సంప్రదాయం ఉట్టిపడుతూనే సవాళ్లను ఎదుర్కొనేంత ధీమాగా కనపడాలన్నదే ఆధునిక మహిళ ఆంతర్యం. నవతరం మహిళ మనసెరిగిన డిజైనర్లు కంచిపట్టుకూ, క్రేప్‌కూ క్రియేటివిటీని జోడిస్తున్నారు. బ్రొకేడ్‌ను, బెనారస్‌నూ... పెద్ద పెద్ద బార్డర్లతో, ట్రెడిషనల్ డిజైన్లతో అమర్చి... సంప్రదాయ వేడుకలకు వైవిధ్యాన్ని తీసుకువస్తున్నారు. చూపులతోనే అల్లుకుపోయే... చక్కదనాల పెద్దంచు చీరలు ఈ శ్రావ ణానికి ప్రత్యేకం.
1- సంప్రదాయపు వేడుక... ఆకుపచ్చని చందేరీ చీరకు జరీ వర్క్ గులాబీల అంచు.
2- ఆధునిక కళ ..శాటిన్ షేడెడ్ చీరకు ముత్యాల అంచు.
3- ముచ్చటగొలిపే... పెద్ద బార్డర్ పైన మరో డిజైనర్ అంచు.కట్టడి చేసే ఆకర్షణకు... హాఫ్‌వైట్ పట్టు చీరకు జర్దోసీ అంచు.
4- అబ్బురపరిచే వైవిధ్యం..సాదా కంచి పట్టుచీరకు పెద్ద అంచు, దానిపైన వర్క్ చేసిన మరో చిన్న అంచు.
లక్ష్మీదేవిలా అలంకరించుకునేందుకు మగువలు ఈ మాసాన ముచ్చటపడుతుంటారు. కళను పెంచే కలర్ చీరలు ఉంటే సరి, లేదంటే కొత్త డిజైన్ల కోసం మార్కెట్‌ను జల్లెడపడుతుంటారు. కానీ, ఉన్న చీరలనే కొత్తగా మార్చేస్తే.. మీ ఆలోచనకు సరికొత్త రూపం ఇవ్వడానికే ఈ డిజైనర్ చీరలు కొలువుదీరాయి.
ఆకుపచ్చ చందేరీ చీరకు జరీ పువ్వుల గులాబీ అంచును, చివరన సన్నని లేస్‌ను జతచేయాలి. అదే రంగు బ్లౌజ్ ధరిస్తే పండగ శోభ రెట్టింపు కాకుండా ఉండదు.
ప్లెయిన్ మస్టర్డ్ కలర్ కంచిపట్టు చీరకు జర్దోసీ వర్క్ చేసిన నీలాకాశం రంగు అంచును, పల్లూను జత చేరిస్తే వినూత్న కళతో వెలిగిపోతుంది.
హాఫ్‌వైట్ బెనారస్ పట్టు చీరను పసుపు, గులాబీ, వంగపండు రంగు శాటిన్ అంచులతో తీర్చిదిద్దడంతో చూపులను కట్టిపడేస్తుంది. గులాబీరంగు పట్టు క్లాత్‌పై చేసినస్వరోస్కి వర్క్ అబ్బురపరుస్తుంది.
సిల్వర్ బార్డర్ గల ఎరుపు రంగు బ్రొకేడ్ చీరకు అంచుపైన కుందన్ వర్క్ చేసిన మరో చిన్న అంచును జత చేయడంతో పండగకు దీపకళను తీసుకువచ్చింది.
ఎరుపు, వెండి రంగుల కలయికతో ఉన్న శాటిన్ చీరకు ముత్యాలు పొదిగిన అంచు ప్రధాన ఆకర్షణగా మారింది.
పెద్ద అంచులు ఇప్పుడు ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉన్నాయి. ఉన్న వాటికే ఇలా ఆకర్షణీయమైన సొబగులు అద్ది, కొత్తగా అందమైన చీరలను మీరూ రూపొందించుకోవచ్చు. ఇవి ఏ వేడుకలోనైనా ప్రత్యేకతను చాటుతాయి.
భార్గవి కూనమ్
ఫ్యాషన్ డిజైనర్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
పెద్దంచు... కొత్త చీర
Published Wed, Aug 6 2014 10:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement