బుట్టెడు ఆత్మీయ రుచులు | special to Kakinada Subaiya Hotel | Sakshi
Sakshi News home page

బుట్టెడు ఆత్మీయ రుచులు

Published Sat, Oct 6 2018 12:39 AM | Last Updated on Sat, Oct 6 2018 1:07 PM

special to Kakinada Subaiya Hotel - Sakshi

కడుపు నిండా భోజనం చేయండి...మీకేం కావాలన్నా నిర్మొహమాటంగా అడగండి...ఇది మీ ఇల్లే అనుకోండి...ఇదీ కాకినాడ సుబ్బయ్య  హోటల్‌ విజయానికి ప్రధాన సూత్రం

1947లో కాకినాడ నడిబొడ్డులో ఉన్న రామారావుపేటలో కాఫీ హోటల్‌తో జీవితం ప్రారంభించారు నెల్లూరు జిల్లా చాకలికొండ గ్రామ వాస్తవ్యులు సుబ్బయ్య. ‘‘నెల్లూరులో పనులు లేకపోవడంతో మా నాన్నగారు తన స్నేహితులతో కలిసి తన పదహారవ ఏట కాకినాడ చేరుకుని, కాఫీ హోటల్‌ ప్రారంభించారు. అక్కడి వారంతా మా నాన్నగారి చేతి కాఫీ తాగి, సంబరపడేవారు. కాకినాడలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో, చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి రూమ్‌ అద్దెకు తీసుకుని చదువుకునేవారు. వారికి భోజన సదుపాయం సరిగ్గా లభించేది కాదు. అటువంటి సమయంలో విద్యార్థులంతా వచ్చి మా నాన్నను కాఫీ హోటల్‌ తీసేసి, భోజన హోటల్‌ పెట్టమని అర్థించారు. హోటల్‌కి కావలసిన పెట్టుబడి కూడా వారే పెడతామన్నారు. అలా నాన్న పేరుతోనే సుబ్బయ్య హోటల్‌ ప్రారంభమైంది’’ అంటారు సుబ్బయ్య రెండో కుమారుడు గోవిందు.

సుబ్బయ్య స్పెషల్‌...
అల్లం, పచ్చిమిర్చి వేసిన వంకాయ కూర సుబ్బయ్య స్పెషల్‌. ఇంకా సాంబారు కూడా ప్రత్యేకమే. సాంబారులో పప్పు, ఘుమఘుమలాడే మసాలా వేసి చిక్కగా తయారుచేయడంతో సుబ్బయ్య సాంబారు బాగా పాపులర్‌ అయ్యింది. ఇంకా స్వయంగా గేదె పాలు తెప్పించి, తోడుపెట్టిన గడ్డ పెరుగు వడ్డించేవారు. ‘‘రెండు వందల రూపాయలతో ప్రారంభమైన ఈ హోటల్‌లో, నాన్నగారే దగ్గరుండి స్వయంగా అడిగి, ఆప్యాయంగా వడ్డించేవారు’’ అని గుర్తుచేసుకుంటారు గోవిందు. కాకినాడకు వచ్చిన కొత్తలో సుబ్బయ్య చిన్న పెంకుటింట్లో అద్దెకు ఉండేవారు. ఆ రోజుల్లోనే జ్ఞానానంద కవి  వంటి ప్రముఖ సాహితీవేత్తలంతా ఇక్కడకు వచ్చి, భోజనం చేస్తూ, సాహితీ చర్చలు జరిపేవారని ప్రతీతి. ‘‘పెద్దపెద్దవారు మా హోటల్‌కి వచ్చేవారు. వారంతా నాన్నగారితో ఎంతో అభిమానంగా కబుర్లు చెప్పేవారు. వారి కుటుంబ విషయాలు కూడా నాన్నతో పంచుకునేవారు. నాన్నగారు అభిమానంగా కొసరికొసరి వడ్డించేవారు. హోటల్‌లో నాన్న స్వయంగా వంట చేసేవారు. అమ్మ కూరలు తరిగేవారు. చుట్టాలందరూ సాయం చేసేవారు’’ అంటారు గోవిందు. 

ఉచితంగా...
కొందరు విద్యార్థులకు ఇంటి నుంచి సకాలానికి డబ్బులు అందేవి కావు. అందువల్ల సుబ్బయ్యకి డబ్బులు చెల్లించలేకపోయేవారు. ‘‘నాన్న ఏ నాడూ డబ్బు గురించి ఆలోచించేవారు కాదు. పేదవారికి ఉచితంగా అన్నం పెడితే పుణ్యమని భావించేవారు. విద్యార్థుల అవసరాలు తెలుసుకుని ధన సహాయం చేసేవారు’’ అని తండ్రి ఔన్నత్యాన్ని వివరిస్తారు గోవిందు. ఒక్కోసారి ఆరునెలలకో, ఏడాదికో మొత్తంగా ఒకేసారి బాకీ తీర్చేవారు విద్యార్థులు. డబ్బు గురించి ఆలోచిస్తూ, చదువు పాడుచేసుకోవద్దని చెప్పేవారు సుబ్బయ్య.

సుబ్బయ్య కుటుంబం...
సుబ్బయ్యకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ‘‘నేను ఇంటర్‌ వరకు చదువుకున్నాక, నన్ను వ్యాపారంలో రమ్మన్నారు. ‘అందరూ మన చేతి భోజనం రుచి చూస్తున్నారు. అదే మనల్ని, మన పిల్లల్ని కాపాడుతుంది. ముందు ముందు ఈ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది’ అనేవారు నాన్న. కస్టమర్లు భోజనం చేస్తున్నప్పుడు, ప్రతి లైనులోకి వెళ్లి వాళ్లకి ఆప్యాయంగా వడ్డించేవారు. ఆ సూత్రాన్ని మేము నేటికీ పాటిస్తున్నాం. అందరికీ కొసరి కొసరి వడ్డించమని మా సర్వర్లకు చెబుతాం. అందరూ సంతృప్తిగా భోజనం చేసి ఆనందంగా వెళ్లడమే మాకు కావలసింది’’ అంటారు తండ్రి అడుగుజాడల్లో వ్యాపారం కొనసాగిస్తున్న గోవిందు.

బుట్ట భోజనం...
వెజ్‌ పులావ్, పులిహోర, పప్పు, మూడు రకాల కూరలు, 2 రకాల పచ్చళ్లు, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు, స్వీట్‌ (బూరె లేదా కాజా)లతో 240 రూపాయలకు బుట్ట భోజనం అందిస్తున్నాం. నలుగురు వ్యక్తులు కడుపునిండా తినొచ్చు.  రాత్రి పదిన్నర దాకా ఉంటాం. అన్నవరం, పిఠాపురం వంటి పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం చేసుకుని, ఇక్కడకు వచ్చి భోజనం చేసి ఆనందంగా వెళ్తారు. 

1970లో ఒకరోజు ఒకాయన రాత్రి 12 గంటలకు వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. మేము ఏమీ లేదని చెప్పి పంపేశాం. నాన్నగారికి విషయం తెలిసి, ‘నన్ను నిద్ర లేపితే నేను పెట్టేవాడిని కదా. వాళ్లు ఎక్కడ నుంచో వచ్చారు. ఎంత ఆకలితో ఉంటారో అర్థం చేసుకోవాలి’ అన్నారు. మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నేను కూడా మా అల్లుళ్లు, అబ్బాయిలతో...  ‘ఏది ఉంటే అదే పెట్టండి, లేదు అని చెప్పద్దు’ అని చెబుతాను. డబ్బులు ఇవ్వకపోయినా అన్నం లేదు అనకండి... ఎవరి దగ్గరైనా డబ్బులు తక్కువగా ఉన్నా, అన్నం పెట్టేవారు నాన్న. వెళ్లిపోమనే వారు కాదు. మన స్నేహితులు భోజనం చేశారనుకుందాం అనేవారు. ఈ సూత్రం మరచిపోలేదు నేను. మాది స్టార్‌ హోటల్‌లా ఉన్నా కూడా మేం అరిటాకు, ఆప్యాయత అనే పాత పద్ధతి మానలేదు. మూలాలు మరచిపోకూడదు అనే నాన్నమాటలు నేటికీ గుర్తుంచుకున్నాం. ముగ్గురు అన్నదమ్ములం మూడు హోటల్స్‌ పెట్టాం. అందరం బాగున్నాం. 
– సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement