూడు ప్రాణాలు తన పైన ఆధారపడి ఉన్నాయి. మేడ్చల్‌లోని ఒక ఫ్యాక్టరీలో సీనియర్‌ స్టోర్‌ కీపర్‌గా పని చేస్తున్నాడు. ముప్పై వేల వరకూ వస్తాయి. కుటుంబాన్ని మర్యాదగా లాక్కుంటూ వస్తున్నాడు. ఉత్తరాది నుంచి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చి ఆ మాత్రం ఎదగడం అతని సొంతప్రాంతంలో, హైదరాబాద్‌లో ఉన్న బంధువర్గంలో గొప్పగానే చెప్పుకుంటారు. అంతా బాగున్నట్టే. ఒక సగటు జీవి తన జీవితం నుంచి ఇంకేం ఆశిస్తాడు?

మొదటి షాక్‌  మార్చి నెల జీతం తీసుకున్నప్పుడు తగిలింది. పది శాతం కోత విధించారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌లో ఉద్యోగానికి రానక్కర్లేదని, జీతం అకౌంట్‌లో వేస్తామని చెప్పారు. అది ఎంత వేస్తారో ఈసారి ఎంత కోత ఉంటుందో తెలియదు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఉద్యోగుల్లో పుకార్లు బయలుదేరాయి. ఇళ్లల్లో ఉన్న ఉద్యోగులు చాలామంది ఆందోళనగా ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నారు. ఉద్యోగాలు తగ్గిస్తారని, కొందరిని తీసేస్తారని, కొందరిని ఉంచుకున్నా సగం జీతమే ఇస్తారనీ... అశోక్‌రామ్‌లో మెల్లగా భయం ప్రవేశించింది. జీతం ఫుల్లుగా వస్తేనే నెల తిరిగేసరికి కటాకటిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోతలు వాతలు అంటే? అది పోనీ. అసలు ఉద్యోగమే పోతే. భయం స్థానంలో వొణుకు వచ్చింది.

టీ బాగలేదు. అందుకని అరగంట నుంచి భార్యను తిడుతున్నాడు అశోక్‌రామ్‌. భార్య అంతకు అంత సమాధానం ఇస్తోంది. పిల్లలు ఇదేం పట్టనట్టు ఫోన్‌లో ఆడుకుంటున్నారు. ఒక కొడుకు టెన్త్‌. ఒక కొడుకు ఎయిత్‌. టెన్త్‌ పరీక్షలు ఆగిపోయాయి. ఎయిత్‌ పరీక్షలు అసలు జరగలేదు. వీళ్ల చదువు ఎలా ఉంటుందో తెలియదు. తన భవిష్యత్తులాగే పిల్లల భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఆ రెండు ఫోన్ల కోసం నలుగురూ కీచులాడుకోవాల్సి వస్తోంది. నలుగురూ ఫోన్‌కి బాగా అడిక్ట్‌ అయ్యారు.

నలుగురూ ఇంట్లో కలిసి ఉంటే ఆప్యాయత పెరగాలి. కాని నలుగురూ నాలుగు విధాలుగా ఐసొలేట్‌ అయ్యారు. ఇంతకుముందు ఇరుగింటికి వెళ్లి పొరుగింటికి వెళ్లి రిలాక్స్‌ అయ్యేది అతని భార్య. ఇప్పుడు ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేక అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుండడంతో ప్రతి చిన్న విషయానికీ కస్సుమంటోంది. ఇవన్నీ అశోక్‌ రామ్‌ను మెల్లగా డిప్రెషన్‌లోకి నెట్టాయి. జీవితం మీద వ్యామోహం మెల్లగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో రాత్రిళ్లు నిద్రలేక పగలు ప్రశాంతత లేక మనిషి దారుణంగా దెబ్బ తిన్నాడు. ‘కరోనా వచ్చిన వాళ్లు ధైర్యంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుని బయటకు వస్తుంటే అసలు ఏ రోగం రాని ఈ మనిషి ఇలా తయారవ్వడం ఏంటి’ అని భార్య ఏడుపు మొదలెట్టింది. అంతా విన్న బంధువొకరు అశోక్‌ను ఫోన్‌ ద్వారా సైకియాట్రి కౌన్సిలింగ్‌కి ఒప్పించాడు.

‘ఆశోక్‌రామ్‌ గారూ ఒకటి చెప్పండి. ఇది మీకు మాత్రమే వచ్చిన కష్టమా? అందరికీ వచ్చిన కష్టమా?’ అడిగాడు సైకియాట్రిస్ట్‌.
‘అందరికీ’
‘మరి. దేనికి భయపడుతున్నారు. ఈ కష్టం మీదొక్కరిదే కాదు. ప్రపంచం మొత్తం పోరాడుతోంది. మీతోపాటు ఆకలితో ఉండేవాళ్లు ఉంటారు. మీతోపాటు ఆశతో పోరాడేవాళ్లు ఉంటారు. రెడ్‌జోన్‌ ఆరంజ్‌ జోన్‌ కావడం ఆరంజ్‌ జోన్‌ గ్రీన్‌ జోన్‌గా మారడం మీరు చూడటం లేదా? మరెందుకు భయం. జీవితం ఎప్పుడూ రెడ్‌జోన్‌లోనే ఉంటుంది. ఒకటి రెండేళ్లు బ్యాడ్‌టైమ్‌ వస్తే ఆ తర్వాత మంచి టైమ్‌ వస్తుందని అనుకోండి. ముందు మీరు ఒక్కరిగా మీలో మీరు మధనపడటం మానేయండి. మీ నుంచి మీరు పారిపోవడానికి ఫోన్‌లోకి దూరడం కూడా మానేయండి. మీలాంటి సహోద్యోగులతో కాకుండా వేరే వాళ్లతో మాట్లాడండి. లోకంలో ఏం జరుగుతోందో తెలుసుకోండి. ఇంత కష్టకాలంలో కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నవారిని గమనించండి.

వందలాది కిలోమీటర్లు మూటలు మోస్తూ నడిచి వెళ్లేవారి కంటే మీరు ఎంతో బెటర్‌గా ఉన్నారు కదా. వారు జీవితాన్ని ధైర్యంగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకు తీసుకోరు? ఇలాంటి మహమ్మారులు ఎన్నో వచ్చాయి అశోక్‌రామ్‌ గారూ. మన తాత ముత్తాతలు వాటితో పోరాడారు. ఆ రక్తం మనలో ఉంది. కనుక భయపడకండి. అందరితో పాటు నేను అనుకుని భవిష్యత్తు గురించి ఎక్కువ బెంగపడకుండా షార్ట్‌టర్మ్‌ ప్లాన్‌లతో ఈ రెండు నెలలకు ఈ మూడు నెలలకు అనుకుంటూ మీ బడ్జెట్‌ని, జీవితాన్ని ప్లాన్‌ చేసుకోండి. వొత్తిడి తగ్గుతుంది. నిద్ర కూడా వస్తుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. తనకే కాదు తనలాంటి ఆలోచన ఉన్న చాలామందికి ఈ అవగాహన అవసరం అని అనిపించింది అశోక్‌రామ్‌కు.
- డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement