పొట్ట అడుగు | special cook to Mushroom | Sakshi
Sakshi News home page

పొట్ట అడుగు

Published Fri, Nov 10 2017 11:54 PM | Last Updated on Sat, Nov 11 2017 6:01 AM

special cook to Mushroom - Sakshi

పొట్ట అడుగుతుందా!
బిర్యానీ చేసిపెట్టమని..
ఆమ్లెట్‌ వేసిపెట్టమని..
మంచూరియా కావాలని..
చిల్లీ కర్రీని టేస్ట్‌ చేస్తానని!!
అడగదు పాపం.

ఆకలో రామచంద్రా అంటుంది కానీ.. అది కావాలి రామచంద్రా.. ఇది కావాలి రామచంద్రా.. అని రాగాలు తీయదు. కానీ పుట్టగొడుగులు వేరు. వాటితో ఒక్కసారి ఏదైనా చేసి పెట్టామా? పొట్ట మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటుంది. అవురావురుమంటూనే ఉంటుంది.

మష్రూమ్‌ మంచూరియా
కావలసినవి: మష్రూమ్స్‌ – 250 గ్రా; ఉడికించిన బంగాళాదుంపలు – 2 పెద్దవి; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్‌; మైదా – 2 టేబుల్‌ స్పూన్స్‌; కార్న్‌ఫ్లోర్‌ – 3 టేబుల్‌ స్పూన్స్‌; నూనె – టీప్‌ ఫ్రైకి సరిపడ.
గ్రేవీ కోసం: ఉల్లి తరుగు – 4 టేబుల్‌ స్పూన్స్‌; తెల్ల ఉల్లికాడల తరుగు – 2 టీ స్పూన్స్‌; గ్రీన్‌ ఉల్లికాడల తరుగు – 4 టీ స్పూన్స్‌; పచ్చిమిర్చి తరుగు – 3 టీ స్పూన్స్‌; వెల్లుల్లి తరుగు – 6 టీ స్పూన్స్‌; అల్లం తరుగు – 6 టీ స్పూన్స్‌; ఉప్పు – తగినంత; సోయా సాస్‌ – 6 టీ స్పూన్స్‌; చిల్లీసాస్‌ – 2 టీ స్పూన్స్‌; వెనిగర్‌ – 6 టీ స్పూన్స్‌; పంచదార – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – 3 టీ స్పూన్స్‌; నూనె – 2 టేబుల్‌ స్పూన్స్‌.
తయారి: ∙మష్రూమ్స్‌ను కడిగి కాడలను తుంచి సన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో తరిగిన మష్రూమ్, ఉడికించిన బంగాళా దుంపలను కలపాలి ∙ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు  టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌ వేసి ముద్దగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్‌లో కూరి పక్కన పెట్టుకోవాలి ∙మరొక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి నీరు పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక, స్టఫ్‌ చేసిన మష్రూమ్స్‌ను పిండి మిశ్రమంలో ముంచి  బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ మరో కడాయిలో నూనె వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి ∙ఇప్పడు వరుసగా ఉల్లి, పచ్చిమిర్చి, తెల్ల ఉల్లికాడల తరుగు, ఉప్పు, కారం, సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ ఉండాలి ∙చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న స్టఫ్డ్‌ మష్రూమ్స్‌ను వేసి గ్రేవీ పట్టేలా మరికొంతసేపు వేగనివ్వాలి ∙స్టౌ ఆఫ్‌ చేసి గ్రీన్‌ స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేసి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

మష్రూమ్‌ ఛీజ్‌ ఆమ్లెట్‌

కావలసినవి: కోడిగుడ్లు – 4; మష్రూమ్స్‌ – 100 గ్రా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 4 రెబ్బలు; తరిగిన ఛీజ్‌ – 2 టేబుల్‌ స్పూన్స్‌; కొత్తిమీర తరుగు – కొంచెం; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 2 టేబుల్‌ స్పూన్స్‌.
తయారి: ∙స్టౌ పైన పాన్‌ పెట్టి వేడయ్యాక 1 స్పూన్‌ నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్‌ వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర కలిపి పక్కనపెట్టుకోవాలి . ఒక గిన్నెలో గుడ్లు కొంచెం ఉప్పు వేసి బాగా బీట్‌ చేసుకోవాలి ∙పాన్‌లో నూనె వేసి వేడయ్యాక బీట్‌ చేసిన గుడ్డు మిశ్రమాన్ని కొంచెం మందంగా ఆమ్లెట్‌లా వేసుకోవాలి ∙ముందుగా తయారు చేసుకున్న మహ్రూమ్స్‌ మిశ్రమాన్ని కూడా వేసి రెండు వైపులా ఆఫ్‌ బాయిల్‌ అయ్యేలా చేసుకొని కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడిగా సర్వ్‌ చేయాలి.

మష్రూమ్‌ బిర్యాని
కావలసినవి: మష్రూమ్స్‌ – 900 గ్రా; బాస్మతి బియ్యం – 4 కప్పులు; ఉల్లిపాయలు – 2; పచ్చిమిరపకాయలు – 4; టమోటాలు – 3; క్యారెట్‌ – 2 టేబుల్‌ స్పూన్స్‌; అల్లం తరుగు – 3 టీ స్పూన్స్‌; వెల్లులి – 3 రెబ్బలు; నెయ్యి/నూనె – 1/2 కప్పు; నిమ్మకాయ – 1; లవంగాలు – 7; దాల్చినచెక్క – అంగుళం ముక్క; యాలకులు – 3; ధనియాల పొడి – 3 టీ స్పూన్స్‌; సోయా సాస్‌ – 2 టీ స్పూన్స్‌; కారం – 1 1/1 టీ స్పూన్‌; ఉప్పు – రుచికి సరిపడ; నీళ్లు – 7 కప్పులు; పుదీనా – కొంచెం.

తయారి: ∙బాస్మతి బియ్యాన్ని కడిగి సరిపడ నీరు పోసి గంట సేపు నానబెట్టి నీరు వాడ్చి పెట్టుకోవాలి ∙స్టౌ పైన ప్రెషర్‌ కుక్కర్‌ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 5 నిమిషాలు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙మష్రూమ్స్‌ను పెద్ద ముక్కలుగా తరుగిపెట్టుకోవాలి ∙అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి ∙ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేలా సిమ్‌లో వేగనివ్వాలి ∙సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్స్‌ ముక్కలు కూడా వేసి పది నిమిషాలు వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ∙ముక్కలన్నీ వేగిన తర్వాత 7 కప్పుల నీరు పోసి మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కుక్కర్‌ మూత పెట్టి సిమ్‌లో 2 లేదా 3 విజిల్స్‌ రానివ్వాలి ∙ప్రెషర్‌ పోయిన తర్వాత పుదీనా గార్నిష్‌ చేసుకోవాలి.

చిల్లీ మష్రూమ్‌ కర్రీ
కావలసినవి: మష్రూమ్స్‌ పెద్ద సైజువి – 10; నల్ల మిరియాల పొడి – 1/4 టీ స్పూన్‌;  మైదా – 4 టేబుల్‌ స్పూన్స్‌; కార్న్‌ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్స్‌; రెడ్‌ కాప్సికమ్‌ – 1/2 కప్పు; గ్రీన్‌ కాప్సికమ్‌ –  1/2 కప్పు; ఎల్లో కాప్సికమ్‌ – 1/2 కప్పు; ఉల్లిపాయ – 1 (ఆప్షనల్‌); పచ్చిమిర్చి తరుగు – 4 టీ స్పూన్స్‌; అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌; టమోటా సాస్‌ – 3 టీ స్పూన్స్‌; సోయా సాస్‌ – 1 టీ స్పూన్‌; వెనిగర్‌ – 1 టీ స్పూన్‌; కారం – 1/2 టీ స్పూన్‌; ఉప్పు – రుచికి సరిపడ; కొత్తిమీర – గార్నిష్‌ కోసం; నూనె – వేయించడానికి సరిపడ.
తయారి: ∙మష్రూమ్స్‌ కాడలను కట్‌ చేసి తుడిచి పెట్టుకోవాలి ∙బౌల్‌లో మైదా పిండి ఉప్పు, మిరియాల పొడి వేసి నీరు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక మష్రూమ్స్‌ను పిండిలో ముంచి బజ్జీల్లా బంగారు రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మరో బౌల్‌లో 2 టేబుల్‌ స్పూన్స్‌ కార్న్‌ ఫ్లోర్‌ అర కప్పు నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి ∙మరొక బాణలిలో 2 టేబుల్‌ స్పూన్స్‌ నూనె వేసి రెడ్, గ్రీన్, ఎల్లో కాప్సికమ్‌ ముక్కలు వేయించాలి ∙5 నిమిషాలు వేయించి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ వేసి మూత పెట్టి సిమ్‌లో నిమిషం మగ్గనివ్వాలి ∙ఇప్పుడు టమోటా సాస్, సోయా సాస్, వెనిగర్, సరిపడ ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్‌ను వేసి మరో రెండు నిమిషాలు వేసి వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుంటే వేడి వేడి చిల్లీ మష్రూమ్స్‌ కర్రీ రెడీ. రైస్‌లోకి, చపాతీలో కూడా బాగుంటుంది.

పుట్టగొడుగులతో దీర్ఘాయుష్షు!
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివని అప్పుడప్పుడూ తినడం మేలన్నది మనందరికీ తెలుసుగానీ.. కారణాలేమిటో చూద్దాం. పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా ఇలా చెప్తున్నారు. మిగిలిన పోషకాలను పక్కకు పెట్టి కేవలం పుట్టగొడుగుల్లో ఉండే రెండు యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా మన ఆయుష్షు పెరిగే అవకాశముందన్నది సారాంశం. ఎర్గోథియోనైన్, గ్లుటాథియోన్‌ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగులో ఉంటాయి. శరీరం మనం తిన్న ఆహారాన్ని ఇంధనంగా మార్చుకునే క్రమంలో ఒక రకమైన ఆక్సిజన్‌ కణాలు పుడుతూంటాయి. ఫ్రీ రాడికల్స్‌ అని పిలిచే ఈ కణాలు శరీరం మొత్తం తిరుగుతూ ఒక ఎలక్ట్రాన్‌ను ఆకర్షించుకుని స్థిరపడేందుకు ప్రయత్నిస్తూంటాయి.  ఈ క్రమంలో ఇవి మన కణాలు, ప్రొటీన్లు.. డీఎన్‌ఏకు నష్టం కలిగిస్తూంటాయి. యాంటీ ఆక్సిడెంటు పుష్కలంగా లభిస్తే ఫ్రీరాడికల్స్‌తో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించుకుని దీర్ఘాయుష్షు పొందవచ్చునని శాస్త్రవేత్త రాబర్ట్‌ బీల్‌మన్‌ తెలిపారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకునే ఫ్రాన్స్, ఇటలీల్లో అల్జీమర్స్, పార్కిన్‌సన్స్‌ వంటి నాడీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండింటికీ మధ్య సంబంధం ఏమిటన్నది కూడా పరిశీలించాలని తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement